Saturday, April 27, 2024

హేమంత్ సోరెన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

- Advertisement -
- Advertisement -

హైకోర్టుకు వెళ్లాలని సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు శుక్రవారం సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇప్పటికే జార్ఖండ్ హైకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున తిరిగి హైకోర్టునే ఆశ్రయించాలని సోరెన్‌కు సుప్రీంకోర్టు సూచించింది. రాజ్యాంగంలోని 32వ అధికరణ కింద ప్రస్తుత పిటిషన్‌ను తాము విచారణకు స్వీకరించలేమని జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం హేమంత్ సోరెన్ న్యాయవాది కపిల్ సిబల్‌కు తెలిపింది.

226వ అధికరణ కింద సంబంధిత హైకోర్టును ఆశ్రయించాలని ధర్మాసనం సూచించింది. పిటిషన్‌ను త్వరితంగా విచారించాలని హైకోర్టును కోరే హక్కు పిటిషనర్‌కు ఉందని జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం తెలిపింది. పిటిషన్‌ను త్వరితంగా విచారించాలని హైకోర్టుకు ఆదేశాలు ఇవ్వాలని ధర్మాసనానికి కపిల్ సిబల్ విన్నవించగా ఒక రాజ్యాంగపరమైన కోర్టును తాము నియంత్రించబోమని జస్టిస్ ఖకన్నా తెలిపారు. హైకోర్టును ఆశ్రయించకుండా నేరుగా సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారని సిబల్‌ను జస్టిస్ ఖన్నా ప్రశ్నించారు.

కోర్టులను ఎవరైనా ఆశ్రయించవచ్చని, ఒక వ్యక్తిని తాము అనుమతిస్తే ప్రతి ఒక్కరూ నేరుగా సుప్రీంకోర్టుకే వస్తారని న్యాయమూర్తి పేర్కొన్నారు. దయచేసి హైకోర్టుకు వెళ్లాలని, తాము ఈ విషయంలో జోక్యం చేసుకోబోమని జస్టిస్ ఖన్నా స్పష్టం చేశారు. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తర్వాత బుధవారం హేమంత్ సోరెన్‌ను ఇడి అరెస్టు చేసింది. దీంతో తన అరెస్టును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News