Friday, May 3, 2024

ఆరుబయట.. ఆగని దీక్ష

- Advertisement -
- Advertisement -

రాత్రంతా దోమల దాడి.. ఉక్కపోత

పార్లమెంట్ ముఖద్వారం వద్దకు మారిన ఎంపిల నిరసన దీక్ష వేదిక

న్యూఢిల్లీ: ధరల పెరుగుదలపై చర్చకు పట్టుబట్టి సస్పెండయిన పార్లమెంటు సభ్యులు తమ సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా బుధవారం నుంచి పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద 50 గంటల నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. కాగా ధర్నా చేస్తున్న ఎంపిలు తమ నిరసన వేదికను గురువారం గాంధీ విగ్రహం వద్దనుంచి పార్లమెంటు ప్రధాన ముఖద్వారం వద్దకు మార్చుకున్నారు. 2014లో ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టినప్పుడు చేసిన హామీని ఆయనకు గుర్తు చేయడం కోసం తాము ఈ పని చేసినట్లు ఓ విపక్ష ఎంపి చెప్పారు. అప్పుడు మోడీ పార్లమెంటు మెట్లకు తన నుదురు తాకించి నమస్కరించిన విషయం తెలిసిందే. అంతేకాక, గాంధీ విగ్రహం వద్ద టెంటు లేకపోవడం, వర్షం కారణంగా తమ ఆందోళన వేదికను వేరే చోటికి మార్చాల్సి వచ్చిందని, ఈ స్థలం సింబాలిక్‌గా ఉంటుందని ఆ నాయకుడు చెప్పారు. కాగా బుధవారం రాత్రి దోమల బాధ, ఉక్కపోతను భరిస్తూ సిపిఐ ఎంపి సంతోష్ కుమార్, ఆప్‌కు చెందిన సంజయ్ సింగ్ సహా అయిదుగురు ఎంపిలు రాత్రంతా గాంధీవిగ్రహం వద్దే గడిపారు.అర్ధరాత్రి దాటే దాకా టిఎంసికి చెందిన డోలా సేన్, శంతను సేన్‌లు వాళ్లతోనే ఉన్నారు. అధికారులు టెంట్‌కు అనుమతి ఇవ్వకపోవడంతో అయిదుగురు ఎంపిలు ఆరు బయటే నిద్రించారు. ధర్నాలో రాజ్యసభకు చెందిన 20 మంది ఎంపిలతో పాటుగా లోక్‌సభలో సస్పెండయిన నలుగురు ఎంపిలు కూడా చేరారు. ‘భారీ వర్షం కారణంగా 50 గంటల ధరా గాంధీ విగ్రహం వద్దనుంచి పార్లమెంటు ప్రధాన ప్రవేశద్వారం వద్దకు మారింది. ఇప్పటికి 29 గంటలు గడిచి పోయాయి. మరో 21 గంటలుంది. ఇప్పుడు 27 మంది ఎంపిల సస్పెన్షన్‌ను ఎత్తి వేయాలని, పాల ఉత్పత్తులపై జిఎస్‌టివిధింపుపై చర్చకు డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపిలు ఇంకా ధర్నాలో ఉన్నారు’ అని టిఎంసి రాజ్యసభ ఎంపి డెరిక్ ఒబ్రియాన్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. గురువారం ఉదయం టిఎంసి ఎంపి మౌసమ్ నూర్ ధర్నా చేస్తున్న ఎంపిలకోసం టీ తెప్పించారు. విపక్ష ఎంపిలు క్షమాపణ చెప్పబోరని, ధర్నా కొనసాగిస్తారని ఈ సందర్భంగా ఆమె చెప్పారు. కాగా ధర్నా చేస్తున్న ఎంపిలకు డిఎంకె మధ్యాహ్నం భోజనం కోసం ఇడ్లీలు అందిస్తుండగా, టిఎంసి చేపల కూర ఏర్పాటు చేస్తోంది. కాగా రాత్రి భోజనం టిఆర్‌ఎస్ ఏర్పాటు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా ధర్నా చేస్తున్న ఎంపిలు డీ హైడ్రేషన్‌తో బాధపడకుండా ఉండడం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ జ్యూస్, లస్సీ, మంచినీరు లాంటి వాటిని పుష్కలంగా ఏర్పాటు చేసింది. కాగా మంగళవారం రాత్రి భోజనం కోసం టిఎంసి తండూరి చికెన్‌ను సర్వ్ చేయడంపై బిజెపి అభ్యంతరం తెలిపింది. గాంధీజీ విగ్రహం వద్ద సస్పెండయిన ఎంపిలు మాంసాహరం తీసుకోవడంపై ప్రతి ఒక్కరూ అభ్యంతరం చెబుతున్నారని బిజెపి అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఒక ట్వీట్‌లో అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి టిఎంసి నేత సుస్మితా దేవ్ ఘాటుగా ప్రతి సమాధానం ఇచ్చారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ నేతలు ఇళ్లలో తలుపులు మూసుకుని అన్నీ తినేస్తారు. అందువల్ల మా ఆహారంపై వ్యాఖ్యలు చేయకుండి’ అని ఆయన మీడియాతో అన్నారు. ఈ వ్యాఖ్యలు బిజెపి అసహనాన్ని చాటుతున్నాయని పేరు చెప్పడానికి ఇష్టపడని మరో విపక్ష నేత అన్నారు. కాగా రెండు అంబులెన్స్‌లు, డాక్టర్‌ను, ఇద్దరు డ్రౌవర్లను, ధర్నా ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచడం కోసం సిబ్బందిని అందించినందుకు విఓక్ష ఎంపిలు రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మరో వైపు ఎంపిలు తమ సొంత దిండ్లు, దుప్పట్లు, మాట్రెస్‌లు తెచ్చుకున్నారు. ఒ బ్రియాన్ అయితే వాళ్ల కోసం ఓడోమాస్ క్రీమ్‌ను కూడా తెప్పించారు.

Suspended RS MPs Strike in Parliament

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News