Saturday, April 27, 2024

‘విజయం సాధించాం’

- Advertisement -
- Advertisement -
Taliban seize control of Kabul airport
కాబూల్ విమానాశ్రయాన్ని వశపరుచుకున్న తాలిబన్ నేతల ప్రకటన

కాబూల్: అమెరికా సైనిక బలగాలు కాబూల్ విమానాశ్రయాన్ని ఖాళీ చేసి వెళ్లడంతో తాము విజయం సాధించామని తాలిబన్లు ప్రకటించారు. మంగళవారం ఉదయం విమానాశ్రయంలోకి ప్రవేశించిన తాలిబన్ నేతలు దేశ భద్రతకు హామీ ఇచ్చారు. గతంలో తమకు వ్యతిరేకంగా పని చేసినవారికి క్షమాభిక్ష ప్రకటించారు. ‘చివరికి అఫ్ఘానిస్థాన్ విముక్తి చెందింది. విమానాశ్రయంలోని మిలిటరీ, పౌర విభాగాలు పూర్తిగా మా ఆధీనంలోకి వచ్చాయి. త్వరలోనే మా కేబినెట్‌ను ప్రకటిస్తాం. అంతా శాంతంగా,సురక్షితంగా ఉన్నది’ అని తాలిబన్ అగ్రనేత హెక్మతుల్లావాసిఖ్ అన్నారు. ప్రజలు సహనం పాటించాలని ఆయన సూచించారు. సాధారణ పరిస్థితి నెలకొనడానికి కొంత సమయం పడుతుందన్నారు.

అమెరికా,నాటో సేనలు అఫ్ఘానిస్థాన్‌ను ఖాళీ చేసి వెళ్లడంతో రెండు దశాబ్దాలపాటు అధికారం కోసం ఎడతెగని పోరాటం చేసిన తాలిబన్లకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. 3 కోట్ల 80 లక్షల అఫ్ఘన్ ప్రజల జీవితాలు తాలిబన్ల చేతుల్లోకి వెళ్లాయి. ఇక అక్కడ ఏం జరుగుతుందన్నదానిపై ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. కాబూల్ ఎయిర్‌పోర్టును పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు మంగళవారం ఉదయం నుంచే భద్రతా చర్యలు ప్రారంభించారు. ఆత్మాహుతి కారు బాంబర్లు విమానాశ్రయంలోకి ప్రవేశించకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎయిర్‌పోర్టులో ఎలాంటి సాంకేతిక పరికరాలను ఏర్పాటు చేయాలన్నది తమ సాంకేతిక విభాగం చూస్తుందని తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు. అఫ్ఘానిస్థాన్ నుంచి అమెరికా దళాలు దాదాపు 1,20,000 మందిని తరలించినట్టు చెబుతున్నారు. వారిలో అమెరికన్లతోపాటు అక్కడ తమ దళాలకు సహకారమందించిన అఫ్ఘన్లు కూడా ఉన్నారు. నాటోలోని మిగతా దేశాల దళాలు కూడా తమ సైనిక సిబ్బందితోపాటు వారికి సహకరించిన అఫ్ఘన్లను తరలించాయి. అయితే, తాలిబన్ల నుంచి ప్రమాదమున్నదని భావించిన అఫ్ఘన్లలో చాలామంది ఇంకా అక్కడే చిక్కుబడిపోయినట్టు తెలుస్తోంది. వారందరినీ తాలిబన్ల దయాదాక్షిణ్యాలకు వదిలేయడం అమెరికా, నాటో దళాల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శలు వస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News