Monday, April 29, 2024

కాబూల్ విమానాశ్రయాన్ని వదిలి ఇళ్లకు వెళ్లండి

- Advertisement -
- Advertisement -
Taliban urge Afghans to leave Kabul airport
అఫ్ఘన్లకు తాలిబన్ల విజ్ఞప్తి

కాబూల్: అఫ్ఘనిస్థాన్ దేశంనుంచి పారిపోయే క్రమంలో కాబూల్ విమానాశ్రయంలో 12 మంది మరణించిన నేపథ్యంలో తాలిబన్ల ప్రతినిధి విమానాశ్రయం వెలుపల పెద్ద సంఖ్యలో ఉన్న అఫ్ఘన్లను ఇళ్లకు తిరిగి వెళ్లాలని కోరారు. కాబూల్ విమానాశ్రయంనుంచి పారిపోయే ప్రయత్నంలో 12 మంది మరణించినట్లు తాలిబన్ అధికారులు ధ్రువీకరించారు. ప్రస్తుతం కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం అమెరికా బలగాల అధీనంలో ఉంది. విమానాశ్రయం వెలుపల తాలిబన్ ఫైటర్లు కాపలా కాస్తున్నారు. అఫ్ఘనిస్థాన్‌నుంచి దౌత్య సిబ్బందిని, తమ దేశ పౌరులను ప్వదేశానికి తీసుకు వచ్చేందుకు అమెరికాతో పాటుగా ఇతర పాశ్చాత్య దేశాలు ప్రయత్నిస్తున్నాయి.

ఈ క్రమంలో కాబూల్ విమానాశ్రయానికి వచ్చే విదూశీ విమానాల్లో ఎక్కి ఎలాగైనా దేశం వీడి వెళ్లాలనే ఉద్దేశంతో పెద్ద సంఖ్యలో అఫ్ఘన్ పౌరులు విమానాశ్రయానికి చేరుకుని రోజుల తరబడిగా వేచి ఉంటున్నారు. వారిని చెదరగొట్టడానికి తాలిబన్లు జరిపిన కాల్పులు, తొక్కిసలాట కారణంగా 12 మంది చనిపోగా, విమానాలు ఎక్కే ప్రయత్నంలో కిందపడి పలువురు గాయపడ్డారు కూడా. ఈ నేపథ్యంలో విమానాశ్రయంలో రద్దీ లేకుండా చూడాలని తాలిబన్ అధికారి అక్కడి వారిని కోరారు. విదేశాలకు వెళ్లేందుకు చట్టపరమైన హక్కులు లేకుంటే ఇళ్లకు తిరిగి వెళ్లాలని ఆ తాలిబన్ అధికారి అప్ఘన్లను కోరారు. కాబూల్ విమానాశ్రయంలో తాము ఎవరినీ బాధపెట్టాలని అనుకోవడం లేదని కూడా పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆ అధికారి చెప్పారు. కాగా ఇప్పటివరకు 8 వేలమందికి పైగా విదేశీయులను కాబూల్ విమానాశ్రయంనుంచి తరలించినట్లు పాశ్చాత్య దేశాల భద్రతా అధికారి ఒకరు చెప్పారు. కాగా అమెరికన్లందరినీ పూర్తిగా స్వదేశానికి తరలించేంత వరకు తమ భద్రతా దళాలు అఫ్ఘన్‌లోనే ఉంటాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇదివరకే స్పష్టం చేశారు కూడా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News