Friday, April 26, 2024

అనుకున్నంత సులువు కాదు

- Advertisement -
- Advertisement -

Team India cricketers need to work hard

 

న్యూఢిల్లీ: చాలా కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్న టీమిండియా క్రికెటర్లు మళ్లీ గాడిలో పడాలంటే తీవ్రంగా శ్రమించక తప్పదు. కరోనా దెబ్బకు చాలా రోజుల నుంచి క్రికెట్ పోటీలు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి. దేశ వ్యాప్తంగా కఠోర లాక్‌డౌన్ అమలు చేయడంతో క్రికెటర్లకు ఇంటికే పరిమితం కాక తప్పలేదు. ఇప్పుడిప్పుడే క్రికెటర్లు సాధన చేసేందుకు మార్గం సుగమం అయ్యింది. ప్రస్తుతం అన్‌లాక్ పక్రియ ప్రారంభం కావడంతో కేంద్ర ప్రభుత్వం కొన్ని మినహాయింపులు ఇచ్చింది. ఖాళీ స్టేడియాల్లో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది.

అంతేగాక క్రికెటర్ల సాధనకు కూడా పచ్చా జెండా చూపింది. దీంతో కొన్ని నెలలుగా ఇంటికే పరిమితమైన క్రికెటర్లకు సాధన చేసుకునే అవకాశం ఏర్పడింది. సుదీర్ఘ కాలం ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్న ఆటగాళ్లు త్వరలోనే మళ్లీ బ్యాట్ పట్టనున్నారు. క్రికెటర్ల ప్రాక్టీస్‌కు సంబంధించి భారత క్రికెట్ బోర్డు కూడా ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ ఆడే ఆటగాళ్లతో పాటు దేశవాళిక్రికెటర్లకు కూడా సాధ్యమైనంత త్వరగా ప్రాక్టీస్ షురూ చేయాలనే లక్షంతో కనిపిస్తోంది. ఈ మేరకు భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి, ప్రధాన కోచ్ రవిశాస్త్రి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తదితరులతో బిసిసిఐ అధికారులు చర్చలు కూడా జరిపినట్టు సమాచారం.

శ్రమించాల్సిందే..

మరోవైపు మళ్లీ పూర్వవైభవం సాధించాలంటే క్రికెటర్లు కూడా నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చక తప్పదు. దీని కోసం తీవ్ర సాధన చేయడం ఒక్కటే ఏకైక మార్గంగా కనిపిస్తోంది. క్రికెట్ వంటి గేమ్‌లో నిరంతరం ప్రాక్టీస్ చేయడం ఎంతో కీలకం. కానీ, కరోనా వల్ల ఏర్పడిన పరిస్థితులతో ఆటగాళ్లకు సాధన చేసే అవకాశం లేకుండా పోయింది. భారత్‌లో ఇండోర్ స్టేడియాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తదితర దేశాలతో పోల్చితే భారత్‌లో ఆధునిక సౌకర్యాలతో కూడిన ఇండోర్ స్టేడియాలు లేవనే చెప్పాలి. దీంతో ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్, జైపూర్ వంటి పెద్ద పెద్ద నగరాల్లో కూడా క్రికెటర్లు సాధన చేయలేక పోయారు. ఇక రానున్న రోజుల్లో ట్వంటీ20 ప్రపంచకప్, ఆస్ట్రేలియా సిరీస్‌లు జరుగనున్నాయి.

దీంతో భారత క్రికెటర్లు ఈ సిరీస్‌లకు సిద్ధం కావాలంటే ముమ్మర సాధన చేయక తప్పదు సీనియర్లు కోహ్లి, రోహిత్, ధావన్, జడేజా, బుమ్రా తదితరులతో పాటు రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్, పృథ్వీషా, శివమ్ దూబే, నవ్‌దీప్ సైని వంటి యువ క్రికెటర్లు కూడా నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఇదిలావుండగా లాక్‌డౌన్ ఆంక్షలు సడలించినా భారత క్రికెట్ బోర్డు మాత్రం ఇప్పటి వరకు క్రికెటర్లకు శిక్షణ శిబిరాన్ని ప్రారంభించలేదు. ఇటీవలే రెండు సిరీస్‌లు రద్దు కావడంతో బిసిసిఐ శిక్షణ కార్యక్రమాన్ని కాస్త వాయిదా వేసింది. వచ్చే నెలలో ఇది ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News