Monday, April 29, 2024

పాములపర్తి సదాదేశానువర్తి

- Advertisement -
- Advertisement -

PV Narasimha rao shatha jayanthi celebrations

 

ఆత్మవిశ్వాసం, ఆత్మజ్ఞానం, ఆత్మనిగ్రహం ఈ మూడు లక్షణాలు పి.వి.లో పుష్కలంగా ఉన్నాయి. ఈ లక్షణాలన్నీ తెలంగాణ మట్టే నేర్పింది. ఈ మట్టినుంచి ఎదిగొచ్చిన వ్యక్తి ఎంతశక్తివంతుడుగా ఉంటాడో దాన్ని దేశం, ప్రపంచం చూసింది. పి.వి. తన జ్ఞానాన్నంతా ప్రజలకోసంపెట్టి ఆత్మవిశ్వాసంతో దేశంకోసం నిలిచిపోరాడారు. ఆత్మనిగ్రహంతోనే, దూరదృష్టితోనే ప్రపంచీకరణ తలుపులు తెరిచాడు. ప్రపంచీకరణను ఈ దేశం మట్టి మీదరాసి చూస్తున్నప్పుడు పి.వి.ని భిన్నకోణాల్లో విశ్లేషించారు. ఈనాడున్న గ్లోబల్ విలేజ్‌ని ఆయన ముప్పయేళ్ల కిత్రం వూహించటం ఆయన దూరదృష్టికి చిహ్నం. నాయకుడంటే అప్పటికప్పుడు తక్షణ సమస్యలపై ఆకస్మిక నిర్ణయాలు తీసుకున్నప్పటికినీ తానువేసే అడుగులు రాబోయే కొన్నేళ్ల తర్వాత కాలాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రపంచం అంతా ఒక కుగ్రామం అన్న ఇప్పటి ఆలోచనను పి.వి. ఎప్పుడో వూహించాడు. అది పి.వి కున్న ప్రాపంచిక దృష్టి. అందుకోలేనంత సామాజిక రాజకీయ దివ్యదృష్టి ఆయనలో ఉంది.

పి.వి. ప్రస్థానం సిఎం నుంచి పిఎం దాకా

1957లో మంథని నియోజకవర్గంనుండి శాసనసభకు ఎన్నికైన పి.వి.న్యాయసమాచార శాఖామంత్రి, న్యాయ, దేవాదాయ మంత్రి, వై టద్య ఆరోగ్య శాఖామంత్రి, న్యాయ, సమాచారశాఖామంత్రిగా పనిచేసి 1971 సెప్టెంబర్ 30న ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రిగా పి.వి. చేపట్టిన భూసంస్కరణలు తెచ్చి కొత్త విప్లవాన్ని సృష్టించారు. తాను సీఎంగా వున్నప్పుడు జరిగిన ఎన్నికల్లో 70శాతం వెనుకబడిన వర్గాలకు సీట్లు కేటాయించడం చరిత్రలో నిలిచింది. పి.వి. కేంద్రరాజకీయాల్లోకి వెళ్లాక హనుమకొండ నుంచి రెండుసార్లు, మహారాష్ట్ర రాంటెక్‌నుంచి రెండుసార్లు, నంద్యాల లోక్‌సభనుంచి ఒకసారి ఎన్నికయ్యారు. 1980-89 మధ్యకాలంలో హోం, విదేశీవ్యవహారాలశాఖ, మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రిగా వ్యవహరించారు. 1983లో జరిగిన అలీన దేశాల శిఖరాగ్రసభలో స్పానిష్‌లో మాట్లాడారు.

ఫీడెల్ కాస్ట్రో పి.వి. ఉపన్యాసానికి ఫిదా అయ్యారు. రాజీవ్‌గాంధీ హత్యానంతరం దేశపాలనా బాధ్యత తీసుకునే ప్రధానపదవికి అందరి ఆమోదంతో వానప్రస్థానంనుంచి తిరిగివచ్చి బాధ్యతలు చేపట్టారు. మైనార్టీ ప్రభుత్వాన్ని ఎలాంటి అవరోధాలు లేకుండా ఐదేళ్లు నిర్వహించిన చాణుక్యుడు పి.వి. దేశం దివాళతీసే దశలో ఆర్థికరంగానికి నూతన పుష్టి కలిగించారు. ఆయన తీసుకవచ్చిన ఆర్థిక సంస్కరణలే ఆ తర్వాత దేశం సాధించిన అభివృద్ధికి ప్రతీక అయ్యింది. దేశంలో అణుపరీక్షలు మొదలుపెట్టింది పి.వి.నే. 1994లో అవిశ్వాసతీర్మానం నుంచి తన ప్రభుత్వం బైటపడేందుకు వక్రమార్గాలు తొక్కారన్న ఆరోపణలు, బాబ్రీ మసీదు కూల్చివేతను ఆపలేకపోయారన్న విమర్శలను పి.వి.ఎదుర్కున్నారు. పి.వి. పై వచ్చిన అవినీతి ఆరోపణలు కోర్టుల్లో వీగిపోయాయి. పి.వి. తన అధికారాన్ని వ్యక్తిగత అవసరాలకు ఎప్పుడూ వాడుకోలేదు. పి.వి.లో ఏ నాయకునిలో లేని విశిష్ట లక్షణాలున్నాయి. పి.వి.గొప్ప కవి, రచయిత.

ఆయన తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచే “గొల్లరామవ్వ” కథ రాశారు. తన “లోపలిమనిషి” దగ్గర్నుంచి ఆయన చేసిన రచనలన్నీ ఆయనే స్వయంగా కంప్యూటర్‌లో టైపు చేసుకున్న ఘనత పి.వి.ది. ఇంగ్లీషు, హిందీతో పాటు 17 భాషల్లో ప్రావీణ్యం పొందా రు. విశ్వనాధసత్యనారాయణ వేయిపడగలు “సహస్రఫణ్‌” పేరున హిందీలోకి అనువదించారు. ‘పన్‌లక్షత్ కోన్‌ఘతో’ అనే మరాఠి పుస్తకాన్ని “అబలజీవితం” అని తెలుగులోకి అనువదించారు. జయప్రభ కవిత్వాన్ని ఆంగ్లంలోకి అనువదించారు. తన ఆత్మకథ ఇర్‌సైడర్ రెండోభాగం రాయాలన్న ఆయన కోరిక తీరకుండానే 2004, డిసెంబర్ 23న కన్నుమూశారు. భారత మాజీ ప్రధాన మంత్రుల అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ఢిల్లీలోనే జరగటం, వారికి స్మృతిచిహ్నాలు ఏర్పాట్లు జరిగాయి. కానీ పి.వి. అంత్యక్రియలు హైదరాబాద్‌లోనే జరిగాయి. ఆయన స్మృత్యర్థంగా దేశంలోనే అతిపెద్ద ఫ్లైఓవర్‌కు “పి.వి.నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌వే” గా పేరుపెట్టారు. 2016లో వినయ్ సీతాపతి పి.వి.పై “హాఫ్‌లయిన్‌” రాయగా, జైరాం రమేష్ “టుది బ్రింక్ అండ్ బాక్ ఇండియాస్ 1991 స్టోరీ” రచించారు.

దేశ్‌బచావో, దేశ్‌బనావో

ఒక్కొక్క ప్రధానిపేరు చెప్పగానే ఒక్కొక్క నినాదం గుర్తుకువస్తుంది. “గరీబ్ హటావో” నినాదం అనగానే శ్రీమతి ఇందిరాగాంధీ, “సోషలిస్టు తరహా రాజ్యం” అంటే జవహార్‌లాల్‌నెహ్రు, “జై జవాన్ జైకిసాన్‌” అంటే లాల్‌బహదూర్ శాస్త్రిలు గుర్తుకువస్తారు. పి.వి.ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలంగా ఉంది. ఈ దశనుండి దేశాన్ని బైటపడేయటం పెద్ద సవాలే. ఈ సవాల్‌ను తీసుకుని పి.వి.నర్సింహారావు “దేశ్‌బచావో దేశ్‌బనావో” అనే నినాదమిచ్చారు. “దేశాన్ని రక్షించుదేశాన్ని నిర్మించు” అనే నినాదంతో ఆయన ఆర్థిక వ్యవస్థను ఒకగాటిన పెట్టడానికి పెద్ద కృషిచేశారు. ఆర్థికవేత్త అయిన మన్మోహన్‌సింగ్‌ను తీసుకవచ్చి ఆర్థికమంత్రిగా పెట్టారు. ఆర్థిక సంస్కరణలు ప్రారంభించి దేశాన్ని కుదుటపడేశారు. ఇది సామాన్యమైన విషయంకాదు. అసాధారణమైన పనిని భుజంమీద వేసుకున్న పి.వి.తన మార్గంలో విజయం సాధించారు. అది దేశాన్ని రక్షించింది. ప్రపంచీకరణ సంస్కరణలతో దేశం కొత్తగా నిర్మించబడింది.

ప్రపంచవ్యాపితంగా వేగవంతంగా జరుగుతున్న మార్పులు, ప్రపంచ ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిణామాలను లోతుగా అధ్యయనం చేస్తే తప్ప వాటిని అవగతం చేసుకోలేరు. సాంకేతిక విప్లవాలు మొదలవుతున్నాయి. కంప్యూటర్ అన్నది అప్పుడప్పుడే విశ్వవేదికమీదకు వస్తుంది.

పి.వి. కంప్యూటర్ల ద్వారా వస్తున్న సాంకేతిక విప్లవాలను తెలుసుకోవటమే కాదు, కంప్యూటర్‌ను స్వయంగా తానే నేర్చుకున్నారు. దానిపైన వేగంగా టైపు చేయగల నేర్పును కూడా పొందారు. పి.వి.కి సాధువులు, సన్యసించిన వారితో మాట్లాడే తాత్త్వికత బాగా తెలుసు. అట్లనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆలవోకగా ఆకళింపు చేసుకున్న జ్ఞాని. పి.వి.లో విభిన్న కోణాలున్నాయి. ప్రకృతిని ఆరాధించేవాడు. ప్రకృతి సంపదను కొనియాడేవారు. ఆయన సాహిత్య, సాంస్కృతిక రంగాలలో ప్రావీణ్యం ఉన్నవాడు. ఈస్థటిక్ సెన్స్‌బాగా తెలిసినవాడు. అన్ని విషయాలపైన లోతైన అవగాహన, ఎరుకగల వ్యక్తి. రసాస్వాధన చేయగల రమణీయత ఆయనలో ఉంది. అందువల్లనే ఆయన ఆలవోకగా రచనలు చేయగలిగేవారు. ధారళంగా పలుభాషల్లో మాట్లాడగలిగేవారు. రాజకీయ పదువుల గాంభీర్యాన్ని ఏనాడు తన దరిచేరనివ్వని సంస్కారి పి.వి. ప్రధానమంత్రి వంటి అత్యున్నత పీఠాన్ని అలంకరించినా ఆయన మాత్రం రచనావ్యాసాంగాన్ని విడిచిపెట్టకపోవటం విశేషం. పి.వి.లో ప్రధాని పీఠమేకాదు, తెలుగు సాహిత్య తెలంగాణ ఠీవి కూడా కన్పిస్తుంది.

తెలంగాణ జ్ఞానభూమి

తెలంగాణ నేలలో జ్ఞానసంపద పొదిగివుంది. ఈ జ్ఞాననేల నుంచి వచ్చిన విజ్ఞానవజ్రమే పి.వి.నర్సింహారావు అని మళ్లొక్కసారి ప్రపంచానికి చాటిచెప్పటానికే కేసీఆర్ పి.వి. శతజయంతి కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టారు. లెక్కప్రకారం ఈ శతజయంతి ఉత్సవాలు ఢిల్లీనుంచి మొదలుకావాలి. కానీ, తెలంగాణ జ్ఞానబిడ్డను దేశం విస్మరిస్తుందని, ఇది సరికాదని ఈ జ్ఞాన భూమినుంచే ఆయన శతజయంతి కార్యక్రమాలకు కేసీఆర్ శ్రీకారం చుట్టారు. జ్ఞాన తెలంగాణ నిర్మాణానికి పునాదిగానే తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా పి.వి. శతజయంతిని ఈ నేలఘనంగా జరుపుకోంటుంది. దక్షణాది సుంచి ఎదిగొచ్చిన మహానేతగా దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు గట్టెక్కిచ్చిన ఘనుడైన పి.వి.ని తలుచుకోవటం గొప్పవిషయం. ఈ తరానికి పి.వి.నర్సింహారావును పరిచయం చేయడం ఎంతో అవసరమని కేసీఆర్ గుర్తించారు.

మూతిముడిచినట్లుగా కనిపించే పి.వి, బక్కపల్చటి కెసిఆర్ వీరిద్దరి బలం జ్ఞానబలం. తెలంగాణ రాష్ట్ర బాహుబలిగా నిలిచిన కేసీఆర్ ఈ మట్టినుంచి ఎదిగొచ్చిన నేతలను మరువకూడదన్న స్ఫూర్తిని ఈ తరంలో రగిలిస్తున్నారు. పి.వి.నర్సింహారావంటే ఒక ఐదేళ్ల కాలంలో ప్రధానమంత్రిగా వ్యవహరించిన వ్యక్తి మాత్రమేకాదు. దేశం గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేశాన్ని గట్టెక్కించి నిలిపిన సంస్కరణలు చేసిన సంస్కారి మన పి.వి. ప్రధానంగా సమాజంలో మార్పురావాలంటే చదువే బలమైన ఆయుధమని నమ్మి విద్యారంగాన్ని తీర్చిదిద్దటానికి ఎంతో కృషిచేశారు. ఆయన రాష్ట్ర విద్యాశాఖామంత్రిగా ఉన్నప్పుడు సర్వేల్‌లో గురుకులం ప్రారంభించారు. అప్పటి ఆంధ్రప్రదేశ్‌లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో మరో రెండు గురుకులాలను ప్రారంభించారు. సర్వేల్ గురుకులంలో చదివొచ్చిన విద్యార్థులే ఇపుడు తెలంగాణ పాలనారంగంలో అత్యంతకీలక రంగాల్లో పనిచేస్తున్నారు. విద్యకు పి.వి. ఇచ్చిన ప్రాధాన్యతను దేశంలో మరెవ్వరూ ఇవ్వలేదు.

రాష్ట్రంనుంచి కేంద్రానికి కేంద్ర విద్యాశాఖామంత్రిగా బాధ్యతల్ని చేపట్టిన పి.వి. ఆ శాఖపేరునే మార్చివేసి మానవవనరుల శాఖగా మార్చటం జరిగింది. తెలంగాణ విద్యారంగంలో విప్లవాలకు కేంద్రమైంది. సర్వేల్ స్ఫూర్తితోనే పి.వి. దేశవ్యాపితంగా నవోదయ విద్యాసంస్థలను నెలకొల్పారు. ఆ విద్యాసంస్థల్లో చదువుకున్న లక్షలాది మంది పిల్లలు ప్రపంచానికే గొప్ప మానవవనరులుగా మారారు. దేశంలో ఎక్కడాలేని విధంగా 959 గురుకులాలను నెలకొల్పింది ఒక్క కేసీఆర్ మాత్రమే. తెలంగాణలో ఒక సర్వేల్ స్కూల్‌ను ప్రారంభించిన పి.వి దేశంమొత్తం గురుకులాలను నెలకొల్పితే, ఒక్క తెలంగాణలోనే 959 గురుకులాలు నెలకొల్పటం విశేషం. ఇది విద్యారంగంలోనే విప్లవాత్మక చర్య.

ప్రధానంగా ఈ గురుకులాలన్నీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఆదివాసీలవి కావటం మరో గొప్ప విషయం. ఇపుడు ఈ గురుకులాల్లో 4 లక్షలమంది చదువుతున్నారు. వీళ్లంతా సమీపభవిష్యత్తులో దేశానికి ప్రపంచానికి గొప్ప మానవవనరుగా మారతారు. మళ్లీ ఈ జ్ఞాన భూమినుంచి ఈ గురుకులాల నుంచి ఎందరెందరో పి.వి.లు, కేసీఆర్‌లు వచ్చి తీరుతారు. దీన్నెవరూ కాదనలేరు. ఈ సందర్భంగా పి.వి.ని స్మరించుకోవటమంటే ఆయన స్ఫూర్తితో జ్ఞానవిప్లవాలు పండించాలి. పేదసాదాబీదాబిక్కి అందరూ చదువుకోవాలి. అందరికీ నాణ్యమైన చదువందాలి. పి.వి.నువ్వు ఆనాడు ప్రపంచీకరణ తలుపులు తెరిచి కొత్త అడుగులు వేశావు. ఇపుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించి తనను తాను పునర్నిర్మించుకుంటూ ఈ నేలమీద సంచారజాతుల పిల్లలు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా తయారై అడుగులు వేసే దశలోవున్నారు. సరిగ్గా పి.వి. లాంటి జ్ఞానులు కోరుకున్న స్థితి అందరికీ చదువు అందాలన్న అంబేద్కర్ ఆశయాలు తెలంగాణ నేలలో పురుడు పోసుకుంటున్నాయి.

ఇపుడు పి.వి. శతజయంతి సందర్భంగా తీసుకునే స్ఫూర్తి నుంచి, ఈ జ్ఞానభూమి నుంచి లక్షలాది మంది కొత్తతరం పిల్లలు తమ కాళ్లపై తాము నిలిచే జ్ఞానాన్ని పొందే శిక్షణాలయాలను నెలకొల్పుకోవలసి ఉంది. ఈ శతజయంతి కార్యక్రమాల సందర్భంగా అసెంబ్లీలో పి.వి. చిత్రపటాన్ని పెట్టటం, ఆయన రచనలు పునర్ముద్రించటం, భారతరత్నను ఇవ్వాలని అడగటం అంటే మన చరిత్రను మనం మననం చేసుకోవటమే అవుతుంది. పి.వి. శతజయంతి స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని విద్యావిప్లవాలు సృష్టించే పనిని కేసీఆర్ చేసి చూపిస్తారు. జ్ఞానతెలంగాణకు బలమైన పునాదులు వేయటానికి పి.వి.శతజయంతి స్ఫూర్తితో వేసే అడుగులు కీలకమైన మార్పులు విద్యారంగంలో తెచ్చి పెడుతుంది. తెచ్చి తీరుతుంది. ‘జ్ఞానసంపదను సృష్టించటం’ దాన్ని మానవనరులుగా మార్చి ప్రపంచానికి అందించే అత్యాధునిక సాంకేతిక శక్తిగా తెలంగాణను తీర్చిదిద్దుకోవటానికి పి.వి.ని ఒక స్ఫూర్తిగా తీసుకుని అడుగులువేయాలన్న దీర్ఘకాలిక ఆలోచన కేసీఆర్‌లో ఉంది.

పి.వి.లాగే కెసిఆర్‌లో వున్న “లోపలి మనిషి”ని అంత తొందరగా గుర్తించటం కష్టం. తెలంగాణలో గ్రామ అభివృధ్ధి విప్లవం, జలవిప్లవం, వ్యవసాయక విప్లవం, హరితవిప్లవం, ఐటివిప్లవం తర్వాత మొత్తం విద్యారంగం తలరాతల్ని మార్చటానికి చేయబోయే జ్ఞానవిప్లవానికి పునాదిగానే పి.వి. శతజయంతి సభల్ని కేసీఆర్ ఘనంగా ఒక సంవత్సర కాలం నిర్వహించాలన్న కార్యాచరణ ప్రణాళికల్ని రచించబోతున్నారు.

దేశంకోసం తపించినవారిని తలుచుకోవటం మన సంస్కారం. తెలంగాణ మట్టిలోనే ఆ సంస్కారగుణముంది. దేశంకోసం జీవితాన్ని అంకితంచేసినవారిని గుర్తుపెట్టుకోవడమంటే మళ్లీ ఆ స్ఫూర్తిని ఈ తరంలో రగిలించడమే అవుతుంది. ఈ స్ఫూర్తి కొనసాగాలి. ఈ చైతన్యదీపాలు వెలుగుతూనే ఉండాలి. అవే మళ్లీ భవిష్యత్ సమాజాలను నిలిపే జ్ఞానజ్యోతులై వెలుగుతుంటాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News