Saturday, April 27, 2024

ఎవరికి ఎవరి భిక్ష?

- Advertisement -
- Advertisement -

KCR

 

భూముల రిజిస్ట్రేషన్ విలువ సవరిస్తాం

మేం తప్పులు చెబితే జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ప్రజలే మమ్మల్ని ఓడిస్తారు

కాళేశ్వరంపై కాంగ్రెస్ చెబుతున్న ఒప్పందం నిజమైతే రాజీనామాకు సిద్ధం

కేంద్రానికి మనమే ఎక్కువ ఇస్తున్నాం, దేశాన్ని నడిపించే నాలుగైదు రాష్ట్రాల్లో తెలంగాణ మొదటిది

పన్ను వసూళ్ల రూపేణా రాష్ట్రం నుంచి కేంద్రానికి ఇంతవరకు రూ.2,72,926కోట్లు వెళ్లాయి

గత ఐదేళ్లలో కేంద్రం నుంచి రాష్ట్రానికి
రూ. 1,12,854 కోట్లు వచ్చాయి

కేంద్రానికి మనం భిక్ష వేస్తున్నామా…
అది మనకి వేస్తున్నదా?

అభివృద్ధి చెందాలంటే అప్పులు తప్పవు, ఇరిగేషన్‌పై లక్ష కోట్లకు పైగా పెట్టాం

తెలంగాణను సస్యశ్యామలం చేసే వరకు విశ్రమించను : ద్రవ్యవినియోగ బిల్లుపై చర్చలో సిఎం

మనతెలంగాణ / హైదరాబాద్ : దేశాన్ని నడిపించే నాలుగైదు రాష్ట్రాల్లో తెలంగాణ మొదటిదని, కేంద్రానికి రాజ్యాంగం ద్వారా లభించిన పన్ను వసూలుతో తెలంగాణ నుంచి రూ. 2,72,926 కోట్లు చేరాయని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు చెప్పారు. సోమవారం శాసన సభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ… గత ఐదేళ్లలో కేంద్రం నుంచి తెలంగాణకు లక్షా 12 వేల 854 కోట్లు వచ్చాయని, కేంద్రం పన్నుల వాటాలో కోతలు విధించిందని విమర్శించారు. కేంద్రానికి మనం భిక్ష వేస్తున్నామా? కేంద్రం మనకు భిక్ష వేస్తుందా…? కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాల్లో కోత పెట్టారని చెప్పారు.

తెలంగాణ నుంచి కేంద్రానికి రూ. 2లక్షలకు పైగా కోట్లు వెళ్ళాయని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అప్పులు చేయాలి తప్పదని, నేడు అత్యధికంగా అప్పులున్న దేశం అమెరికానని, తెచ్చిన అప్పు ఏం చేస్తున్నాం అనేది ముఖ్యమని వివరించారు. రూ. లక్ష కోట్లకు పైగా ఇరిగేషన్‌పై ఖర్చు పెట్టామని, రెండేళ్లలో సగానికి సగం అప్పులు తీరిపోతాయని, 23 జిల్లాలున్న ఏపీకి సమానంగా తెలంగాణ బడ్జెట్ ఉందని ముఖ్యమంత్రి వివరించారు. తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్ర జిఎస్‌డిపి రూ.5 లక్షల కోట్లలోపు ఉండేదని, ప్రస్తుతం రాష్ట్ర జిఎస్‌డిపి రూ. 9 లక్షల కోట్లకు పైగా ఉందని తెలిపారు.

రుజువు చేస్తే రాజీనామా చేస్తా…
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం నేను 7 సార్లు కేంద్రం వద్దకు వెళ్ళాను, హరీశ్‌రావు 30 సార్లు వెళ్ళడం జరిగిందని, అనుమతులు తీసుకువచ్చామని సిఎం చెప్పారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క చేసిన 152 టిఎంసిల నుంచి 100 టిఎంసిలకు కుదించి తీసుకువచ్చారని చెప్పడంతో సిఎం కెసిఆర్ ఒక్కమారుగా లేచి మీరు ఒప్పందం చేసుకున్నారా..? చేసుకుంటే ఒప్పందం చూపించండి నేను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. గాలి కబుర్లు చెప్పరాదని, అగ్రీమెంట్ ఉంటే చూపాలని, ఏదో వెళ్ళి వచ్చి కుదించుకుని తీసుకువచ్చామని చెప్పడం సరికాదని సిఎం చెప్పారు.

తెలంగాణను సస్యశ్యామల చేసే వరకు విశ్రమించను సజల, సుజల, సస్యశ్యామల తెలంగాణను చేసే వరకు విశ్రమించను’ అని, కోటి ఎకరాలు సస్యశ్యామలం చేస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేశారు. ’రైతు బంధును ఐక్యరాజ్యసమితి అభినందించిందని, 124 రోజులు కాకతీయ కాలువలు సజీవంగా ఉన్నాయని చెప్పారు. షుగర్ ఫ్రీ రైస్ పెద్ద ఎత్తున పండించబోతున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. యాసంగిలో 38 లక్షల ఎకరాలకు పైగా వరినాట్లు వేశారని, తెలంగాణ సోనాను పెద్ద ఎత్తున పండించబోతున్నామని’ సిఎం కెసిఆర్ లిపారు. ఎగువ, దిగువ రాష్ట్రాల సమన్వయంతో నీటి ప్రాజెక్టులు చేపడుతున్నామని’ సిఎం వివరించారు. రైతును రాజు చేసే వరకు ఖర్చుకు వెనుకాడేదిలేదని, ’పేగులు తెగేదాకా కొట్లాడి తెలంగాణ తెచ్చింది టీఆర్‌ఎస్ పార్టీయని, తెలంగాణ రైతులు, ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం రానివ్వబోమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

530 టీఎంసీలు గోదావరి నుంచి ఢంకా భజాయించి తీసుకుంటామని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ఎన్నో కేసులు వేశారన్నారు. మిడ్‌మానేరులో 3 టిఎంసిలు, మల్లన్నసాగర్‌లో 2 టిఎంసిలు, 75 టిఎంసిలు సమ్మక్కసాగర్, 175 సీతారామ ప్రాజెక్టు నుంచి తీసుకుంటామని, మొత్తం 950 టిఎంసిలు తీసుకోవాలని నిర్ణయించినట్టు, కృష్ణాలో మనకు రావాల్సిన వాటా కోసం పోరాటం చేస్తూనే గోదావరి నుంచి మన వాటా తీసుకుంటామని సిఎం స్పష్టం చేశారు. మిషన్ కాకతీయ చాలా వరకు పూర్తయిందని, రెండేళ్లలో 1200 చెక్‌డ్యాంలు పూర్తి చేయబోతున్నామని, వ్యవసాయ రంగం ద్వారా జిఎస్‌డిపి పెంచే ప్రయత్నం చేస్తున్నా మని, రైతును రాజు చేసే వరకు ఖర్చుకు వెనుకాడేదిలేదని సిఎం కెసిఆర్ చెప్పారు. మీకు కాలువలు కనిపించడం లేదా? అద్భుతంగా కరెంట్‌ఇస్తున్నాం? ఇది గ్రోత్ కాదా? అని ప్రతిపక్షాలను ముఖ్యమంత్రి ఎదురు ప్రశ్నించారు.

భూముల విలువను సవరిస్తాం…
రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువను సవరిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ వెల్లడించారు. ఇసుక, మైన్స్ వంటి వాటిపై పన్నులు పెంచడం వల్ల ప్రభుత్వానికి నిధులు వస్తాయని, విద్యుత్, ఆర్‌టిసి చార్జీలు పెంచితే ఆ సంస్థలకే వెళ్తాయని సిఎం తెలిపారు. ఆర్‌టిసిని బ్రతికించడానికి చార్జీలు పెంచాలని, సంస్థకు బడ్జెట్‌లో రూ. 1000 కోట్లు కేటాయించినట్టు, ఏ ప్రభుత్వమైనా కరెంట్ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు పెంచుతుందని, 24 గంటల నాణ్యమైన కరెంట్‌ఇస్తున్నాం కాబట్టి చార్జీలు పెంచక తప్పదని సిఎం కెసిఆర్ వెల్లండించారు.

విద్యుత్ విభాగంలో 50 వేల మంది పనిచేస్తారని, 24 గం.లు కరెంటు ఇస్తున్నాం.. విద్యుత్‌ను కాపాడుకోవాలి.. పన్నులు భరించాలి. పెంపులో వెనుకాడబోమని, నేను ప్రజలను మోసం చేయనని సిఎం స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధిలో కాంప్రమైజ్ కామని, మీకు పనిలేదు.. మేము ఫుల్ బిజీ యని, కరోనా, ఆర్థిక మాంద్యం పీడిస్తున్న సమయంలోనూ ఈ ఏడాది గ్రోత్ రూ. 1.63 లక్షల కోట్లకు చేరుకుంటామని, మరో రూ. 20 వేల కోట్లు రిజిస్ట్రేషన్‌ల విలువను సవరించడం ద్వారా చేరవచ్చని సిఎం సూచన ప్రాయంగా వెల్లడించారు.

కందుల కొనుగోలుకు రూ. 300 కోట్లు విడుదల
రాష్ట్రంలో రైతులు దర్జాగా పంటలు పండిస్తున్నారని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. వ్యవసాయంలో అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నామన్నారు. 2 లక్షల 25 వేల కంది రైతులకు న్యాయం చేస్తున్నామన్నారు. కందుల కొనుగోలుకు రూ. 300 కోట్లు విడుదల చేసి కంది రైతులను ఆదుకుందని సిఎం తెలిపారు. కేంద్రానికి నేను లేఖ రాస్తానని సిఎం చెప్పారు. వ్యవసాయం రంగం మైనస్ నుంచి ప్లస్ స్థాయి వచ్చిందని, వ్యవసాయ రంగంలో -_ 11.4 శాతం నుంచి + 23.7 శాతానికి చేరుకుందని, మూడేళ్ళు రైతాంగం పండిస్తే వచ్చే ఫలితాలతో అప్పులు మాయమవుతాయని సిఎం తెలిపారు. అన్ని రంగాల్లో రాష్ట్రాభివృద్ధి కనిపిస్తోందని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు.

వందశాతం రాష్ట్ర ప్రగతి కోసం పనిచేస్తామని, కరోనా..ఆర్థిక మాంద్యం పీడిస్తున్నా.. తెలంగాణలో వనరులు బాగానే ఉన్నాయని, రాష్ట్రంలో 2 లక్షల టన్నులకు పైగా సన్నబియ్యం పంట పండబోతుందని సిఎం ధీమా వ్యక్తంచేశారు. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే సంక్షేమ పథకాలను ఎలా కొనసాగిస్తున్నామని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రశ్నించారు. గిరిజన ప్రాంతాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘతన తమదేనని స్పష్టం చేశారు. అనేక రంగాల్లో అభివృద్ధి ప్రజల కళ్లముందు కనిపిస్తోందని, కాకతీయ కాలువలు సజీవంగా పారుతుంటే జనాలకు కనిపిస్తోందని, కానీ, కాంగ్రెస్ నాయకులకు కనిపించడం లేదని సిఎం విమర్శించారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్వన్. కాగ్‌ఇచ్చిన లెక్కలనే మేం శాసనసభలో సమర్పించామని సిఎం పేర్కొన్నారు.

నిరుద్యోగ యువతను మోసం చేయొద్దు ..
మిమ్మల్ని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలేనని, నిరుద్యోగ యువతను మోసం చేయడం మానుకోవాలని, నిరుద్యోగులను అడ్డంపెట్టుకుని ఎంతకాలం మోసం చేస్తారని’ ముఖ్యమంత్రి కెసిఆర్ మండిపడ్డారు. ఇవ్వలేని వాటిని ఇస్తామని నమ్మించి మోసం చేయడం సరికాదని, 50 ఏళ్ళలో మీరు ఎందుకు ఉద్యోగాలివ్వలేదని ఆయన ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు. తెలంగాణ వస్తే లక్ష ఉద్యోగాలిస్తామని పార్లమెంట్, అసెంబ్లీలో చెప్పామని సిఎం స్పష్టం చేశారు. తె’వాస్తవాలు చెబితే ప్రజలు గౌరవిస్తారని, దేశంలో తొలిసారిగా అభివృద్ధి పనుల ఖర్చుల వివరాలు బహిరంగంగా వెల్లడించామని, ప్రజల సమస్యలే ఇతివృత్తంగా.. పరిష్కారం కోసం పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

తెలంగాణ ఏర్పడితే లక్ష కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలు వస్తాయని చెప్పామని సిఎం అన్నారు. 70 ఏళ్ల చరిత్రలో గత ప్రభుత్వాలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాయని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతను మోసం చేయడం మానుకోవాలని ప్రతిపక్షాలకు ఆయన హితవుపలికారు. ప్రతిపక్షాలు సబబుగా మాట్లాడితే సబబైన సమాధానమే వస్తుందనీ, రాజకీయంగా మాట్లాడితే రాజకీయ సమాధానమే వస్తదని చెప్పారు. ఏదో ఒక గ్రామానికి అదీ… మారుమూల గ్రామానికి నీళ్లు రాకుంటే మొత్తం భగీరథ దండుగ అన్నట్లు మాట్లాడటం సరికాదని, సభలో హుందాగా మాట్లాడాలి’ అని శాసనసభలో ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు.

కామారెడ్డిలో విజయ డైరీ ప్లాంట్..
అప్పుల్లో ఉన్న విజయ డైరీని లాభాల్లోకి తెచ్చామని, కామారెడ్డిలో విజయ డైరీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్టు సిఎం చెప్పారు. నార్త్ ఇండియాలో విజయడైరీ నెయ్యికి విపరీతమైన డిమాండ్ ఉండేదని, అలాంటి సంస్థను రూ.30కోట్ల నష్టాల్లోకి తీసుకొస్తే తెలంగాణ ప్రభుత్వం విజయ డెయిరీని ఆదుకుందని, రూ. 16 కోట్లను ఆ సంస్థ బ్యాంకుల్లో డిపాజిట్ చేసే స్థాయికి తీసుకొచ్చామని సిఎం వివరించారు. కల్యాణలక్ష్మీ మా ఎన్నికల వాగ్దానం కాదు.. అయినా లక్ష నూట పదహారు ఇస్తున్నామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ఎప్పుడైనా మద్య నిషేధం చేశారా..? కాంగ్రెస్ హయాంలో బెల్టు షాపులే లేనట్టు మాట్లాడుతున్నారని, కాసు బ్రహ్మానందరెడ్డి సమయంలో మద్యపాన నిషేధం పెడితే అట్టర్ ప్లాప్ అయ్యిందనీ, ఎన్‌టిఆర్ హయాంలో ప్రొహిబిషన్ పెట్టి ఎత్తివేశారని సిఎం గుర్తు చేశారు.

గ్రామాల్లో గుడుంబా బట్టీలు లేకుండా చేశామని, అవసరమైతే మద్యం ధరలు మళ్లీ పెంచుతామని సీఎం వెల్లడించారు. 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులున్నారని, బీడీ కార్మికులకు పంఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని సిఎం తెలిపారు. టీడీపీ, కాంగ్రెస్ హయాంలో పెన్షన్లది ఘోరమైన పరిస్థితియని, గత ప్రభుత్వ హయాంలో పింఛన్లు రూ. 200 ఇచ్చేవారని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పింఛన్ రూ. 1000 చేశామని, ప్రస్తుతం పింఛన్ వంద శాతం పెంచి రూ. 2016 చేశామని, రాష్ట్ర ఆర్థిక స్థితి బాగాలేకపోతే సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తున్నామని సిఎం ప్రతిపాక్షాలనుద్దేశించి చెప్పారు.
మేము చేసింది అభివృద్ధి అయితేనే హైదరాబాద్‌లో మమ్మల్ని గెలిపిస్తారు..

వచ్చే జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో తాము చెప్పేది నిజమైతే, అభివృద్ధి చేస్తేనే మమ్మల్ని గెలిపిస్తారని, లేదంటే ఓట్లు వేయరని సిఎం చెప్పారు. హైదరాబాద్ పరిధిలో అభివృద్ధి పనులకు రూ.10 వేల కోట్లు కేటాయించామని, అందులో రూ. 2 వేల కోట్లు పాతనగరానికి కేటాయించాలని ఎంఐఎం ఎంఎల్‌ఎ కోరినట్టు కేటాయించే విషయమై పరిశీలిస్తామని, పాతనగరానికి మెట్రో తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. హైదరాబాద్‌కు తాగునీటి సమస్య రాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, కేశవాపూర్‌లో రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నామని, మిషన్ బగీరథ పథకంలో జలమండలి ద్వారా ఔటర్ రింగ్ రోడ్‌లోపలి గ్రామాలకు నీటిని అందించే రింగ్ మేయిన్ పథకం నడుస్తుందని సిఎం చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 31 మున్సిపాలిటీల్లో నీటి పథకం పూర్తికావాల్సి ఉందని, అక్కడి కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడని తద్వారా ఆలస్యమైందని సిఎం వివరించారు. 3 నుంచి 4 వేల కోట్లు సివిల్ సప్లై విభాగానికి కేటాయించినట్టు సిఎం తెలిపారు.

ఇప్పుడు ఇసుకపై ఆదాయం రూ. 2,384 కోట్లు
గత ఐదేళ్ళలో ఇసుకపై రూ. 2,384 కోట్లు సంపాదించామని, ఈ ఏడాది మరో ఆరేడు వేల కోట్లు సంపాదించాలనే లక్షంతో పనిచేస్తున్నామని, 2004 నుంచి 2014 వరకు దశాబ్థకాలంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇసుకపై సంపాదించింది కేవలం రూ. 40 కోట్లు మాత్రమేనని సిఎం చెప్పారు. గత ప్రభుత్వాల సమయంలో ఇసుకపై వచ్చే ఆదాయం జేబుల్లోకి వెళ్ళగా ఇప్పుడు మాత్రం ప్రభుత్వానికి చేరుతుందని సిఎం వ్యాఖ్యానించారు. వక్ఫ్ భూములపై సమీక్ష నిర్వహిస్తామని, సిఎఎపై దేశవ్యాప్తంగా ఉన్న ఇతరులతో కలిసి పోరాటం చేస్తామని చెప్పారు. ఇళ్ళు కాలిపోయిన వారికి నష్టపరిహారం ఇస్తున్నామని, ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రభుత్వ ఉద్యోగులు కారని, వారు ఆందోళన చేస్తే ప్రభుత్వం పట్టించుకోదని, వారి విషయంలో జిల్లాల కలెక్టర్లు చూసుకుంటారని సిఎం తెలిపారు.

పోడు భూములపై ప్రజాదర్బారు…
రాష్ట్రంలోని పోడు భూములపై ప్రజాదర్బారు నిర్వహిస్తామని, నేను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆ విభాగానికి చెందిన అధికారులు, జిల్లాల కలెక్టర్లుతో కలిసి వెళ్తామని సిఎం ప్రకటించారు. గిరిజనులపై మాకు సానుభూతి ఉన్నదని, గిరిజనులకు గ్రామపంచాయితీలు చేసిన ఘనత మాది, పోడు భూముల విషయాన్ని ప్రభుత్వ శ్రద్దగా ఆలోచిస్తున్నదని ముఖ్యమంత్రి కెసిఆర్ వెల్లడించారు.

 

Telangana is first of states to lead Country
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News