Saturday, April 27, 2024

దేశాన్ని కెసిఆరే నడిపించాలి

- Advertisement -
- Advertisement -

BALKA SUMAN

 

సిఎఎతో పాటు పలు అంశాలలో నాయకత్వం వహించాల్సిన సమయం ఆసన్నమైంది, కేంద్రం మొండిగా వ్యవహరిస్తోంది

n దేశప్రజలను ఒక్కత్రాటి మీదికి తెచ్చి ముందుకు తీసుకువెళ్లవలసిన బాధ్యత కెసిఆర్‌పై ఉంది
– సిఎఎ వ్యతిరేక తీర్మానంపై
చర్చలో బాల్కసుమన్

హైదరాబాద్: పౌరసత్వ చట్ట సవరణ(సిఎఎ)తో పాటు పలు అంశాలలో దేశానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నాయకత్వం వహించాల్సిన సమయం ఆసన్నమైందని టిఆర్‌ఎస్ సభ్యులు బాల్క సుమన్ తెలిపారు. సిఎఎపై కేంద్రం మొండిగా వెళ్తున్న తరుణంలో దేశ ప్రజానీకానికి దిశానిర్దేశం చూపెట్టి అందరినీ ఒక్కటిగా ముందుగా తీసుకెళ్లాలని తెలంగాణ ప్రజానీకం తరుపున సుమన్ సిఎంను కోరారు. బాధ్యత కలిగిన కేంద్ర ప్రభుత్వం విభజన రాజకీయాలకు పాల్పడుతోందని, ఈ దేశంలో ఒక సెక్షన్‌ను పక్కన పెట్టి రాజకీయం చేయడాన్ని మేధావి వర్గంతో పాట ఎవరూ సమర్థించడం లేదని పేర్కొన్నారు. సిఎఎ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్ వ్యతిరేక తీర్మానంపై ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ఈ సందర్భంగా దేశ రాజ్యాంగం ఉపోద్ఘాతం(ప్రియాంబుల్) సభలో చదివి వినిపించారు.

నిజాన్ని వినిపించే స్వరం బయటకు వస్తే దేశ ద్రోహుల ముద్ర వేస్తున్నారని చెప్పారు. తాను ఎంపిగా ఉన్నపుడు గ్రామీణభివృద్ధి స్టాండింగ్ కమిటీ మెంబర్‌గా పనిచేసానని 20 రాష్ట్రాలు తిరిగినట్లు వివరించారు. ప్రతిచోట భిన్నస్వరూపాలు, భిన్న భౌగోళిక పరిస్థితులు ఉన్నాయని, 70 ఏళ్లుగా ఉన్న దేశం ఒక్కటిగా కలగలిపి ఉన్నదంటే ఫౌండింగ్ ఫాదర్స్ నిర్ణయాలేనన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, మౌలనా అబుల్ కలాం ఆజాద్ వంటి వారి కమిట్ మెంట్‌తో అధ్బుతమైన రాజ్యాంగం ఇవ్వడమేనన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 7 దశాబ్దాల తరువాత తాము భారతీయ పౌరులమని నిరూపించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. రాజ్యాంగం కానీ, 1955 పౌరసత్వ చట్టం మతం ఆధారంగా పౌరసత్వం ఇవ్వడాన్ని, తిరస్కరించడాన్ని ఎక్కడా ప్రతిపాదించలేదన్నారు. ఆర్టికల్ 14, 15,21లను సిఎఎ ఉల్లంఘిస్తుందని తెలిపారు.

ఎన్‌ఆర్‌సి వల్ల దళితులు, మైనార్టీలు, ఆదివాసీలు అదే విధంగా మహిళలు, సంచార జాతులు తీవ్రంగా ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. దేశంలోని నిజమైన సమస్యలైనా ఆకలి, పేదరికం, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం లేదని తెలిపారు. బలహీన వర్గాలకు గృహ నిర్మాణాన్ని కల్పించడం, గత రెండేళ్లుగా తగ్గుతున్న ఎకనామీని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దేశవ్యాప్తంగా విద్యార్థులంతా బయటకు వచ్చి సిఎఎ, ఎన్‌ఆర్‌సికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారని వివరించారు. సహనంతో చేస్తున్న నిరసనలు, దీక్షలను తట్టుకునే, సహించే శక్తి లేక అణచివేస్తున్నారన్నారు. దేశంలో ఏడెనిమిది రాష్ట్రాలు వారి అసెంబ్లీల్లో సిఎఎకు వ్యతిరేకంగా తీర్మానం చేశాయని తెలిపారు.

జింగోజియం భావనలు పెచ్చరిల్లకుండా చూడండి
ఇప్పుడు కావాల్సింది, ఖేల్ ఇండియా కాదని దిల్ ఇండియా కావాలన్నారు. బలహీన వర్గాలను, మైనార్టీలను, అన్ని కులాలను, మతాల వారీని ఒకే కోణంలో ఒకే రకంగా తమ బిడ్డలుగా గొప్ప మనస్సు కేంద్ర ప్రభుత్వానికి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దేశాన్ని తియోక్రెటిక్ (దైవపాలన) దేశంగా మార్చొద్దన్నారు. జింగోజియం భావనలు పెచ్చరిల్లకుండా చూడాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. ప్రముఖ చరిత్రకారుడు రామచంద్రగుహ చెప్పినట్లు దేశానికి అయిన గాయాన్ని మాన్పడానికి, నమ్మకాన్ని ప్రజల్లో పెంపొందించడానికి వెంటనే కేంద్రం ఎన్‌ఆర్‌సి రద్దు చేయడంతో పాటు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న సిఎఎను కేంద్రం తెలివైన ప్రభుత్వం అయితే వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఒక వసుధైక కుటుంబంగా గొప్పగా పరిడవిల్లేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

బాల్క సుమన్ సభలో గుర్రం జాషువా పద్యాన్ని చదివి వినిపించారు.
గుణం లేని వాడు కులం గొడుగు పడుతాడు
మానవత్వం లేని వాడు మతం ముసుగు వేస్తాడు
జనులంతా ఒకటే కుటుంబం.. జగమంతా ఒకటే నిలయం

KCR should lead the Country
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News