Monday, April 29, 2024

మానవీయ ప్రతీకలు

- Advertisement -
- Advertisement -

Telangana is state implementing popular schemes

 

“స్వేచ్ఛ అంటే కేవలం రాజకీయ స్వేచ్ఛ కాదు, నిర్ణీత కాల వ్యవధులలో ఎన్నికలు నిర్వహించడం మాత్రమే కాదు, పేదరికాన్ని, నిరక్షరాస్యతను, అసమానతలను, ఆర్థిక అంతరాలను రూపుమాపడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం కావాలి” అని నినదించిన మహాత్మాగాంధీ మాటలను, చేతలలో చేసి చూపిస్తున్నారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.

తెలంగాణ బడ్జెట్ కేవలం చిట్టాపద్దుల పట్టికలు కాదు. అవి ప్రజల జీవితాలలో వెలుగులను ప్రసరింపజేసే వరప్రదాయినీలు. రాష్ర్టం ఏర్పడ్డాక ప్రవేశపెట్టిన 2014-15 తొలి బడ్జెట్‌లో తమకు పరిపాలనా అనుభవం లేదని, ప్రభుత్వం కల్మషం లేకుండా చెప్పుకుంది. అయితే ప్రజల శ్రేయోరాజ్య స్థాపనకు అంకితభావంతో పని చేస్తామని ప్రకటించుకున్నది. ఈ ఏడేళ్లలో ప్రవేశపెట్టిన ఎనిమిది బడ్జెట్‌లను నిశితంగా పరిశీలించినప్పుడు, ముఖ్యమంత్రి దూరదృష్టి, స్పష్టమైన దృక్పథం, రాష్ట్రాన్ని, ప్రజలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలోకి తీసుకు పోవడానికి ఎంతగా పరిశ్రమించారో స్పష్టంగా తెలుస్తున్నది. సంపూర్ణ ప్రగతే లక్ష్యంగా చేసుకొని ఆ దిశగా తీసుకున్న నిర్ణయాలు, అమలులోకి తెచ్చిన పథకాలు ఇంతటి స్వల్పకాలంలోనే దేశం దృష్టిని ఆకర్షించాయి.

తల్లిగర్భం నుండి జీవితాంతం వరకు ప్రతి దశలోనూ సంక్షేమాన్ని అమలు చేస్తున్న స్ఫూర్తిదాయకమైన ప్రభుత్వం ఇది. ప్రతికూల పరిస్థితులు ఏళ్లతరబడి సాగిన దుష్పరిపాలన, విచ్ఛిన్నమైన ఆర్థిక వ్యవస్థ, చేపట్టిన పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి తగిన సామర్థ్యం వంటివి ప్రభుత్వాన్ని వేధిస్తున్నప్పటికీ వర్తమానంలోనే ఊహించని వృద్ధిరేటును సాధించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. ఈ అభివృద్ధికి మహోన్నతంగా తీసుకున్న నిర్ణయాలే కారణం. ఇందులో కెసిఆర్ దార్శనికతతో అమలులోకి తెచ్చిన విధి విధానాలే దిక్సూచిగా నిలిచాయి. ఇంతటి ఆర్థికాభివృద్ధికి అనుసరిస్తున్న సమగ్ర ప్రణాళిక, ఉపాధి కల్పన, చురుగ్గా అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ప్రణాళికలు, ప్రభుత్వ యంత్రాంగం పనితీరు వలననే ఈ పురోభివృద్ధి సాధ్యమైందని చెప్పడం నిర్వివాదాంశం. శీఘ్ర, సమత్వశీల పురోభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆర్థిక క్రమశిక్షణతో కొనసాగిస్తున్న అభివృద్ధి ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నది.

ప్రస్తుతం కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసింది. కేంద్రం న్యాయంగా ఇవ్వవలసిన నిధులను విడుదల చేయడం లేదు. అయినప్పటికీ ప్రజలకు మేలు చేయాలనే తపన ఉంది. అంతకుమించి అంకితభావం, సంకల్పబలం ఉంది. అంతకు మించి సంకల్పశుద్ధి ఉంది. ఓట్ల కోసం రూపొందించే పథకాలు ఎలా డీలా పడ్డాయో, ఎలా కనుమరుగుయ్యాయో మన కళ్లముందు కనిపిస్తున్న గతచరిత్ర. కాగా నేటి తెలంగాణ సంక్షేమ పథకాలు ఏ పథకానికి ఆ పథకం వైవిధ్యం, వినూత్నం, వైశిష్ట్యం కలిగి ఉన్నాయి. కేవలం తాత్కాలిక ఉపశమనం కోసం రూపొందించినవి కావు. శాశ్వత పేదరిక నిర్మూలనకు ఆత్మగౌరవం పెంపొందించే దిశగా అమలు చేయబడుతున్నవిగా గమనించాలి.

2014-15 తొలి బడ్జెట్‌లో లక్ష్యం సాధించే వరకు వెనక్కి తిరిగి చూడం అని ప్రతినబూనింది. “బడ్జెట్ అంకెల కసరత్తులాగానే ఉంటుంది. జమా ఖర్చుల పద్దు లాగానే కనిపిస్తుంది. ఇప్పుడు మేము ప్రవేశపెడుతున్న బడ్జెట్ తెలంగాణ ప్రజల కలల సాకారం చేసే సజీవ ఆర్థిక ప్రణాళిక. ప్రజల మేలు కోసం, ప్రజలే రూపొందించిన కరదీపిక అని ప్రభుత్వం నాడు స్పష్టంగా చెప్పింది. రెండవ బడ్జెట్ 2015-16 లో “ఇక్కడ నేల మీద ఉత్పత్తయ్యే సంపద, ఇక్కడి ప్రజలు చెమటోడ్చి సృష్టించిన ప్రతిపైసా వారి సర్వతోముఖాభివృద్ధికి వెచ్చిస్తాం” అన ప్రకటించిందీ ప్రభుత్వం. మూడవ బడ్జెట్ 2016-17 లో “సమైక్య పాలనలో ప్రతి రూపాయికి భిక్షమెత్తుకునే దుస్థితి ఉండేది, కానీ ఇప్పుడు చరిత్రను తిరగరాసుకుంటున్నాం” అని తెలిపింది. నాలుగవ బడ్జెట్ 2017-18 లో “రాష్ర్టం ఏర్పడిన నాటి నుండి పేదల సంక్షేమమే వరమావధిగా, పారదర్శకమైన, ప్రజానుగుణమైన పరిపాలన సాగించడానికి మా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. మా ప్రభుత్వానికి ప్రజల ప్రభువులు, వారి కోసం పని చేయడమే మా కర్తవ్యం” అని చెప్పుకుందీ ప్రభుత్వం.

అయిదవ బడ్జెట్ 2018-19లో “తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచే స్థాయికి ఎదిగింది. ప్రజా సంక్షేమం, మౌలిక వసతుల కల్పన, పాలనా సంస్కరణల్లో తెలంగాణ చూపిన మార్గం మాకు అనుసరణీయమని ఇతర రాష్ర్ట ప్రభుత్వాలు పేర్కొనడం గొప్ప విజయం” అని ప్రభుత్వం సగర్వంగా ప్రకటించుకుంది. ఆరవ బడ్జెట్ 2019-20లో “ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రగతి, సంక్షేమ కార్యక్రమాలు, ఫలాలు చవిచూడని కుటుంబం లేదని ప్రకటించుకుంది. అందుకనే గత ఎన్నికలలో ప్రజలు తిరిగి తెరాసను గెలిపించారు” అని విజయానుభూతితో తెలుపుకుందీ ప్రభుత్వం. ఏడవ బడ్జెట్ 2020-21లో “ఇది పూర్తిగా ప్రజలే కేంద్రంగా రూపొందించిన ప్రగతిశీల బడ్జెట్. సంక్షేమ కార్యక్రమాలకు నిధులలో ఎక్కడా కోత విధించలేదు. పథకాల లబ్ధిదారులను పెంచే నిర్ణయాలు ప్రతిపాదిస్తున్నాం. పేదప్రజల అభ్యున్నతికి ఎంతటి నిబద్ధతతో ఉన్నామో, ఈ బడ్జెట్ ప్రతిపాదనలు స్పష్టం చేస్తున్నాయి” అని ప్రభుత్వం పేర్కొంది.

కాగా ప్రస్తుత ఎనిమిదవ బడ్జెట్ 2021-22 నాటికి జాతీయ జి.డి.పి. వృద్ధిరేటు 7.8% నుండి -3.8% తగ్గింది. జాతీయస్థాయి జిడిపి వృద్ధిరేట్లతో పోలిస్తే మన రాష్ర్ట జిఎస్‌డిపి వృద్ధిరేటు మెరుగ్గా ఉండడం గమనించిదగింది. వచ్చే ఆర్థిక సంవత్సరం రాష్ర్ట జిఎస్‌డిపి మంచి వృద్ధిని సాధిస్తుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడడం ముదావహం. దేశంలో ఆదాయం తగ్గిన నేపథ్యం లో కూడా తెలంగాణ ఆదాయం పెరిగింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ మన రాష్ర్ట పురోగతి మెరుగ్గా ఉంది. నేడు దేశంలో తెలంగాణ ప్రబలశక్తిగా ఎదుగుతోంది అని అనడానికి ఇది సరైన నిదర్శనమని చెప్పవచ్చు.

అనూహ్య రీతిలో అమలులోకి తెచ్చిన రైతుబంధు, రైతుబీమా, ఆరోగ్యలక్ష్మి, కెసిఆర్ కిట్, కళ్యాణలక్ష్మీ / షాదీముబారక్ మున్నగు ఉదాత్త పథకాల వంటి వాటితో సహా వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, బోదకాల బాధితులు, కల్లుగీత కార్మికులు, నేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు క్రమం తప్పకుండా పింఛన్లను మంజూరుచేస్తూ ఆ వర్గాలలో జీవన భరోసాను కల్పించిందీ ప్రభుత్వం. అన్ని పథకాలకు ఇచ్చిన హామీ మేరకు రెట్టింపు చేసి అందజేయడం గొప్ప విషయం. ఇది చాలు తెలంగాణ ప్రభుత్వ ఉదాత్త సామాజిక బాధ్యతను తెలియజేయడానికి. ఇలాంటి ప్రజారంజక పథకాలను అమలు చేస్తున్న దేశంలోనే ఏకైక రాష్ర్టంగా తెలంగాణ గురించి గొప్పగా చెప్పుకోవచ్చును.

ప్రభుత్వం కఠోరంగా పరిశ్రమించి సంక్షేమ రాజ్య స్థాపన దిశగా ముందుకు వెళుతున్నప్పుడు సహకరించాల్సిన విపక్షాలు సహనం కోల్పోయి, జుగుప్సాకరంగా వ్యాఖ్యలు చేయడం దిగ్భ్రాంతిని కలిగిస్తున్నది. కళ్లున్న కబోదిలా విమర్శిస్తున్న విపక్షాలకు చేదు అనుభవాలు ఎదురవడం ఇక్కడ గొప్ప పరిణామం. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నదని విమర్శలు గుప్పిస్తున్న విపక్షాలకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ఇస్తున్న సమాధానాలు ప్రభుత్వ నిబద్ధతను తెలియజేస్తున్నది. ప్రధానంగా కువిమర్శలు చేస్తున్న ఇక్కడి బిజెపి నాయకుల డొల్లతనాన్ని స్పష్టం చేస్తున్నది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 293 సెక్షన్ – 3 ప్రకారం రాష్ర్ట సంపదలో 3% వరకు అప్పు తీసుకునే ఎఫ్.ఆర్.బి.ఎమ్. పరిమితికి లోబడే తెలంగాణ రాష్ర్టం ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తున్నదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గతంలోనే తెలిపారు. ఆర్థిక క్రమశిక్షణలో మన రాష్ర్టం అగ్రభాగాన ఉన్నదని, ఎక్కువ సంపద ఉన్నప్పటికీ తక్కువ అప్పులు తీసుకుంటున్న రాష్ట్రాలలో ముందు వరుసలో నిలుస్తున్నదని గత మార్చిలో జరిగిన పార్లమెంట్ సమావేశాలలో ఆర్థిక సహాయమంత్రి అనురాగ్ ఠాగూర్ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానమే తెలంగాణ ప్రభుత్వ నిజాయితీని స్పష్టం చేస్తున్నది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News