Saturday, April 27, 2024

పల్లె దవాఖానాలు

- Advertisement -
- Advertisement -
Telangana Monsoon Sessions 2021
బస్తీ దవాఖానాల తరహాలో త్వరలో పల్లె దవాఖానాలు
అన్ని ఏర్పాట్లు జరిగాయి, కొద్ది రోజుల్లోనే ప్రారంభమవుతాయి
ఆసుపత్రుల ఆధునికీకరణకు అనేక చర్యలు తీసుకుంటున్నాం
ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు పెంచుతున్నాం
27వేల ఆక్సిజన్ బెడ్లతో పాటు 500 టన్నుల ఆక్సిజన్ రాష్ట్రంలోనే
ఉత్పత్తి చేసుకునేలా ఏర్పాట్లు చేశాం
హైదరాబాద్ నగరం నలుదిక్కులా నాలుగు పెద్ద ఆసుపత్రులు
నిర్మిస్తాం, ఇప్పటికే పనిచేస్తున్న టిమ్స్ మాదిరిగా మరి మూడింటిని
నెలకొల్పుతాం, స్థానిక ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలు పెంచాం :
శాసనసభలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటన
రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోంది
రాష్ట్ర జాబితాలోని అనేక అంశాలను కేంద్ర జాబితాలో చేర్చారు
రాష్ట్రాల అధికారాలను హరించడంలో బిజెపి,కాంగ్రెస్ దొందూదొందే
భట్టిపై సిఎం కెసిఆర్ ఫైర్
డ్రైనేజీ వ్యవస్థను నాశనం చేసింది గత పాలకులు కాదా, మీరు చేసిన తప్పులను సవరించలేక సచ్చిపోతున్నాం

మనతెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలోనే పల్లె దవాఖానాలు ప్రారంభం చేస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో 350 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయాలని టార్గెట్ ఇచ్చానని అన్నారు. డివిజన్‌కు రెండు చొప్పున ఏర్పాటు చేయాలని చెప్పానని, కొన్ని బస్తీల్లో మూడు ఏర్పాటు చేయాలని చెప్పానని పేర్కొన్నారు. నగరంలో బస్తీ దవాఖానలు నిరుపేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నాయని, ఇప్పుడు కొత్తగా ఆరోగ్య సదుపాయాలు పెంచాలనే ఉద్దేశంతో పల్లెల్లో దవాఖానలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. త్వరలోనే ఈ దవాఖానలు వస్తాయని, ఇందు కోసం అన్ని ఏర్పాట్లు జరిగాయని చెప్పారు. కొద్ది రోజుల్లోనే పల్లె దావఖానాలు ప్రారంభమవుతాయని, సంబంధిత శాఖ చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఆస్పత్రుల ఆధునీకరణకు అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పల్లె, పట్టణ ప్రగతిపై గురువారం అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చలో భాగంగా సిఎం కెసిఆర్ ప్రసంగించారు.

రాష్ట్రంలో మిషన్ భగీరథ ద్వారా రక్షిత నీరు పంపిణీ చేయడం ద్వారా అంటువ్యాధులు తగ్గాయని అన్నారు. కరోనాతో ఏర్పడిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో ఆరోగ్య రంగంలో మౌళిక సదుపాయాలు పెంచుతున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 27 వేల బెడ్లను ఆక్సిజన్ బెడ్లుగా మార్చడంతో పాటు 500 టన్నుల ఆక్సిజన్ రాష్ట్రంలోనే ఉత్పత్తి చేసుకునేలా  ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో నాలుగు దిక్కులా పెద్ద ఆసుపత్రులు నిర్మిస్తామని వెల్లడించారు. ఇప్పటికే గచ్చిబౌలి స్టేడియంలో టిమ్స్ ఆసుపత్రి ప్రారంభం కాగా, అదే తరహాలో మరో మూడు ఆసుపత్రులు నిర్మించనున్నట్లు సిఎం కెసిఆర్ తెలిపారు. జాతీయ సగటుకు ఆదాయాన్ని సమకూర్చే నాలుగు ఉత్తమ రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఒకటని ఆర్‌బిఐ కితాబిచ్చిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. అధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందుందని, ఇది తెలంగాణ సాధిస్తున్న ప్రగతి అని సిఎం పేర్కొన్నారు.

తెలంగాణ ధనిక రాష్ట్రం అని తాను ఉద్యమ సమయం నుంచి చెబుతున్నానని, అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే మంచి వేతనాలు ఇస్తున్నామని చెప్పారు. మన దగ్గర నుంచి కేంద్రానికి పోయే నిధులు ఎక్కువ, అక్కడ్నుంచి వచ్చే నిధులు తక్కువ అని తెలిపారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా రావాల్సిందే అని, అది రాష్ట్రం హక్కు అని పేర్కొన్నారు. కేంద్రం నుంచి వచ్చేది కేవలం సిఎస్‌ఎస్ మాత్రమే అని తెలిపారు. కేంద్రం రాష్ట్రాల హక్కులను హరిస్తోందని, రాష్ట్రాల హక్కులపై కేంద్రంతో పోరాడుతామని అన్నారు.రాష్ట్ర జాబితాలోని అనేక అంశాలను కేంద్ర జాబితాలోకి చేర్చారని అన్నారు. రాష్ట్రాల అధికారాలను హరించడంలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు దొందు దొందే అని విమర్శించారు. ఈ పార్టీలు రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాల అధికారాలను తగ్గించాయని చెప్పారు. ఉపాధి హామీ కూలీల డబ్బులు కూడా ఢిల్లీలో వేస్తారని విమర్శించారు. పెట్రోల్, డీజిల్‌ను జిఎస్‌టిలో చేరుస్తామంటే బిజెపి పాలిత రాష్ట్రాలు కూడా వ్యతిరేకించాయని అన్నారు.

పెట్రోల్, డీజిల్‌తో రాష్ట్రాలకు వచ్చే ఆదాయం కూడా రాకుండా చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోందని అన్నారు. గ్రామపంచాయతీల అభివృద్ధికి అక్టోబర్ వరకు ప్రతి నెల రూ. 227 కోట్లు విడుదల చేశామని చెప్పారు. గ్రామపంచాయతీలకే కాకుండా అర్బన్ లోకల్ బాడీస్‌కు రూ. 112 కోట్లు విడుదల చేస్తున్నామని, దీంట్లో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్, ఫైనాన్స్ కమిషన్ కేటాయింపులు ఉంటాయని తెలిపారు. గ్రామపంచాయతీలకు కేంద్రం ప్రత్యేకంగా ఇచ్చే నిధులేమీ ఉండవని ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేశారు. ఉపాధి హామీ తదితర నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లిస్తోందని సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క ఆరోపించగా సిఎం కెసిఆర్ ఖండించారు. పంచాయతీలకు కేంద్రం ఇచ్చే నిధులు ప్రత్యేకంగా ఉండవని, ఆర్థిక సంఘం సిఫారసుల మేరకే నిధులు కేటాయిస్తారని అన్నారు. అన్ని రాష్ట్రాల తరహాలోనే మనకూ కేటాయింపులు ఉంటాయని, కేంద్రం ప్రత్యేకంగా ఇచ్చేది ఏమీ లేదని వివరించారు. గ్రామాల్లో రైతుల కోసం లక్ష కలాలు నిర్మిస్తున్నామని అన్నారు. ఉపాధి హామీ పథకం పనులను కేంద్రమంత్రులు, అధికారులు ప్రశంసించారని తెలిపారు.

నరేగా నిధులు వాడుకోవడంలో తెలంగాణ నెంబర్‌వన్ అని సిఎం వ్యాఖ్యానించారు. కరోనా సమయంలో ఒక్క గింజ కూడా లేకుండా రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిందని చెప్పారు. రాష్ట్రంలో 2,600లకుపైగా రైతు వేదికలు నిర్మించామని అన్నారు. రైతుల కోసం గ్రామాలలో లక్ష కల్లాలు నిర్మించామని తెలిపారు. గ్రామాలలో వైకుంఠదామాలు నిర్మిస్తున్నామని అన్నారు. రైతులకు కల్తీ విత్తనాల పంపిణీ చేయకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.పచ్చదనం పెంపు నిరంతర కొనసాగుతోందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా లోకల్ బాడీల కోసం ప్రత్యేకంగా కలెక్టర్‌ను నియమించామని, ఈ తరహా పోస్టు దేశంలోనే ఎక్కడా లేదని చెప్పారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వల్ల రాష్ట్రం రూపురేఖలు మారిపోయాయని సిఎం తెలిపారు. వరి ధాన్యం కొనేది లేదంటూ ఇప్పుడు కేంద్రం చెబుతోందని, ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరామని అన్నారు. పెరుగుతున్న హైదరాబాద్ అవసరాలకు అనుగుణంగా రూ .1,200 కోట్లతో నగర శివారు ప్రాంతాల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. పేదవారికి రూ .1 నల్లా కనెక్షన్ ఇస్తున్నామని అన్నారు. రూ .5,378 కోట్లతో ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో 24 గంటల పాటు నీళ్లు అందించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ప్రతి గ్రామానికి కార్యదర్శిని నియమించాం

రాష్ట్రంలో ఇదివరకు 9 వేల గ్రామాలకు 3 వేల పంచాయతీ కార్యదర్శులు ఉండేవారని, ఇప్పుడు ప్రతి గ్రామానికి ఒక పంచాయతీ కార్యదర్శి ఉండేలా నియామకాలు చేశామని సిఎం కెసిఆర్ చెప్పారు. 12,769 గ్రామాలకు పంచాయతీ కార్యదర్శులను నియమించామని అన్నారు. పంచాయతీరాజ్ శాఖలో కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు ఉద్యోగులందరికీ ప్రమోషన్లు ఇచ్చామని చెప్పారు. కొత్తగా అవసరమైన చోట నియామకాలు జరిపామని పేర్కొన్నారు.

ఉద్యోగులు ఏమైనా అనారోగ్య కారణాలతో సెలవులపై వెళ్లినప్పుడు, మహిళలకు ప్రసూతి సెలవులపై వెళ్లినప్పుడు వారి స్థానంలో వారం రోజుల్లోగా కొత్త వారిని నియమించాలని జిల్లా కలెక్టర్లకే అధికారులు ఇచ్చామని తెలిపారు. ఆ విధంగా ప్రస్తుతం 980 మంది పని చేస్తున్నారని పేర్కొన్నారు. ఎక్కడా ఖాళీ ఏర్పడ్డ వారం రోజుల్లోనే నియమిస్తున్నారన్నారు.మీరు చెట్లు పెట్టలేదు…. అభివృద్ధి చేయలేదు.. మేం రెండింటిని చేస్తున్నామని భట్టి విక్రమార్కను ఉద్దేశించి సిఎం అన్నారు. గతంలో గ్రామాల్లో మంచి నీటి సమస్య తీవ్రంగా ఉండేదని, ఏ ఊరికి వెళ్లినా ఎంఎల్‌ఎలు, మంత్రుల ముందు బిందెలతో నిరసనలు జరిగేవని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని చెప్పారు. గ్రామాలను అభివృద్ధి చేసేందుకు గ్రామపంచాతీయలను, ఇతర ఆస్తులను కుదవపెట్టాలని కేంద్రం చెబుతుందని అన్నారు. మంచినీళ్ల కోసం మిషన్ భగీరథను చూసి నీతిఆయోగ్ ప్రశంసించిందని చెప్పారు. రూ. 24 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రానికి నీతి ఆయోగ్ సూచిస్తే 24 పైసలు కూడా ఇవ్వలేదని తెలిపారు. అవార్డులు మాత్రం మోయలేనన్ని వచ్చాయని అన్నారు. గతంలో నల్గొండ జిల్లా ఫ్లోరైడ్‌తో బాధపడితే మిషన్ భగీరథ ద్వారా ఆ సమస్య తీరిందని చెప్పారు. తెలంగాణ ఫ్లోరైడ్ రహిత రాష్ట్రం అని కేంద్రం ప్రకటించిందని ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు.

పారిశుద్ధ్య కార్మికులు తల్లిదండ్రుల కంటే గొప్పవాళ్లు

పారిశుద్ధ్య కార్మికులు తల్లిదండ్రుల కంటే గొప్పవాళ్లని, వారి సేవలు వెలకట్టలేనివని ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యాఖ్యానించారు. సపాయన్నా…నీకు సలామన్నా అని పాట రాశారని తెలిపారు. గతంలో పారిశుద్ధం కార్మికులకు రూ.500 నుంచి రూ.4 వేల వరకు వేతనాలు ఉంటే, వారి వేతనాలను రూ.8500లకు పెంచి సకాలంలో చెల్లిస్తున్నామన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలు భారీగా పెంచామని తెలిపారు. స్థానిక సంస్థలకు ఇచ్చే నిధుల్లో కేంద్ర ప్రభుత్వం 25 శాతం కోత విధించిందన్నారు. నిధుల కోసం గ్రామ పంచాయతీల ఆస్తులను తాకట్టు పెట్టుకొమ్మని కేంద్రం చెబుతోందని తెలిపారు. గతంలో బోరు బావుల్లో పడి ఎందరో పిల్లలు చనిపోయారని, ఇప్పుడు పల్లెల్లో నిరుపయోగంగా ఉన్న బోరుబావులను,పాడుపడ్డ బావులను పూడ్చేశామని పేర్కొన్నారు. ప్రతి గ్రామానికి నెలకు రూ.5 లక్షలు నిధులు విడుదల చేస్తున్నామన్నారు.

హైదరాబాద్‌లో వరదలు, ముంపునకు కారణం కాంగ్రెస్ కాదా..? అని సిఎం ప్రశ్నించారు. ఈ నగరంలో డ్రైనేజీ వ్యవస్థను నాశనం చేసింది గత పాలకులు కాదా..? అని అడిగారు. మీరు చేసిన తప్పులను సవరించలేక చచ్చిపోతున్నామని భట్టి విక్రమార్కను ఉద్దేశించి కెసిఆర్ అన్నారు. నగరంలో డ్రైనేజీ వ్యవస్థను రూపుదిద్దేందుకు రూ. 15 వేల కోట్లు కావాలని అధికారులు చెప్పారని, ఇది ఒక రోజులో అయ్యే పని కాదు.. దశలవారీగా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విశ్వనగరం అంటే కొన్నాళ్లలో నిర్మించేది కాదని సిఎం కెసిఆర్ తెలిపారు.హైదరాబాద్‌ను నేనే కట్టాను అని ఒకాయన చెబుతుండేవారని, 400 ఏండ్ల చరిత్ర ఉన్న నగరం హైదరాబాద్ అని పేర్కొన్నారు.వందల ఏళ్లుగా హైదరాబాద్ నగరం క్రమంగా విస్తరిస్తోందని చెప్పారు.

హైదరాబాద్ అనేది విశ్వనగరం అని, ఇక్కడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ఉందని, అనేక కాన్ఫరెన్స్‌లు జరుగుతుంటాయని చెప్పారు. దేశంలో ముంబై, కొలకత్తా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ మెగా మెట్రో సిటీలు ఉన్నాయన్నారరు. హైదరాబాద్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రానికి నివేదిక ఇచ్చామని, ఈ నగరాలను అభివృద్ధికి చేసుకోవాల్సిన అసవరం ఉందని తాను ప్రధానికి చెప్పానని తెలిపారు. కేంద్రం ప్రతి ఏడాది రూ. 30 లక్షల కోట్ల బడ్జెట్ పెడుతుందని, ఈ ఐదు నగరాలను గొప్పగా చేయడానికి రూ. 50 వేల కోట్లు ఇవ్వాలని కోరానని పేర్కొన్నారు. ఏడాదికి రూ.10 వేల కోట్లు, రాష్ట్రాలు రూ. 10 వేల కోట్లు కలిపి మొత్తంగా రూ. 20 వేలు కోట్లు ఖర్చు చేస్తే అవి ఒక పద్ధతికి వస్తాయని చెప్పానని, కానీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదని సిఎం మండిపడ్డారు.

వక్ఫ్ బోర్డు భూములపై సిబిసిఐడి విచారణ

వక్ఫ్ బోర్డు భూములపై సిబిసిఐడి విచారణకు ఆదేశాలు జారీ చేస్తామని సిఎం కెసిఆర్ ప్రకటించారు. వక్ఫ్ బోర్డు భూముల విచారణకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.ప్రభుత్వంలో రికార్డుల ఆధారంగా దేవాదాయ, వక్ఫ్ బోర్డుల భూములు ఫ్రీజ్ చేశామని, ప్రభుత్వపరంగా ఎట్టి పరిస్థితుల్లో ఆ భూములను రిజిస్ట్రేషన్లు చేయడం జరగదని అన్నారు. కొన్ని సందర్భాలలో కోర్టుల్లో మన వారు వాదించడం లేదని అక్బరుద్దీన్ అంటున్నారని, దీనిపై విచారణకు వెంటనే ఆదేశాలు జారీ చేస్తానని సిఎం తెలిపారు.

స్థానిక ప్రతినిధుల గౌరవ వేతనాలు పెంచాం

రాష్ట్రంలో సర్పంచ్‌ల గౌరవ వేతనాలు ఒకప్పుడు చాలా తక్కువగా ఉండేవని ఇప్పుడు వారి గౌరవ వేతనాలు పెంచామని సిఎం కెసిఆర్ తెలిపారరు. జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్లకు గతంలో రూ. 7,500 ఉంటే, తమ ప్రభుత్వం లక్ష రూపాయలు ఇస్తుందన్నారు. జెడ్‌పిటిసిలకు గతంలో రూ. 2,250 ఇస్తే.. ఇప్పుడు రూ. 13 వేలు ఇస్తున్నామని చెప్పారు. మండల ప్రజాపరితష్ సభ్యులకు గతంలో రూ. 1,500 ఇస్తే.. ఇప్పుడు రూ. 13 వేలు ఇస్తున్నామన్నారు. సర్పంచ్లు, ఎంపీటీల గౌరవ వేతనాలు రూ. 6,500లకు పెంచామని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో మంచినీళ్లు లేవు, కరెంట్ లేదని, గ్రామాలలో వంగిపోయిన కరెంట్ స్తంభాలు ఉండేవని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో గ్రామాల్లో ఘోరమైన పరిస్థితి ఉందని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎలక్ట్రిసిటీ బోర్డుతో సుదీర్ఘంగా చర్చించి, పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 2,33,000 కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశామని అన్నారు. 59 వేల కి.మీ. మేర విద్యుత్ వైర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇంకా ఎక్కడైనా సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే సమస్యను పరిష్కరిస్తామని సిఎం తెలిపారు.ఉమ్మడి రాష్ట్రంలో పర్ క్యాపిట ఇన్‌కం రూ. 4 ఉంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ. 669గా ఉందని తెలిపారు.

హైదరాబాద్ ఇస్తాంబుల్‌లాగా కావాలని కలలు కనొద్దా..?

హైదరాబాద్ పాత నగరాన్ని ఇస్తాంబుల్ చేస్తామనడంలో తప్పేంటని సిఎం అడిగారు. హైదరాబాద్ ఇస్తాంబుల్ లాగా కావాలని కలలు కనడం త ప్పా అని ప్రశ్నించారు. కలలు కంటాం, వాటి ని నెరవేర్చుకొనేందుకు ప్రయత్నిస్తామని సిఎం చెప్పారు. ఈ విషయంపై వక్రీకరణలు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. మీకేమో కలలు కనే ధైర్యం లేకపాయే… మేము కలలు కూడా కనొద్దా..? అని భట్టి విక్రమార్కను ఉద్దేశించి అన్నారు. జనాన్ని పాజిటివ్ లైన్‌లా తీసుకుపోవద్దా..? ఇదెక్కడి దౌర్భాగ్యం అని సిఎం మండిపడ్డారు. కరీంనగర్‌ను డల్లాస్ చేస్తామని చెప్పలేదని కెసిఆర్ తెలిపారు. రోప్ వే బ్రిడ్జి కావాలని మంత్రి గంగుల కమలాకర్ అడిగారని, కరీంనగర్ పక్కనే నది, కాలువలు అందంగా ఉంటాయని, వాటిని సుందరంగా తీర్చిదిద్దుకుంటే కరీంనగర్ డల్లాస్ లాగా కనిపిస్తుందని చెప్పానని గుర్తు చేశారు. అది తప్పా..? అని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News