Monday, May 6, 2024

రాష్ట్రంలో విద్యుత్ ధగ ధగలు..

- Advertisement -
- Advertisement -

వ్యవసాయానికీ నిరంతర విద్యుత్
పరిశీలనకు పలు రాష్ట్రాల నుండి రాక

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణలో విద్యుత్ ధగధగలు రాష్ట్ర కీర్తిని ఎక్కడికో అందనంత ఎత్తుకు తీసుకెళ్తున్నాయి. నాడు ఉమ్మడి రాష్ట్రంలో నిత్యం విద్యుత్ కోతలతో కరెంటు ఎప్పుడొస్తుందో తేలియక.. రాత్రింబవళ్లూ పంట చేల వద్దే గడపాల్సి వచ్చేది. కొన్ని సందర్బాల్లో రాత్రిళ్లు బోరు మోటార్లు వేసేందుకు వెళ్లి విద్యుత్ షాక్‌లకు గురై ఆసువులు బాయాల్సి వచ్చేది. అది ఒకప్పటి పరిస్థితి.. ఇప్పుడు తెలంగాణ ఆవిర్భవించి పదేళ్లు గడిచాక పరిస్థితులు సమూలంగా మారిపోయాయి. నిజానికి ఏ రాష్ట్రంలో అయిన అభివృద్ధి స్థాయిని కొలిచే అత్యంత ముఖ్యమైన సూచికలలో విద్యుత్ వినియోగం ఒకటి కావడం తెలిసిందే. అంతే కాదు అటు ఆర్థిక వృద్ధిలోనూ విద్యుత్ రంగం కీలక పాత్ర పోషిస్తోంది కూడా. తెలంగాణ ఆవిర్భవించిన నాడు రాష్ట్రంలో స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లు మాత్రమే ఉండగా.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు నేతృత్వంలో జరిగిన అద్భుతమైన కృషివల్ల నేడు తెలంగాణ స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 18,567 మెగావాట్లకు పెరిగింది. తెలంగాణ ఏర్పడిన తరువాత విద్యుత్తురంగ బలోపేతం కోసం, కరెంటు సరఫరా, పంపిణీ వ్యవస్థలను మెరుగుపర్చడం కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 39,321 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది.

వ్యవసాయానికి నిరంతర విద్యుత్

దేశంలో మరే ఇతర రాష్ట్రంలో లేని విధంగా అన్నిరంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరాని అందిస్తూ తెలంగాణ రాష్ట్రం ముందుకుసాగుతున్నది. రాష్ట్రంలోని 27.49 లక్షల మంది రైతులు 24 గంటల ఉచిత్ విద్యుత్ ను పొందుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు అంతులేని కరెంటు కోతలు, పవర్ హాలిడేల నుండి అనతి కాలంలోనే తెలంగాణ శాశ్వత విముక్తిని సాధించింది. 2014లో రాష్ట్ర స్థాపిత విద్యుత్తు సామర్థ్యం 7,778 మెగావాట్లు కాగా, నేడు 18,567 మెగావాట్లకు పెరిగింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ట్రాన్స్‌మిషన్ నెట్వర్క్ ని బలోపేతం చేయడానికి 18,874 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. అదేవిధంగా మెరుగైన విద్యుత్ పంపీణి నెట్‌వర్క్ పునరుద్దరించడానికి పల్లె ప్రగతి కార్యక్రమం కింద రూ.506 కోట్లు, పట్టణ ప్రగతి కింద రూ.249 కోట్లు ప్రభుత్వం ఖర్చుచేయడం విశేషం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం డిస్కమ్ ల ద్వారా 1062 కొత్త 33/11 కేవీ సబ్-స్టేషన్లు, 3.89 లక్షల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు, 1.83 లక్షల కి.మీ డిస్ట్రిబ్యూషన్ లైన్లు ఏర్పాటుచేయడం జరిగింది. రాష్ట్రప్రభుత్వం 22,722 మంది విద్యుత్ కార్మికుల సర్వీసులను క్రమబద్ధీకరించింది. వ్యవసాయరంగానికి 24 గంటల ఉచిత్ విద్యుత్ ను అందించేందుకు రూ. 11,500 కోట్లను డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు సబ్సిడీగా చెల్లిస్తున్నది.

కాగా తలసరి విద్యుత్తు వినియోగం సైతం ఒక ప్రధాన ప్రగతి సూచికగా నిలుస్తోంది. 2014- -15 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో తలసరి విద్యుత్తు వినియోగం 1,356 యూనిట్లు మాత్రమే ఉండేది. 2021- -22 నాటికి అది 2,126 యూనిట్లకు పెరిగింది. ఇదే సమయంలో జాతీయ సగటును గనుక పరిశీలిస్తే 1,255 యూనిట్లుగా ఉంటోంది.. అంటే తెలంగాణ తలసరి విద్యుత్తు వినియోగం, జాతీయ తలసరి వినియోగం కన్నా 69.40 శాతం ఎక్కువగా నమోదవడం గమనార్హం .

పలు వర్గాలకూ ఉచిత విద్యుత్

రాష్ట్రంలోని 27.49 లక్షల వ్యవసాయ మోటర్లకు 24 గంటల ఉచిత సరఫరాను ప్రభుత్వం 100 శాతం సబ్సిడీతో అందిస్తోంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా 8 లక్షల వ్యవసాయ సర్వీస్ కనెక్షన్లు ఇవ్వగా.. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా పేద వర్గాల ప్రజలకు అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకం ద్వారా 6,00,258 మంది ఎస్‌సి వినియోగదారులకు, 3,26,385 మంది ఎస్‌టి వినియోగదారులకు ప్రతి నెలా 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను అందిస్తోంది. అదేవిధంగా వృత్తినే ఉపాధిగా చేసుకుని జీవనం కొనసాగిస్తున్న 30, 013 మంది నాయీ బ్రాహ్మణుల వినియోగదారులకు, 55,458 ధోభి ఘాట్‌లు, లాండ్రీ దుకాణాలకు ప్రతి నెలా 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను అందిస్తోంది. అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం 5467 పౌల్ట్రీ ఫారాలకు , 6097 పవర్ లూమ్‌లకు యూనిట్ కి రూ.2. సబ్సిడీని అందిస్తున్న విషయం గమనార్హం.

పరిశీలనకు పలు రాష్ట్రాల నుండి రాక

కాగా తెలంగాణలో నిరంతరం విద్యుత్ అందుతున్న తీరుతెన్నులను పరిశీలించేందుకు పలు రాష్ట్రాల నుండి అధికారులు తెలంగాణకు విచ్చేస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, బీహార్‌తో పాటు గోవా రాష్ట్రాల నుండి పలువురు తెలంగాణకు విచ్చేసి ఇక్కడ అందుతున్న నిరంతర విద్యుత్‌ను పరిశీలించి అబ్బురపడుతున్నారు. అన్నింటికీ మించి ఇక్కడి విద్యుత్ కనెక్షన్‌వ్యవస్థ వారిని అమితంగా ఆకట్టుకుంటోంది. ఒక జిల్లాలో విద్యుత్ కట్ అయితే మరో జిల్లా నుండి విద్యుత్ అందేలా అధికారులు ఏర్పాట్లు చేయడం విశేషం.

విద్యుత్ రంగంలో తెలంగాణ సాధించిన ఘనత ఇదీ..

* 2021- -22 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 2126 యూనిట్లు కాగా దేశ తలసరి విద్యుత్ వినియోగం 1255 యూనిట్లు. దేశ తలసరి విద్యుత్ వినియోగం కంటే ఇది 69.40 శాతం ఎక్కువ.
* 27.49 లక్షల మంది రైతులకు 24 గంటల ఉచిత కరెంటు సౌకర్యం అందుతోంది. తెలంగాణ రాష్ట్ర స్థాపిత విద్యుత్ సామర్థ్యం 2014 లో 7,778 మెగావాట్లు కాగా, 1 మే 2023 నాటికి 18,567 మెగావాట్లుగా ఉంది. 2014తో పోల్చితే 2023 నాటికి రెండు రెట్ల కంటే ఎక్కువగా పెరిగింది.
* 23.03.2014 న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 13,162 మెగావాట్లు కాగా, స్వరాష్ట్రంలో 30.03.2023 న నమోదైన గరిష్ట విద్యుత్ డిమాండ్ 15,497 మెగావాట్లుగా ఉంది. 14.03.2023 న రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం 297.89 మిలియన్ యూనిట్లుగా ఉండడం విశేషం.
* 2014 లో వ్యవసాయరంగ సేవల పరిధిలో ఉన్న విద్యుత్తు కనెక్షన్ల సంఖ్య 19.03 లక్షలు కాగా 01.05.2023 నాటికి 27.49 లక్షలుగా ఉంటోంది. రాష్ట్రంలోని మొత్తం విద్యుత్తు కనెక్షన్లు 2014 లో 1.11 కోట్లు కాగా 01.05.2023 నాటికి 1.78 కోట్లు ఉండడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News