Wednesday, May 1, 2024

డబుల్ మ్యూటేషన్ దడ

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో 50% కేసులు అవే!
18 నుంచి 20శాతం యూకే స్ట్రెయిన్
 వడివడిగా వ్యాపిస్తున్న వైరస్
 గంటల వ్యవధిలో విషమస్థితికి పలువురు కొవిడ్ రోగులు
 అన్ని ఆసుపత్రుల్లో బెడ్లు ఫుల్
 మరో ఆరు వారాల పాటు ఇదే పరిస్థితి
 60వేల పడకలు సిద్ధం చేశాం 
 తొలిదశతో పోలిస్తే సెకండ్‌వేవ్ తీవ్రం : హెల్త్ డైరెక్టర్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో డబుల్ మ్యూటేషన్ కరోనా దడ పుట్టిస్తోంది. దేశ వ్యాప్తంగా పది రాష్ట్రాల్లో రెండు మ్యూటేషన్ల(మార్పులు)తో ఏర్పడిన కొత్త రకం కరోనాతోనే అత్యధిక వ్యాప్తి జరుగుతుందని హెల్త్ ఆఫీసర్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహరాష్ట్ర, ఢిల్లీ, వెస్ట్‌బెంగాల్, గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ డబుల్ మ్యూటేషన్ వేవ్ ఎక్కువగా కొనసాగుతుండగా, మన రాష్ట్రంలోనూ ఇలాంటి కేసులు 50 శాతం ఉన్నట్లు హెల్త్ డిపార్ట్‌మెంట్‌లోని ఓ ఆఫీసర్ తెలిపారు. అంతేగాక మరో 18 నుంచి 20 శాతం యూకే స్ట్రెయిన్ కూడా ఉన్నట్లు తాము అనుమానిస్తున్నామన్నారు. దీంతోనే రాష్ట్రంలో వైరస్ వ్యాప్తితోపాటు మరణాలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. రాబోయే రోజుల్లో కూడా మరింత భారీ స్థాయిలో కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు ఆరోగ్యశాఖ భావిస్తుంది. ఇప్పటికే వ్యాప్తిపై అధ్యయనం చేయాలని సిసిఎంబికి కూడా విజ్ఞప్తి చేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.మరోవైపు ఇతర రాష్ట్రాల వలే మన దగ్గరా మ్యూటేషన్ వైరస్ క్షేత్రస్థాయిలో వెళిపోయింది. ఎవరి నుంచి ఎలా సోకుతుందో? అర్థం కాని పరిస్థితి ఉంది. దీంతో లాక్‌డౌన్ కర్ఫూ లాంటివి పెట్టినా పెద్ద ప్రభావం ఉండదని నిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ స్వీయనియంత్రణే శ్రీరామ రక్షని వారు అంటున్నారు. అయితే వైరస్ సోకిన గంటల వ్యవధిలోనే పేషెంట్లు క్రిటికల్ స్టేజ్‌కి వెళ్లడం గమనార్హం. మ్యూటేషన్ వైరస్‌కు ప్రస్తుతం ఉన్న మెడిసిన్ ప్రోటోకాల్ పెద్దగా పనిచేయకపోవడమే దీనికి కారణమని అధికారులు అప్ ది రికార్డులో చెబుతున్నారు. అలాంటి వారికి లక్షణాలు బట్టి మెడిసిన్స్ ఇస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.మరోవైపు గతంలో కొవిడ్ సోకిన సెకండ్ వీక్‌లో ఆక్సిజన్ లెవల్స్ పడిపోతుండగా ప్రస్తుతం మూడు నాలుగు రోజుల్లోనే తగ్గిపోతున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు.
పడకల పరేషన్….
కరోనా కేసులు ఒక్కసారిగా పెరగడంతో రాష్ట్రంలో పడకల కొరత ఏర్పడింది. కరోనా పేషెంట్లు అడ్మిట్ అయ్యేందుకు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. ఒక పడక కోసం సుమారు పది నుంచి పదిహేను ఆసుపత్రులు తిరిగితేనే కానీ లభించడం లేదని ఓ బాధితుడు అన్నారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లోని బెడ్లు కూడా పుల్ అయ్యాయి. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్నప్పటికీ నో కరోనా బెడ్స్ అనే బోర్డులు కనిపిస్తున్నాయి. మరోవైపు అత్యధికంగా ఆక్సిజన్ అవసరమయ్యే పేషెంట్లనూ అడ్మిట్ చేసుకోవడం లేదు. వాస్తవంగా అసింప్టమాటిక్, మైల్డ సింప్టమ్స్‌లో ఉన్న వారిని ఆసుపత్రుల్లో వైద్యం అందించాల్సిన అవసరం లేదని ఇటీవల వైద్యశాఖ అన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేసింది. కానీ కొన్ని ఆసుపత్రులు ఆక్సిజన్, వెంటిలేటర్, సీరియస్ పేషెంట్లనూ అడ్మిట్ చేసుకోవడం లేదు. ముఖ్యంగా కార్పొరేట్, ప్రైవేట్ హాస్పిటల్స్ ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇదిలా ఉండగా గాంధీ ఆసుపత్రిలో విచిత్రమైన పరిస్థితులు తలెత్తాయి. కొవిడ్ వార్డులలో చికిత్స పొందుతున్న పేషెంట్లను ఒక రోజు పరిశీలించిన తర్వాత మరుసటి రోజు ఉంటాడనే గ్యారెంటీ లేదని ఓ అధికారి అన్నారు. అంటే కేవలం గంటల వ్యవధిలోనే రోగులు విషమ పరిస్థితుల్లోకి వెళ్తున్నట్లు ఆయన చెప్పారు. దీంతోనే మరణాలు
యంటీబాడీస్ వృద్ది ఉన్నా లైట్ తీసుకోవద్దు…
మొదటి దశలో కరోనా బారిన పడి కోలుకున్న వారికీ సెకండ్ వేవ్ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి కారణం యాంటీబాడీల వృద్ధి ఒక్కోక్కరిలో ఒక్కో విధంగా ఉంటున్నాయి. కొందరికి గరిష్ఠంగా ఐదు నెలలు ఉంటే, మరి కొందరిలో నెలరోజులకు మించడం లేదు. పైగా ఇది కొత్త రకపు ఆర్‌ఎన్‌ఏ వైరస్ కావున కోవిడ్ విజృంభణ ఏ విధంగా ఉంటుందో స్పష్టంగా అంచనా వేయడం కష్టతరమని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో రీ ఇన్‌ఫెక్షన్ అయ్యే అవకాశం కూడా ఉందని వారు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా మొదటి దశలో ఇన్‌ఫెక్ట్ కానీ వారికి మాత్రమే సెకండ్ వేవ్‌లో వైరస్ సోకే అవకాశం ఉందని మరి కొన్ని స్టడీస్ చెబుతున్నారు. దీని ప్రకారం పరిశీలిస్తే తెలంగాణలో తొలి దశలో కేవలం 25 శాతం మందికి మాత్రమే వైరస్ తేలింది. దీంతో మరో 75 శాతం మందికి ఈ దశలో వైరస్ సోకే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే సెకండ్ వేవ్‌లో ఎక్కువగా అసింప్టమాటిక్ పేషెంట్లు ఉంటారని, తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వ్యాప్తి మరింత పెరుగుతోందని వైద్యులు వెల్లడిస్తున్నారు.
60 వేల బెడ్లను సిద్ధం చేశాం…
కరోనా వైరస్ సెకండ్ వేవ్‌నూ ఎదుర్కొనేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 60వేల బెడ్లను సిద్ధం చేశామని హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు అన్నారు. మొదటి వేవ్‌తో పోల్చితే రెండో దశ చాలా తీవ్రంగా ఉందన్నారు. ఈమేరకే గాంధీని కొవిడ్ నోడల్ కేంద్రంగా మార్చామన్నారు. గత ఐదు వారాలు నుంచి కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయని, ఈ వ్యాప్తి మరో ఆరు వారాల పాటు ఉంటుందన్నారు. వైద్యశాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు తెలిపారు. అంతేగాక అన్ని ఆసుపత్రుల్లో రెమిడెసివీర్ మందులను కూడా అందుబాటులో ఉంచామన్నారు. డాక్టర్ల అవసరం మేరకు వాటిని వినియోగిస్తామన్నారు. అంతేగాక టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్‌లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పిహెచ్‌సి స్థాయి నుంచి టీచింగ్ ఆసుపత్రుల వరకు అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచామన్నారు. మౌళిక వసతులు, మందులు, సిబ్బంది కొరత లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. అయితే కరోనా నియంత్రణకు మాస్కు, భౌతిక దూరం, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతే మనకు రక్షణగా నిలుస్తాయని ఆయన సూచించారు.

Telangana sees Double variant mutant

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News