Wednesday, May 1, 2024

తేనెలొలుకు తేట తెలుగు

- Advertisement -
- Advertisement -

telugu poems with bhavam and poet name

అలనాటి జీవన చిత్రంలోకెళితే అడుగడుగునా తెలుగు భాషా పరిమళం వికసించి, జీవితమంతా రంగురంగుల హరివిల్లును చూపినంత ఆనందంతో, ప్రశాంతంగా, ఉల్లాసంగా గడచిపోయేది. జోల పాటలో రాగ రంజితమైన లాలింపు, వేదంతార్ధాలు నిక్షిప్తమై, వింటుంటే వినాలనిపించేలా ఉండి సేద తీర్చేవి. ‘కస్తూరి రంగ రంగా…’, అంటూ పాపాయికి పేరు పెట్టేప్పుడు, ఉయాలలో వేసేటప్పుడు పాడే పాటల్లో లాలిత్యం, మధురత్వం ఏరులై పారేది. రాత్రి వెన్నెల్లో పాపాయి అన్నం తిననని మారాం చేస్తే చందమామను చూపిస్తూ, ‘చందమామ రావే…’ అంటూ పాడితే … చందమామను చూసిన పరవశానికో, అందులోని తెలుగు తేటదనానికో చక్కగా బువ్వతినేవారు పిల్లలు. నేటి ఆకాశ హర్మ్యాల వంటి అపార్టుమెంట్లలో ఎంతమంది చందమామను చూస్తున్నారు? ఇంకా చిన్న చిన్నగా పాఠశాలకు పంపించే నేపథ్యంలో ఎన్నో ఆటలు, పాటలు, అందులో ఎన్నో అర్ధాలు మానసిక పరిణతి కలిగేలా ఉండేవి. ‘చిట్టి చిలకమ్మ…, ‘చిట్టి చిట్టి మిరియాలు…, ‘దాగుడు మూతల దండ కోర్….’, ‘వీరి వీరి గుమ్మడి పండు…’, ‘ఒప్పులకుప్ప వయ్యారి భామ…’, ‘తారంగం తారంగం…’ అని ఇలా పద్యం గాని, పాట గాని ఎంతో పరవశం కలిగేలా మనసుకి హాయి గొలిపేలా ఉండి నీతిని, విజ్ఞానాన్ని అంతర్లీనంగా ప్రతిబింబించేవి.

 

దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు అలనాడే శ్రీకృష్ణదేవరాయలు. శతాబ్దాల సాహిత్య చరిత్ర, భాషా చరిత్ర గల అందమైన భాష తెలుగు. దానిని ఆకళింపు చేసుకున్న జాతి తెలుగు జాతి. ప్రతి సంస్కృతి, సంప్రదాయం ఎంతో అర్ధవంతమైన మన సంస్కారాన్ని, ఉన్నతిని ప్రతిబింబిస్తుంది. అందుకే తోట గాలి, ఏటి నీరు, తేట తెనుగు కన్నా స్వచ్ఛమైనవి లేవంటారు మన పెద్దలు. తేట తేట తెనుగులా అంటూ తెలుగు గొప్పదనాన్ని వర్ణించాడో కవి. తెలుగులో వచ్చిన సాహిత్యం అమూల్యమైనది. పాశ్చాత్య భాషలలో ఇటాలియన్ వంటిదని నికోలాయ్ కౌంటి వంటి వారు తెలుగును పొగిడారంటే దీని విశిష్టత అర్ధం చేసుకోవచ్చు. సి.పి.బ్రౌన్ వంటి బ్రిటిష్ ఉన్నతాధికారులు వేమన పద్యాలు చూసి ముగ్ధులై తెలుగు అభిమానులుగా మారారు. దీన్ని మరింత అభివృద్ధి చేయడానికి రేయింబవళ్లు కృషి చేశారు. పదకోశాలు తయారు చేశారు. పూర్వం తెలుగు భాషా సౌందర్యం జనపదమై, జానపదమై, పాటై, వచనమై, పద్యమై, కవిత్వమై, తెలుగుదనం పరవశించేది.
పుట్టిన పాపాయి ఏడుస్తుంటే, తన కళ్లారా చూసుకుంటూ, మాతృత్వం పొంగి పొర్లుతుంటే, ‘ఏడవకు ఏడవకు వెర్రి పాపాయి, ఏడిస్తే నీ కళ్లు నీలాలు కారు, నీలాలు కారితే నే చూడలేను’ అంటూ ఆ కంటి నీరు తననెంత బాధపెడుతుందో ఆ తల్లి చెబుతుంటే, ఆ తల్లి ఒడి వెచ్చదనానికో, పాటలోని మాధుర్యానికో, ఆర్ద్రతకో పాపాయి నిద్రలోకి జారుకునేది.
ఇంత కమ్మని భాష మన తెలుగు భాష. జ్ఞానపీఠ అవార్డును సైతం దక్కించుకున్న భాష మన తెలుగు భాష. ‘అమ్మ’ అన్న పిలుపులో అనురాగం ధ్వనిస్తుంది, ‘నాన్న’ అన్న పిలుపులో అభిమానం ధ్వనిస్తుంది. ఇంత మాధుర్యం సంతరించుకున్న మన భాష కొంత నిర్లక్ష్యం వల్ల ఈ తరం యువతకు, చిన్నారులకు దూరమవుతున్నది.
పూర్వం తెలుగు జాతి ప్రతి దశలోనూ మాతృభాష పరిమళం అంటిపెట్టుకుని ఉండేది. పుట్టినప్పటి నుండి లాలి పాటలు, తప్పటడుగులు వేసే వేళ మురిపాల ముచ్చట్లు, చదువుకునేటప్పుడు సాంస్కృతిక సౌరభం, పెళ్లప్పుడు ప్రతీ ఘట్టం మధుర భావాల సుమనోహరమై, సమాహారమై తెలుగు తనంతో విడదీయరాని అనుబంధమై తెలుగు అక్షరమే తరగని ఆస్తిగా, కొండంత అండగా నిలిచింది, జ్ఞానమిచ్చింది, అలసట తీర్చింది, అక్కున చేర్చుకుంది. అభయమిచ్చింది. మనసు ఫలకం పై మధుర స్మృతులై వెన్నెల వెలుగులు నింపింది.
అలనాటి జీవన చిత్రంలోకెళితే అడుగడుగునా తెలుగు భాషా పరిమళం వికసించి, జీవితమంతా రంగురంగుల హరివిల్లును చూపినంత ఆనందంతో, ప్రశాంతంగా, ఉల్లాసంగా గడచిపోయేది. జోల పాటలో రాగ రంజితమైన లాలింపు, వేదంతార్ధాలు నిక్షిప్తమై, వింటుంటే వినాలనిపించేలా ఉండి సేద తీర్చేవి. ‘కస్తూరి రంగ రంగా……..’, అంటూ పాపాయికి పేరు పెట్టేప్పుడు, ఉయాలలో వేసేటప్పుడు పాడే పాటల్లో లాలిత్యం, మధురత్వం ఏరులై పారేది. రాత్రి వెన్నెల్లో పాపాయి అన్నం తిననని మారాం చేస్తే చందమామను చూపిస్తూ, ‘చందమామ రావే…’ అంటూ పాడితే …. చందమామను చూసిన పరవశానికో, అందులోని తెలుగు తేటదనానికో చక్కగా బువ్వతినేవారు పిల్లలు. నేటి ఆకాశ హర్మ్యాల వంటి అపార్టుమెంట్లలో ఎంతమంది చందమామను చూస్తున్నారు? ఇంకా చిన్న చిన్నగా పాఠశాలకు పంపించే నేపథ్యంలో ఎన్నో ఆటలు, పాటలు, అందులో ఎన్నో అర్ధాలు మానసిక పరిణతి కలిగేలా ఉండేవి. ‘చిట్టి చిలకమ్మ….’, ‘చిట్టి చిట్టి మిరియాలు…..’, ‘దాగుడు మూతల దండ కోర్….’, ‘వీరి వీరి గుమ్మడి పండు…….’, ‘ఒప్పులకుప్ప వయ్యారి భామ……’, ‘తారంగం తారంగం…….’ అని ఇలా పద్యం గాని, పాట గాని ఎంతో పరవశం కలిగేలా మనసుకి హాయి గొలిపేలా ఉండి నీతిని, విజ్ఞానాన్ని అంతర్లీనంగా ప్రతిబింబించేవి. ‘కాళ్ళగజ్జె కంకాలమ్మ…..’లో ఔషధాలకు సంబంధించిన విజ్ఞానం, ‘చింతకాయ దప్పడం, పప్పేసి కలపడం, కంఠమెల్ల మెక్కడం, కడుపు నొప్పి రావడం…’, ఎక్కువ తింటే కడుపు నొప్పని చెప్పకనే చెప్పడం, ఇంకా ఒకటి ఓ చెలియా…. రెండు రొకళ్ళు….. మూడు ముచ్చిలక….. నాలుగు నందన్న….’ అంటూ అంకెలు ఆటలతోనే నేర్పడం జరిగేవి.
తెలుగు చదువు కేవలం విజ్ఞానాన్ని పెంపొందించేలా మాత్రమే కాక వ్యక్తిత్వ వికాసానికి, జీవించడానికి కావలసిన తెగింపు సమకూరుస్తుంది. ‘పలువురెదుట నిలిచి భాషింప భయమేల తెలుగు బిడ్డ ’ అంటూ ధైర్యాన్ని నూరిపోస్తుంది. ‘ధైర్యే సాహసే ల’ అనుకుంటూ ఆత్మవిశ్వాసం ప్రతిబింబించేలా దీటుగా మాట్లాడేలా చేస్తుంది.
పెరిగాక కూడా ఆ తెలుగుదనంలోని నుడికారం అడుగడుగునా ప్రతిఫలిస్తూ పరవశాన్ని కలగచేసేది. భాష ఒకటిగా ఉన్నప్పుడే జాతి ఒకటిగా ఉంటుంది. భాష కనుమరుగైతే సంస్కృతి దూరమవుతుంది. భాష, సంస్కృతిలేని జాతి క్రమంగా సహజ లక్షణాలు కోల్పోతుంది.
ఒకప్పటి మాట ఎలా ఉన్నా ప్రస్తుతం మన తెలుగు ప్రాచుర్యం, ప్రాముఖ్యత కొంత తగ్గింది. తెలుగు జాతి మనది … నిండుగ వెలుగు జాతి మనది… అన్నట్లు అందరూ గర్వంగా చెప్పుకునేటట్లు… మా తెలుగు తల్లికి మల్లెపూదండ…తో పాటు తెలుగు జిలుగుల వెలుగు హారం వేయాలి. సహజంగానే ప్రతి తెలుగు వాడిలో భావితరాల మనస్సుల్లో ‘తెలుగు’, పూలు వికసింపజేయాలి. నవ తెలుగుభాష సౌందర్యాన్ని, పరిమళాన్ని నలు దిశలా వెదజల్లాలి. పల్లెల్లో పాడుకునే పద్యాలు, జానపద గేయాలు కమ్మదనాన్ని తీయదనాన్నీ తరతరాల సంపదగా రేపటి పౌరులకి అందించాలి.
పురాతన కాలం నుండి ఎన్నో మార్పులు చేర్పులు కాలంతో ఎన్నో తీయని జ్ఞాపకాలను, చమత్కారాలను తనలో నిక్షిప్తం చేసుకుని లలితమైన తియ్యతేనియలాంటి తెలుగును, పొదుపు కథలుగా, కవితలుగా, కావ్యాలుగా, కథలుగా రేపటి పౌరులకు నాటికలుగా, నవలలుగా పరివర్తనం చెంది వారసత్వ సంపదగా అందించాలి.

టి. సంయుక్తా
కృష్ణమూర్తి
8500175459

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News