Monday, April 29, 2024

తిరుమలకు ‘ఉగ్ర’ ముప్పు!?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తిరుమలకు ‘ఉగ్ర’ ముప్పు పొంచి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల బయటపడ్డ భద్రతా లోపాలపై మంగళవారం తిరుమల కొండపై అన్నమయ్య భవన్ లో టిటిడి విజిలెన్స్ అధికారులు, పోలీసులు, కేంద్ర ఐబి, రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో డిజిపి ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా, రాజస్థాన్‌కు చెందిన కమ్యూనిటీ పోలిసింగ్ అధికారి పంకజ్ చౌదరి పాల్గొన్నారు. ఏడుకొండలపై చేపట్టిన భద్రతా ఏర్పాట్ల గురించి టిటిడి భద్రతా అధికారులు, పోలీసులు విడివిడిగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. తిరుమలలో భద్రతా లోపాలు ఆందోళన కలిగిస్తుండటంతో టిటిడి అధికారులు దీనిని సీరియస్ గా తీసుకున్నారు. అలిపిరి మొదలుకుని ఘాట్ రోడ్డు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, శ్రీవారి ఆలయం, భక్తుల రద్దీ ప్రాంతాల్లో నిఘా ఏర్పాట్లు, తనిఖీ వంటి భద్రతలపై చర్చించినట్లు సమాచారం.

తిరుమల తిరుపతి దేవస్ధానంపై ఉగ్రవాదుల ముప్పు ఉందని కేంద్ర భద్రతా బలగాలు హెచ్చరించిన క్రమంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఐతే టిటిడిలో భద్రతను మరింత కఠినతరం చేసేందుకు కేంద్ర భద్రతా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తిరుమలలో భద్రతలో వైఫల్యం ఎక్కడ ఉందన్న దానిపై నిఘా అధికారుల ద్వారా ఓ అంచనాకు వచ్చారు. ఈ క్రమంలోనే కేంద్ర నిఘా వర్గాలతో పాటు రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులను కూడా తిరుమలకు రప్పించి కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఓఎస్‌డి శశిధర్ రెడ్డి, ఎస్‌ఎస్జి ఎస్బీ బాబుజీ అట్టెడ, ఎస్‌ఐబి ఐఎస్‌డబ్ల్యూ గరుడ సుమిత్ సునీల్‌లు పాల్గొన్నారు. ఇటీవల శ్రీవారి ఆలయం పరిసరాల్లో ఏప్రిల్ 25వ తేది సాయంత్రం మూడు హెలికాప్టర్లు చక్కర్లు కొట్టాయి. దీంతో భక్తులను ఆందోళనకు లోనయ్యారు.

శ్రీవారి ఆలయానికి సమీపంలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, పరాకమణి భవనం, బాలాజీనగర్ ప్రాంతంలో హెలికాప్టర్‌లు చక్కర్లు కొట్టినట్లు అధికారులు గుర్తించారు. తిరుమలలో 3 హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడంపై టిటిడి విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన హెలికాప్టర్లు కడప నుంచి చెన్నై వెళ్తుండగా తిరుమల మీదుగా చక్కర్లు కొట్టినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. అదే విధంగా, తిరుమల శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన ఓ వీడియో ఇటీవల నెట్టింట హల్ చల్ చేసింది. ఈ వీడియో వైరల్ అవడంతో టిటిడి అధికారులు అప్రమత్తమయ్యారు. డ్రోన్ కెమెరాల్లో శ్రీవారి ఆలయాల చిత్రీకరించడంపై ఆరా తీశారు.

తిరుమల శ్రీవారి ఆలయంపై, పరిసర ప్రాంతాల్లో విమానాలు, డ్రోన్ కెమెరాలు నిషేధం ఉంది. అయితే శ్రీవారి ఆలయానికి సంబంధించిన వీడియాను ఓ యూట్యూబ్ ఛానల్ పోస్టు చేయడం కలకలంగా మారింది. శ్రీవారి ఆలయాన్ని చిత్రీకరించి, సోషల్ మీడియాలో వైరల్ చేసిన విజువల్స్ పై విచారణ జరిపి నిందితులను పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News