Sunday, April 28, 2024

948 ఆటోలు సీజ్

- Advertisement -
- Advertisement -

POLICE

 

లాక్‌డౌన్ నిబంధనలు బేఖాతరు, పోలీసుల సీరియస్
మూడు కమిషనరేట్ల పరిధిలో 2,480 వాహనాలు సీజ్
జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున వాహనాలు స్వాధీనం
లాక్‌డౌన్ అమలు తీరుపై ప్రధాని మోడీ, సిఎం కెసిఆర్ అసహనం, వేగంగా స్పందించిన అధికారులు

మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్‌ను అరికట్టేందుకు తెలంగాణ సర్కారు ఈ నెలాఖరు (మార్చి 31) వరకూ రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించినప్పటికీ.. లాక్‌డౌన్ నిబంధనలను బేఖాతరు చేస్తూ ప్రజలంతా రోడ్లపైకి వచ్చారు. ఈ సందర్భంలో ఆలస్యంగానైనా అధికారులు స్పందించారు. ఒక్క హైదరాబాద్‌లో రోడ్లపై నిబంధనలు ఉల్లంఘించి తిరుగాడిన 948 ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. సైబరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మాదాపూర్‌లో ఏకంగా వంద వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలను పెద్ద ఎత్తున పోలీసులు సీజ్ చేసి ఆయా ప్రాంత సమీప స్టేషన్‌లకు తరలించారు. ఆటోలతో సహా ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిస్థాయిలో నిలువరించే విధంగా నిబంధనలు స్పష్టపరుస్తున్నప్పటికీ ఆటోవాలాలు రోడ్లేక్కాశారు.

కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రాకూడదని, ద్విచక్రవాహనంపై ఒకరికంటే ఎక్కువ మంది ప్రయాణించకూడదని నిబంధన ఉన్నా ద్విచక్రవాహనంపై ఒకరికి మించి ఎక్కువగా కుర్రకారు రాష్ట్రవ్యాప్తంగా చక్కర్లు కొట్టారు. కార్లలో సైతం ప్రజలు రోడ్లెక్కేశారు. జనతా కర్ఫూని తెలంగాణ ప్రజలు నిబద్ధతతో పాటించినప్పటికీ.. లాక్‌డౌన్‌ను మాత్రం అంత సీరియస్‌గా తీసుకోలేదు. ప్రధాని మోదీ రాష్ట్రాలలో లాక్‌డౌన్ అమలు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ అమలు తీరుపై సిఎం కెసిఆర్ అసహనం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ని పటిష్టంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో సిఎస్, డిజిపి ఇతర ఉన్నతాధికారులు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి లాక్‌డౌన్ ఆవశ్యకతను వివరించారు.

రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అత్యవసర సర్వీసులు మినహా మిగిలిన వారెవరూ రోడ్లపైకి రావొద్దని, అతిక్రమిస్తే కఠిన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ నెలాఖరు వరకు నిత్యావసరాల కోసం నిబంధనల ప్రకారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ప్రజలకు అనుమతి ఉంటుందన్నారు. స్వీయ నియంత్రణ పాటించాలని పదే పదే వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు లాక్‌డౌన్ పట్ల నిర్లక్షం వహిస్తూ రోడ్లపై దూసుకొచ్చిన వాహనాలను పోలీసులు ఎక్కడికక్కడ నిలువరించి సీజ్ చేశారు.

 

The Autos were seized by Police
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News