Saturday, April 27, 2024

కాంగ్రెస్ భవిష్యత్తు!

- Advertisement -
- Advertisement -

The future of Congress is questionable

 

కాంగ్రెస్ పార్టీకి ఏమైంది, ఏమి కాబోతోంది అనే ప్రశ్న చాలా కాలంగా చాలా మందిని వేధిస్తున్నది. ఇప్పుడీ ప్రశ్న మరింత గాఢమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దేశ స్వాతంత్య్ర సంగ్రామానికి సారథ్యం వహించి, స్వాతంత్య్రం తర్వా త దేశాన్ని సుదీర్ఘ కాలం పరిపాలించిన గొప్ప నేపథ్యం గల ఈ పార్టీ జాతీయ రాజకీయ తెర మీద నుంచి నిష్క్రమిస్తే ప్రత్యామ్నాయ శక్తి లేని దుస్థితి తక్షణమే తలెత్తుతుంది. ప్రధాని మోడీ పదే పదే ప్రకటించిన కాంగ్రెస్ ముక్త్ భారత్ రుజువైతే ప్రజలకు పాలక పక్షం తప్ప వేరే దిక్కు లేని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రాంతీయ రాజకీయ పార్టీల్లో ఉద్దండ పిండాల వంటి శక్తులున్నప్పటికీ జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న ప్రాంతీయ పార్టీ దాదాపు లేదనే చెప్పాలి. ఇవి వాటి సొంత రాష్ట్రాలకే ఎక్కువగా పరిమితమైపోయి ఉన్నాయి. కాంగ్రెస్ ఎంత చెడినా ఇప్పటికీ దేశమంతటా అంతో ఇంతో ఉనికిని కాపాడుకుంటున్నది. అయితే పార్టీలో నైరాశ్యాన్ని సమర్థవంతంగా తొలగించి, సర్దిచెప్పడం ద్వారా విభేదాలను పరిష్కరించి ముందుకు నడిపించే బలమైన నాయకత్వం జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు లేకపోడం వల్లనే ఈ దుస్థితి అని ప్రత్యేకించి చెప్పనక్కర లేదు.

అత్యంత ప్రధానమైన ఐదు అసెంబ్లీల ఎన్నికలకు ముందు కేరళలో సీనియర్ నేత పిసి చాకో పార్టీని విడిచిపెట్టడం, బెంగాల్‌లో ప్రచారానికి అధిష్ఠానం ప్రకటించిన ముఖ్య ప్రచారకుల జాబితాలో 23 మంది అసమ్మతి నేతల బృందం నుంచి ఒక్కరూ లేకపోడం ఆ పార్టీ అంతర్గత విభేదాలతో ఇప్పటికీ సతమతమవుతున్నదని రుజువు చేశాయి. కేరళలో కాంగ్రెస్ పార్టీ అనేదే లేదని ఉన్నవి రెండు ముఠాలేనని ఆరోపిస్తూ చాకో రాజీనామా చేశాడు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఎన్నికలకు ముందు చాకో రాజీనామా చేయడం బిజెపిలో చేరడానికే అనే అభిప్రాయం వెల్లడవుతున్నది. గ్రూప్ 23 పేరుతో ప్రసిద్ధికెక్కిన అసమ్మతి నాయకుల్లో దాదాపు అందరూ సీనియర్లే. మొదటి నుంచి గాంధీల కుటుంబానికి అత్యంత విధేయుడుగా ఉంటూ కీలక బాధ్యతలు నిర్వహించిన గులామ్ నబి అజాద్ సహా ఆనంద్ శర్మ, కపిల్ సిబల్, మనీశ్ తివారీ, రాజ్ బబ్బర్ వంటి సీనియర్ నేతలు 23 మంది కలిసి పార్టీలో సమూల మార్పులు తేవాలని, పై నుంచి కింది వరకు ఎన్నికలు జరిపించాలని కోరుతూ గత సంవత్సరం ఆగస్టులో సోనియా గాంధీకి లేఖ రాసి ప్రజలకు విడుదల చేశారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న రాహుల్ గాంధీని నాయకత్వానికి దూరంగా ఉంచాలన్నదే వీరి అభిప్రాయంగా ప్రచారమైంది. సోనియా గాంధీ ఇందుకు బొత్తిగా సిద్ధంగా లేరని కూడా తెలుస్తున్నది. ఏదో ఒక సాకు చెప్పి పార్టీ జాతీయ స్థాయి ఎన్నికలను వాయిదా వేయడంలోనే ఆ విషయం బోధపడుతున్నది. రాహుల్ గాంధీ తిరిగి పగ్గాలు చేపట్టడానికి పూర్తి అనువైన వాతావరణంలోనే ఆయనను మళ్లీ పార్టీ అధ్యక్షుణ్ణి చేయాలనేది సోనియా గాంధీ ఉద్దేశంగా బోధపడుతున్నది. అయ్య వచ్చే వరకు అమావాస్య ఆగదనే సామెత చందంగా రాహుల్ గాంధీ రాకతో నిమిత్తం లేకుండానే ఎదురవుతున్న పెను సవాళ్లను తట్టుకొని నిలబడడంలో పార్టీ వైఫల్యాలు తరచుగా రుజువవుతున్నాయి. పార్టీ అధ్యక్ష పీఠాన్ని తిరిగి స్వీకరించడానికి ఇష్టం లేనట్టు కనిపిస్తున్న రాహుల్ గాంధీ దాని వ్యవహారాలను మాత్రం పూర్తిగా గుప్పెట్లో పెట్టుకొని కథ నడిపిస్తున్నాడు.

ఒక వైపు ప్రధాని మోడీ నిర్ణయాలపై ఘాటైన విమర్శలు చేస్తూనే మరో వైపు పార్టీ కీలక నియామకాల్లో తన వర్గీయులకే అవకాశమిస్తున్నాడు. పశ్చిమ బెంగాల్ ప్రచార బృందం ఏర్పాటులో అదే చేశాడు. ఆయన సాగిస్తున్న ఈ ముసుగు ఆటకు తెరపడకపోతే కాంగ్రెస్ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు. ఇప్పుడు జరుగుతున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికలు బిజెపి కంటే కాంగ్రెస్‌కే ఎక్కువ ముఖ్యమని చెప్పవచ్చు. అసోం, కేరళలో అధికారం కోసం కాంగ్రెస్ నేరుగా పోటీ పడుతున్నది. తమిళనాడులో ప్రతిపక్ష డిఎంకె కూటమిలో దాని తర్వాత ప్రధాన శక్తిగా ఉంది. బెంగాల్‌లో ఒకప్పటి పాలక పక్షంగా ఈ ఎన్నికలు దానికి కీలకమైనవి. పుదుచ్చేరిలో నిన్నగాక మొన్న బిజెపి దుస్తంత్రం వల్ల అధికారం కోల్పోయిన కాంగ్రెస్ అక్కడ గట్టి కృషి చేసి అధికారాన్ని తిరిగి చేజిక్కించుకోవలసి ఉన్నది. కాని ఆ పార్టీ జాతీయ నాయకత్వం ఈ సవాళ్లకు తగిన స్థాయిలో సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు.

గత నవంబర్‌లో జరిగిన బీహార్ ఎన్నికల లో కాంగ్రెస్ తాహతకు మించిన సీట్లు బేరమాడుకొని తగినన్ని విజయాలు సాధించుకోలేక పోవడం వల్ల తేజసి యాదవ్ నాయకత్వంలోని ఆర్‌జెడి కూటమి అధికారానికి అతి చేరువకు వెళ్లి దానిని చేజిక్కించుకోలేకపోయింది. జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మిత్ర పక్షాల విజయాలకు దోహదపడడానికి బదులు అవి దెబ్బతినడానికి కారణమయిందనిపించుకుంటే అంతకంటే అవమానం మరొకటి ఉండదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News