Monday, April 29, 2024

తెలంగాణ జాతీయోద్యమం

- Advertisement -
- Advertisement -

Telangana has special place in National movement

 

మిశ్రమ సంస్కృతికి ప్రతీకగా పేరొందిన తెలంగాణ జాతీయోద్యమంలో విశిష్ట స్థానాన్ని పొందింది. ఆధునిక యుగంలో మతేతర సెక్యులర్ జాతీయవాదాన్ని పెంపొందించిన ఘనత కూడా కలిగి ఉంది. 1857 లో బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగిన మొదటి స్వాతంత్య్ర సమరం హిందూ, ముస్లిం ఐక్యతకు నిదర్శనం. మౌల్వీ అల్లా ఉద్దీన్ తుర్రెబాజ్‌ఖాన్ నాయకత్వంలో హైద్రాబాద్‌లోని బ్రిటీష్ రెసిడెన్సీపై దాడి జరిగిన తర్వాత కోయ, గోండ్, భిల్ ఆదివాసీలు, రొహిల్లా, ఆఫ్ఘన్ సిపాయిలతో పాటు ఉన్నత వర్గాలకు చెందిన హిందూ జమీందార్లు, దేశ్‌పాండేలు, వలసవాద వ్యతిరేక తిరుగుబాట్లలో పాల్గొన్నారు. సోలాపూర్ పాలకుడు వెంకటప్పనాయక్, పేష్యా నానాసాహెబ్, తాంతియాతోపే లాంటివారు జాతి, మత భేదాలకు అతీతంగా బ్రిటీష్ వ్యతిరేక పోరాటంలో కీలక పాత్ర నిర్వహించినారు. నిజాం రాజ్యంలో నిర్మల్, రాయచూర్, కౌలాస్, కొల్లాపూర్, కొప్పాల్, మీరాజ్ తిరుగుబాట్లకు ముఖ్య కేంద్రాలు.

హైదరాబాద్ నగరంలో సోనాజీ పండిత్, రత్నాకర్‌పాగే, రంగారావు పట్వారి, బేగంబజార్‌రావు సాహెబ్‌పీష్యాల పాత్ర అద్వితీయమైనది. హైదరాబాద్ సంస్థానంలో బ్రిటీష్ వ్యతిరేక ఉద్యమం హిందూ, ముస్లీంల ఐక్యతను పెంపొందించడం ఆంగ్లేయుల్ని కలవరపరిచింది. “మన పాలనతో విసుగు చెందిన వర్గాలు సమష్టిగా పెద్దఎత్తున తిరుగుబాట్లు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు” అని బ్రిటీష్ అధికారి పేర్కొన్నాడు. అదే విధంగా బ్రిటీష్ అనుకూల వార్తాపత్రిక ఇంగ్లీష్‌మన్ ఈ విధంగా రాసింది. “హిందువులు మనల్ని అసహ్యించుకుంటారు, ముస్లింలను ప్రేమిస్తారు”. తుర్రెబాజ్‌ఖాన్ ప్రారంభించిన వలసవాద వ్యతిరేక ఉద్యమంలో వర్గ, కుల, మతాలకు అతీతంగా బహుజన, అగ్రవర్గాలు కలిసికట్టుగా పాల్గొనడం ఆధునిక తెలంగాణ చరిత్రలో ముఖ్యఘట్టంగా పేర్కొనవచ్చును.

పందొమ్మిదవ శతాబ్దం చివరి దశకాల్లో నిజాం రాజులు బ్రిటీష్ పాలకుల తొత్తులుగా వ్యవహరించడంతో అసంతృప్తి చెందిన మధ్య తరగతి విద్యావంతులు, మేధావులు వలసవాద వ్యతిరేక సిద్ధాంతాల్ని, భావజాలాన్ని ప్రచారం చేసినారు. బ్రిటీష్ పెట్టుబడిదార్లకు లాభాలు చేకూర్చడానికి నిజాం ప్రభుత్వం ప్రవేశపెట్టిన చాందా రైల్వే స్కీంను నిజాం కాలేజి ప్రిన్సిపాల్ అఘోరనాథ్ ఛటోపాధ్యాయ, నిజాం ప్రభుత్వ అధికారులైన మాల్వీ అబ్దుల్ ఖయ్యూం, దస్తూరి ఔసగీలు వ్యతిరేకించి, ఉద్యమాన్ని చేపట్టారు. 1885లో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన తర్వాత, తొలినాటి జాతీయ ఉద్యమంలో విశాల ప్రాతిపదికపై హిందూ ముస్లిం మేధావులు పాల్గొన్నారు. అఘోరనాథ్ ఛటోపాధ్యాయ, అబ్దుల్‌ఖయ్యూం, హాజీ సజన్‌లాల్, రామచంద్ర పిళ్ళై, రామానుజ మొదటిలియార్, రాజామురళీ మనోహర్ లాంటి ప్రముఖులు భారత జాతీయ కాంగ్రెస్‌లో సభ్యులుగా చేరారు.

జాతీయతా భావాల్ని ప్రచారం చేయడంలో షాకతుల్ ఇస్లాం, హైదరాబాద్ రికార్డ్ లాంటి వార్తాపత్రికలు ముఖ్యపాత్ర వహించినాయి. మోహిబ్ హుస్సేన్, సయ్యద్ అఖిల్ లాంటి కొంత మంది పత్రికా సంపాదకులు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్ని సమర్థించినారు. ముల్లా అబ్దుల్‌ఖయ్యూం నిజాం ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ సఫైర్ దక్కన్ పత్రికలో జాతీయ కాంగ్రెస్‌కు అనుకూలంగా పలు వ్యాసాలు రాసినాడు. హైదరాబాద్ రికార్డ్ పత్రిక నిజాం ప్రభుత్వ ఆంక్షలను నిరసిస్తూ, బ్రిటీష్ రెసిడెంట్ చర్యలను ఖండించి ఆయనను “స్థానిక కైజర్‌” గా వర్ణించింది.

భారత జాతీయ కాంగ్రెస్ చేపట్టిన ఉద్యమం తెలంగాణ పౌరసమాజంలో నూతన రాజకీయ చైతన్యాన్ని పెంపొందించింది. 1889 వ సంవత్సరంలో సికింద్రాబాద్‌లో ఏర్పాటైన జాతీయ కాంగ్రెస్ సభకు దాదాపు 2000 మంది హాజరైనారు. హిందువులతో పాటు జాతీయవాదులైన ముస్లింలు, క్రైస్తవులు ఈ సభలో పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపినారు. బ్రిటీష్ ఇండియాలో చెలరేగిన వందేమాతరం, ఖిలాఫత్, సహాయ నిరాకరణ ఉద్యమాలతో ప్రభావితులైన మేధావులు కేశవరావు కోరాట్కర్, వామన్ నాయక్‌లు 1918 వ సంవత్సరంలో కాంగ్రెస్ కమిటిని ఏర్పాటు చేసి, జాతీయ ఉద్యమాన్ని నడిపించినారు. మౌలానా షౌకత్ అలీ అభ్యర్థన మేరకు నిజాంను “ఇండియన్ డయ్యర్‌” గా అభివర్ణించిన పండిత్ తారానాద్ గాంధీజీ నాయకత్వంలో ప్రారంభమైన ఉద్యమానికి మద్దతు తెలియ చేసినాడు.

మహాత్మా గాంధీ నాయకత్వంలో ప్రారంభమైన ఖిలాపత్, సహాయ నిరాకరణ ఉద్యమాలకి హైదరాబాద్ నగరంతో సహా తెలంగాణ ప్రాంతాల్లో మంచి ఆదరణ లభించింది. కరీంనగర్, జనగాం, మెదక్ గుల్బర్గా, రాయచూర్, ఔరంగాబాద్ జిల్లాల్లో ఖిలాఫత్ ఉద్యమం ఉధృతంగా కొనసాగింది. ఈ ఉద్యమంలో బారిష్టర్ అస్గర్‌హసన్, హుమాయూన్ మీర్జా, కోరాట్కర్, వామన్‌నాయక్, మందముల నర్సింగ్‌రావు లాంటి ప్రముఖ నాయకులు పాల్గొనడంతో హిందూ ముస్లిం సఖ్యత ప్రదర్శించబడింది. ఖిలాఫత్ డే సందర్భంగా హైదరాబాద్ నగరంలోని వివేకవర్ధిని మైదానంలో 23 ఏప్రిల్ 1920 న జరిగిన గొప్ప బహిరంగ సభలో వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఖిలాఫత్ ఉద్యమ ప్రభావాన్ని గమనించిన బ్రిటీష్ రెసిడెంట్ నిజాం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాజకీయ ఉద్యమాల్ని అణచివేయించినాడు.

అదే విధంగా గాంధీ జీ భావాలు, ఆలోచనలతో ప్రభావితులైన హిందూ ముస్లిం యువకులు సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. పుణె, బొంబాయి, అలీఘడ్ విశ్వవిద్యాయాల్లో చదువుకుంటున్న అనేకమంది హైదరాబాదీ విద్యార్థులు తమ చదువులకు స్వస్తి చెప్పి సహాయనిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. వారిలో సరోజిని నాయుడు కుమారుడు జయసూర్య, అక్బర్ అలీఖాన్, మీర్‌మహ్మద్‌హుస్సేన్, మహ్మద్ అన్సారీ లాంటి వారు ముఖ్యులు. రాజకీయ చైతన్యంతో ప్రభావితులై జాతీయ ఉద్యమంలో పాల్గొన్న పలువురు ముస్లిం ప్రముఖులు పైజామాలకు బదులు ఖాదీ ధోతులు, గాంధీ టోపీలు ధరించి తమ జాతీయాభిమానాన్ని చాటుకున్నారు. ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్లు బద్రుల్ హసన్, బారిష్టర్ శ్రీకిషన్, పద్మజా నాయుడు లాంటివారు ఖాదీ ఉద్యమాన్ని వ్యాప్తి చేసినారు. గాంధీయిజం ప్రభావం తెలంగాణ ప్రాంతంలో చెలరేగిన సామాజిక, రాజకీయ ఉద్యమాలపై ప్రస్ఫుటంగా ఉందని చెప్పటానికి ఖిలాఫత్, సహాయ నిరాకరణ, ఖాదీ ఉద్యమాలు చక్కటి నిదర్శనం.

1919- 1946 సంవత్సరాల మధ్య గాంధీజీ నాలుగు సార్లు హైదరాబాద్ సంస్థానంలో పర్యటించినారు. ఆయన పర్యటనలు ఫలితంగా తెలంగాణ ప్రజానీకంలో నూతన జాతీయ చైతన్యం పెల్లుబికింది. తెలంగాణ జాతీయోద్యమం ఉధృతంగా కొనసాగుతున్న చివరి దశలో జనవరి 1946 నాటి గాంధీ మహాత్ముని పర్యటన చాలా ముఖ్యమైన ఘట్టం. ఎందుకంటే 1940 దశకంలో బ్రిటీష్ ఇండియాతో పాటు నిజాం రాజ్యంలో బ్రిటీష్ వలసవాద వ్యతిరేక ఉద్యమం ప్రత్యేకతను సంతరించుకుంది. ఆంగ్లేయుల పాలన అంతమైన తర్వాత స్వతంత్రతను ప్రకటించి ఆజాద్ హైదరాబాద్‌ను స్థాపించి తన నిరంకుశ పాలనను కొనసాగించాలని నిజాం రాజు ప్రయత్నించినాడు. అందుకుగాను మతతత్వవాదులైన రజాకార్లను ప్రోత్సహించి, దమనకాండతో రాజకీయ ఉద్యమాల్ని ఉక్కు పాదంతో అణచివేసినాడు. రాజకీయంగా తెలంగాణ సమాజంలో జాతీయ మతతత్వ శక్తుల మద్య ఘర్షణలు తారస్థాయికి చేరుకున్నాయి. అటువంటి విషమ పరిస్థితుల్లో నిరంకుశ పాలనకు దోపిడీకి గురైన తెలంగాణ ప్రజానీకానికి గాంధీ మహాత్ముడు ఆపద్బాంధవుడుగా దర్శనమిచ్చినాడు.

1946 నాటి ఆయన చివరి పర్యటనల్లో మద్రాసు నుంచి వార్దా ప్రయాణంచేస్తూ తెలంగాణలో మధిర, ఖమ్మం, గార్ల, డోర్నకల్, మానుకోట, వరంగల్, ఖాజీపేట, మంచిర్యాల రైల్వేస్టేషన్‌లలో దిగి ప్రజలనుద్దేశించి గాంధీజీ ప్రసంగించినాడు. వేల సంఖ్యలో ప్రజలు ఆయన దర్శనం కోసం వేచి ఉన్నారు. కులం, వర్గం, మతం, లింగ బేధాలకు అతీతంగా గ్రామీణ తెలంగాణ ప్రజానీకంలో నూతన చైతన్యం, అంకితభావం, ఆధిపత్యశక్తుల్ని ఎదిరించాలనే సంక ల్పం మరింత బలపడింది. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, వామపక్ష పార్టీలు చేపట్టిన ఉద్యమాలకు గాంధీయిజం స్ఫూర్తినిచ్చింది. తత్ఫలితంగా కుల, మతాలకు అతీతంగా చెలరేగిన మిలిటెంట్ ప్రజా ఉద్యమాలు నిజాం పాలనను అంతమొందించడంలో కీలకపాత్ర నిర్వహించినాయి.

మరొక రకంగా చెప్పాలంటే 1857 వ సంవత్సరంలో తుర్రేబాజ్‌ఖాన్ ప్రారంభించిన బ్రిటీష్ వ్యతిరేక లౌకిక జాతీయవాదం తెలంగాణం సమాజంలో హిందూ ముస్లిం ఐక్యతను కొనసాగించింది. 19వ శతాబ్దంలో సెక్యులర్ జాతీయవాదాన్ని అఘోరనాథ్ ఛటోపాధ్యాయ, ముల్లా అబ్దుల్ ఖయ్యూం, రాంజి గోండులు వ్యక్తీకరించినారు. ఆ చైతన్య వారసత్వం, కొనసాగింపు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రతిబింబించింది. వలసవాద, నిరంకుశ, ఫ్యూడల్ శక్తుల్ని అంతమొందించడంలో అమరులైన సోయబుల్లాఖాన్, షేక్‌బందగీ, దొడ్డికొమరయ్య, చిట్యాల ఐలమ్మ, కొమరంభీం తెలంగాణ సెక్యులర్ జాతీయవాదానికి మరపురాని ప్రతీకలు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News