Saturday, April 27, 2024

కృష్ణరాయడు తెలుగురాయడే

- Advertisement -
- Advertisement -

The mother tongue of the Sri krishnadevaraya is Telugu

 

ప్రపంచ ప్రఖ్యాత చక్రవర్తులు సీజర్, అలెగ్జాండర్, నెపోలియన్‌లతో పాటు శ్రీకృష్ణదేవరాయలు ఒకరని చరిత్రకారుల అంచనా. దక్షిణ భారతదేశాన్ని ఇరవై ఏళ్ళపాటు దుర్నిరీక్ష్యంగా పరిపాలించిన రాయలవారికి ‘సంగీత సాహిత్య సమరాంగణసార్వభౌమ’ అనేబిరుదుతోపాటు, మూరురాయరగండ మొదలైన బిరుదులు పదివరకు ఉన్నాయి. అలాంటి చక్రవర్తి దక్షిణ భారతదేశంలో పుట్టి జగద్విఖ్యాతచరిత్రను సృష్టించడం మనందరికీ గర్వకారణం. అట్టి రాయలవారి మాతృభాషను గురించి భిన్న కథనాలు ఉన్నాయి. ఐతే వారు కర్ణాటక ప్రభువు గనుక కన్నడంవారని. తెలుగు సరస్వతిని వజ్రసింహాసనం పైన కూర్చోబెట్టారు కనుక తెలుగువారని ఆయా ప్రాంతాలవారు తమకు అనుకూలమైన వాదనలను తెరమీదకు తెస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాసంలో రాయలివారి మాతృభాష తెలుగే అనే విషయాన్ని సుస్పష్టం చేయడమే నా ఉద్దేశం.

కృష్ణరాయడు కన్నడరాయడే అనడానికి ఆధారాలు
ఆముక్తమాల్యదలో రాయలవారే రాసిన ఈ క్రింది పద్యం చూద్దాం:
ఉ॥ ఎన్నినుఁ గూర్తునన్న,విను,మే మును దాల్చిన మాల్య మిచ్చున
ప్పిన్నది రంగమం దయిన పెండిలి సెప్పుము; మున్ను గొంటి నే
వన్ననదండ యొక్క మగవాఁ డిడ,నేను దెలుంగు రాయఁడ,
న్గన్నడరాయ,యక్కొదువఁ గప్పు ప్రియాపరిభుక్త భాక్కథన్ 114.
కృష్ణాజిల్లా శ్రీకాకుళంలో ఆంధ్రమహావిష్ణువు రాయలవారి కలలో కనిపించాడు.“ఇప్పటికే సంస్కృత భాషలో ఎన్నోకావ్యాలు రాశావు.అట్టినీకు తెలుగులో ఒక కావ్యం రాయడం విశేషంకాదు.కాబట్టి తెలుగున ఒకకావ్యాన్ని రాయు.అంతేకాదు.పది అవతారాలెత్తిన ఘనుడవు.అందు చేత ‘నీ యొక్క ఏ కథను రాయా’లని ప్రశ్నిస్తావా. ఐతే విను.‘ఓ కన్నడరాయా!నేను తెలుగు రాయడను.తానుధరించిన దండను నాకు సమర్పించిన ఆండాలుకు,నాకు జరిగిన పెళ్ళిని కావ్యంగా రాయు.గతంలో సుదాముడనే ఓ మగవాడు ఓ దండను ఇస్తే తీసుకున్నాను.మగవాడు ఇచ్చిన దండను తీసుకోవలసి వచ్చిందికదా అని నేను బాధపడుతున్నాను. ‘వల్లభచేత అనుభవింపబడిన దానిని పొందిన రంగనాథుని కథ’ను రాయడంవలన ఆకొఱతను తీర్చు’అని అన్నాడట.”అని ఈ పద్యభావం.ఈ పద్యంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే రాయలవారిని ‘కన్నడరాయా!’అని సంబోధించాడు.
అంతే కాదు“ఇది కర్ణాటధరాధృతిస్థిరభుజా హేవాకలబ్ధ”189‘కర్ణాటదేశమనే భూమిని ధరించుట యందు నిశ్చలమైన బాహువులయొక్క ఇచ్ఛామాత్రముచేత పొందబడిన”అని తనను గూర్చి తానే చెప్పుకున్నారు రాయలవారు.
అలాగే “అమ్మ కర్ణాట సింహాసనాఢ్యు డగుచు/ జెలగు శ్రీకృష్ణరాయల జెట్టవట్టి’అని కృష్ణరాయ విజయంలో కుమారధూర్జటి రాశారు.(శ్రీకృష్ణదేవరాయవైభవము26 వ పుట)

మను చరిత్రలో పెద్దనకూడ‘కన్నడరాజ్యరమారమణ’-2-81. అని రాయలవారిగూర్చి ప్రశంసించారు.
నందితిమ్మన పారిజాతాపహరణంలో ‘ఉద్యదయశ్శ్రీ కర్ణాటమహీశ’5109అని రాయలవారిని ప్రస్తుతించారు.
ఈ రకంగా హంపి విజయనగరం పుట్టినప్పటినుండి దానిని కర్ణాటదేశరాజధానిగాను,ఆ రాజ్యాన్ని కన్నడ రాజ్యమని,లేదా కర్ణాటమని పిలవడం జరిగింది.ఆ సంహాసనంపై కూర్చొని పాలించిన వారందరూ రాయలవారితో పాటు కన్నడ ప్రభువులే!అందుచేతనే సాక్షాతూ ్తశ్రీమహావిష్ణువే రాయలవారిని ‘కన్నడరాయా!’అని సంబోధించారు.
అంతేకాదు కృష్ణదేవరాయలవారి పూర్వులు రాయలసీమలో ఒకనాడు భాగమైన బళ్ళారిలో ఉండేవారని, సేనానాయకులుగా సంగమరాజులతో పాటుయుద్ధాలలో పాల్గొని,కర్ణాటకలోని పడమటితీరానగల తుళునాడుకు దండనాథులుగా, సామంతులుగా పనిచేశారని, కృష్ణరాయలతండ్రి నరసరాయలు సాళువ నరసింహరాయల మెప్పుపొంది పెనుగొండ చేరి ప్రధానదండనాయకుడుగా వ్యవహరించాడని గుత్తి(జోళదరాశి)చంద్రశేఖరరెడ్డి తన ‘రైతురాయలు’కావ్యంలో 30 వ పుటలో రాశారు.తుళునాడు నుండి వచ్చారు గనుక వారు తుళువ వారయ్యారనేది అందరూ అంగీకరించిన సత్యం. “వాని వంశంబు తుళువాన్వవాయ మయ్యె’123.అని రాయలవారే రాసుకున్నారు.రాయలవారి పూర్వీకులు కర్ణాటానికి చెందిన వారు.రాయలు కన్నడ సార్వభౌముడు అని ఇన్ని ఆధారాలు ఉన్న నేపథ్యంలో రాయలవారు తెలుగు భాషపై తన గాఢానురాగాన్ని తెలియజేస్తూ రాసిన పద్యాన్ని విశ్లేషిస్తాను.
ఆ॥ తెలుఁ గదేల యన్న,దేశంబు దెలుఁ,గేను
దెలుఁగు వల్లభుండఁ,దెలుఁగొ కండ,
యెల్లనృపులు గొలువ నెఱుగఁవే బాసాడి,
దేశభాషలందుఁ దెలుఁగు లెస్స.115.

“ఓ కన్నడరాయా!కావ్యాన్ని తెలుగులోనే ఎందుకు రాయమంటున్నానంటే ఇది తెలుగుదేశం.నేను తెలుగువల్లభుడను.దేశదేశాలరాజులతో వివిధభాషలలో మాట్లాడి ‘తెలుగు పటికపంచదారలాంటిది.’అనే విషయాన్ని తెలుసుకోలేదా?దేశభాషలన్నిటిలోనూ తెలుగే గొప్పది.’అని కృష్ణరాయలతో శ్రీకాకుళాంధ్రదేవుడు పలికాడు” అని పై పద్యభావం.
ఈ పద్యానికి సంజీవినీ వ్యాఖ్యానం లో వేదం వెంకటరాయశా్రి్త ‘కన్నడ రాయఁడవైన నిన్ను కన్నడములో చెప్పుమనక మఱియే భాషలోఁగాని చెప్పుమనక తెనుఁగుననే చెప్పుమనియెద నేల యనఁగా అందులకు ఈ వక్ష్యమాణ కారణము లున్నవి’.ఇంకా ‘నానాభాషలాడు రాజులు నిన్నుఁ గొలుచునప్పుడు వారితో నా యా భాషలాడి దేశభాష లన్నిటిలోను తెలుఁగు యొక్క యాయుత్కర్షను నీవు కనిపెట్టియుండ లేదా?’ అని రాశారు. పై వేదంవారి వ్యాఖ్యను విశ్లేషిద్దాం.‘కన్నడ రాయఁడవైన నిన్ను కన్నడములో చెప్పుమనక’అనడంలో రాయలవారిది కన్నడం మాతృభాష.కాబట్టి కన్నడంలోనే రాయమనాలి అనేది వేదంవారి ఉద్దేశం.‘నానాభాషలాడు రాజులు నిన్నుఁ గొలుచునప్పుడు వారితో నా యా భాషలాడి’అనడంలో ‘రాయలవారిది కన్నడం మాతృభాష కనుక వారితో మాట్లాడే రాజుల్లో తెలుగురాజులు కూడ ఉన్నార’నేది వేదంవారి ఉద్దేశం.అంతిమంగా ఇలా నిర్ణయించేశారు వేదంవారు..‘ఆడి’ తెనుగును రాజులతో ఆడి నేర్చెనేగాని చదివి నేర్చినవాఁడు గాఁడు ‘నృపులు’ అనుటచే తెనుఁగు అతని ఇంటిభాష గాదు.’సంజీవినీ వ్యాఖ్య237 పుట.

కృష్ణరాయలు కన్నడిగుడే అనే వేదంవారి అభిప్రాయానికి కారణం ఈ వ్యాఖ్యానం రాసిననాటికి నాలుగువందల ఏండ్ల నుండి ప్రజల్లో స్థిరపడిపోయిన ఒక నమ్మకం.‘1928 లో వేదం వేంకటరాయశాస్త్రిగారి ఆముక్తమాల్యద వ్యాఖ్యానం‘సంజీవని’ వెలువడింది’ ఆంధ్రకవులచరిత్రము కందుకూరి వీరేశలింగము 487పుట.ఇంకా దానికి తొలుత నేను చెప్పిన గ్రంథస్థమైన ఆధారాలు.అంతేకాదు ‘ఆ మాత్రమున కృష్ణదేవరాయ లాంధ్రుఁడని నిర్ధారింపరాదు.అతఁడే తాను కన్నడరాయ లయినట్టు వ్రాసికొనినాడు.’శ్రీకృష్ణదేవరాయల రాష్ట్రభాష గాడిచెర్ల హరిసర్వోత్తమరావు శ్రీకృష్ణదేవరాయ వైభవముపుట390.మంత్రి తిమ్మరుసు గురించి కుందూరి ఈశ్వరదత్తు ఇలా రాశారు ‘ఇతడు బహువృద్ధుడై, తానాంధ్రుడైయుండి, కర్ణాటకసామ్రాజ్యాధినాథుడగు కృష్ణరాయల కీర్తి ్తనాచంద్రతారార్కముగ వెలుగునట్లొనర్చిన ప్రతిభావంతుడు’శ్రీకృష్ణరాయలు మంత్రులుదండనాథులు శ్రీకృష్ణదేవరాయ వైభవముపుట 100. ఇలా గతంలో ఎందరో పండితులు,విమర్శకులు,సాహితీవేత్తలు రాయలవారు కన్నడరాయడనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.ఐతే రాయలవారు గాని మరెవరుగాని వారి మాతృభాష ఇది అని ఎక్కడా వివరించలేదు అలాంటి అవసరం ఎవరికీ రాదు.విచిత్రంగా రాయలవారు లాంటి ప్రఖ్యాత వ్యక్తుల విషయంలోనే ఆ విచికిత్స అవసరమౌతుంది.

మాతృభాషగా తెలుగుపై రాయలవారి గాఢానురాగం:
ఈ‘తెలుఁగ దేల యన్న’పద్యాన్ని అలాగే రాయలవారు రాయడంలో ఆయనకు తెలుగు పై ఉన్న అభిప్రాయాన్ని మరికొంత విశ్లేషిద్దాం.13వ శతాబ్దపు మూలఘటిక కేతన తన ఆంధ్రభాషాభూషణంలో ‘తల్లి సంస్కృతంబె ఎల్ల భాషలకును’ అని రాశాడు.14వ శతాబ్దంలో కాకతీయులకాలం నాటి కవి వినుకొండ వల్లభరాయుడు తన క్రీడాభిరామంలో అదే భావాన్ని పదాలు మార్చి ‘జనని సంస్కృతంబు సకల భాషలకును’ ప్రస్తావన37పద్యం. అని పునరుద్ఘాటించాడు.ఇలాంటి పరిస్థితుల మధ్యనే పుట్టిపెరిగిన శ్రీకృష్ణదేవరాయల వారికి సంస్కృతం దేవభాష అనే అభిప్రాయం ఉండడంలో ఆశ్చర్యమేమీ లేదు.ఎంతగా సంస్కృతాన్ని నేర్చి,ఆ భాషలో రచనలు చేసినా ‘జనని సంస్కృతంబు సకల భాషలకును’ అని మాత్రం రాయలేదు.రెండుభాషలపై అధికారం కల రాయలవారికి, పది భాషలు నేర్చిన ఆంధ్రభోజునికి ఆ రెండు భాషలమధ్య జన్యజనక సంబంధంలేదన్న అవగాహన పుష్కలంగా ఉంది.అందుకే ‘తెలుఁ గ దేల యన్న’ పద్యంలోగాని, ఇంకెక్కడ గాని అలాంటి అభిప్రాయాన్ని రాయలవారు ప్రకటించలేదు.పై వినుకొండవల్లభరాయని పద్యంలో‘జనని సంస్కృతంబు సకల భాషలకును’ అనే పాదాన్ని వదిలి, ‘దేశభాషలందుఁ దెనుఁగు లెస్స’,అనే పాదాన్ని మాత్రమే తీసుకొని తెలుగు భాషపై ప్రకటించిన మమకారం లాంటిది, రాయలవారు మరే భాషమీద ప్రకటించలేదు.ఇది వారికి మాతృభాషపైగల మక్కువకు చిహ్నంగా చెప్పవచ్చు.

రాజ్యపాలనలో మాతృభాషాముద్ర
‘తెలుగు దేశమున తెనుఁగున,కన్నడదేశమున తెలుగు, కన్నడ భాషలలో,శ్రీదివ్యతిరుపతి క్షేత్రమున తమిళ,కర్ణాటాంధ్ర భాషలలో మూడింటిలో శాసనములు వేయించినారు.’రాయలవారి ఆంధ్రవాఙ్మయ సేవనిడదవోలు వెంకటరావు శ్రీకృష్ణదేవరాయ వైభవముపుట354.ఈ వాక్యం మనకు చెబుతున్న విషయమేమంటే కృష్ణరాయలవారి రాష్ట్రభాష తెలుగు.అందుచేతనే ఆంధ్రేతరప్రాంతాలలోకూడ తెలుగులో శాసనాలను చెక్కించారు.పాలనావసరాలకోసం ఆయా ప్రాంతీయభాషలలోకూడ శాసనాలను రాయించారు. అదేకదా గొప్ప పరిపాలకుని రాజనీతిజ్ఞత.తన మాతృభాష తెలుగు కనుకనే రాయలవారు తన రాజ్యంలో రాష్ట్రభాష (శీతీ్ శ్రీఅవ) గా దానిని వినియోగించారని చెప్పవచ్చు. ఇక సుల్తానులతో పోరాడి గెలిచిన రాజ్యాలను రాయలవారు తనకు అనుకూలమైన సుల్తానులకే అప్పగించేవారు.కటకంవరకూ జయించినా గజపతితో సంధిచేసుకొని,కృష్ణకు ఉత్తరాన గలదేశాన్ని తిరిగి గజపతికే అప్పగించారు. తెలుగు, కన్నడ, కేరళ ప్రాంతాలలో మాత్రం తనకు అనుయాయులైన తెలుగువారిని ఆయాకోటలకు అధిపతులుగా నియోగించేవారు. కొటియం నాగమనాయకుడు మధురలో స్వతంత్రించడం, అతని కొడుకైన విశ్వనాథనాయకుడే నాగమనాయకుని పట్టితేవడంతో రాయలవారు ఆ విశ్వనాథనాయకునే మధురపాలకుడుగా నియమించారుఆయక్కుడి పాళయప్పట్టు కైఫీయతురాయవాచకముమిత్రమండలి ప్రచురణలుపుట 133.అది మొదలు తమిళప్రాంతంలో తెలుగురాజుల ఏలుబడి ప్రారంభమై తెలుగు సాహిత్యంలో దక్షిణాంధ్రయుగమనే అంకానికి కారణమయింది.
బంధువులందరూ తెలుగువారే!

సాళువనరసింహరాయల(వీరికే కఠారి ఇంటిపేరట) ప్రాపకంతో నరసరాయలు చంద్రగిరి చేరాడని,నరసింహరాయలి సోదరే నరసరాయలి మొదటి భార్య తిప్పాంబ అని, చంద్రగిరి రాజ్యంలోని అరిగండాపురానికి చెందిన కాపు వనిత నాగులాంబను నరసరాయలు రెండవభార్యగా వివాహమాడాడని,ఆమెకు పుట్టిన కృష్ణరాయలు చక్రవర్తి అయిన తరువాత తన తల్లి కన్నవారి ఊరిని బాగుచేసి, ఆమెపేరన అరిగండాపురాన్ని ‘నాగులాపురం’గా పేరు మార్చారని చరిత్ర స్పష్టంచేసింది. మూడవభార్య అచ్యుతదేవరాయలు, శ్రీరంగరాయల తల్లి ఓబులాంబ కర్నూలు ప్రాంతానికి చెందినది. కృష్ణరాయల తల్లులు ముగ్గురూ తెలుగువారే!తల్లి తెలుగువారి ఆడపడుచు. రాయలు తెలుగునేలపై పుట్టారు కాబట్టి శ్రీకృష్ణదేవరాయల వారి మాతృభాష తెలుగే!. ‘రాయలు పెద్దకుమార్తె మోహనాంగిని ఆళియరామరాయలుకు, చిన్నకుమార్తె వెంగమాంబను ఆరవీటి తిరుమలరాయలకు యిచ్చారు.ఇద్దరూ కర్నూలు ప్రాంతీయులే!ఇంకొక కుమార్తె కృష్ణవేణిని పొత్తపినాడు (సిద్ధవటం)పాలకులు మట్లె వరదరాజుకు ఇచ్చి వివాహం చేశారు. వీరందరూ తెలుగువారే!’ భట్టరుెట్టి పద్మారావు రాయలుశ్రీకృష్ణదేవరాయలు138పుట. ఇక వారి కుమార్తె మోహనాంగి కూడ తెనుగుననే మారీచీ పరిణయం అనే కావ్యాన్ని రాసిందికదా! ఎక్కడపుట్టారో అక్కడి భాషమీద,మాతృభాషమీద మమకారం ఎవరికైనా ఉంటుందనడానికి ఇంతకంటే వేరే రుజువులు అక్కరలేదనుకుంటా.ఇక మోహనాంగి గూర్చి నిడదవోలు వెంకటరావుగారేమన్నారో చూద్దాం.
మోహనాంగి

“ఈమె గజపతి కూతురని,జగన్మోహినియని యీమె పేరని రాయవాచకము తెలుపుచున్నది.ఈమె మారీచీ పరిణయమను శృంగార ప్రబంధము రచించెనని గ్రంథస్థమైన విషయము కలదు.కాని యది కానరాదు.మోహనాంగికి కవితాభిరుచి యున్నట్లు,రాయలతో చదరంగమాడుచు “ఉద్ధతులమధ్య పేదల కుండ దరమే”అను కవికర్ణరసాయనోక్త పద్యమును చదువుటవలన తెలిసికొన వచ్చును.ఆ పద్యమునకాక,కవికర్ణరసాయన కావ్యమునకు విలువ గట్టినది మోహనాంగియే.” రాయలవారి ఆంధ్రవాఙ్మయ సేవనిడదవోలు వెంకటరావు శ్రీకృష్ణదేవరాయ వైభవముపుట369.

రాయలవారి బాల్యం చంద్రగిరిలోనే గడిచిందని,చక్రవర్తి కాకముందు ఎన్నోసార్లు తిరుమలపైకి వెళ్ళి,స్వామిని దర్శించి తన ఇష్టదైవంగా మనసులో స్థిరపరచుకొన్నారని చరిత్ర చెబుతోంది.చిన్ననాటినుండి రాయలవారు శాస్త్రభాష సంస్కృతంతోపాటు,మాతృభాష తెలుగును తన ప్రతి అణువులోను నింపుకున్నారనేది నిర్వివాదం.విద్యాభ్యాసంతరువాత కొన్నాళ్ళు అనంతపురం జిల్లాలోని పెనుగొండలో గడిపారని కూడ చరిత్ర ఉంది.యౌవనప్రాదుర్భావ సమయానికి సాళువ నరసింహరాయల కోరికమేరకు తండ్రితోపాటు వారు సకుటుంబంగా హంపి చేరుకున్నారని చారిత్రకుల అంచనా. పుట్టినదాది చక్రవర్తి అయ్యేంతవరకూ తెలుగునేలలోనే గడిపితే వారు తెలుగువారు కాక మరేమౌతారు?

రాయలవారి ఇంటిపేరు
సీ॥ రాయరాహుతుగండ రాచయేనుఁవచ్చి
యారట్లకోట కోరాడునాఁడు
సమ్మెటనరపాలసార్వభౌముఁడు కంచుతలుపులఁ
గరుల డీ కొలుపునాఁడు,
సెలగోలసింహంబు చేరి ధిక్కృతిఁజేసి
సింహాద్రి జయశిల జేర్చునాఁడు,
గడికోటమారాజు గండపెండేరంబు
కూతుఁ నొడంబడఁ గూర్చునాడు,
గీ॥ నొడలెఱుంగవొ చచ్చితో యూరలేవొ,
చీరఁ జాలక తొలఁగితో జీర్ణమైతో,
కనడరాజ్యంబు జొచ్చితే గజపతీంద్ర,

తెఱచినిలు కుక్కసొచ్చినతెఱఁగు గాను.రాయలవారి మరణానంతరం కటకాధిపతియైన గజపతి విజయనగరం(ఆనెగొంది)పై దండెత్తి ఆ పట్టణసమీపంలో విడిది చేశాడు.అందుచేత ఆపట్టణ ప్రజలు భయభ్రాంతులౌతున్నారు.ఆ సందర్భంలో అల్లసాని పెద్దన గజపతి ముందర ఈపద్యాన్ని చదవగా గజపతి సిగ్గుపడి వెనుతిరిగి పోయాడట.కవిజీవితములుగురుజాడశ్రీరామమూర్తి134వ పుట.
ఈ పద్యం రెండవపాద ప్రారంభంలో ‘సమ్మెటనరపాలసార్వభౌముడు’అని,మూడవపాద ప్రారంభంలో ‘సెలగోలసింహంబు’ అని పెద్దన రాయలవారిని ఇంటి పేర్లతో పేర్కొన్నారని కైఫీయతుల చదువరి కట్టా నరసింహులు నాతో అన్నారు.ఈ‘సమ్మెట’,‘సెలగోల’ ఇంటి పేర్లవారు గుంటూరు,ప్రకాశంజిల్లాల్లో నేటికీ ఉన్నారని ఆయాప్రాంతాల నుండే రాయలవారి పూర్వులు తుళువనాడుకు సైనికులుగా తొలుత వెళ్ళారని నాతో చెప్పారు.‘పూర్వు లావఱకు వసియించిన గ్రామనామములనుబట్టి సంపెటవారనియు,సెలగోలవా రనియు కూడ గృహనామము గలదు.ఈ కడపటి రెండుపేరులును కరణములు వ్రాసియుంచిన కొండవీటి కవిలె చరిత్రమునం దుదాహరింపఁబడి యున్నవి’ఆంధ్రకవులచరిత్రముకందుకూరి వీరేశలింగంపుట.484.

ఏది ఏమైనా రాయలవారి పూర్వులు ఆంధ్రులేనని,వారి పూర్వుల ఇంటిపేర్లు సమ్మెట,సెలగోల అని, మాతృభాష తెలుగేనని ఈ పెద్దనగారి పద్యంవలన మరోసారి రూడి పరచవచ్చు. సూర్యుడు అస్తమించని సామ్రాజ్యాన్ని స్థాపించిన ఆంగ్లేయులు తమ ఆంగ్లభాషకు ప్రపంచదేశాలలో ఎంత ప్రాభవానన్ని కలిగించారో ప్రస్తుతం మనకు అనుభవైక వేద్యమే.అదే తీరున ఐదు శతాబ్దాల క్రిందట భారతదేశంలో అధిక భాగాన్ని జయించిన కృష్ణదేవరాయలు తన ఏలుబడిలోని దేశం అంతటా తన మాతృభాషయైన తెలుగుకు అంతే ప్రాభవాన్ని కలిగించారు. అందుకే దక్షిణ భారతదేశంలోని ఆనాటి చదువరులకు వారి మాతృభాష ఏదైనప్పటికీ తెలుగునేర్చుకోవడం, మాట్లాడగలగడం, తెలుగున రచించగలగడం ఒక ష్ట్రఱశీఅ గా మారిందన్నది నిఖార్సయిన నిజం. రాయలవారి పూర్వులు తెలుగునేల దక్షిణ ప్రాంతం నుండి తుళువ ప్రాంతానికి వలస వెళ్ళడం,వారి తండ్రి చంద్రగిరి చేరడం, రాయలవారి తల్లులు ముగ్గురూ తెలుగువారే కావడం,తాను తెలుగు వారినే అల్లుళ్ళుగా తెచ్చుకోవడం,తన సామంతులు, దండనాథులు,మంత్రులు,అష్టదిగ్గజకవులు,అధికారులు ఆముక్తమాల్యద రచన ఇలా సమస్తమూ తెలుగుమయం కావడం, మాతృభాషపై వారికిగల గాఢానురాగాన్ని తెలియజేస్తుంది. ‘దేశభాషలందు తెలుగులెస్స’అనగలిగిన చక్రవర్తిని వేరే భాషీయుడని ఎలా అనగలం. ఇన్ని కారణాలచేత కృష్ణరాయడు తెలుగురాయడే!

వందలాది శిలా,తామ్రశాసనాలను,తెలుగు తమిళ,కన్నడ గ్రంథాలను, మహమ్మదీయుల రాతలను,ఫోర్చుగీసు వర్తకులు రాసిన చారిత్రకాంశాలను తరచి చూస్తే రాయలవారి గూర్చి కొంత తెలుసుకోగలం.ఇంకా ప్రజలనోళ్ళలో నానుతున్న గాథలకు కొదవే లేదు.
దక్షిణ భారత దేశంతో పాటు, శ్రీలంక,జాఫ్నా వంటి ఇరుగు పొరుగు దేశాలు, గయ,గోవామొదలైన ఇతర ప్రదేశాలు చూడగలగాలి. ఫోర్చుగీసు,పారసీ వంటి విదేశీయ భాషలతో పాటు, దక్షిణదేశభాషలు భాగా అధ్యయనం చేయగలగాలి. అప్పు డు మాత్రమే రాయలవారి నిజరూపాన్ని కొంత దర్శింపజేయగలం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News