Saturday, April 27, 2024

అమెరికా అధ్యక్షుల ఆరోగ్యం ఎప్పుడూ రహస్యమే!

- Advertisement -
- Advertisement -

Health of American president is always secret

 

గతంలో అనేక సందర్భాల్లో వాస్తవాలు దాచిపెట్టిన వైట్‌హౌస్

విల్సన్‌నుంచి ట్రంప్ దాకా ఇదే తీరంటున్న విశ్లేషకులు

వాషింగ్టన్: కరోనా వైరస్ బారిన పడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు తాను ఆరోగ్యంగా ఉన్నానని ట్రంప్ ప్రకటించినా మరో 48 గంటలు గడిస్తే కానీ ఏ విషయమైనా తెలుస్తుందని ఆయన సన్నిహిత వర్గాలు చెప్పడం గమనార్హం. అయితే అమెరికా చరిత్రను చూస్తే మాత్రం చాలా సందర్భాల్లో అధ్యక్షుల ఆరోగ్యం విషయంలో వైట్‌హౌస్ అసత్యాలనే బైటపెట్టినట్లు స్పష్టమవుతుంది. కొన్నిసార్లు వారి ఆరోగ్య సమస్యలు చిన్నవైనా.. మరికొన్ని సార్లు తీవ్ర సమస్యలు ఉన్నా బహిరంగపర్చలేదనే వాదన ఉంది. వీటిని తెలుసుకోవడానికి ప్రజలకు ఒక్కోసారి దశాబ్దకాలం పట్టిందంటేనే అధ్యక్షుల విషయంలో వైట్‌హౌస్ వ్యవహారం అర్థమవుతుంది. తాజాగా ఇప్పుడు అధ్యక్షుల విషయంలో వైట్‌హౌస్ పారదర్శకంగా ఉంటుందా? అన్న అంశం చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుత అధ్యక్షుడిలాగానే వైరస్ ప్రభావాన్ని తక్కువ చేసి చూపించిన ఉడ్రోవిల్సన్ కూడా 1918లో అప్పటి స్పానిష్ ఫ్లూ బారిన పడ్డారు. అనంతరం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అయితే ఎప్పటిమాదిరిగానే విల్సన్ అనారోగ్యం విషయాన్ని శ్వేతసౌధం రహస్యంగా ఉంచింది. 1919లో రెండో ప్రపంచయుద్ధం ముగిసిన సందర్భంగా పారిస్‌లో చర్చలు జరుపుతున్న సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురైన విల్సన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అయితే అధ్యక్షుడిపై విషప్రయోగం జరిగిందని విల్సన్ వ్యక్తిగత వైద్యుడు కేరీ గ్రేసన్ అనుమానించి ఆ విషయాన్ని లేఖద్వారా వైట్‌హౌస్ అధికార్లుకు తెలియజేశారు. అయితే ఉడ్రోవిల్సన్ స్పానిష్ ఫ్లూబారిన పడిన విషయం ఆ తర్వాత బయటపడింది. వందేళ్ల తర్వాత ఇప్పుడు ఇలాంటి ఘటనే పునరావృతమైంది. మహమ్మారిల విజృంభణ సమయంలో వాటి తీవ్రతను తక్కు వ చేసి చూపించేందుకు ప్రయత్నించిన ఇద్దరు అధ్యక్షులు వైరస్ బారినపడ్డారు.

అయితే భయాందోళనలు తగ్గించడం కోసం అలా చేశానని ట్రంప్ సమర్థించుకున్నప్పటికీ దానికి రాజకీయ కారణాలున్నాయని విశ్లేషకుల అభిప్రాయం. ఎన్నికలకు ముం దు అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారకుండా ఉండడం కోసమే ట్రంప్ అలా చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ వైరస్ ప్రభావాన్ని తక్కువ చేసి చూపించడానికి విల్సన్‌కు వేరే కారణాలున్నట్లు జాన్ బారీ రాసిన పుస్తకాన్ని బట్టి అర్థమవుతోంది. తాజాగా ట్రంప్ ఆరోగ్యంపై వైట్‌హౌస్ ఏ మేరకు పారదర్శకంగా వ్యవహరిస్తుందనే విషయంపై అక్కడి విశ్లేషకులు ఆసక్తిగా చూస్తున్నారు.

అధ్యక్షుల ఆరోగ్యంపై ఎప్పుడూ గోప్యతే..

చాలా సమయాల్లో అమెరికా అధ్యక్షుల ఆరోగ్యం, వారి వైద్యానికి సంబంధించిన విషయాలను ప్రజలకు ఎంత రహస్యంగా ఉంచారు చరిత్ర స్పష్టం చేస్తోందని చికాగో యూనివర్శిటీకి చెందిన రాజకీయ విశ్లేషకుడు విలియం హోవెల్ అభిప్రాయపడుతున్నారు. వీటికి చరిత్రలో జరిగిన ఘటనలే నిదర్శనమని ఆయన చెప్తున్నారు. తాజాగా ట్రంప్ కరోనా వైరస్‌కు గురైన నేపథ్యంలో గతంలో అమెరికా అధ్యక్షుల ఆరోగ్యం విషయాలను వైట్‌హౌస్ రహస్యంగా ఉంచిన కొన్ని సంఘటనలను చరిత్రకారులు, విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

* 1890లో అమెరికా అధ్యక్షుడిగా ఉండిన గ్రోవర్ క్లీవ్‌లాండ్ కూడా తన అనారోగ్యంపై గోప్యతను పాటించారు. లాంగ్ ఐలాండ్ ప్రాంతంలో ఓ ప్రత్యేక షిప్‌లో అర్ధరాత్రి తన నోటికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. క్లీవ్‌లాండ్ నోటినుంచి క్యాన్సర్ పుండును తొలగించినట్లు ఫిలడెల్ఫియాకు చెందిన 2000 సంవత్సరంలో బైటపెట్టింది. అయితే తనకు ఆరోగ్యం సరిగా లేకపోవడం బలహీనత అవుతుందేమోనన్న భయంతో గ్రోవర్ ఈ విషయాన్ని దాచిపెట్టినట్లు ఆ తర్వాత తెలిసింది.
* ఇక 1967లో లిండన్ బి. జాన్సన్ కూడా శస్త్రచికిత్స ద్వారా తనచర్మానికున్న గాయాన్ని తొలగించుకున్నారు. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారు.

 

*1944లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ కూడా అధిక రక్తపోటు, గుండెజబ్బు, తీవ్ర శ్వాససంబంధమైన సమస్యలను ఎదుర్కొన్నట్లు తేలిం ది. దీంతో ఆయన ధూమపానాన్ని తగ్గించాలని, ఆహారంపై నియంత్రణ పాటించాలని డాక్టర్లు సూచించారు. అయితే అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తుండడంతో తనకు స్వల్ప అనారోగ్య సమస్యలు మాత్రమే ఉన్నట్లు రూజ్వెల్ట్, వైట్‌హౌస్ సంయుక్తంగా ప్రకటించాయి. తిరిగి ఎన్నికల్లో గెలిచిన రూజ్వెల్ట్ కొద్దినెలల తర్వాత (1945 ఏప్రిల్ 12న) గుండెపోటుతో చనిపోయారు.

* అమెరికా చరిత్రలో నిలిచిపోయిన అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ కూడా ఇదే మార్గాన్ని అనుసరించారు. ప్రమాదకరమైన అడిసన్‌వ్యాధితో పాటుగా తీవ్ర జీర్ణకోశ సమస్యలను కెన్నడీ ఎదుర్కొన్నట్లు చరిత్రకారుడు రాబర్ట్ డాల్లెక్ స్పష్ట చేశారు. ఆరోగ్యంగా ఉండేందుకు నిత్యం ఎనిమిది రకాల మాత్రలు వేసుకునే వారని ఆయన వెల్లడించారు. అయితే తాను అనారోగ్యంతో ఉన్న విషయాన్ని దాచడానికి కెన్నడీ చాలా ప్రయత్నాలు చేశారని, అడిసన్ వ్యాధి ఉన్న విషయాన్ని విలేఖరులు చాలాసార్లు ప్రశ్నించినప్పుడు ఆయన ఖండించేవారని గుర్తు చేశారు.

*1955లో అధ్యక్షుడిగా ఉన్న డ్వైట్ డి ఐసెన్‌హోవర్‌కు కూడా ఓసారి విహారయాత్రలో ఉన్నప్పుడు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన ఆరు వారాలపాటు ఆస్పత్రిలో చికిత్స పొందాల్సి వచ్చింది. అనంతరం రెండో దఫా అధ్యక్ష ఎన్నికల్లో ఆయన పోటీ చేయకపోవడమే మంచిదని అందరూ భావించారు. కానీ అధికార బాధ్యత్తల్లో ఉంటేనే ఆయన త్వరగా కోలుకుంటారని వైద్యులు సిఫార్సు చేయడం గమనార్హం.

*1841లో విలియమ్ హారిసన్ విషయంలోను వైట్‌హౌస్ ఇలానే చేసిందనే విమర్శలున్నాయి. అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన నెలరోజులకే ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. తొమ్మిది రోజుల తర్వాత చివరికి తుదిశ్వాస విడిచారు. ఆయనకు నిమోనియా వంటి లక్షణాలున్నట్లు వైద్యులు ముందుగానే గుర్తించినప్పటికీ ఈ విషయాన్ని వైట్‌హౌస్ వెల్లడించలేదు.
ఇలా అమెరికా చరిత్రలో చాలా మంది అధ్యక్షులు స్వల్ప, తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే ఇలాంటి సమస్యలు సాధారణమే అయినప్పటికీ వీటిగురించి ప్రజలకు వెల్లడించడంలో వైట్‌హౌస్ గోప్యతను పాటించిందని చరిత్రకారులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News