Saturday, April 27, 2024

విశ్వ క్రీడలకు సర్వం సిద్ధం

- Advertisement -
- Advertisement -

టోక్యో: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. టోక్యో ఒలింపిక్స్‌కు శుక్రవారం తెరలేవనుంది. జపాన్ రాజధాని టోక్యో నగరం వేదికగా విశ్వ క్రీడలు జరుగనున్నాయి. నిజానికి కిందటి ఏడాది జులై 23 నుంచే ఒలింపిక్స్ జరగాల్సి ఉంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణను దృష్టిలో పెట్టుకుని క్రీడలను ఏడాది పాటు వాయిదా వేశారు. ఇక శుక్రవారం ప్రారంభమయ్యే ఒలింపిక్స్ ఆగస్టు 8న ముగుస్తాయి. ఈ క్రీడల్లో దాదాపు 204 దేశాలకు చెందిన క్రీడాకారులు పోటీ పడనున్నారు. అంతేగాక క్రీడల చరిత్రలోనే తొలిసారిగా శరణార్థులతో కూడిన జట్టు కూడా ఒలింపిక్స్ బరిలోకి దిగుతోంది. ఇక ఎప్పటిలాగే ఈసారి కూడా అమెరికా, చైనా, బ్రిటన్, కొరియా, జపాన్, ఆస్ట్రేలియా, రష్యా దేశాలే ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్నాయి. ఈసారి 339 పతకాల కోసం అథ్లెట్లు పోటీ పడనున్నారు. ఇక మొత్తం 33 క్రీడాంశాల్లో పోటీలు జరుగనున్నాయి. భారత్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో క్రీడాకారులు ఒలింపిక్స్ బరిలో నిలిచారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ క్రీడల్లో భారత్ మొత్తం 18క్రీడాంశాల్లో పోటీపడనుంది. ఈసారి భారత్ తరఫున 127 మంది బరిలోకి దిగారు.
చైనా, అమెరికాల మధ్యే పోటీ
ఈసారి కూడా రెండు పెద్ద దేశాల మధ్యే పతకాల కోసం గట్టి పోటీ నెలకొంది. గతంలోలాగే ఈసారి కూడా అమెరి కా, చైనాల మధ్య హోరాహోరీ ఖాయంగా కనిపిస్తోంది. ప్రపంచ క్రీడల్లోనే ఈ రెండు దేశాలు ఎదురులేని శక్తులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక క్రీడలకు ఆతిథ్యం ఇస్తున్న జపాన్ కూడా భారీ ఆశలతో బరిలో దిగనుంది. బ్రిటన్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, దక్షిణ కొరియా తదితర దేశా లు కూడా ఈ క్రీడల్లో పతకాల పంట పండించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. తొలిసారి శరణార్థుల జట్టు కూడా బరిలో దిగనుంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో శరణార్థుల శిబిరాల్లో ఉన్న క్రీడాకారులు ఒక బృందంగా ఏర్పడి జపాన్ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగుతున్నారు. వీరిపై అందరి దృష్టి నెలకొంది.
కఠిన ఆంక్షల మధ్య..
గతంలో ఎన్నడూ లేని విధంగా టోక్యో ఒలింపిక్స్ భిన్న పరిస్థితుల్లో జరుగనున్నాయి. కరోనా మహమ్మరి దెబ్బకు ఏకంగా ఏడాది పాటు వాయిదా పడిన విశ్వ క్రీడలను సజావుగా జరపడం నిర్వాహకులకు సవాలుగా మారింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటికే క్రీడా గ్రామంలో కరోనా కేసులు కలకలం సృష్టించాయి. పలువురు క్రీడాకారులు కరోనా బారిన పడడంతో నిర్వాహకులతో పాటు పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారుల్లో ఒక రకమైన ఆందోళన నెలకొంది.
ప్రేక్షకులు లేకుండానే..
మరోవైపు ఈసారి ఒలింపిక్స్‌ను ఖాళీ స్టేడియాల్లోనే నిర్వహిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అభిమానులకు స్టేడియాల్లోకి అనుమతి ఇవ్వడం లేదు. కేవలం క్రీడాకారులు, సహాయక సిబ్బంది, ఒలింపిక్స్ సంఘం ప్రతినిధులకు మాత్రమే క్రీడా ప్రాంగణాల్లో అనుమతి ఉంటుం ది. ఇక క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు ప్రతిసారి కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. ఒకవేళ పాజిటివ్ వస్తే తప్పనిసరిగా ఐసోలేషన్‌కు వెళ్లక తప్పదు. అంతేగాక అథ్లెట్ల ఆరోగ్యాన్ని కాపాడేందుకు నిర్వాహకులు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీని కోసం అత్యాధునిక వైద్య సౌకర్యాలను అందుబాటులో ఉంచారు. ఇక క్రీడల ఆరంభోత్సవ వేడుకలను కూడా గతంలో మాదిరిగా భారీ నిర్వహించడం లేదు. పరిమిత సంఖ్యలో మాత్రం ఆరంభోత్సవ కార్యక్రమాలు ఉండనున్నాయి. అయితే ఈసారి కూడా క్రీడల్లో పాల్గొనే దేశాల క్రీడాకారులు మార్చ్‌పాస్ట్‌లో పాల్గొంటారు. శుక్రవారం జరిగే మార్చ్‌పాస్ట్‌లో భారత బృందానికి బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్, భారత హాకీ జట్టు కెప్టెన్ మన్‌దీప్ సింగ్ నాయకత్వం వహిస్తారు. ఇక క్రీడలను సోనీ నెట్‌వర్క్, డిడి స్పోర్ట్ ఛానెల్స్ ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి.

Tokyo Olympic 2021 Starts from tomorrow

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News