Saturday, April 27, 2024

ఆత్మవిశ్వాసంతో ‘కోల్‌కతా’

- Advertisement -
- Advertisement -

Tomorrow is qualifier 2 fight Between KKR vs DC

నేడు క్వాలిఫయర్2 సమరం

షార్జా: ఐపిఎల్ సీజన్14 తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే లీగ్ దశతో పాటు నాకౌట్‌లో రెండు మ్యాచ్‌లు ముగిసాయి. ఇక మిగిలింది క్వాలిఫయర్2, ఫైనల్ సమరం మాత్రమే. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగే క్వాలిఫయర్2లో కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇందులో గెలిచే జట్టు సిఎస్‌కెతో ఫైనల్ పోరుకు అర్హత సాధిస్తోంది. తుది సమరం శుక్రవారం జరుగనుంది. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన కోల్‌కతా ఈ మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇందులో కూడా గెలిచి టైటిల్ పోరుకు దూసుకెళ్లాలనే పట్టుదలతో ఉంది. ఇక లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన ఢిల్లీ తొలి క్వాలిఫయర్‌లో పోరాడి ఓడింది. మహేంద్ర సింగ్ ధోని చారిత్రక ఇన్నింగ్స్ ఆడడంతో గెలవాల్సిన మ్యాచ్‌లో రిషబ్ సేనకు అనూహ్య ఓటమి తప్పలేదు. ఈసారి మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా టైటిల్ సమరానికి చేరుకోవాలని ఢిల్లీ తహతహలాడుతోంది.

రెండు జట్లలోనూ ప్రతిభాంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లు ఇరు జట్లలోనూ అందుబాటులో ఉన్నారు. దీంతో బుధవారం జరిగే నాకౌట్ సమరం నువ్వానేనా అన్నట్టు సాగడం ఖాయం. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఢిల్లీ వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరినట్టు అవుతోంది. కిందటిసారి కూడా ఢిల్లీ ఫైనల్‌కు చేరింది. అయితే ముంబై ఇండియన్స్‌తో జరిగిన తుది సమరంలో ఓడి రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. ఇక కోల్‌కతా ఇప్పటికే రెండుసార్లు ఐపిఎల్ ట్రోఫీని గెలుచుకుంది. 2012, 2014లలో నైట్‌రైటర్స్ చాంపియన్‌గా నిలిచింది.

బ్యాటింగే అసలు సమస్య..

ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను బ్యాటింగ్ సమస్య వెంటాడుతోంది. కీలక సమయంలో ఒత్తిడికి గురై వికెట్లను చేజార్చుకోవడం అలవాటుగా మారింది. బెంగళూరుతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కూడా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. యువ ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్, శుభ్‌మన్ గిల్‌లలో నిలకడ లోపించింది. అయ్యర్ కాస్త బాగానే రాణిస్తున్నా గిల్ మాత్రం తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక పోతున్నాడు. క్వాలిఫయర్2లో ఓపెనర్లు కోల్‌కతాకు చాలా కీలకంగా మారారు. వీరిద్దరూ అందించే శుభారంభంపైనే కోల్‌కతా భారీ స్కోరు ఆధారపడి ఉంటుంది. ఇక రాహుల్ త్రిపాఠి, నితీశ్ రాణాలు కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచక తప్పదు. లీగ్ దశలో రాణా పెద్దగా ప్రభావం చూపలేక పోయాడు. త్రిపాఠి మాత్రం కాస్త బాగానే ఆడాడు. అయితే కిందటి మ్యాచ్‌లో రాహుల్ ఆరు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో మాత్రం దూకుడుగా ఆడాలనే లక్షంతో కనిపిస్తున్నాడు. ఇక బెంగళూరుపై రాణా 23 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. కానీ అతని బ్యాటింగ్‌లో దూకుడు ఉండడం లేదు. ధాటిగా ఆడడంలో విఫలమవుతున్నాడు. ఇది జట్టుపై బాగానే ప్రభావం చూపుతోంది.

మోర్గాన్, కార్తీక్‌లపై భారీ ఆశలు..

కీలకమైన నాకౌట్ సమరంలో జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, మాజీ సారథి దినేశ్ కార్తీక్‌లపై నెలకొంది. ఈ సీజన్‌లో మోర్గాన్, కార్తీక్‌లు బ్యాటింగ్‌లో విఫలమవుతున్నారు. ఒకటి రెండు మ్యాచుల్లో మినహా వీరిద్దరూ పెద్దగా రాణించలేదనే చెప్పాలి. ఈసారైన ఇద్దరు కీలక ఇన్నింగ్స్‌లు ఆడాల్సిన అవసరం ఉంది. మోర్గాన్ కెప్టెన్సీ బాగానే ఉన్నా అతని బ్యాటింగ్ అంతంత మాత్రంగానే ఉందని చెప్పాలి. ఇది జట్టుకు ప్రతికూలంగా మారింది. మోర్గాన్, కార్తీక్‌లు తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరిస్తే ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించడం కోల్‌కతాకు పెద్ద కష్టమేమీ కాదు. గతంలో విధ్వంసక బ్యాటింగ్‌కు మరో పేరుగా నిలిచిన కార్తీక్ ఈసారి మాత్రం దూకుడుగా ఆడలేక పోతున్నాడు. కార్తీక్ తడబాటు కోల్‌కతాకు ఇబ్బందిగా పరిణమిస్తోంది. ఢిల్లీతో అమీతుమీ తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో కార్తీక్ తన బ్యాట్‌కు పని చెప్పక తప్పదు.

ఆ ఇద్దరు చాలా కీలకం..

మరోవైపు ఆల్‌రౌండర్లు షకిబ్ అల్ హసన్, సునిల్ నరైన్‌లు ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో జట్టుకు చాలా కీలకంగా మారారు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో నరైన్ ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టాడు. బౌలింగ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన నరైన్ బ్యాట్‌తోనూ రాణించాడు. కీలక సమయంలో దూకుడుగా ఆడి బెంగళూరు గెలుపు అవకాశాలను దెబ్బకొట్టాడు. ఈసారి కూడా అదే జోరును కనబరచాలనే పట్టుదలతో ఉన్నాడు. నరైన్ విజృంభిస్తే ఢిల్లీకి ఇబ్బందులు ఖాయం. ఇక షకిబ్ రూపంలో మరో పదునైన అస్త్రం కోల్‌కతాకు అందుబాటులో ఉంది. బ్యాట్‌తో, బంతితో రాణించే సత్తా షకిబ్‌కు ఉంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో షకిబ్ ఆల్‌రౌండ్‌షోతో జట్టుకు అండగా నిలిచాడు. ఈసారి కూడా జట్టు అతనిపై భారీ ఆశలే పెట్టుకుంది. ఫెర్గూసన్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి తదితరులతో కోల్‌కతా బౌలింగ్ కూడా బలంగా ఉంది. రెండు విభాగాల్లోనూ బలంగా కనిపిస్తున్న నైట్‌రైడర్స్ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

సంచలనాలకు మరోపేరు..

ఇక యువ ఆటగాళ్లతో కూడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్‌లో సంచలన ప్రదర్శనతో అలరిస్తోంది. లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచి సత్తా చాటింది. క్వాలిఫయర్1లో కూడా పటిష్టమైన చెన్నైని దాదాపు ఓడించినంత పని చేసింది. ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగే పోరులో గెలుపే లక్షంగా పెట్టుకుంది. పృథ్వీషా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, హెట్‌మెయిర్ వంటి విధ్వంసక బ్యాట్స్‌మన్ జట్టులో ఉన్నారు. కిందటి మ్యాచ్‌లో అయ్యర్, ధావన్‌లు తక్కువ స్కోరుకే వెనుదిరగడం ఢిల్లీకి ప్రతికూలంగా మారింది. ఈసారి మాత్రం వీరిద్దరూ మెరుగైన బ్యాటింగ్ కనబరచాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ సీజన్‌లో ధావన్, పృథ్వీషాలు అద్భుతంగా రాణిస్తున్నారు.

ఒకటి రెండు మ్యాచుల్లో తప్ప వీరిద్దరూ జట్టుకు శుభారంభమే అందిస్తున్నారు. ఈసారి కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. అయ్యర్ కూడా తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగాల్సిన అవసరం ఉంది. అయ్యర్ విజృంభిస్తే కోల్‌కతా బౌలర్లకు కష్టాలు ఖాయం. సిఎస్‌కెపై ధాటిగా ఆడిన రిషబ్ పంత్, హెట్‌మెయిర్‌లు ఈసారి కూడా అదే జోరును కనబరచాలనే పట్టుదలతో ఉన్నారు. ఇద్దరు కూడా ఫామ్‌లో ఉండడం ఢిల్లీకి పెద్ద ఊరటనిచ్చే అంశం. అంతేగాక అక్షర్, అవేశ్ ఖాన్, నోర్జే, రబడా, అశ్విన్‌లతో బౌలింగ్ విభాగం కూడా చాలా బలంగా ఉంది. ఇలా రెండు విభాగాల్లోనూ సమతూకంగా కనిపిస్తున్న ఢిల్లీ భారీ ఆశలతో కోల్‌కతా పోరుకు సిద్ధమైంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News