Sunday, April 28, 2024

గెలిస్తేనే నిలుస్తారు..

- Advertisement -
- Advertisement -

Tomorrow match between MI vs RR

ఇరు జట్లకు కీలకం, రేపు ముంబైతో రాజస్థాన్ ఢీ

షార్జా: ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ సిద్ధమయ్యాయి. ప్రస్తుతం ఇరు జట్లు పది పాయింట్లతో ఉన్నాయి. కోల్‌కతా ఇప్పటికే 12 పాయింట్లు సాధించి కాస్త మెరుగైన స్థితిలో నిలిచింది. ఇలాంటి స్థితిలో ఈ మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ ముంబైకి, మాజీ విజేత రాజస్థాన్‌కు చావో రేవోగా మారింది. ఈసారి ఓడితే ప్లేఆఫ్ బెర్త్‌ను దక్కించుకోవడం రెండు జట్లకు కష్టంగా తయారవుతోంది. కాగా, కిందటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై సంచలన విజయం సాధించిన రాజస్థాన్ ఈ పోరుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, శివమ్ దూబేలు విధ్వంసక ఇన్నింగ్స్‌లతో రాజస్థాన్‌కు సంచలన విజయం సాధించి పెట్టారు. ఈ గెలుపు రాజస్థాన్ జట్టులో కొత్త జోష్‌ను నింపింది. బ్యాటింగ్‌లో బలంగా ఉండడం శాంసన్ సేనకు కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, శివమ్ దూబే తదితరులు మరోసారి విజృంభిస్తే ముంబైకి ఇబ్బందులు తప్పక పోవచ్చు.

ఇక కెప్టెన్ సంజు శాంసన్ ప్రతి మ్యాచ్‌లోనూ నిలకడైన ప్రదర్శనతో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. ఈసారి కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచేందుకు సిద్ధమయ్యాడు. శాంసన్ తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే రాజస్థాన్‌కు భారీ కష్టమేమీ కాదు. అయితే కీలక ఆటగాళ్లు డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియాల వైఫల్యం రాజస్థాన్‌ను వెంటాడుతోంది. అంతేగాక బౌలర్లు కూడా భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేస్తే రాజస్థాన్ గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.

సవాల్ వంటిదే..

ఇక ఈ సీజన్‌లో పేలవమైన ప్రదర్శనతో సతమతమవుతున్న ముంబైకి రాజస్థాన్‌తో పోరు సవాల్‌గా మారింది. బౌలర్లు బాగానే రాణిస్తున్నా బ్యాటింగ్ వైఫల్యం రోహిత్ సేనను వెంటాడుతోంది. ఢిల్లీతో జరిగిన కిందటి మ్యాచ్‌లో ముంబై 129 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ రోహిత్‌తో సహా డికాక్, సౌరభ్, పాండ్య సోదరులు, పొలార్డ్ తదితరులు ఆశించిన స్థాయిలో బ్యాటింగ్‌ను చేయలేక పోతున్నారు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా వీరంతా మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కిందటి సీజన్‌లో పరుగుల వరద పారించిన డికాక్, సూర్యకుమార్ తదితరులు ఈసారి తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదనే చెప్పాలి. హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్యలు అయితే మరింత ఘోరంగా ఆడుతున్నారు.

ఇద్దరి వైఫల్యం జట్టుపై బాగానే కనిపిస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో పాండ్య సోదరులు చెలరేగాల్సిన అవసరం ముంబైకి ఎంతైనా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే పొలార్డ్ కూడా చెలరేగాల్సిన పరిస్థితి అసన్నమైంది. సూర్యకుమార్‌కు ఈ మ్యాచ్ చాలా కీలకమని చెప్పాలి. రానున్న ప్రపంచకప్‌లో చోటు నిలబెట్టుకోవాలంటే మిగిలిన మ్యాచుల్లో రాణించడమే ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది. ఇప్పటికే పేలవమైన ప్రదర్శనతో ఇషాన్ కిషన్ తుది జట్టులో స్థానం సంపాదించలేక పోతున్నాడు. కాగా, కీలకమైన ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించాల్సిన బాధ్యత జట్టు సభ్యులపై ఉంది. ఇందులో వారు ఎంతవరకు సఫలం అవుతారనే దానిపైనే ముంబై గెలుపు అవకాశాలు ఆధారపడి ఉంటాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News