Monday, April 29, 2024

నోముల ఇకలేరు

- Advertisement -
- Advertisement -

నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల ఇకలేరు

* కామ్రేడ్ ఎర్ర గులాబీ కన్నుమూత
* దివికేగిన ధృవతార
* హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన నోముల
* ఈ నెల 3 ( గురువారం) న నకిరేకల్ మండలం పాలెం గ్రామంలో అంత్యక్రియలు
* నోముల అంత్యక్రియలకు హాజరుకానున్న సిఎం కెసిఆర్
* నోముల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన మండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి
* పాలెం గ్రామంలో అంత్యక్రియల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ పాటిల్, ఎస్పీ రంగనాథ్
* పాలెం గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ లాంఛనాలతో నోముల అంత్యక్రియలు
* నోముల నర్సింహ్మయ్యకు నివాళులు అర్పించిన నకిరేకల్ ఎమ్మేల్యే చిరుమర్తి, మాజీ ఎమ్మేల్యే వేముల, పలువురు ప్రముఖులు

TRS MLA Nomula Narsaiah passes away

మన తెలంగాణ/కట్టంగూర్(నకిరేకల్): నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య యాదవ్(64) గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. విప్లవాల ఖిల్లా నల్లగొండ జిల్లా ,నకిరేకల్ మండలం పాలెం గ్రామం ఆయన స్వస్థలం.

కుటుంబ నేపథ్యం : నకిరేకల్ మండలంలోని పాలెం గ్రామానికి చెందిన నోముల రాములు, మంగమ్మ దంపతులకు ఐదుగురు కొడుకులు,ఇద్దరు కుమార్తెలు.వీరిలో నోముల నర్సింహ్మయ్య రెండో సంతానంగా నకిరేకల్ మండలం పాలెం గ్రామంలో 9 జనవరి 1956 లో జన్మించారు .పెద్దకుమారుడు సీతారాములు అగ్రికల్చర్ ఆఫీసర్‌గా పని చేసి రిటైర్డ్ అయ్యారు. మూడో సంతానం నోముల మురళీ ఏసీపీ హోదాలో విజిలెన్స్ శాఖలో పని చేస్తున్నారు. గోవిందరాజులు అడ్వకేట్ గా, యోగిబాబు ప్రభుత్వ లెక్చరర్‌గా పని చేస్తున్నారు. కుమార్తెలలో పెద్ద కూతురు సుజాత మాజీ సర్పంచ్ కాగా, చిన్న కూతురు గాయత్రి సూర్యపేట కోర్టులో అడ్వకేట్ గా కొనసాగుతున్నారు. ఆమె భర్త రాంమ్మూర్తి సూర్యపేట పట్టణంలో ప్రముఖ వైద్యుడిగా పని చేస్తున్నారు. నోముల నర్సింహ్మయ్య కుటుంబానిది పూర్తిగా మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం.
నోముల బయోడేటా:
తల్లిదండ్రులు: నోముల రాములు,మంగమ్మ
భార్య: నోముల లక్ష్మీ, వృత్తి:వ్యవసాయం,గృహిణి
సంతానం: ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు
పెద్ద కూతురు : ఝాన్సీరాణి,అల్లుడు: రవి వీరురివురు ఆస్ట్రేలియాలోనే స్థిర పడ్డారు.
చిన్న కూతురు: అరుణ జ్యోతి, అల్లుడు: క్రాంతి కుమార్ వీరురివురు అమెరికాలో స్థిరపడ్డారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు.
కుమారుడు: నోముల భగత్ ,వృత్తి హైకోర్టు న్యాయవాది
కోడలు: భవాని, వృత్తి: వ్యాపారం
విద్యాభ్యాసం : నోముల నర్సింహ్మయ్య తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని నోముల గ్రామంలోనే పూర్తి చేశారు. డిగ్రీ నల్లగొండ ఎన్.జి కళాశాలలో , ఎం.ఏ ఎల్.ఎల్.బి ఉస్మానియా యూనివర్శిటీ లో పూర్తి చేశారు.
రాజకీయ నేసథ్యం : మార్కిస్ట్ దృక్పథంతో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను,దోపిడికి గురవుతున్న సామాజిక వర్గాలను చూసి ,అప్పటి రాజకీయ పరిస్థితులకు ఆకర్షితులై 13 యేండ్ల వయస్సులోనే ఎర్ర జెండా చేతపట్టి,ప్రజా ఉద్యమాలలో చురుకుగా పాల్గొనేవారు. విద్యార్ధి దశలోనే నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకొని కమ్యూనిస్ట్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు.ఈ నేపథ్యంలోనే ఉస్మానియా యూనివర్శిటీ లో 1981 లో లా చదివే రోజుల్లో విద్యార్ధి సంఘమైన ఎస్.ఎఫ్.ఐ లో చేరి ఉద్యమాలలో పాల్గొంటూ, విద్యార్ధి నాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నల్లగొండ, నకిరేకల్ కోర్టులలో న్యాయవాది గా పని చేసి మంచి పేరు సంపాదించుకున్నారు. సిపిఎం సీనియర్ నేత నర్రా రాఘవ రెడ్డి ప్రోత్సాహంతో నోముల నర్సింహ్మయ్య ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 1987 నుండి1999 వరకు 12 ఏళ్ల పాటు నకిరేకల్ ఎంపీపీ గా పని చేశారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1999 నుండి 2009 వరకు నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గా పోటి చేసి గెలుపొందారు.అసెంబ్లీలో పది సంవత్సరాల పాటు సిపిఎం శాసన సభాపక్ష నాయకుడిగా సేవందించి ప్రజల పక్షాన పోరాడుతూ ,అసెంబ్లీలో తనదైన వాక్చుతుర్యంతో బలమైన నాయకుడిగా ముద్రవేసుకున్నారు. 2009 లో నకిరేకల్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ స్థానం కావడంతో భువనగిరి పార్లమెంట్ నుండి ఎంపి గా పోటి చేసి ఓడిపోయారు. 2009 నుండి 2014 వరకు కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉండి, ప్రజల పక్షాన ఉద్యమాలు చేశాడు. 2014 ఎన్నికల సమయంలో సిపిఎం నుంచి హూజూర్‌నగర్ ఎమ్మెల్యే సీటు కోసం ప్రయత్నం చేయగా టికెట్ రాకపోవడంతో అదే సమయంలో టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే టికెట్ సాధించి కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరి జానా రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే గా పోటి చేసి జానా రెడ్డి పై ఘనవిజయం సాధించారు. ఎన్నికల సమయం నాటి నుండి అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న నోముల పలుమార్లు కేరళ రాష్ట్రం వెళ్లి వైద్యం చేయించుకున్నారు. కొంత కాలం ఆరోగ్యం పరిస్థితి బాగానే ఉన్నప్పటికి, సమస్య తిరిగి యథావిధికి వచ్చింది. నియోజకవర్గంలో ముఖ్యమైన కార్యక్రమాలకు మాత్రమే హాజరవుతున్నారు. హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోనే ఉంటూ వైద్యం చేయించుకుంటున్నట్లు సమాచారం.
పలువురు ప్రముఖుల నివాళులు: శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్, నకిరేకల్ ఎమ్మేల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం లు నోముల నర్సింహ్మయ్య మృతదేహాన్ని సందర్శించి సంతాపం తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

రేపు(గురువారం) పాలెంలో…నోముల అంత్యక్రియలు:

నాగార్జునసాగర్ శాసన సభ్యుడు నోముల నర్సింహ్మయ్య అంత్యక్రియలు ఆయన వ్యవసాయ క్షేత్రంలో గురువారం నకిరేకల్ మండలంలోని పాలెం గ్రామంలో నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. బుధవారం నార్కట్‌పల్లి కామినేని హాస్పటల్ కు తరలించి ప్రజలు, టిఆర్‌ఎస్ నాయకులు,అభిమానులు,కార్యకర్తల సందర్శనార్ధం అందుబాటులో ఉంచుతారు.

పాలెం గ్రామంలో అంత్యక్రియలు,హెలిపాడ్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ:

ప్రభుత్వ ఆదేశం మేరకు నాగార్జునసాగర్ శాసన సభ్యుడు నోముల నర్సింహ్మయ్య అంత్యక్రియలను తన స్వగ్రామైన నకిరేకల్ మండలం పాలెం గ్రామంలో నిర్వహిసున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ప్రశాంత్ జీవన్ పాటిల్, డిఐజి,న ల్లగొండ ఎస్పీ ఏ.వి.రంగనాథ్ లు మంగళవారం సాయంత్రం సందర్శించి,ఏర్పాట్లను పరిశీలించారు.అనంతరం అధికారులకు తగు సూచనలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News