Wednesday, May 15, 2024

ఐసోలేషన్ కిట్లు

- Advertisement -
- Advertisement -

టెస్టు కంటే ట్రీట్మెంట్‌పై దృష్టి సారించిన సర్కార్…!
సింప్టమ్స్ ఉన్నోళ్లందరికీ ఐసోలేషన్ కిట్లు
పాజిటివ్ రిపోర్టు లేకున్న మందులు
పది రోజుల పీరియడ్‌లో రెండు విడతల్లో మెడిసిన్స్ పంపిణీ
బాధితులను గుర్తించేందుకు ఇంటింటికీ స్పెషల్ సర్వే
క్రియశీలక పాత్ర వహించనున్న ఆశాలు, ఏఎన్‌ఎంలు
మహమ్మారిని తరిమికొట్టేందుకు ఉక్కు సంకల్పంతో ప్రభుత్వం
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి టెస్టుల కంటే ట్రీట్మెంట్‌పైనే ఎక్కువ దృష్టి సారించాలని నిర్ణయించింది. ఈ మేరకు సింప్టమ్స్ ఉన్నోళ్లందరికీ ఐసోలేషన్ కిట్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే జిహెచ్‌ఎంసి పరిధిలో ఈ విధానం కొనసాగుతుండగా, ఈరోజు నుంచి జిల్లాల్లోనూ షురూ చేయనున్నట్లు హెల్త్ ఆఫీసర్లు చెబుతున్నారు. దీంతో వైరస్ లోడ్‌ను అతి తక్కువ సమయంలో కంట్రోల్ చేసే ఆస్కారం ఉంటుందనేది వైద్యశాఖ అభిప్రాయం. ఫలితంగా కరోనా సోకిన బాధితులకు ఆక్సిజన్ అవసరమయ్యే పరిస్థితి రాదని, తద్వారా సదరు వ్యక్తులు సీరియస్ పరిస్థితుల్లోకి వెళ్లకుండా కాపాడుకోవచ్చని వైద్యులు వెల్లడిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 37వేల ఆశాలు, 8 వేల ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ వర్కరు,్ల ఇతర మెడికల్ సిబ్బంది కలసి 11,700 టీంలుగా ఏర్పడి కరోనాను జల్లెడ పట్టనున్నారు. పట్టణాలు, గ్రామాలలో ప్రతి ఇంటికి తిరిగి లక్షణాలు ఉన్నోళ్లందరిని గుర్తించి కిట్లు ఇవ్వనున్నారు. మరోవైపు ఎలాంటి పాజిటివ్ రిపోర్టు లేకుండానే ఈ కిట్లను పంపిణీ చేయడం గమనార్హం. పది రోజల ఐసోలేషన్ పీరియడ్‌లో 5 రోజులు సింప్టమాటిక్ మెడిసిన్స్, మరో ఐదు రోజులు పాటు స్టెరాయిడ్స్ ఇవ్వాలని వైద్యశాఖ భావిస్తుంది.అంతేగాక ప్రతి జిల్లాలో రోగులను పర్యవేక్షించేందుకు కాల్ సెంటర్లనూ ఏర్పాటు చేయనున్నారు. ఈ సెంటర్ల ద్వారా ఐసోలేషన్‌లో ఉండే రోగులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు సులువుగా ఉంటుందని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అంతేగాక అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్, క్లినిక్‌లలో కొవిడ్ ఓపిలను కూడా ప్రారంభిస్తున్నారు. లక్షణాలు ఉన్నోళ్లంతా నేరుగా ఇక్కడికి వెళ్లినా టెస్టులు చేసి మందులు ఇవ్వనున్నారు.
ఎందుకీ నిర్ణయం…
సెకండ్ వేవ్‌లో కరోనా వ్యాప్తి ఎక్కువైంది. లక్షణాలు ఉన్నోళ్లంతా టెస్టింగ్ కేంద్రాలకు వెళ్లడం అక్కడ అనుమానితులు కూడా రావడంతో వైరస్ ఒకరి నుంచి మరోకరికి అంటుకున్నట్లు ఇటీవల వైద్యశాఖ పరిశీలనలో తేలింది. అంతేగాక కొన్ని కేంద్రాల్లో టెస్టింగ్‌తో పాటు వ్యాక్సినేషన్ కూడా జరుగుతున్నాయి. దీంతో అత్యధిక మందిపై వైరస్ దాడి చేస్తుంది. మరోవైపు చాలా మంది శాంపిల్ ఇచ్చిన తర్వాత రిపోర్టు రాకముందే విచ్చలవిడిగా తిరుగుతున్నారు. అప్పడికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది. అంతేగాక కొందరికి అతి తక్కువ సమయంలో ఆక్సిజన్ లెవల్స్ పడిపోతున్నాయి. వీటన్నింటిని నియంత్రించేందుకే సింప్టమ్స్ ఉన్నోళ్లందరికీ మెడికేషన్ చేపిస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు.
ఐసిఎంఆర్ ఏం చెబుతుందంటే..?
ఫీవర్, దగ్గు, తలనొప్పి, గొంతునొప్పి, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, ఒళ్లునొప్పులు, వాసన, రుచి కోల్పోవడం, డయేరియా వంటి లక్షణాలు ఉన్నోళ్లంతా కొవిడ్ 19గానే పరిగణించాలని ఐసిఎంఆర్ తాజా మార్గదర్శకాలు చెబుతున్నాయి. వీరంతా వీలైతే టెస్టుకు వెళ్లాలి. లేదంటే నేరుగా డాక్టర్ల సూచనతో రిపోర్టు వచ్చే వరకు వేచిచూడకుండా మందులు వాడాలని సూచించింది.
కిట్‌లో ఉండే మందులు ఇవే….
డాక్సిసైక్లిన్ యంటీవైరల్ డ్రగ్, పారాసెట్‌మాల్, లివొసెట్రిజిన్, ర్యాంటాక్, విటమిన్ సి, మల్టీవిటమిన్, విటమిన్ డితో పాటు మెథల్‌ప్రెడ్నిసొలేన్ స్టెరాయిడ్స్ వంటివి ఐసోలేషన్ కిట్‌లో ఉంటాయి. అయితే లక్షణాలు తేలిన తర్వాత డాక్సిసైక్లిన్ యాంటీవైరల్ డ్రగ్‌ను 5 రోజుల పాటు ఉదయం, రాత్రి తప్పనిసరిగా వాడాలి. అదే విధంగా జ్వరం వస్తే పారాసెట్‌మాల్‌ను పది రోజుల పాటు ఉదయం, రాత్రి, జలుబు చేస్తే లివొసెట్రిజిన్‌ను పది రోజుల పాటు ఉదయం, అసిడిటికి ర్యాంటక్‌ను పది రోజుల్లో ఉదయం ఒక్కసారి మాత్రమే వేసుకోవాలి. అంతేగాక రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు విటమిన్ సి, మల్టీ విటమిన్లను పది రోజుల పాటు ఉదయం, రాత్రి తీసుకుంటూ, విటమిన్ డి ని మాత్రం పది రోజుల ఐసోలేషన్ పీరియడ్‌లో ఉదయం ఒక్కసారి మాత్రమే తీసుకోవాలి. అయితే వీటిలో డాక్సిసైక్లిన్‌ను, విటమిన్స్ క్యాపిల్స్‌ను ప్రభుత్వం సూచించిన ప్రకారం వాడుతూ జ్వరం, జలుబు వంటివి తగ్గే వరకు సదరు మందులు వాడాలి. మరోవైపు ఐదు రోజుల తర్వాత కూడా ఈ సింప్టమ్స్ తగ్గకపోతే మెథెల్‌ప్రెడ్నిసొలోన్ స్టెరాయిడ్స్‌ను డాక్టర్లు సలహాతో వాడాలని అధికారులు చెబుతున్నారు. వీటితో పాటు టెంపరేచర్‌ను, ఆక్సిజన్ లెవల్స్‌ను, శ్వాసరేట్‌ను ప్రతి రోజూ మూడు సార్లు చెక్‌చేసుకోవాలి. కానీ షుగర్ పేషెంట్లు స్టెరాయిడ్స్ వాడే ముందు వైద్యులను సంప్రదించాలని ఆరోగ్యశాఖ పేర్కొంటుంది.
ఉదయం 7 గంటల నుంచే….
కరోనా లక్షణాలు ఉన్నోళ్లను గుర్తించడంలో వైద్యసిబ్బంది వేగంగా పనిచేస్తున్నారు. ఇంటింటికి తిరిగి సర్వే చేసి అనుమానిత లక్షణాలు కలిగిన వారికి కిట్లు ఇవ్వడంతో పాటు అవసరమైన వారికి క్వారంటైన్ కేంద్రాలకు, ఆసుపత్రులకూ పంపిస్తున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతున్న సర్వే రాత్రి 10 గంటల వరకు కూడా కొనసాగుతుందని వైద్య ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే సర్వే చేసే సిబ్బంది ఆరోగ్య దృష్ట వారికి ప్రత్యేక మాస్కుల, పిపిపి కిట్లు కూడా అందించామని వైద్యారోగ్యశాఖ వర్గాలు స్పష్టం చేశాయి. అదే విధంగా 104 కంట్రోల్ రూంకి వచ్చిన కాల్స్ ఆధారంగా బాధితులను గుర్తించే పనిని కూడా వైద్యారోగ్యశాఖ ఏఎన్‌ఎమ్‌లకు, ఆశా, అంగన్‌వాడీ వర్కర్లుకు అప్పజెప్పింది.
నర్సులు పాత్ర కూడా కీలకం….
బాధితులను ఆసుపత్రులకు తరలించిన తర్వాత కూడా వైద్యసేవలు అందించడంలో నర్సుల పాత్ర కూడా కీలకంగా మారింది. ప్రాణాలకు పణంగా పెట్టి పనిచేస్తున్నారు. రోగిని కాపాడటంలో వైద్యుడి పాత్ర ఎంత ఉందో, నర్సులు పాత్ర కూడా అంతే కనిపిస్తుంది. డాక్టర్ పరీక్షించిన తర్వాత మందులు ఎలా వేసుకోవాలి? ఏ సమయానికి ఏ మందులు వాడాలి? రోగికి ఆహారం అందించడం వంటి పనులన్నీ దగ్గరుండి స్వయంగా నర్సులే చూస్తున్నరని వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులే చెబుతున్నారు. గాంధీ, ఉస్మానియా, చెస్ట్, ఫీవర్ ఆసుపత్రులలో కరోనా చికిత్సకు అందించేందుకు నర్సులు, డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది కలిపి మొత్తం సుమారు 400 మంది పనిచేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. వీరందరి ఆరోగ్య దృష్టా రోటేషన్ పద్దతిలో డ్యూటీలు చేయిస్తున్నామని ఉన్నతాధికారులు వివరించారు.
వేగంగా మందులు వాడటం వలన సత్ఫలితాలు ఉంటాయిః హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు
లక్షణాలను వేగంగా గుర్తించి, మందులు వాడటం వలన ఎంతో ఉపయోగం ఉంటుంది. టెస్టుల కోసం పరుగులు పెట్టకుండా ఫస్ట్ మెడిసిన్ వాడటం బెటర్. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు వైద్యశాఖ తాజాగా తీసుకున్న నిర్ణయంతో సుమారు 90 శాతం సత్ఫలితాలు ఉంటాయి. లక్షణాలు ఉన్నోళ్లంతా ఐసోలేషన్ కిట్ తీసుకొని ఆ ఛార్ట్‌లో సూచించిన ప్రకారం మందులు వేసుకుంటే సదరు బాధితులకు ఆక్సిజన్ అవసరమయ్యే అవసరం రాదు. తద్వారా సీరియస్ పరిస్థితులు రావు. ఐసిఎంఆర్ తాజా మార్గదర్శకాలు కూడా ఇవే స్పష్టం చేస్తున్నాయి. అయితే ప్రతి పేషెంట్‌కి ఆక్సిజన్, రెమిడెసివీర్‌లు అవసరం లేదు. అనవసరంగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. ప్రైవేట్ కు వెళ్లి లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం కంటే ప్రభుత్వాసుత్రులకు వచ్చి ఉచితంగా వైద్యం పొందండి. సిఎం ఆదేశాల మేరకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాం.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎంతో ఉపయోగంః డా కిరణ్ మాదాల క్రిటికల్ కేర్ ఎక్స్‌పర్ట్ నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రి
కరోనా నియంత్రణకు లక్షణాలున్నోళ్లందరికీ కిట్లు ఇవ్వడం వలన ఎంతో ఉపయోగం ఉంది. వాస్తవంగా మన రాష్ట్రంలో ఈ సెకండ్ వేవ్‌లో 50 శాతం మహరాష్ట్ర వేరియంట్ ఎక్కువగా ఉంది. ఇది ఒకరి నుంచి సుమారు నాలుగురికి వ్యాప్తి చెందుతోంది. అంతేగాక 10 నుంచి 15 శాతం యూకే, మరో 5 శాతం ఎన్ 440కె, 30 శాతం ఏటుఏ, సౌత్ ఆఫ్రికా వేరియంట్లు ఉన్నట్లు ఇటీవల రీసెర్చ్‌లో తేలింది. అయితే ఏ వేరియంట్లు ఉన్నప్పటికీ వేగంగా మందులు వాడితే కరోనాను సులువుగా జయించవచ్చు. మరోవైపు సి.టి వాల్యూ కూడా గతంలో సగటున 25 వస్తుండగా, ప్రస్తుతం 15 నుంచి 16కి పడిపోయింది. అంటే వైరస్ లోడ్ ఎక్కువున్నట్లు అర్థం. దీంతోనే అతి వేగంగా ఆక్సిజన్ లెవల్స్ పడిపోతున్నాయి. ఈక్రమంలోనే సకాలంలో వైద్యం అందని వారు మరణిస్తున్నారు.
మెడిసిన్స్ చార్ట్..
మందు              కారణం     ఉదయం  రాత్రి  రోజులు
డాక్సిసైక్లిన్       యాంటీవైరల్    1        1    5
పారాసెట్‌మాల్       జ్వరం       1        1   10
లివొసెట్రిజిన్        జలుబు       1        1   10
ర్యాంటక్            అసిడిటి       1      లేదు  10
విటమిన్‌సి        ఇమ్యూనిటీ    1         1   10
మల్టీవిటమిన్     ఇమ్యూనిటీ     1        1   10
విటమిన్‌డి       ఇమ్యూనిటీ     1         1   10
5 రోజుల తర్వాత జ్వరం తగ్గకపోతే….
మెథెల్‌ప్రెడ్నిసొలైన్ స్టెరాయిడ్     1        1    5

TS Govt Delivered home Isolation kits

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News