Saturday, April 27, 2024

స్పీడప్

- Advertisement -
- Advertisement -

కరోనా కట్టడికి స్పీడ్ పెంచిన సర్కార్…
టెస్టింగ్, ట్రీట్మెంట్, ట్రేసింగ్‌లు మరింత వేగవంతం
పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు నియామకం
జిల్లా స్థాయిలోనూ విస్తరిస్తున్న వైద్యసేవలు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కట్టడికి సర్కార్ స్పీడ్ పెంచింది. టెస్టింగ్, ట్రీట్మెంట్, ట్రేసింగ్ విధానాలను మరింత వేగవంతం చేస్తూ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కృషి చేస్తుంది. దీనిలో బాగంగా వైరస్ తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో నోడల్ ఆఫీసర్లను ఏర్పాటు చేసి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తుంది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ప్రస్తుతం తెలంగాణలో వైరస్ వ్యాప్తి కాస్త తక్కువునప్పటికీ, దాన్ని కూడా పూర్తిస్థాయిలో తగ్గించాలని సిఎం ఆదేశాలు మేరకు వైద్యశాఖ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుంది. ఈ మేరకు మంత్రి ఈటల రాజేందర్ వైద్యశాఖ అధికారులతో శనివారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, తగిన సూచనలు చేశారు. ముఖ్యంగా జిహెచ్‌ఎంసి పరిధిలో కేసులు వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అదుపులోకి తేవాలంటే, కేసులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో మరింత మెరుగైన విధివిధానాలతో ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. ఈమేరకు అవసరమైన సదుపాయాలు అన్నీ వెంటనే సమకూర్చుతామని ఆయన అధికారులకు హామీ ఇచ్చారు.
పెరిగిన టెస్టింగ్ కెపాసిటీ…
రాష్ట్రంలో కరోనా టెస్టింగ్ కెపాసిటీ పెరిగింది. 300 నుంచి ప్రస్తుతం సుమారు 15వేల వరకు పెరిగిందని అధికారులు పేర్కొంటున్నారు. వాస్తవంగా వైరస్ తీవ్రతను తెలుసుకునేందుకు పరీక్ష విధానం ముఖ్యమైనది. అయితే తెలంగాణలో మర్కజ్ లింక్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి రోజూ 300 నుంచి 600 టెస్టులు చేసిన వైద్యశాఖ, ఆ తర్వాత మైగ్రెంట్స్ ప్రవేశిస్తున్న నేపథ్యంలో వాటిని 1000నుంచి 1500లకు పెంచింది. అదే విధంగా లాక్‌డౌన్ పూర్తయిన తర్వాత వైరస్‌ను అంచనా వేసేందుకు ప్రతి రోజు 2000 నుంచి క్రమక్రమంగా 6వేల వరకు టెస్టింగ్ కెపాసిటీని పెంచింది. అయితే ఇతర రాష్ట్రాలు కంటే మన దగ్గర టెస్టులు సంఖ్య తక్కువ కనిపించినప్పటికీ, మొదట్నుంచి తెలంగాణలో కరోనా నిర్ధారణ కోసం కేవలం ఆర్‌టిపిసిఆర్ టెస్టులను మాత్రమే చేస్తున్నారు. ఐసిఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) నిబంధనల మేరకు లక్షణాలు ఉన్న వారికి, ప్రైమరీ కాంటాక్టులు, హైరిస్క్ గ్రూప్‌ల నమూనాలను నిర్ధారిస్తున్నారు. మిగతా టెస్టుల కంటే ఆర్‌టిపిసిఆర్‌లోనే అధిక పారదర్శకత ఉంటుందని గతంలో డబ్లూహెచ్‌ఒతో పాటు ఐసిఎంఆర్ కూడా పేర్కొంది. దీన్నే తెలంగాణ వైద్యశాఖ పాటించింది. అయితే ఇతర రాష్ట్రాల్లో ఆర్‌టిపిసిఆర్‌తో పాటు యాంటీజెన్, యాంటీబాడీ టెస్టులను కూడా చేస్తున్నారు. దాంతోనే ఆయా రాష్ట్రాల్లో టెస్టుల సంఖ్య అధికంగా కనిపిస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే రోజురోజుకి సోషల్‌మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా అవాస్తవాలతో కొంత మంది ప్రజల్లో భయాందోళనలు సృష్టించడంతో, తెలంగాణలోనూ యాంటీజెన్ టెస్టులను ప్రారంభించినట్లు ఓ అధికారి అన్నారు.

ప్రస్తుతం ఆర్‌టిపిసిఆర్ విధానంలో నివేదిక రావడానికి కనీసం మూడు నుంచి నాలుగు రోజుల సమయం పడుతుంది.అదే యంటీజెన్ టెస్టు అయితే కేవలం 30 నిమిషాల్లోనే నివేదికలు వస్తున్నాయి. దీంతో ఎక్కువ మంది జనం వీటి కొరకు క్యూ కడుతున్నారు. అయితే వీటి పనితీరు కూడా మెరుగ్గానే ఉందని గుర్తించిన వైద్యశాఖ వీటి సంఖ్యను మరింత పెంచాలని భావిస్తుంది.ప్రతి రోజు సుమారు 10 వేల యాంటీజెన్, 5 వేలు ఆర్‌టిపిసిఆర్ టెస్టులు చేయాలని అధికారులు నిశ్చయించుకున్నారు. ప్రతి పిహెచ్‌సి స్థాయి నుంచి టీచింగ్ ఆసుపత్రి వరకు అందరికీ టెస్టులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా జిల్లాల్లోనూ ఈ యంటీజెన్ టెస్టులు ప్రారంభించేందుకు వైద్యశాఖ సర్వం సిద్ధం చేస్తుంది. లక్షణాలు ఉన్న వారందరికీ పరీక్షలు చేసి వైరస్ వ్యాప్తిని అంచనా వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఐసిఎంఆర్ నుంచి అనుమతి పొందిన ప్రైవేట్ ల్యాబ్స్‌లో సైతం యంటీజెన్ టెస్టులు నిర్వహించుకోవచ్చని వైద్యశాఖ అంటుంది. కానీ వాటి ధర రూ.450 నుంచి 500 మాత్రమే తీసుకోవాలని సూచిస్తుంది.
ట్రీట్మెంట్లోనూ వేగం……
రాష్ట్రంలో కరోనా వైద్యంలోనూ వేగం పెరిగింది. ఇప్పటికే హైదరాబాద్‌లో గాంధీ, చెస్ట్, కింగ్ కోఠి ఆసుపత్రుల్లో కరోనా వైద్యం అందుతుండగా, మరిన్ని రోజుల్లో టిమ్స్‌లోనూ వైద్యం అందనుంది.దీంతో పాటు జిల్లా ఏరియా ఆసుపత్రుల్లోనూ వైద్య సేవలు అందించేందుకు అవసరమైన సౌకర్యాలను సమకూర్చుతున్నారు. దీంతో హైదరాబాద్ ఆసుపత్రుల మీద భారం తగ్గుతుందని అధికారులుల అంచనా. మరోవైపు ఇప్పటికే ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో కరోనా వైద్యం అందుతుండగా, రాష్ట్ర వ్యాప్తంగా 22 మెడికల్ కాలేజీలను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకొని మెరుగైన వైద్యం అందించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. అయితే అసింప్టమాటిక్, మైల్డ్ సింప్టమ్స్‌తో వైరస్ సోకిన వారికి ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లోనే చికిత్స ఇస్తున్నారు. ఈక్రమంలో అందుబాటులో ఉన్న హాస్పిటల్స్‌లో రోగులు నిండితే మరిన్ని ఆసుపత్రుల్లో కూడా కరోనా వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని అధికారులు అంటున్నారు.
పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు….
రాష్ట్ర వ్యాప్తంగా కరోనాను కంట్రోల్ తెచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. మొదట కేసులు అధికంగా ఉన్న జిహెచ్‌ఎంసి పరిధిలో 8 సర్కిళ్లల్లో స్పెషల్ ఆఫీసర్లను నియమించింది. దీనిలో ఐఎఎస్, ఐపిఎస్ అధికారులూ ఉన్నారు. వీరు కరోనా కట్టడి కోసం కేసుల అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకునేలా క్రిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేయాలి. దీంతో పాటు క్వారంటైన్, ఐసోలేషన్ లోఉన్న వారిని పర్యవేక్షిస్తూ తీవ్రతను తగ్గించేందుకు కృషి చేయాలి. మరోవైపు అన్ని ప్రాంతాల్లో టెస్టులు జరిగేలా ప్రత్యేక చొరవ తీసుకొని వైరస్ వ్యాప్తి కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తామని ఓ అధికారి అన్నారు. ఇదిలా ఉండగా, కరోనా కట్టడి కోసం మరిన్ని రోజులు సహకరించాలని వైద్యశాఖ ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది.

TS Govt speeds up corona tests

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News