Thursday, May 16, 2024

ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

 

మొదటి ఏడాది మార్కులే రెండవ ఏడాదికి కేటాయింపు
ఫలితాలతో సంతృప్తి చెందని వారికి తర్వాత ప్రత్యేకంగా పరీక్షలు

మనతెలంగాణ/హైదరాబాద్ : ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి సోమవారం ఫలితాలను విడుదల చేశారు. పరీక్ష ఫీజు చెల్లించిన 4,51,585 మంది జనరల్, ఒకేషనల్ విద్యార్థులు, 22,265 మంది ప్రైవేట్ విద్యార్థులను ఉత్తీర్ణులుగా ప్రకటించారు. ఇందులో 2,28,754 మంది బాలికలు, 2,22,831 మంది బాలురు ఉన్నారు. 1,04,886 మంది గ్రేడ్ ఎ, 61,887 మంది గ్రేడ్ బి సాధించగా, 1,08,093 మందికి సీ గ్రేడ్ వచ్చింది. ఫలితాలను http://tsbie.cgg.gov.in, http://examresults.ts.nic.in, http://results.cgg.gov.in వెబ్‌సైట్లలో పొందుపరిచారు. మార్కుల మెమోలో ఏమైనా తప్పులు ఉంటే ఫిర్యాదు చేసేందుకు ఇంటర్ బోర్డు అవకాశం కల్పించింది.

ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు టోల్ ఫ్రీ నెంబర్ 040 24600110కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. కరోనా తీవ్రత కారణంగా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ఇంటర్మీడియేట్ పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఏ విధంగా ఇవ్వాలనే విషయంలో ప్రభుత్వం విధివిధానాలు రూపొందించిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. వాటి ఆధారంగా ద్వితీయ సంవత్సరం ఫలితాలను ప్రకటిస్తున్నామని అన్నారు. మొదటి సంవత్సరంలో సంబంధిత సబ్జెక్టుల్లో ఎన్ని మార్కులు వచ్చాయో, ద్వితీయ సంవత్సరంలోనూ ఆయా సబ్జెక్టుల్లో అన్నే మార్కులు ఇచ్చినట్లు చెప్పారు. ప్రాక్టికల్స్ విషయం మాత్రం విద్యార్థులందరికీ గరిష్ట మార్కులు కేటాయించామని పేర్కొన్నారు.

గతంలో ఫెయిలైన సబ్జెక్టులకు మాత్రం పాస్ మార్కులు ఇచ్చామని తెలిపారు. విద్యార్థులు తమ ప్రథమ సంవత్సరం హాల్‌టికెట్ నెంబర్‌ను వెబ్‌సైట్‌లో పొందుపరచడం ద్వారా ద్వితీయ సంవత్సరం ఫలితాలను పొందవచ్చని, గతంలో ఫెయిలైన విద్యార్థులు తమ పూర్వపు హాల్‌టికెట్ నెంబర్‌ను పొందురచడం ద్వారా మార్కులను పొందవచ్చని అన్నారు. ఒకవేళ విద్యార్థులు ఈ ఫలితాలతో సంతృప్తి చెందకపోతే కరోనా పరిస్థితులు సద్దుమనిగిన తర్వాత ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఉత్తీర్ణత సాధించిన ద్వితీయ సంవత్సరం విద్యార్థులు తమ ఆసక్తికి అనుగుణంగా కెరీర్‌ను ఎంపిక చేసుకోవాలని, భవిష్యత్తును బంగారంగా మలుచుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆకాంక్షించారు.

100 శాతం ఉత్తీర్ణత
కరోనా కారణంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో ఈ సారి 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్ జనరల్, ఒకేషనల్ కోర్సులలో 2,07,024 మంది బాలికలు, 2,00,024 మంది బాలురు ఉత్తీర్ణత సాధించగా, ఒకేషనల్ కోర్సులలో 8,374 మంది బాలికలు, 12,863 మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు.

అత్యధిక విద్యార్థులకు ఎ గ్రేడ్
ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలలో జనరల్‌లో 1,57,971 మంది విద్యార్థులు ఎ గ్రేడ్ సాధించగా, 82,630 మంది బి గ్రేడ్, 59 వేల మంది సి గ్రేడ్, 1,08,083 మంది డి గ్రేడ్ సాధించారు. ఒకేషనల్‌లో నలుగురు విద్యార్థులు ఎ గ్రేడ్, ఐదుగురికి బి గ్రేడ్, 12 మంది సి గ్రేడ్, 264 మందికి డి గ్రేడ్ సాధించారు.

ఒత్తిడి నివారణకు సైకాలజిస్టుల సేవలు
ఇంటర్ ఫలితాల నేపథ్యంలో విద్యార్థుల మానసిక ఒత్తిడి నివారణకు ఇంటర్ బోర్డు ఏడుగురు క్లినికల్ సైకాలజిస్టులను నియమించింది. మానసిక ఒత్తిడికి లోనయ్యే విద్యార్థులు ఫోన్‌లో సైకాలజిస్టులను సంప్రదించి తగిన సలహాలు, సూచనలు పొందవచ్చు.

సైకాలజిస్టు పేరు                  ఫోన్ నెంబర్
1.డాక్టర్ అనిత అరె                  9154951704
2.డాక్టర్ మజల్ అలీ                 9154951977
3. డాక్టర్ రజిని                      9154951695
4.పి. జవహార్‌లాల్ నెహ్రూ          9154951699
5.ఎస్.శ్రీలత                         9154951703
6.శైలజ పిసపాటి                    9154951706
7.అనుపమ గుట్టిమ్‌దేవి             9154951687

Telangana Inter 2nd year Results
Telangana Inter 2nd year Results

TS Inter 2nd year results 2021

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News