Monday, April 29, 2024

చింతల తొవ్వలో మానవీయ బంధాలు

- Advertisement -
- Advertisement -

తుల శ్రీనివాస్… ఇటీవల కాలంలో తెలుగు సాహిత్యంలో విరివిగా వినబడుతున్న పేరు. శ్రీనివాస్ గారికి సుమారు 40 – 45 సంవత్సరాల వయసు ఉండవచ్చు. కవిగా అతని వయస్సు సరిగ్గా మూడేళ్లు… మూడేళ్ల ఈ కవి బాలుడి కవిత్వం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో స్వేచ్ఛ విహారం చేస్తోంది. తుల శ్రీనివాస్ పరోక్షంలో ఈయన కవిత్వం పై చర్చలు జరుగుతున్నాయి. తాను ఎవరో తెలియకుండానే తన కవిత్వం గురించి మాట్లాడుతున్నారు. కొన్ని కవితలు అయితే పేరు లేకుండానే వైరల్ అవుతున్నాయి. మూడేళ్ల ఈ కవి బాలుడిని ఇప్పటికీ ఆరు అవార్డులువరించాయి. ఇందులోనూ విజయవాడకు చెందిన ఒక సంస్థ తుల శ్రీనివాస్ కు తెలియకుండానే ఆ పుస్తకాన్ని పరిశీలించి మీకు అవార్డు ఇవ్వడానికి అనుమతి ఇవ్వండి అని అడిగారంటే అదంతా శ్రీనివాస్ గారి గొప్పతనం కాదు వారి కవిత్వ గొప్పదనం.
అసలు ఎవరీ శ్రీనివాస్? ఏమిటి ఈయన నేపథ్యం అని పరిశీలిస్తే కరోనాకాలంలో తెలుగు సాహిత్యంలో పెను తుఫానులా దూసుకొచ్చిన కవి తుల శ్రీనివాస్.

నల్లగొండ జిల్లాలో నకరికల్లు కు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడ్లూరు గ్రామవాసి. నిజంగా సహజకవి. ఇలా ఎందుకు అంటున్నాను అంటే శ్రీనివాస్ గతంలో సాహిత్యం చదువుకున్న వారు కాదు. ఇతరుల కవిత్వం పుస్తకాలు తిరగేసిన వారు కాదు. అసలు తాను రాస్తున్నది కవిత్వమో కాదో కూడా ఇతరులు చెప్పేవరకు పసిగట్టినవాడు కాదు.తెలుగు సాహిత్యంలో మునుపేన్నడు ఉపయోగించని ప్రతీకలను ఉపయోగించగల సామర్థ్యం ఉన్నవాడు. ఆయన తన చింతల తొవ్వ వెంట మనలను మన బాల్యంలోకి నడిపించగలడు. ప్రాకృతిక వర్ణనలతో గిలిగింతలు పెట్టగలడు. మానవీయ స్పర్శతో కంట నీరు తెప్పించగలడు. శ్రీనివాస్ గారి కవిత్వపు లోతుల్లోకి నేను వెళ్ళను కానీ వీరి కవిత్వంలోని మానవీయ కోణాన్ని పరామర్శించే ప్రయత్నం చేస్తాను.
పసుల కాడి సుక్క మొలవడానికి ముందే/ సందు చివర తోర్నపాకయ్యేది నా సూపు/ గుళ్లె ముత్యాలమ్మ కదిలొచ్చినట్లు/ సద్దిగంపెత్తుకొని అమ్మ సందు మల్లంగనే/ అన్నకు నాకు ఉరుకుడు పోటీ మొదలయ్యేది/ అమ్మను ముట్టుకోంగనే పానం ఎగిరిగంతేసే లేగ దూడయ్యేది అంటూ అమ్మను అనురాగపు జల్లులో ముంచెత్తుతాడు. అమ్మ బిడ్డ కోసం పడే తపన కళ్ళ ముందు ఉంచుతాడు. చివరగా అమ్మంటే గుండె దాలిలో నిత్యం పొంగే పచ్చిపాల పొంగు అని వినూత్నమైన నిర్వచనంతో కవితను ముగిస్తాడు. పూలు లేని చెట్టు అనే మరో కవితలో తన తండ్రి మరణించినప్పుడు తల్లిని విధవరాలుగా చేస్తున్న సందర్భాన్ని గుండెలు పిండేసేలా అభివర్ణించారు

అమ్మ చేతి మట్టి గాజులకు నాన్న అంటే ఎంత ఇష్టమో/ నాన్నతో పాటు మట్టి గంధం పూసుకున్నాయి/ పెళ్లి తంతు ముగిశాక/ వాడిపోయిన పూలతో/ కలతప్పిన పెళ్లి పందిరిలా/ ఇప్పుడు పూలు లేని చెట్టయి నా అమ్మ…/ ఈ కవి నాన్న కోసం పడిన తపన వింటే పాషాణ హృదయులయినా కన్నీటిలో మునిగిపోతారు. తన తండ్రి దూరమైనప్పుడు/ కన్నీటి నదిలో ఒంటరిగా వదిలి/ కాలం రెక్కలు కట్టుకొని కనుమరుగయ్యావు/ దేహం ఇచ్చావు జ్ఞానం ఇచ్చావు చివరికి తీరని దుఃఖమిచ్చావు/ న్యాయమా నాన్నా నీకిది/ నీ చిటికెన వేలు ఊతం లేక ఈ దుఃఖపునదులు ఎలా దాటను ? అంటూ ప్రశ్నిస్తూ ఊపిరి దీపం కవితలో పాఠకులను దుఃఖితులను చేస్తారు. ఇక తండ్రి చివరి చూపులో ఆయన పాదాలను స్పర్శిస్తున్నప్పుడు కవిలో కలిగిన వేదన ఈ కవిత్వ పాదాల్లో చూడండి/ నా కనుపాపలపై శాశ్వతంగా చెక్కుకున్న చక్రాంకితాలు/ చితి మీద చివరిసారి స్పృశించిన బ్రహ్మ కడగని విష్ణు పాదాలుమా నాన్న పాదాలు.. అంతిమయాత్ర అనే మరో కవితలోనూ కవి నాన్నపై గల ప్రేమను ఆర్ద్రంగా ఆవిష్కరించారు.ఇక ఈ కవికి అన్నపై కూడా ఎనలేని ప్రేమ./ అమ్మవని చెప్పడానికి కడుపున మోయవైతివి/ నాయినవని చెప్పడానికి భుజానతిప్పవైతివి/ ఇద్దరి బాధ్యతలు నెత్తికెత్తుకొని/ అంత ఎత్తున నిలిపిన నీవు అవడానికి మాత్రమే అన్నవు/ ఎంగిలి పాలు జీకి నీ వెనక నడిచినోన్ని/

ఎత్తు పల్లాలన్నీ నీ యేలు పట్టుకునే దాటినోడ్ని/ అంటూ అన్న పై తన ప్రేమానురాగాలు కురిపిస్తూ ఇంటి కోసం అన్న చేసిన కష్టాన్ని అద్భుతంగా వర్ణిస్తారు/ సంసార బండికి దాపటి ఎద్దు వై/ నాన్నతో పాటు ఎగబోస్తూ/ బువ్వ కుండ నిత్య ఆకలికి/ నీ పాలి సోలెడు బియ్యం అయ్యావు అంటూ అన్న శ్రమను గుర్తుకు తెచ్చుకున్నారు. నీ పాదాల కింద చెప్పునైతేనే కదా ఈ జన్మకి ఉన్న రుణంలో కొంత కొంత తీరేది… అని అన్న రుణాన్ని తీర్చుకోవాలనుకోవడం ఈ కవితను ముగింపులో పతాక స్థాయికి చేర్చింది.కవికి కుటుంబ బంధాల పట్ల ఉన్న అనురాగమంతా చింతల తోవ్వలో ప్రతిఫలిస్తోంది. నాయనమ్మ ఒకసారి వచ్చి పోవే… అంటూ తన నాయనమ్మని కలవరించే ఈ కవి/ లక్ష రూపాయల బ్యాంకు బ్యాలెన్స్/ నీచెక్కుడు సంచిల చారాన ఇచ్చిన సంబూరమియ్యనేలేదు/ కుడి చేతుల కర్ర అయినా జారవిడి సేదేమో గాని/ ఎడమ సంకనున్న నన్ను అదిమదిమి పట్టుకునేదట/ ఎందుకే నన్ను ఇంత రుడం ల పడేసి పోయినవు… అంటూ/ మా నాయిననెట్ల సాదినవో నాకు తెలవదు గాని/ రొమ్ము పాలియ్యకున్నా నన్ను అమ్మలెక్క సాదినవు అంటూ నాయనమ్మతో ఉన్న ప్రేమానురాగాలను నెమరు వేసుకుంటారు.
తాను, తన కుటుంబమే లోకంగా బతుకుతున్న నేటి ఆధునిక సమాజంలో తన చిన్నాన్నను సైతం ఈ కవి కవిత్వ సింహాసనం పై అధిరోహింప చేస్తారు./ కొన్ని బంధాలు దేవుడేసిన పీఠముళ్లు/

తనువులెక్కడున్నా/ హృదయ తంత్రులని తట్టి తడిమే నిస్తంత్రీ తరంగాలు/ అందుకేనేమో/ అన్న కొడుకైన కన్న కొడుకు లెక్కనే చూసుకున్న నిన్ను/ చిన్నాన్న అని పిలిచి చిన్న ఎడబాటుకు కూడా తావీయలేదు/ నోరారా నాన్న అనే పిలుచుకున్నా అంటూ తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు./ మంచి కొడుకు మంచి తమ్ముడు మంచి మనుమడు కాగలిగినవాడు మంచి భర్త కూడా అవుతాడు కదా… ఇందుకు శ్రీనివాస్ గారి సతీమణి ఉమాదేవి అదృష్టవంతురాలు.
అహానికి వ్యుత్పత్యర్థం నేను/ అణకువకు నానార్ధానివై నువ్వు/ ప్రతిసారి నీకు నేను చతుర్థి విభక్తిని/ నువ్వు మాత్రం నాకు సంబోధన పూర్వపదానివి/ నన్ను ఎలాగైనా భరించాలనే భర్త అనే వికృతిని నేను/ ఓర్పును ఒడిసి పట్టుకొని భార్యలా పరుచుకున్న ప్రకృతి నువ్వు… అంటూ తన శ్రీమతి పై ప్రేమాభిమానాలను తన కవిత్వంలో వ్యక్తీకరించారు.
ఈ కవికి స్నేహమన్నా స్నేహితులన్నా వల్లమాలిన ప్రేమ/ మూసి ఇసుకదిన్నెల్లో దుఃఖపు పొరలని ఆరేసుకొని/ ఒకరికొకరం ఓదార్చుకున్న క్షణాలు/ అంతరాల్ని మరిచి అంతరంగాల్ని ఆవిష్కరించుకున్న తరుణాలు/ నీ అడుగుల్ని అందుకోలేక లేగ దూడనై అనుసరించిన నిమిషాలు/ హిమాలయాల్లా కరిగిపారిన స్వచ్ఛమైన మన నవ్వుల ప్రవాహాలు/ అంటూ తమ చిన్ననాటి స్మృతులను పంచుకుంటూ మళ్లీ జన్మంటూ ఉంటే వృత్తి పాఠశాల మాత్రమే కాదు ఒకే గర్భం పంచుకోవాలని ఉంది అంటారు. తన మిత్రుడు సురేష్ తమ పాఠశాల నుంచి వీడ్కోలు పొందుతున్న సందర్భంగా రాసిన కవిత ఇది.

మంచి కొడుకు మంచి తమ్ముడు మంచి మనవడు మంచి భర్త కాగలిగినవాడు మంచి తండ్రి కాకుండా ఎలా ఉంటాడు… తన బిడ్డను హాస్టల్లో వదిలి వచ్చే సందర్భంలో తండ్రిగా ఈ కవి ఆవేదన వినండి…/ ఇంద్ర భవనం లాంటి వసతిగృహమని/ అందరు అంటుంటే విన్నాను అయినా/ నీ పసి రెక్కలు విరిచి పంజరంలో బంధించాననే భావన నన్ను బతకనీయడం లేదు/ తట్టుకోలేకపోతున్నా బిడ్డా/ ప్రాణం తల్లడిల్లి పోతోంది/ నువ్వు లేని ఈ గూటిలో/ గుడ్డి కొంగనై మిగిలాను… ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఇట్లాంటి సన్నివేశాలను అనుభవిస్తూనే ఉంటాడు … కవి మాత్రమే ఇలా అద్భుతంగా వ్యక్తీకరించగలుగుతాడు. కలతపడ్డ కన్న పేగు అనే కవితలోనూ తన బిడ్డ వసతిగృహానికి వెళ్ళినప్పుడు తండ్రి పడే ఆవేదన హృద్యంగా ఆవిష్కరించాడు.
ఇక తప్పకుండా ప్రస్తావించవలసిన మరొక కవిత పావన గంగ. తెలుగు సాహిత్యంలో వేశ్య కవిత్వ వస్తువుగా అనేక కవితలు వచ్చాయి. ఇదే వస్తువుగా తుల శ్రీనివాస్ అభివ్యక్తి నిత్య నూతనంగా కనిపిస్తోంది./ నాభి పై నాలుక ముట్టడి/ అత్తరు పూసిన దేహంపై అలుపెరుగని యుద్ధమే అయినా/ వీలైనంత తొందరగా అమ్ముడై/ ఇంకో పూటకు అదనపు మెతుకవుదామని/ సొక్కి సొక్కి పొక్కిలైన తనువును/ పచ్చి పుండ్ల పానుపు చేసి/ మరో నోటికి రెండో విందవుతోంది…/

చీకటిని ఆయుధంగా/ దారిద్రంపై తీవ్రమైన దాడి చేసే తాను/ మలినాలన్నీ కలుపుకొని ముందుకు సాగే పావన గంగే…/ ఎంత హృదయ విదారకం… తను శవమై ఒకరికి వశమై తనువు పుండై ఒకడికి పండై ఎప్పుడూ ఎడారై ఎందరికో ఒయాసిస్త్స్ర.. అనే అలిశెట్టి ప్రభాకర్ కవిత జ్ఞాపకం వస్తుంది కదా… ఇది తుల శ్రీనివాస్ గారి కవిత్వం. ఇంతటి మంచి కవిత్వానికి భరత్ భాషా భూషణ్ తిరునగరి గారి పేరిట గొప్ప పురస్కారం రావడం బంగారానికి తావి అబ్బిన చందంగా ఉంది. పురస్కార గ్రహీతకు, పురస్కార ప్రదాతకు ఇరువురికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.

(తుల శ్రీనివాస్‌కు తిరునగరి స్మారక వచన కవిత్వ పురస్కారం అందజేసిన సందర్భంగా చేసిన ప్రసంగపాఠం )

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News