Monday, April 29, 2024

‘జోరు తగ్గని’ భారత్

- Advertisement -
- Advertisement -

Two more gold medals for India in Paralympics

టోక్యో క్రీడల్లో మరో నాలుగు పతకాలు
మనీశ్, భగత్‌లకు స్వర్ణాలు, అదానాకు రజతం, మనోజ్‌కు కాంస్యం

టోక్యో: టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు పతకాల పంట పండిస్తున్నారు. శనివారం భారత్‌కు మరో రెండు స్వర్ణ పతకాలు లభించాయి. అంతేగాక ఒక రజతం, మరో కాంస్య పతకాన్ని కూడా భారత్ సొంతం చేసుకుంది. దీంతో టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య 17కు చేరుకుంది. ఒక ఒలింపిక్స్‌లో భారత్ ఇన్ని పతకాలు గెలుచుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. పురుషుల షూటింగ్‌లో మనీశ్ నర్వాల్ పసిడి పతకాన్ని ముద్దాడాడు. ఇక షూటింగ్‌లో భారత్‌కే చెందిన సింగ్‌రాజ్ అదానా రజతం దక్కించుకున్నాడు. మరోవైపు బ్యాడ్మింటన్‌లో ఒక స్వర్ణం, మరో కాంస్యం సాధించింది. పురుషుల బ్యాడ్మింన్ ఎస్‌ఎల్3 విభాగంలో ప్రమోద్ భగత్ పసిడి పతకం సాధించాడు. ఇదే విభాగంలో భారత షట్లర్ మనోజ్ సర్కార్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.

చరిత్ర సృష్టించిన ప్రమోద్

పురుషుల బ్యాడ్మింటన్‌లో భారత షట్లర్ ప్రమోద్ భగత్ స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించాడు. పారాలింపిక్స్ బ్యాడ్మింటన్ చరిత్రలోనే స్వర్ణం సాధించిన తొలి భారత షట్లర్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. శనివారం జరిగిన ఫైనల్లో భగత్ బ్రిటన్‌కు చెండిన డేనియల్ బెథెల్‌పై సంచలన విజయం సాధించాడు. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో భగత్ 2114, 2117తో జయకేతనం ఎగుర వేశాడు.ఆరంభం నుంచే భగత్ దూకుడును ప్రదర్శించాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ లక్షం దిశగా అడుగులు వేశాడు. మరోవైపు బ్రిటన్ షట్లర్ కూడా గెలుపు కోసం తీవ్రంగానే పారాడాడు. అయితే భగత్ ఆఖరు వరకు నిలకడను ప్రదర్శించి అలవోకగా తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక రెండో గేమ్‌లో డేనియల్ మరింత మెరుగైన ప్రదర్శన చేశాడు. అయితే భగత్ దూకుడు ముందు ఎదురు నిలువలేక పోయాడు. చివరి వరకు నిలకడైన ఆటను కనబరిచిన ప్రమోద్ భగత్ వరుసగా రెండు సెట్లు గెలిచి మ్యాచ్‌తో పాటు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక పారాలింపిక్స్ బ్యాడ్మింటన్ చరిత్రలో ఓ భారత షట్లర్ పసిడి పతకాన్ని గెలుచుకోవడం ఇదే తొలిసారి. దీంతో ప్రమోద్ భగత్ తన కెరీర్‌లోనే అత్యంత అరుదైన రికార్డును దక్కించుకున్నాడు.

మనోజ్‌కు కాంస్యం

ఇక భారత్‌కే చెందిన మనోజ్ సర్కార్ బ్యాడ్మింట్ ఎస్‌ఎల్3 విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. కాంస్యం కోసం జరిగిన పోరులో మనోజ్ జపాన్‌కు చెందిన పుజిహారాను ఓడించాడు. ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో మనోజ్ 2220, 2113 తేడాతో విజయం అందుకున్నాడు. తొలి గేమ్‌లో మనోజ్‌కు ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. అయితే ఆఖరు వరకు నిలకడగా ఆడిన మనోజ్ సెట్‌ను సాధించాడు. ఇక రెండో గేమ్‌లో మనోజ్ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

మనీశ్‌కు స్వర్ణం

పారాలింపిక్స్ షూటింగ్‌లో భారత్ మరో రెండు పతకాలు గెలుచుకుంది. శనివారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 విభాగం పోటీల్లో భారత్‌కు చెందిన 19 ఏళ్ల మనీశ్ నర్వాల్ పసిడి పతకాన్ని ముద్దాడాడు. భారత్‌కే చెందిన మరో షూటర్ సింగ్‌రాజ్ అదానా రజతాన్ని సాధించాడు. ఆరంభం నుంచే మనీశ్ నిలకడైన ప్రదర్శన చేశాడు. అదానా నుంచి గట్టి పోటీ ఎదురైనా మనీష్ మాత్రం ఒత్తిడికి గురి కాలేదు. పూర్తి ఏకాగ్రతతో ఆడుతూ లక్ష్యాన్ని సాధించాడు. ఫైనల్లో 218.2 స్కోరుతో మనీష్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ ఒలింపిక్స్ షూటింగ్‌లో భారత్‌కు ఇది రెండో స్వర్ణ పతకం కావడం విశేషం. ఇంతకుముందు మహిళల షూటింగ్‌లో అవని లేఖరా పసిడి పతకాన్ని గెలిచి చరిత్ర సృష్టించింది. తాజాగా మనీష్ కూడా స్వర్ణంతో మెరిశాడు.

అదానా డబుల్ ధమాకా

మరోవైపు సింగ్‌రాజ్ అదానా రజతం సాధించి టోక్యో ఒలింపిక్స్‌లో డబుల్ ధమాకా సాధించాడు. ఇంతకుముందు కాంస్య పతకాన్ని సాధించిన అదానా తాజాగా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో రజతం గెలుచుకున్నాడు. సహచర షూటర్ మనీశ్ నర్వాల్‌కు చివరి వరకు గట్టి పోటీ ఇస్తూ తృటిలో స్వర్ణం గెలిచే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. క్వాలిఫయింగ్ పోటీల్లో అంతంత మాత్రంగానే రాణించిన అదానా ఫైనల్లో మాత్రం అద్భుత ప్రతిభను కనబరిచాడు. ఒక దశలో స్వర్ణం సాధించేలా కనిపించాడు. చివరికి 216.7 స్కోరుతో అదానా రజతం దక్కించుకున్నాడు. ఇక రష్యాకు చెందిన సెర్గి మలెషెవ్ ఈ విభాగంలో కాంస్యం సాధించాడు.

ప్రశంసల వర్షం..

పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లపై ప్రశంసల వర్షం కురుస్తోంది. శనివారం స్వర్ణాలు సాధించిన షూటర్ మనీశ్ నర్వాల్, షట్లర్ ప్రమోద్ భగత్‌లను భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ తదితరులు ప్రశంసించారు. అంతేగాక రజతం, కాంస్య పతకాలు గెలిచిన అదానా, మనోజ్‌లను కూడా వారు అభినందించారు. టోక్యో క్రీడల్లో భారత క్రీడాకారులు అంచనాలకు మించి రాణించి దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటారని కొనియాడారు. పారా అథ్లెట్ల విజయం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News