Saturday, April 27, 2024

ఉరుముతున్న నిరుద్యోగం

- Advertisement -
- Advertisement -

ప్రపంచంలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నా ఉరుముతున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సఫలం కాలేకపోతున్నాయి. 2047 నాటికి దేశానికి స్వాతంత్య్రం సాధించి వందేళ్లు పూర్తవుతాయి. స్వతంత్ర భారతం అనేక రంగాలలో గణనీయమైన అభివృద్ధి సాధించినా భారత్‌లో తయారీ వంటి ఆకర్షణీయ నినాదాలిస్తున్నా తదనుగుణంగా ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలలో ముఖ్యంగా తయారీ రంగంలో మేటిగా నిలవలేక ఇంకా అనేక వస్తువులను చైనా తదితర దేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఫలితంగా కోట్లాది మందికి ఉద్యోగ, ఉపాధి కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ప్రస్తుతం 5 వ స్థానంలో వున్న ఆర్ధిక వ్యవస్థను వచ్చే 24 ఏళ్లలో అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలో 3 వ స్థానానికి చేర్చడమే లక్ష్యంగా సంకల్పం చెప్పుకొని ఆ దిశగా కొన్ని చర్యలు చేపట్టారు. అయితే ఇవి లక్ష్య సాధనకు ఏ మేరకు ఉపకరిస్తాయనేదే ప్రశ్న. నిరుద్యోగ సమస్య తీవ్రత దృష్ట్యా పాలస్తీనా వివాదంలో ఇస్లామిక్ దేశాలతో పోరాడుతున్న

ఇజ్రాయెల్ దేశంలో వివిధ రంగాలలో ముఖ్యంగా నిర్మాణ రంగంలోకి పని చేయడానికి భారత యువత ఎగబడటం చూస్తే నిరుద్యోగ పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. ఇజ్రాయెల్ నిర్మాణ రంగంలో పని చేయడానికి 10 వేల మందికి పైగా ప్లంబర్లు, ఎలక్ట్రిషియన్లు, కార్పెంటర్లు, పెయింటర్ల వంటి వివిధ వృత్తులవారు అవసరం కాగా, ఆ పనుల్లో చేరడానికి తొలుత 25 కోట్ల జనాభా గల అతి పెద్ద రాష్ట్రం యుపి, హర్యానా యువకులు ఎగబడ్డారు. కాగా ఇజ్రాయెల్‌తో స్నేహ సుహృద్భావ సంబంధాలు నెరపుతున్న ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం చొరవ తీసుకుని బిజెపి ఏలుబడిలోని యుపి, హర్యానాలో కార్మికుల రిక్రూట్‌మెంట్‌లో ఇజ్రాయెల్‌కు తమ సహకారాన్ని అందించింది. పాలస్తీనా సంఘర్షణలో ఇస్లామిక్ దేశాలు, ఇజ్రాయెల్ పరస్పరం బాంబు, క్షిపణి దాడులకు దిగడంతో అక్కడ భీతావహ పరిస్థితులు నెలకొన్నా అక్కడ పని చేయడానికి మన నిరుద్యోగ యువత పోటీపడుతున్నది. ఒక్కో ఉద్యోగికి నెలకు రూ.1.40 లక్షల జీతం, రూ. 4 వేల వరకు బోనస్ ఇస్తామని ప్రకటించడంతో ఎంపిక జరుగుతున్న చోట్ల తొక్కిసలాట జరుగుతున్నది. ఆకలితో మరణించడం కంటే పనిచేస్తూ ప్రాణాలు పోగొట్టుకోవడానికి యువత సిద్ధపడటం నిరుద్యోగ తీవ్రతకు నిదర్శనం.

వివిధ దేశాలలో నైపుణ్యం, పాక్షిక నైపుణ్యం గల కార్మికులకు మెరుగైన ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉండటంతో బతుకు కోసం ఆ దేశాలకు తరలి వెళ్ళడానికి యువత పోటీపడుతున్నారు. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ తదితర రాష్ట్రాలకు చెందిన వేలాది మంది కార్మికులు గల్ఫ్, తదితర దేశాలలో పని చేస్తూ తమ కుటుంబాలకు వేల కోట్ల రూపాయలు పంపి ఆడుకుంటున్నారు. దేశంలో తగిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలులేకే యువత విదేశాల బాట పడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని 2014లో అధికారంలోకి రావడానికి ముందు బిజెపి తమ ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసింది. అయితే వాస్తవంగా జరిగింది వేరు. దేశంలో తగిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక కన్సల్టెన్సీలకు వేల కొద్దీ డబ్బు చెల్లించి మన యువత విదేశాలకు తరలి వెళుతున్నారు. ధనదాహంతో కొన్ని కన్సల్టెన్సీలు అవకాశాలు లేని దేశాలకు కూడా యువతను పంపడం, అక్కడికి చేరాక వారు అష్టకష్టాలు పడటం తెలిసిందే. కెనడా, అమెరికా వంటి దేశాలకు వెళ్లినవారికి సైతం తగిన ఉద్యోగాలు లభించక అర్ధాకలితో అలమటిస్తూ,

అప్పుల పాలై మళ్లీ స్వస్థలాలకు తిరిగి వస్తున్నవారు గణనీయంగా ఉన్నారు. 2022 అక్టోబర్ -2023 సెప్టెంబర్ మధ్య అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన 96,917 మందిని గుర్తించి పట్టుకున్నట్లు అమెరికన్ కస్టమ్స్, సరిహద్దు భద్రతాదళం గణాంకాలు ఘోషిస్తున్నాయి. దేశ ఆర్ధిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు ప్రభుత్వాలు చెబుతున్నా ఇది ఉద్యోగ, ఉపాధి కల్పించలేని అభివృద్ధిగా మిగిలిపోతున్నది. 2024- 25లో మన దేశం 7.3% అభివృద్ధి సాధించగలదని ఇటీవల తాత్కాలిక బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కోట్లాది యువతకు, శ్రామికులకు ఉద్యోగ, జీవనోపాధి అవకాశాలు కల్పించలేనిదిగా నిలవనుంది. నిరుపేదలు ఏ పని దొరికితే ఆ పనికి వెళుతూ జీవితాలు వెళ్ళదీస్తున్నారు. చదువుకున్న నిరుద్యోగ యువత మాత్రం తమ అర్హతలకు అనుగుణమైన ఉద్యోగాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. పనిచేసే వయసు గల యువతకు తగిన ఉపాధి అవకాశాలు లభించకపోతే అది వారిలో నైరాశ్యానికి , అశాంతికి దారితీసే ప్రమాదముంది. భారత ప్రభుత్వం రెండేళ్ల క్రితం సైన్యంలో చేరదలచిన యువతకు అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించగా వేలాది మంది యువత ముందుకొచ్చారు. మామూలు సైన్యంలో ఇచ్చే జీత భత్యాలు,

పింఛను వీరికిరావు. బిజెపి ప్రభుత్వం ఎక్కువగా వాణిజ్య, పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే పని చేస్తున్నందున, అగ్నిపథ్‌లో శిక్షణ పొందినవారు ఐదేళ్ళ తర్వాత పరిశ్రమల వారికి రక్షకులుగా పని చేయాల్సి ఉంటుంది. 13 కోట్ల జనాభా గల పెద్ద రాష్ట్రంలో పరిమితమైన రైల్వే ఉద్యోగాలకోసం యువత ఎగబడడంతో అది హింసాకాండకు దారి తీసింది. ఆరేళ్ల క్రితం 35 వేల ఉద్యోగాల కోసం ప్రకటన రాగా కోటి మంది దరఖాస్తు చేశారు. నియామకాల్లో అవినీతి జరిగి ఆందోళనలకు దారి తీసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 368 బంట్రోతు ఉద్యోగాలకు ప్రకటన చేయగా పిహెచ్‌డిలు, పోస్టు గ్రాడ్యుయేట్లు సహా 23 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. దేశంలో మొత్తం నిరుద్యోగిత రేటు 6.6%. నగరాలు, పట్టణాలలో 15- 19 ఏళ్ల ఉద్యోగార్థులు రేటు అంతకు 3 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు 2023 జులై సెప్టెంబర్ గణాంకాలు ఘోషిస్తున్నాయి. నిరుద్యోగ సైన్యం నానాటికీ పెరిగిపోతుండడం అనేక సమస్యలకు దారితీస్తున్నది. 2014లో యువత కోటి ఆశలతో కమలం పార్టీకి ఓటేయడంతో నరేంద్ర మోడీ ప్రధానిగా కేంద్రంలో కమలనాథులు అధికారంలోకి వచ్చారు.

నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం మోడీ ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యం కావాలి. అయితే అరకొర చర్యలు తప్పితే మోడీ ప్రభుత్వం ఈ రంగంలో పెద్దగా పురోగతి సాధించలేదు. ఉద్యోగాలు కల్పించినా కొన్ని అసంఘటిత రంగంలో పట్టణాలు, నగరాలలో అసంఘటిత రంగంలో రోజువారీ కూలీ పనులే, మహిళలే అధికం. 2019 -20లో 22 శాతంగా ఉన్న ఈ పనులు 2022 -23లో 24 శాతానికి పెరిగినట్లు పరిశీలనలో తేలింది. ఇవి హెల్పర్లు, గృహ పరిశ్రమలకు చెందినవే. పట్టణ యువత నైరాశ్యంతో ఉద్యోగాల కోసం వెదకడం మానేసినట్లు తేలింది. 2023 జులై సెప్టెంబర్‌లో ఉద్యోగుల చేరిక తగ్గింది. మూడు నెలల్లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కంటి తుడుపుగా కొన్ని ఉద్యోగ నియామకాలు చేపట్టాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల డిఎస్‌సి ద్వారా నియామకాలను ప్రకటించింది. 2023 జులై నాటికి నిరుద్యోగిత రేటు 7.95 శాతంగా ఉన్నట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఇండస్ట్రీ వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం 2015 నుండి ఇప్పటి వరకు 36,643 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసినట్లు ఆర్‌టిఐ ద్వారా సమాచారం లభించింది. మధ్యలో ప్రశ్నాపత్రాలు లీకై కొన్ని పరీక్షల రద్దుకు, ఉద్యోగాలు రావనే నిరాశతో కొందరు ఆత్మహత్యలకు పాల్పడటం శోచనీయం. రేవంత్ రెడ్డి సిఎంగా కొత్తగా అధికారంలోకి

వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు దాదాపు 2 లక్షల పోస్టులకు దశలవారీగా నియామక ప్రక్రియ చేపట్టడం యువతకు ఆశాకిరణంగా కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వ 31 విభాగాల్లో మంజూరైన పోస్టులు 4,91,304. ప్రస్తుతం 3 లక్షల ఉద్యోగులు మాత్రమే పని చేస్తున్నారు. స్కూలు విద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ, పోలీసు, పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖలలో దాదాపు 77% మంది పని చేస్తున్నారు. స్కూలు విద్యశాఖలో మంజూరైన పోస్టులు 1,37,651 కాగా, ప్రస్తుతం 1,13,853 మంది మాత్రమే పని చేస్తున్నారు. పోలీసు శాఖలో మంజూరైన పోస్టులు 98,384 కాగా, ప్రస్తుతం 61,212 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో మంజూరైన పోస్టులు 52,906 కాగా, ప్రస్తుతం 22,336 మంది పని చేస్తున్నారు. కాగా నరేంద్ర మోడీ పదేళ్ల పాలనలో 9 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చినట్లు, అదే మోడీ ప్రభుత్వం సాధించిన ఘన విజయమని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అభివర్ణించారు. కానీ యుపిఎ పదేళ్ల పాలనలో ఇచ్చినది 6 లక్షల ఉద్యోగాలేనని కేంద్ర మంత్రి అంటున్నారు. యుపి ఎస్‌సి ద్వారా మోడీ ప్రభుత్వం 50,906 ఉద్యోగ నియామకాలు చేయగా, యుపిఎ హయాంలో ఇచ్చింది

45,431 ఉద్యోగాలేనని, ప్రస్తుత సిబ్బందికి భారీగా ప్రమోషన్లు కల్పించామని మంత్రి చెప్పారు. భారత ప్రభుత్వంలో మంజూరైన పోస్టులు 40 లక్షలు కాగా, ప్రస్తుతం 30 లక్షల ఉద్యోగులే పని చేస్తున్నారు. సివిల్ సర్వీసులలో 1,365 ఐఎఎస్, 703 ఐపిఎస్, 1042 ఇండియన్ ఫారెస్ట్ పోస్టులు, ఐఆర్‌ఎస్ పోస్టులు 301 ఖాళీగా వున్నాయి. హోం శాఖలో 1,14,245, సిఆర్‌పిఎఫ్, బిఎస్‌ఎఫ్, ఢిల్లీ పోలీసు శాఖలలో గ్రూప్ ఎ పోస్టులు 3,075, గ్రూప్ బి పోస్టులు 15,861 పోస్టులు, గ్రూప్ సి లో 95,309 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రైల్వేలో 2.63 లక్షల పోస్టులు ఖాళీగా ఉండగా, ఇటీవల పలు దఫాలుగా 1.39 లక్షల పోస్టులు భర్తీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 8 లక్షల ఉద్యోగులు ఉన్నారు. వారిలో 5.6 లక్షల రెగ్యులర్, 1.3 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయాలలో పని చేస్తున్నారు. 2 లక్షల మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తున్నారు. యుపిలో 27 లక్షల ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్లు, మహారాష్ట్రలో 17 లక్షలు, తమిళనాడులో 16 లక్షల ఉద్యోగులు, పెన్షనర్లు వున్నారు. బీహార్, రాజస్థాన్, జార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాలలో నిరుద్యోగులు అధికం. కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలు ఖాళీలు భర్తీ చేస్తే నిరుద్యోగులకు కొంతైనా ఊరట కలుగుతుంది. నైపుణ్య శిక్షణ ఇచ్చి ప్రైవేటు రంగంలో ఉద్యోగ కల్పనను ప్రోత్సహిస్తే మరి కొన్ని వేల మందికి ఉపాధి లభిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా సత్వర చర్యలు చేపట్టాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News