Monday, May 6, 2024

అన్ని విధాలా అర్హురాలు

- Advertisement -
- Advertisement -

Vanidevi had all Qualifications for entry into Legislative Council

 

పూర్వ ప్రధాని పివి నరసింహారావు ఔన్నత్యం ఎంతటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పివి గురించి చెప్పడం అంటే సూర్యుడిని దివిటీ పెట్టి చూపించడం వంటిది. వేద పురాణాలు మొదలుకొని ఆర్థిక, అధునాత సాంకేతికత వరకు అన్నింటిలో అగ్రశ్రేణి మేధావి ఆయన. పండితుడు, పరిపాలకుడు మేళవించిన విశిష్ట వ్యక్తిత్వం ఆయనది. ఆ మహానుభావుడి ఔన్నత్యాన్ని గుర్తించి, అభిమానించి ప్రపంచ వ్యాప్తం గా సముచిత రీతిలో శత జయంతి ఉత్సవాలను జరుపాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సారథి, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించడం తెలుగువారందరికీ ఆనందం కలిగించింది. పివి దేశానికే ఠీవీ అనే దృక్పథంతో అంతర్జాతీయ స్థాయిలో వివిధ కార్యక్రమాలను చేపట్టడం గొప్ప విషయమని భావిస్తున్న తరుణంలో, శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గంలో పివి కుమార్తె, విద్వన్మణి, స్థితప్రజ్ఞురాలైన సురభి వాణీ దేవిని అభ్యర్థిగా నిలబెట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించడం హర్షణీయం.

పివి కుటుంబ సభ్యురాలిగా వారి నుంచి వాణీదేవి ఎంతో పరిజ్ఞానాన్ని సంపాదించారు. వారి సాన్నిహిత్యంలో, మార్గదర్శకత్వంలో సమున్నతంగా రూపుదిద్దుకున్న సంస్కారవంతమైన వ్యక్తిత్వం వాణీదేవిది. తండ్రి ప్రధాని పదవిలో ఉన్నప్పుడు కూడా ఆమె రాజకీయ అవగాహన కలిగి ఉండీ, అవకాశాలు అందుబాటులో ఉండి కూడా, స్థితప్రజ్ఞురాలిగా అంటీముట్టనట్టు వ్యవహరించారనేది మనందరికీ తెలిసిందే. పట్టభద్రుల ప్రతినిధిగా శాసన మండలి ప్రవేశానికి అన్ని అర్హతలు ఉన్నట్టి వాణీదేవికి పివి శత జయంత్యుత్సవాల సందర్భంగా రాజకీయ ప్రవేశం కల్పించడం మొత్తం విద్యాలోకానికే గౌరవం తెచ్చిపెడుతున్నది.

ముఖ్యమంత్రి కెసిఆర్ బ్రాహ్మణ పక్షపాతియని బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ను 2015 సంవత్సరంలో ప్రకటించినప్పుడే అనుకున్నాము. భవిష్యత్తులో కూడా వారు బ్రాహ్మణ సమాజానికి సముచిత స్థానం కల్పిస్తారని భావించాము. సురభి వాణీ దేవిని పట్టభద్ర స్థానం నుంచి పోటీకి నిలిపినందుకు బ్రాహ్మణ సమాజమంతా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నది. సురభి వాణీ దేవి ప్రధాని కుమార్తె అయినా నిరాడంబరంగా, నిగర్వంగా ఉంటారు. స్నేహశీలిగా, పది మందికి మేలు కూర్చే మహిళామణిగా, అన్నిటి కంటే మించి విద్యావంతురాలిగా చేస్తున్న సేవలను గమనించి ముఖ్యమంత్రి ఆమెను శాసన మండలి పట్టభద్రుల స్థానానికి పోటీ నిలుపడానికి ఎంపిక చేశారు. వివిధ బ్రాహ్మణ సంక్షేమ సంఘాలు, పరిషత్‌లు, సేవా సమాఖ్యలు సమష్టిగా సురభి వాణీ దేవిని సమర్థించడానికి ముందుకు రావాలని మనవి చేస్తున్నాను.

బ్రాహ్మణుల్లో మేధావులు, పరిపాలనా దక్షులు, సామాజిక సంస్కర్తలు, సంఘ సేవకులు ఎంతో మంది ఉన్నారని, ఇంత మంది ఇన్ని రకాల వారున్నా, రాజకీయ అస్తిత్వం లేనందు వల్ల రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా సరైన గుర్తింపు రావడం లేదని బ్రాహ్మణ సమావేశాల్లో ఎన్నోసార్లు ఆవేదన వ్యక్తమైంది. ముఖ్యమంత్రి ఈ ఆవేదన గ్రహించి ఉంటారు కనుకనే ఈ సారి పట్టభద్రుల నియోజకవర్గానికి సురభి వాణీ దేవిని ఎంపిక చేసి ఉంటారు. ఈ నిర్ణయం బ్రాహ్మణులందరికీ సంతోషం కలిగిస్తున్నది. పివి శతజయంతి ఉత్సవాల సందర్భంగా బ్రాహ్మణులకు రాజకీయ సత్తా కల్పించాలని తలంచడం ముదావహకరమైన విషయం. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని బ్రాహ్మణులంతా ఒక తాటిమీద నిలబడి, ముఖ్యమంత్రి ఆలోచనకు, ఆశయానికి బాసటగా నిలిచి, సురభి వాణీదేవి విజయం సాధించేలా కృషి చేద్దామని, బ్రాహ్మణ సంఘాలకు, సమాజాలకు అందరికీ పిలుపు ఇస్తున్నాను.

పివి తనయగా వాణీదేవి వివిధ రంగాలలో ఎంతో సామాజిక పరిజ్ఞానం సముపార్జించారు. వారికి అనేక విద్యారంగ, సామాజిక సమస్యలపై అవగాహన ఉన్నది. వారు పట్టభద్రులకు ప్రాతినిధ్యం వహించడానికి అన్ని విధాల అర్హురాలు. శాసన మండలిలో వారి సేవలు సమాజానికి ఎంతో ఉపయోగకరం. వారు శాసన విధాన నిర్ణయాలలో, చర్చలలో పాలుపంచుకోవడం వల్ల సమాజానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. బ్రాహ్మణులకే కాదు, వివిధ సామాజిక వర్గాలకు, భిన్న అస్తిత్వాల వారికి హర్షణీయమని భావించి ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర్‌రావు పివి ముద్దుల పట్టి అయిన సురభి వాణీదేవిని అభ్యర్థిగా ఎంపిక చేశారు. అన్ని సామాజిక వర్గాలవారు సమష్టిగా వాణీదేవిని గెలిపించాలని కోరుతున్నాను.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News