Monday, May 6, 2024

ఎన్నికల రాజకీయాలకు వీరప్ప మొయిలీ స్వస్తి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : కాంగ్రెస్ సీనియర్ నేత, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ పార్టీ తనకు సర్వం ఇచ్చిందని, ఎన్నికల రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నందుకు తనకు విచారం లేదని బుధవారం ప్రకటించారు. మాజీ కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో చిక్కబళ్లాపూర్ నుంచి పోటీ చేయాలనే ఆసక్తితో ఉన్నారు. కానీ పార్టీ ఆయనకు టిక్కెట్ నిరాకరించింది.

మొయిలీ 2009, 2014 పార్లమెంటరీ ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి గెలిచారు. కానీ 2019లో ఓడిపోయారు. ‘(ఎన్నికల రాజకీయాల నుంచి) రిటైర్ కావడానికి అది మంచి సాకు’ అని ఆయన అన్నారు. ఎం మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ వంటి అదే వయస్సు ఉన్న పార్టీ నేతలు ఈ దఫా పోటీ చేయడం లేదు కనుక పోటీ చేయాలన్న ఆలోచన విరమించవలసిందని తనతో కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం చెప్పినప్పుడు తాను వెంటనే అంగీకరించానని 84 ఏళ్ల మొయిలీ తెలిపారు.

మొయిలీ బెంగళూరులో ‘పిటిఐ’తో మాట్లాడుతూ, ‘నేను ఈ సారి చిక్కబళ్లాపూర్ నుంచి తిరిగి ఎన్నికయ్యేవాడినే’ అని చెప్పారు. తాను నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తూనే ఉన్నానని, అయితే నియోజకవర్గం ప్రజలతో అనుబంధం తెంచుకోవడం కష్టం అని ఆయన చెప్పారు. తనను నిలబెట్టరాదన్న పార్టీ నిర్ణయం తనను బాధించలేదని ఆయన స్పష్టం చేశారు. అధిష్ఠానం నిర్ణయాలకు తాను ఎల్లప్పుడూ నిబద్ధమై ఉన్నట్లు మొయిలీ తెలిపారు. ‘అధికారంపై తనకు వ్యామోహం ఉందనే అభిప్రాయం ప్రజలకు కలగరాదని అనుకుంటున్నాను. నేను పార్టీ కోసం పని చేస్తూనే ఉంటా. ఎన్నికల్లో పోటీ చేయను’ అని మొయిలీ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News