Tuesday, April 30, 2024

ధరలు ‘గుడ్లు’రుముతున్నాయి

- Advertisement -
- Advertisement -

Vegetable rates increased with India economy

దేశంలో తీవ్ర ఆర్థిక మందగమన పరిస్థితుల కారణంగా బతుకు బండిని లాగడమే కష్టంగా మారుతోంది. పెరుగుతున్న ధరలతో జీవనమే దుర్భరంగా ఉంది. కూరగాయలు, ఉల్లి, పప్పులు, నూనెలు అందరి ఇళ్ళలో అగ్గిరాజేస్తున్నాయి. సగటు జీవి నిత్యావసరాలు ఆజ్యం పోస్తున్నాయి. అరకొర ఆహార ధాన్యాల ఉత్పత్తి, లభ్యత సకలజనులకు చుక్కలు చూపిస్తున్నాయి. సందట్లో సడేమియాలా కరోనా కాటేయడంతో ‘సాధారణ’ బతుకులు చిన్నాభిన్నమవుతున్నాయి.
ఆర్ధిక మాంద్యం, పెద్దనోట్ల రద్దు, ఇప్పుడు మరో పెద్ద బండ కరోనా దరిమిలా ధరల దరువు సామాన్యుణ్ణి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలు ఇంకా దరిచేరనేలేదు. మామూలు రోజుల్లో కూడా పెరుగుతున్న ధరలు వినియోగదారుడిని వెక్కిరిస్తున్నాయి. ఏ వస్తువును ముట్టుకున్నా పెరగడమే కానీ తరగడం అనేది మనం వినమేమో! నిత్యావసరాలు, పప్పుధాన్యాలు, నూనెలు, పోషక పదార్ధాలు, పెట్రోలు, డీజిల్ ఇలా ఎన్నో జీవనావసరాలపై ప్రభావం చూపుతున్నాయి. కూరగాయల సంగతి ఇక సరేసరి. కరోనా వచ్చింది కాటేసింది అన్న సత్యాన్ని ఎల్లరూ ఎరిగేలా చేసింది. నిత్యావసరాల కొరత, మార్కెటింగ్, రవాణా సౌకర్యాల మందగింపు, వ్యాపారుల దోపిడీ, నియంత్రణలేని విధానాలు, వివిధ ఉత్పత్తుల డిమాండ్ అధికమవడం, సప్లయికి బాగా వ్యత్యాసం ఉండటం, ప్రభుత్వ చర్యల లేమి ఇత్యాది ఎన్నివల్లె వేసినా చిట్టచివరిగా వినియోగదారులను కూడలిలో నిలబెడుతున్నాయి. పెరిగిపోతున్న ఈ ధరాభారంతో అన్ని వర్గాల ప్రజలు తప్పేదేముంది అనడం తప్ప తప్పించుకునే మార్గం లేక నిట్టూరుస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా పుణ్యమాని ఉత్పత్తిరంగం చతికిల పడింది. అన్ని దేశాల్లో ధరలు పెరగడం, ఆర్ధిక ఒడిదుడుకులు సహజమే అయినా కొన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో పాలకులు దీన్ని జాతీయ, అంతర్జాతీయ సమస్యగా పేర్కొంటూ నిమిత్తమాత్రంగా ఉండటం గమనార్హం. కొరతను సృష్టించే/ వచ్చే అంశాలను ముందుగా గుర్తించి సమస్యలను పరిష్కరించే చర్యలు పాలకులు చేపట్టలేకపోతున్నారని ఇట్టే అర్ధమవుతుంది. నిత్యావసరాలైన పప్పులు, నూనెలు, ఉల్లి ధరలు ప్రధానంగా జనాన్ని ప్రభావితం చేస్తున్నాయి.
ఉల్లి ధరలు మరోసారి ఎగబాకాయి. అప్పట్లో ఈ ఏడాది ప్రారంభంలో ఉల్లి అందుబాటులో లేక నానా అగచాట్లుపడ్డారు. ఉల్లి పొదుపు మంత్రాన్ని జపించారు. మళ్ళీ ఇప్పుడు కిలో రూ.50 దాకా ఉండటంతో ఉల్లి లొల్లి మొదలైంది. ప్రపంచంలోని 140 దేశాల్లో ఉల్లి సాగవుతోంది. అందులో ఐదో వంతు పంట పండించే భారత్‌లో ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తోంది. అధిక వానలు కురవడం లేదా దిగుబడులు తగ్గడం లాంటి సమస్యలకు తోడు కరోనా మహమ్మారి రవాణా రంగంపై దెబ్బ తీయడంతో ఉల్లితో సహా అన్ని నిత్యావసరాలకు ఆ సెగ తగిలింది. పాలకులు దీన్ని గమనించకపోవడంతో పరిస్థితి విషమించింది. కోరినంత ఉల్లి అందుబాటు ధరల్లో లభించక ఉల్లి వాడేవారు తమ ఆహార అలవాట్లలోనూ పొదుపు పాటించాల్సి రావడం విషాదకరమే.
వాస్తవానికి ఈ ఏడాదిలో ధరల మోత మోగనుందని, ద్రవ్యోల్బణం తీవ్ర ప్రభావం చూపుతోందని ఈ సరికే సంకేతాలు వెలువడ్డాయి. సగటు మనిషికి వాడుక వస్తువులైన, సబ్బులు, పాల ఉత్పత్తులు, ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఆరోగ్య అవసరాలకు అవసరమయ్యే మందుల ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. ముడి సరుకుల ధరలు ఎగబాకటం, కరోనాకాటు వల్ల ధరలు పెంచక తప్పదని కంపెనీలు తమ వాదనను తెరపైకి తెస్తున్నాయి. చివరికి సామాన్యుని నెలవారీ బడ్జెట్ గతి తప్పిన పరిస్థితి ఎల్లెడలా గోచరిస్తోంది.
బంగాళాదుంప, అల్లం, వెల్లుల్లితో పాటు కూరగాయల ధరలు మార్కెట్లో మండుతున్నాయి. కొన్ని కూరగాయలు ఒక కిలో 40 నుంచి 60 రూపాయల వరకు ఉన్నాయి. విపరీతంగా రేట్లు పెరిగాయి. గతేడాది తో పోలిస్తే వీటి ధర దాదాపు 12 నుంచి 35 శాతం మేర పెరిగాయి. పాల ఉత్పత్తులు, నూనెలు 15 శాతం పెరగడం గమనించదగ్గది. భారతదేశంలో వంటకాల్లో సింహ భాగాన్ని ఆక్రమిస్తున్న నూనెల ధరలు ప్రతి ఒక్కరికీ సెగపెడుతున్నాయి. దేశీయంగా నూనె గింజల ఉత్పత్తి ఇంకా ఇంకా పెరిగితేనే సమస్యకు పరిష్కార మార్గమేర్పడుతుందని ఆహార నిపుణులు పేర్కొంటున్నారు.
పెట్రోలు, డీజిల్ ధరలు కూడా సమస్యకు హేతువవుతున్నాయని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తికి మూలమైన వ్యవసాయరంగంపై పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల అంతులేని ప్రభావాన్ని చూపుతోంది. దశాబ్దాలుగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ప్రభుత్వ అదుపు తప్పి ఆకాశాన్నంటుతున్నాయి. డీజిల్ ధరల పెంపు కారణంగా రవాణా చార్జీలు పెరిగి కూరగాయలతో పాటు అన్ని నిత్యావసరాల ధరలను పెంచేస్తున్నారు. పైపెచ్చు ప్రస్తుతం కరోనా వైరస్‌తో వినియోగ దారులపై పెట్రోలు, డీజిల్ ధరలు దొంగ దెబ్బ తీశాయి. ప్రజా రవాణాలో ముఖ్య భాగమైన రైళ్లు, బస్సుల నిర్వహణపై పరిమితులు ఏర్పడ్డంతో వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి వాహన సౌకర్యం అనివార్యమైంది. దీంతో సాధారణ జనం సొంత వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది.
పెరిగిన పెట్రోలు, డీజిల్ సెస్సు వీరందరిపైనా ప్రభావం చూపుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు, డీజిల్ ధరలు భారంగా మారుతున్నాయి. రాష్ర్టంలో లీటరు పెట్రోలు రూ.86 పైగా ఉంది. ఇందులో వ్యాట్ రూపంలో రూ.18.66, అదనపు వ్యాట్ రూ.4 ఇప్పటికే వస్తున్నాయి. తాజాగా గత వారమే ఒక రూపాయి సెస్ విధించారు. మొత్తం మీద పెట్రోలుపై రాష్ట్రానికి లీటరుకు రూ.23.66 సమకూరుతోంది. అలాగే డీజిల్‌పై రూ. 18.53 పన్ను రూపంలో ఆదాయం వస్తుంది. ఈ గణాంకాలను సాధారణ ప్రజానీకం గమనించకపోవడం చెప్పకోదగ్గ విశేషం.
కరోనాతో ప్రజల ఆహార అలవాట్లలోనూ మార్పులు అనివార్యమయ్యాయి. టమోటా, ఆలు, ఉల్లి తర్వాత ఇప్పుడు కోడిగుడ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కరోనా వ్యాప్తి ఎక్కువవటం, రోగ నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) పెంపుదలలో భాగంగా గుడ్ల వాడకంపై ప్రభావం పెరిగింది. చాలా మంది ప్రజల ఆహారంలో ఇప్పుడు గుడ్డు తప్పనిసరైంది. గతంలో ఎన్నడూ గుడ్డు జోలికి పోని వారు సైతం ఇప్పుడు కరోనాతో గుడ్డు తింటున్నారు. కరోనా తొలి రోజుల్లో గుడ్డు ధరలు బాగా పడిపోయాయి. గుడ్లు కొనే వారే కరువయ్యారు. ఆ వైరస్‌పై రకరకాల ప్రచారాలు సాగడంతో రూ.2 నుంచి రూ.3కి కూడా గుడ్లు లభించాయి. అయితే తాజాగా ఇమ్యూనిటీ పెరగడానికి గుడ్డు కారకమవుతుందని విశ్లేషణలు ఊపందుకోవడంతో గతంలో ఎన్నడూలేని విధంగా ఒక్కో గుడ్డు రూ.6 నుంచి రూ.7 దాకా పలుకుతోంది. రాష్ర్టంలో గుడ్ల వినియోగం బాగా పెరిగిందని, అందుకే ఈ రేట్లని పౌల్ట్రీ రంగం నిపుణులంటున్నారు.
కరోనా లాక్‌డౌన్ కాలంలో గుడ్ల ఉత్పత్తికి ఇబ్బందులొచ్చాయని, దీంతో ధరలు పెరిగాయని వారంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ మే మధ్య కాలంలో గుడ్లతో పాటు చికెన్ సేల్స్ పడిపోయి వ్యాపారులకు నష్టాలొచ్చాయని పేర్కొంటున్నారు. తగినంత సిబ్బంది, లేబర్ దొరక్క చాలా కోళ్ళు చనిపోయాయని నిపుణులు చెబుతున్నారు, కరోనా లాక్‌డౌన్‌తో ఇబ్బందులుపడ్డ రైతులు ఉత్పత్తిని తగ్గించారని, అందువల్లే డిమాండ్ పెరిగి, సప్లయి తగ్గిందని, ధరలు అమాంతం పెరిగాయని వ్యాపారులు ఉదహరిస్తున్నారు. ఈ రేట్లు కొన్నిరోజుల పాటు ఇలానే పెరుగుతాయని, కనీసం ఏడాది పాటు గుడ్డు ధర రూ. 5 ఉంటేనే కరోనా కష్టాల నుంచి ఈ రంగం కోలుకుంటుందని పౌల్ట్రీ వర్గాల విశ్లేషణగా ఉంది. మరోవైపు చికెన్ ధరలు కిలోకు రూ. 200పై మాటే. వినియోగం పెరుగుదల చికెన్ రేట్లు ఎక్కువకావడానికి హేతువయింది.
వ్యవసాయ రంగాన్ని బాగా ప్రోత్సహించడం, మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి అవకాశాల మెరుగుకు చర్యలు తీసుకోవడం మొదలైన అంశాలపై దృష్టి నిలపాల్సి ఉంది. ధరలను నియంత్రించాలంటే మార్కెట్లపై ప్రభుత్వ జోక్యం అనివార్యమన్న వాదనలూ ఉన్నాయి. వ్యవసాయోపకరణాల ధరలు తగ్గించాలి. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఖర్చులకు అదనంగా 50 శాతం కలిపి కనీస మద్దతు ధరలు నిర్ణయించి, మార్కెట్లో ధరలు తక్కువగా ఉన్నప్పుడు రైతుల నుంచి వ్యవసాయోత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్న సూచనలు తక్షణ ఆవశ్యకత అనే అభిప్రాయమూ వెల్లడవుతోంది. మొత్తం మీద దేశంలోని మెజారిటీ ప్రజల ఆదాయాలను పెంచడానికి చర్యలు తీసుకుంటే ఆర్ధిక మాద్యం నుంచి బయట పడటం, తద్వారా ధరల నియంత్రణకు అవకాశమేర్పడుతుంది. సామాన్యునికి కాసింత సంతసం మిగులుతుంది.

చెన్నుపాటి రామారావు
99590 21483

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News