Sunday, April 28, 2024

తప్పిస్తున్నట్టు గంటన్నర ముందు చెప్పారు: విరాట్ కోహ్లి

- Advertisement -
- Advertisement -

Virat Kohli Press Conference

ముంబై: వన్డే కెప్టెన్సీ నుంచి తనను తప్పిస్తున్న విషయాన్ని సెలెక్టర్లు కేవలం గంటన్నర ముందే చెప్పారని విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. అది కూడా టెస్టు జట్టును ప్రకటించడానికి కాల్ చేసినప్పుడూ త్నతో చెప్పారన్నాడు. అంతేగాని తనకు ముందుగానే ఈ విషయం తెలుసని బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించడాన్ని కోహ్లి పరోక్షంగా ఖండించాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌ను పురస్కరించుకుని బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోహ్లి మాట్లాడాడు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కోహ్లి ఎన్నో కీలక అంశాలు ప్రస్తావించాడు.
టెస్టు జట్టు ఎంపిక సమయంలో..
టెస్టు జట్టును ప్రకటించడానికి గంటన్నర ముందు సెలెక్టర్లు నన్ను వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టు సమాచారం ఇచ్చారన్నాడు. టెస్టు టీమ్ ఎంపిక కోసం సెలెక్టర్లు తనకు కాల్ చేశారన్నాడు. అయితే ఆ కాల్ కట్ చేయడానికి ముందు వన్డే సారథ్య బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగిస్తున్నట్టు వివరించాడు. ఇక తాను మాత్రం చాలా రోజుల ముందే వన్డేలు, టెస్టుల్లో కెప్టెన్‌గా కొనసాగుతానని బిసిసిఐకి స్పష్టం చేశానని విరాట్ వివరించాడు. కాగా, వన్డే కెప్టెన్సీ మార్పు విషయంలో భారత క్రికెట్ బోర్డు ఇలా ఎందుకు వ్యవహరించిందో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదన్నాడు. కెప్టెన్‌గా తనకు అప్పగించిన బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తించానని, జట్టు కోసం తీవ్రంగా శ్రమించానని స్పష్టం చేశాడు. మరోవైపు టి20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్న విషయాన్ని ముందుగానే బిసిసిఐ దృష్టికి తీసుకెళ్లానని, అప్పుడూ బోర్డు అధికారుల నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదన్నాడు. అయితే ఆ తర్వాత సౌరవ్ గంగూలీ చేసిన ప్రకటన తనను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు. తాను 2023 వన్డే ప్రపంచకప్ వరకు కెప్టెన్‌గా కొనసాగుతానని బోర్డుకు ముందే స్పష్టం చేశానని తెలిపాడు. అయితే బోర్డు మాత్రం వన్డే సారథిగా రోహిత్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకోవడం బాధకు గురి చేసిందన్నాడు.
విశ్రాంతి కావాలని కోరలేదు..
మరోవైపు దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌లో తనకు విశ్రాంతి కావాలని బోర్డును కోరలేదని విరాట్ స్పష్టం చేశాడు. విరామం కోసం తాను బిసిసిఐని సంప్రదించలేదన్నాడు. సెలెక్టర్లకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటానని, వన్డే సిరీస్‌లో పాల్గొంటానని వివరించాడు. ఈ విషయంలో మీడియాలో వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలేనని కొట్టి పారేశాడు.
రోహిత్ విభేదాలు లేవు..
సహచరుడు రోహిత్ శర్మతో తనకు ఎలాంటి విభేదాలు లేవని కోహ్లి తేల్చి చెప్పాడు. రోహిత్‌తో తనకు మనస్పర్థాలు ఉన్నట్టు మీడియాలో వచ్చిన కథనాల్లో నిజం లేదన్నాడు. రోహిత్‌తో కలిసి ముందుకు సాగేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నాడు. వ్యూహాల విషయంలో రోహిత్ అత్యంత సమర్థుడన్నాడు. ఈ విషయంలో అతనికి ఎవరూ సాటిరారన్నాడు. ఇక రోహిత్‌కు తన పూర్తి సహకారం ఉంటుందన్నాడు. అతని సారథ్యంలో టీమిండియా మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తుందనే నమ్మకాన్ని కోహ్లి వ్యక్తం చేశాడు.

Virat Kohli Press Conference

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News