Monday, April 29, 2024

అభిప్రాయం- ధిక్కారం

- Advertisement -
- Advertisement -

Voters must be fully aware of their right to vote

 

పార్లమెంటుకి, అసెంబ్లీలకు మధ్య సంబంధాలలో ధిక్కారం, ఘర్షణ వంటి వ్యతిరేక వాతావరణానికి ఆస్కారం ఉంటుందా, ఒకే దేశంలోని భిన్న రాష్ట్రాల ప్రజలకు ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర ప్రభుత్వాలకు మొత్తం దేశ ప్రజల శాసన నిర్మాణ వ్యవస్థ అయిన పార్లమెంటుకు విభేదాలు తలెత్తినప్పుడు దానిని ఏ విధంగా పరిగణించాలి? పార్లమెంటు చేసిన పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), మూడు కొత్త వ్యవసాయ శాసనాలకు వ్యతిరేకంగా రాష్ట్రాల అసెంబ్లీలు తీర్మానాలు చేయడం ఏ కోవలోకి వస్తాయి అనే విచిత్రమైన మీమాంస సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. రాజ్యాంగం 7వ షెడ్యూల్‌లోని కేంద్ర జాబితాలో గల అంశాలపై పార్లమెంటు చేసే చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానాలు ఆమోదించే హక్కు శాసన సభలకు ఉండరాదంటూ దాఖలైన ఒక కేసును సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. రాజస్థాన్‌కు చెందిన సమత ఆందోళన్ అనే ప్రభుత్వేతర సంస్థ (ఎన్‌జిఒ) ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. పౌరసత్వ సవరణ చట్టం దేశంలో సమానత్వ హక్కును కాలరాస్తున్నదంటూ దానిని రద్దు చేయాలని కోరుతూ 2019లో కేరళ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై దృష్టి కేంద్రీకరించి సమత ఆందోళన్ ఈ కేసును దాఖలు చేసింది.

విచారణ సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి వెలిబుచ్చిన అభిప్రాయాలు అత్యంత విలువైనవని చెప్పవచ్చు. ధిక్కారానికి, అభ్యర్థనకు మధ్య గల విభజన రేఖను ఎత్తి చూపించాయి. ఇటువంటి తీర్మానాల ద్వారా శాసన సభలు, కేంద్ర చట్టాలను వ్యతిరేకించాలని ప్రజలకు పిలుపు ఇవ్వడం లేదు, ఆ చట్టాలను రద్దు చేయాలని మాత్రమే కేంద్రాన్ని కోరుతున్నాయి అని బాబ్డే చేసిన వ్యాఖ్యానంలో ప్రజల ప్రజాస్వామిక స్వేచ్ఛల ఆవశ్యకతపై, భిన్నాభిప్రాయ ప్రకటనపై సుప్రీంకోర్టుకున్న మక్కువ స్పష్టపడుతున్నది. పార్లమెంటు చట్టాన్ని పక్కన పెట్టాలని కోరే అధికార పరిధి అసెంబ్లీలకు లేదన్న పిటిషన్‌దారు అభిప్రాయంతో తమకు ఎటువంటి పేచీ లేదని అదే సమయంలో తమ అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు ఉండదని ఎలా అంటారు అని జస్టిస్ బాబ్డే పిటిషన్‌దార్లను ప్రశ్నించడం బాగుంది. ఆ విధంగా పౌరసత్వ సవరణ చట్టానికి, కొత్త వ్యవసాయ శాసనాలకు వ్యతిరేకంగా కేరళ, పశ్చిమబెంగాల్ అసెంబ్లీలు తీర్మానాలు చేయడంలో ఎటువంటి హానీ లేదని జస్టిస్ బాబ్డే వెలిబుచ్చిన అభిప్రాయం ప్రజాస్వామిక రాజ్యాంగానికి వన్నె తెచ్చే విధంగా ఉంది.

ఈ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ దేశ ప్రజానీకం చేపట్టిన సుదీర్ఘమైన ధర్నాలను, మహోద్యమాలను దమనకాండతో అణచివేయగలుగుతున్న కేంద్ర ప్రభుత్వం వాటికి వ్యతిరేక తీర్మానాలు చేస్తున్న అసెంబ్లీలను ఏమీ చేయలేకపోతున్న నిస్సహాయ స్థితి స్పష్టంగా కనిపిస్తున్నది. అందుకే తన చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానాలు ఆమోదించే వెసులుబాటు కూడా అసెంబ్లీలకు లేకుండా చేయాలని అది కోరుతూ ఉండవచ్చు. కేంద్ర పాలకుల అటువంటి నిరంకుశ అధికార కాంక్షను ఇటువంటి పిటిషన్లు ప్రతిధ్వనిస్తున్నాయని అనిపించడం తప్పు కాదు. పిటిషనర్ మరింత ముందుకు పోయి కేంద్ర చట్టాలు మంచివా, చెడ్డవా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు అసెంబ్లీలకు లేదన్నారు. కేంద్రం అధికార పరిధిలోని అంశాలపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీలకు లేనట్టే దాని చట్టాలపై అభిప్రాయం కలిగి ఉండే హక్కు కూడా వాటికి ఉండదని వాదిస్తున్నారు.

ప్రజలు ఎన్నుకునే శాసన సభల అభిప్రాయ ప్రకటన స్వేచ్ఛకు కూడా ఉరి బిగించాలన్న ధోరణి దేశాన్ని ఎటు తీసుకుపోతుందో చెప్పనక్కర లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీయే అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు ఏర్పరిస్తే పార్లమెంటు చేసే ప్రజావ్యతిరేక శాసనాలన్నీ దాని నోటి నుంచే వెలువడతాయి. అక్కడ తనకున్న ఎదురులేని మెజారిటీతో ఎదురు ప్రశ్నించే నోళ్లను దౌర్జన్యంగా మూసివేసి ఎమర్జెన్సీ నాటి పరిస్థితి దాపురిస్తుంది. అది ప్రస్తుతం రాజ్యం చేస్తున్న విషయం తెలిసిందే. అందుచేత అక్కడ ఇక్కడ అంతటా ఒకే పార్టీ పరిపాలన ఉండడం దేశానికి ఎంత చేటో వివరించనక్కర లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని ఏ పార్టీ నడుపుతున్నా దానికి పార్లమెంటులో తిరుగులేని మెజారిటీ అప్పగించడం దేశ ప్రజల అవివేకమే. తమ ఓటును హక్కుగా కాకుండా తమను తాము మోదుకునే ఆయుధంగానే వారు తమపై ప్రయోగించుకోడం అవుతుంది.

ఇప్పటిలా అటువంటి పరిస్థితులు నెలకొన్నా రాష్ట్రాలలో ఇతర పార్టీలు అధికారంలో ఉండడమనేది దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే కనీస కవచంగా ఉపయోగపడుతుంది. అందుచేత దేశంలోని ఓటర్లకు తమ ఓటు హక్కుపై సంపూర్ణ అవగాహన ఉండి తీరాలి. మతానికో, కులానికో ఓటు వేసి కార్పొరేట్లకు పబ్లిక్ రంగ ఆస్తులన్నింటినీ కట్టబెట్టి అయిన వారైన ప్రజలకు ఆకుల్లో, కాని వారికి కంచాల్లో పెట్టే దుష్ట పాలనలను ఎంచుకోడం వల్ల జాతి శ్రేయస్సు సమూలంగా దెబ్బతింటుంది. జస్టిస్ బాబ్డే విచారణ మధ్యలో వెలిబుచ్చిన విలువైన అభిప్రాయాలు కేసు చివరిలో విజయం సాధించాలని కోరుకుందాం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News