Friday, April 26, 2024

మాఫీల మతలబు

- Advertisement -
- Advertisement -

Waiver of Bank loans of Corporate houses

 

ప్రభుత్వరంగ బ్యాంకులు ఉన్నదెందుకంటే ప్రజాధనాన్ని కార్పొరేట్ పారిశ్రామిక, వాణిజ్య సంస్థల యాజమాన్యాలకు కట్టబెట్టి వాటి సేవలో తరించడానికే అని తడుముకోకుండా చెప్పవచ్చు. అవి వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొని ఎగవేయడం, అందువల్ల బ్యాంకులకు కలిగే అపార నష్టాన్ని దేశ ప్రజలు కట్టే పన్ను విత్తం నుంచి కేంద్ర ప్రభుత్వం ఉద్దీపన పేరిట తీసి ఇచ్చి పూడ్చడం మామూలు అయిపోయింది. బ్యాంకులు రుణాలుగా ఇచ్చేది ప్రజల ధనమే వాటిని ఎగ్గొట్టినందువల్ల కలిగే నష్టాలను తొలగించేదీ జనం డబ్బుతోనే. గత ఐదేళ్లలో ఈ విధంగా మాఫీ చేసిన కార్పొరేట్ సంస్థల బ్యాంకు రుణాల మొత్తం రూ. 5,55,603 కోట్లని సాక్షాత్తు భారతీయ రిజర్వు బ్యాంకే (ఆర్‌బిఐ) వెల్లడించింది. బ్యాంకులు తమ ఖాతా పత్రాలలో నిరర్థక ఆస్తుల (వసూలు కాని రుణాలు) ను తక్కువగా చూపించడానికే ఈ మాఫీకి పాల్పడుతుంటాయని వాస్తవానికి అది రుణాలను రద్దు చేయడం కాదని వాటిని వసూలు చేసే కృషి వేరే మార్గంలో కొనసాగుతూ ఉంటుందని పాలకులు, వారి ప్రచార వ్యూహకర్తలు ప్రజలకు ఇస్తున్న వివరణ బొత్తిగా విశ్వసించదగినది కాదు.

ఎందుకంటే సాంకేతిక మాఫీ ద్వారా రద్దు చేసిన వేలాది కోట్ల రూపాయల రుణాలలో తిరిగి వసూలు చేయగలుగుతున్నది బహు స్వల్పం. ఆ కొద్ది పాటి మొత్తానైన్నా రాబట్టడానికి అమితంగా ఖర్చు చేయవలసి ఉంటుంది. అంతిమంగా తేలేది సున్నాకు సున్నా హళ్లీకి హళ్లీ. 2016-17లో బ్యాంకులు తమ బ్యాలెన్స్ షీట్ల బరువు తగ్గించుకోడానికి సాంకేతిక తుడిచివేత పద్దు కింద రద్దు చేసిన కార్పొరేట్ రుణాలు రూ. 1,08,374 కోట్లు, 2017-18లో రూ. 1,61,328 కోట్లు, 2018-19 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు మాసాల్లో రూ. 82,799 కోట్లు. ఈ విధంగా గత 10 సంవత్సరాల్లో రూ. 7 లక్షల కోట్ల మేరకు ‘పెద్ద మనుషుల’ బ్యాంకు రుణాల మాఫీ జరిగిపోయిందని రూఢి సమాచారం. ఇందులో యుపిఎ 2 హయాంలో మాఫీ అయింది రూ. 1,45,226 కోట్లు. మిగిలినదంతా కేంద్రంలోని ప్రస్తుత బిజెపి హయాంలో జరిగిందే కావడం గమనించవలసిన అంశం. ఇలా మాఫీ చేసినప్పుడల్లా కేంద్ర పాలకులకు హితులు, సన్నిహితులయిన వారిని ప్రత్యేక దృష్టితో చూసుకోడం మామూలే.

2019 సెప్టెంబర్ 30 వరకు 50 మంది ఉద్దేశపూర్వక బడా ఎగవేతదార్లకు చెందిన రూ. 68,607 కోట్ల కిమ్మత్తు రుణాలను బ్యాంకులు మాఫీ చేసినట్టు సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన ఒక సమాధానంలో ఆర్‌బిఐ తాజాగా వెల్లడించిన విషయం ఇప్పుడు చర్చనీయమైంది. ఈ 50 మంది పేర్లు వెల్లడించాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దాటవేసిన సంగతి తెలిసిందే. ఈ 50 మందిలో గీతాంజలి జెమ్స్ అధినేత మెహుల్ చోక్సీ, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ విజయ్ మాల్యా, బాబా రామ్‌దేవ్ వంటి వారు ఉండడం గమనించవలసిన విషయం. వీరినే కమలనాథులకు కావలసిన వారని రాహుల్ గాంధీ ఎత్తి పొడుస్తున్నారు. గీతాంజలి జెమ్స్‌కు చెందిన రూ. 5492 కోట్ల బాకీని మాఫీ చేశారు. అలాగే ఈ మాఫీ వరం పొందిన పై 10 యాజమాన్యాలలో విజయ్ మాల్యా విమానయాన సంస్థ ఉన్నది.

ఒకవైపు ఆయనను, చోక్సీని ఆర్థిక నేరస్థులుగా పరిగణించి విదేశాల్లోని వారిని రప్పించడానికి కృషి చేస్తున్నట్టు కనిపిస్తూనే ఇంకోవైపు ఇంత భారీ ఎత్తు మాఫీ కటాక్షాలను ప్రసాదించడంలోని వైరుధ్యం మతలబు ఏమిటి? నీరవ్ మోడీ మాదిరిగానే మెహుల్ చోక్సీ కూడా విదేశీ కొనుగోలుదారుల పేరిట బకాయి పత్రాలు సృష్టించి వాటిని బ్యాంకుల్లో కుదువ పెట్టి భారీగా అప్పులు తీసుకొని ఎగనామం చిత్తగించాడు. పంజాబ్ నేషనల్ బ్యాంకు ఉద్యోగులు వీరికి సహకరించారు. చోక్సీకి చెందిన గిలీ ఇండియా కంపెనీ చెల్లించాల్సిన రూ. 1,447 కోట్లు, నక్షత్ర బ్రాండ్స్ బాకీ పడిన రూ. 1109 కోట్ల అప్పులు కూడా ఈ మాఫీ జాబితాలో ఉన్నాయి. తిరిగి వసూలు చేసుకోడానికి జరిపిన సకల ప్రయత్నాలూ విఫలమైన తర్వాతే వాటికి ముద్దుగా నిష్ప్రయోజక ఆస్తులని పేరు పెడతారు.

వీటి విలువకు తగిన ప్రత్యామ్నాయ ఆస్తుల హామీ లేవీ లేకపోడమో అలా రాయించుకున్న వాటి విలువ అతి స్వల్పం గా ఉండడం వల్లనో అవి ఎన్నటికీ వసూలు కావు. వాటికి సాంకేతిక మాఫీ పేరిట శాశ్వతంగా తెర దించుతున్నారు. అలా తీసుకున్న రుణాల భారీ విత్తంతో బడా బాబులు సృష్టించుకునే ఆస్తులు మాత్రం అపారంగా పెరిగి పిల్లలు పెడుతూనే ఉంటాయి. పరిశ్రమలు, వ్యాపారాలు, ఉద్యోగాలను, ఉపాధులను కల్పిస్తాయని వారు సంపద సృష్టికర్తలని పొగుడుతూ పాలకులు వీరికి ఎర్ర తివాచీ పరుస్తుంటారు. బ్యాంకుల మేనేజర్లు ప్రత్యేక కానుకలకు కక్కుర్తిపడి ప్రజల సొమ్మును మంచినీళ్ల ప్రాయంగా వీరికి ధారపోస్తుంటారు. ఎన్నికల వేళ ఈ ఎగవేతదార్లు ఏలిన వారికి వీలైన మేరకు తోడ్పడుతుంటారు. ప్రజలు, ప్రజాస్వామ్యం పేరిట నిరాటంకంగా సాగిపోతున్న ఈ ధనస్వామ్య మాయోపాయానికి తెరపడేదెప్పుడో?

 

Waiver of Bank loans of Corporate houses
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News