Monday, April 29, 2024

భారతదేశం గర్వించదగ్గ గొప్ప నటుడు

- Advertisement -
- Advertisement -

Irrfan Khan

 

బాలీవుడ్ విలక్షణ నటుడు
ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత

తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ (54) కన్నుమూశారు. అరుదైన క్యాన్సర్‌తో బాధపడుతు న్న ఆయన ముంబయ్‌లోని కోకిలా బెన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఇర్ఫాన్ ఖాన్ చాలా రోజుల క్రితమే న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ అనే క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. దీనికోసం ఆయ న లండన్‌లో చికిత్స తీసుకున్నారు. క్యాన్సర్ నుంచి కోలుకుని గత ఏడా ది సెప్టెంబర్‌లో తిరిగి ముంబయ్ చేరుకున్నారు. భారత్‌కు తిరిగి వచ్చిన తరువాత ఆ మధ్య మరోసారి తన ఆరోగ్యంపై స్పందించారు ఇర్ఫాన్. “తాను పూర్తిగా కోలుకోలేదని.. ఇక ఇక్కడే ఉంటూ రెగ్యులర్ చెకప్ చేయించుకుంటున్నాను”అని ఆయన చెప్పారు. అయితే అంతలోనే మృతిచెందడం విచారకరం. శనివారం రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఇర్ఫాన్ ఖాన్ తల్లి సైదా బేగం (95) కూడా కన్నుమూశారు.

కరోనా లాక్ డౌన్ కారణంగా కన్నతల్లి కడసారి చూపులకు నోచుకోలేకపోయారు ఇర్ఫాన్. ఇక తన తల్లి అంత్యక్రియలను అతను వీడియో కాల్ ద్వారా వీక్షించి ఎంతో బాధపడ్డారు. తల్లి మరణంతో ఆయన డిప్రెషన్‌లోకి వెళ్ళారట. కాగా అప్పట్లోనే ఇర్ఫాన్ ఖాన్ “నేను బతికేది కొన్ని రోజులే” అంటూ ఓ వీడియో విడుదల చేయడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా తల్లి మరణంతో కృంగిపోయిన ఇర్ఫాన్‌కు క్యాన్సర్ తిరగబెట్టినట్టు తెలిసింది. ఇర్ఫాన్ ఖాన్ మరణంతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన మరణం బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖులు, సినీ అభిమానులు ఆయన ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియా ద్వారా తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

చిన్నప్పటినుంచే నటనపై ఆసక్తి
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో 1967 సంవత్సరం జనవరి 7న ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు ఇర్ఫాన్‌ఖాన్. చిన్నప్పటి నుంచే అతనికి నటనపై ఆసక్తి ఉండేది. ఎంఏ చదువుతున్నప్పుడు వచ్చిన స్కాలర్‌షిప్ డబ్బులతో ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’లో చేరి ఇర్ఫాన్ నటనలో శిక్షణ తీసుకున్నారు. ఆతర్వాత ముంబయికి వచ్చిన ఆయన చాణక్య, బనేగి అప్నీ బాత్, చంద్రకాంత, డర్ వంటి ఎన్నో సిరీయల్స్‌లో నటించారు. సంజయ్ ఖాన్ తెరకెక్కించిన ‘జై హనుమాన్’ సీరియల్‌లో ఇర్ఫాన్ వాల్మీకి పాత్రలో నటించి తన నటనతో బుల్లితెర ప్రేక్షకులను మెప్పించారు.

సినీ ప్రపంచంలోకి…
ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్ చిత్రం ‘సలామ్ బాంబే’ (1988)తో ఇర్ఫాన్ వెండితెరకు పరిచయమయ్యారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా నుంచి ఆయన పాత్రను తొలగించడం జరిగింది. ఇక ‘సలామ్ బాంబే’ చిత్రం ఆస్కార్‌కు నామినేట్ కావడం విశేషం. ఆ తర్వాత ఏక్ డాక్టర్ కీ మౌత్, ది గోల్ చిత్రాల్లో ఇర్ఫాన్ నటించారు. ఆసిఫ్ కాపాడియా దర్శకత్వం వహించిన ‘ది వారియర్’ (2001) చిత్రంలో ఇర్ఫాన్ కీలకపాత్రలో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇర్ఫాన్ ఖాన్ బాలీవుడ్ చిత్రం ‘రోగ్’లో ఇన్‌స్పెక్టర్ ఉదయ్ రాథోడ్ పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను అలరించారు. ‘రోగ్’ సినిమా తర్వాత ఇర్ఫాన్‌కు బాలీవుడ్‌లో వరుసగా అవకాశాలు వచ్చాయి. దీంతో ఆయన బాలీవుడ్ చిత్రాలతో పాటు హాలీవుడ్ చిత్రాల్లో నటించి భారతదేశం గర్వించదగ్గ గొప్ప నటుడిగా నిలిచారు.

హాసిల్, స్లమ్ డాగ్ మిలియనీర్, ది లంచ్‌బాక్స్, పీకూ వంటి చిత్రాలతో మెప్పించిన ఆయనకు నాలుగు ఫిలింఫేర్ అవార్డులు దక్కాయి. 2011లో భారత ప్రభుత్వం ఇర్ఫాన్‌ఖాన్‌ను ‘పద్మశ్రీ’ అవార్డుతో సత్కరించింది. 2013లో విడుదలైన ‘పాన్ సింగా తోమర్’ చిత్రంలో నటనకు గాను ఆయనకు జాతీయ అవార్డు దక్కింది. ఇక పీకూ, హిందీ మీడియం చిత్రాలు ఆయనకు ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డులను అందించాయి. ఇర్ఫాన్ ఖాన్ నటించిన ‘లైఫ్ ఆఫ్ ఫై’ నాలుగు ఆస్కార్ అవార్డులను గెలుపొందింది. ఇక క్యాన్సర్ చికిత్స అనంతరం ఇర్ఫాన్ ‘అంగ్రేజీ మీడియం’ సినిమాలో నటించారు. ఈ సినిమా సమయంలో అనారోగ్యానికి గురి కావడంతో ఆయన ప్రమోషన్స్‌కు కూడా దూరంగా ఉన్నారు. ఈ ఏడాది మార్చి 13న ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమా తర్వాత ఆయన ఏ చిత్రానికీ సంతకం చేయలేదు. ఇర్ఫాన్ ఖాన్ అంత్యక్రియలను ముంబయిలో నిర్వహించారు.

మహేష్ చిత్రంలో…
సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ‘సైనికుడు’ సినిమాలో ఇర్ఫాన్ ఖాన్ విలన్ రోల్ చేశారు. ఈ చిత్రంలో తన అద్భుతమైన నటనతో అతను ప్రేక్షకులను మెప్పించారు.

ప్రపంచ సినిమా, నాటక రంగానికి తీరని లోటు…
ఇర్ఫాన్ మరణం పట్ల భారత ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇర్ఫాన్ మరణం ప్రపంచ సినిమాకు, నాటక రంగానికి తీరని లోటు అని అన్నారు. నటనా రంగంలో అసమాన ప్రతిభను కనపరిచిన ఇర్ఫాన్ ఎప్పటికీ గుర్తుండిపోతారని… ఇర్ఫాన్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని మోదీ ట్వీట్ చేశారు. అలాగే మరోవైపు ఇర్ఫాన్ మృతిపై అమిత్ షా స్పందిస్తూ… ఈ మరణవార్త తనను ఎంతో ఆవేదనకు గురి చేసిందని చెప్పారు. అసమాన నటనతో ప్రపంచ స్థాయిలో ఇర్ఫాన్ పేరు ప్రఖ్యాతులను సొంతం చేసుకున్నారని కొనియాడారు. ఆయన మరణంతో దేశం ఒక గొప్ప నటుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇర్ఫాన్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. అదేవిధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్… ఇర్ఫాన్ మృతి పట్ల తన సంతాపాన్ని తెలియజేశారు.

Irrfan Khan passed away
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News