Monday, April 29, 2024

రాహుల్‌కు‘అమేథిలో పట్టిన గతే’

- Advertisement -
- Advertisement -

బిజెపి వాయనాడ్ అభ్యర్థి సురేంద్రన్
వాయనాడ్ : 2019లో నాలుగు లక్షల పైచిలుకు వోట్ల ఆధిక్యంతో రాహుల్ గాంధీ విజయం సాధించిన నియోజకవర్గంలో ఈ దఫా ఆయన ప్రత్యర్థి, బిజెపికి చెందిన కె సురేంద్రన్ భారీ ప్రకటన చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్‌కు ‘అమేథి ఫలితమే ఎదురవుతుంది’ అని సురేంద్రన్ సోమవారం ధీమా వ్యక్తం చేశారు. కేరళలోని వాయనాడ్‌లో తమ అభ్యర్థిగా సురేంద్రన్ పేరును బిజెపి ఆదివారం ప్రకటించిన విషయం విదితమే. కేరళలో రానున్న లోక్‌సభ ఎన్నికలు వాయనాడ్‌కు సంబంధించి ఆసక్తికరంగా మలుపు తిరిగింది. రాహుల్ గాంధీ తన సీటును నిలబెట్టుకునేందుకు పోటీ చేస్తుండగా, వాయనాడ్‌లో సీనియర్ సీపిఐ నాయకురాలు అన్నీరాజాను లెఫ్ట్ ఫ్రంట్ నిలబెట్టింది.

‘ఇండియా’ కూటమికి చెందిన ఇద్దరు సీనియర్ నేతలు రాహుల్‌ను, అన్నీ రాజాను ఢీకొనేందుకు సురేంద్రన్ అభ్యర్థిత్వాన్ని బిజెపి కేంద్ర నాయకత్వం ప్రకటించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో వాయనాడ్‌లో ఎన్‌డిఎ అభ్యర్థికి కేవలం 7.25 శాతం వోట్లు వచ్చాయి. తన అభ్యర్థిత్వంపై ప్రకటన వెలువడిన తరువాత సురేంద్రన్ మీడియాతో మాట్లాడుతూ, రాహుల్ గాంధీకి క్రితం సారి అమేథిలో పట్టిన గతే ఇప్పుడు వాయనాడ్‌లో పడుతుందని అన్నారు. ‘అభివృద్ధి సంక్షోభం ఉన్న నియోజకవర్గం వాయనాడ్. రాహుల్ గాంధీ నియోజకవర్గానికి ఏమీ చేయలేదు. ఆయనకు అమేథీ ఫలితమే వాయనాడ్‌లో ఎదురవుతుంది’ అని సురేంద్రన్ చెప్పారు.

క్రితం సారి రాహుల్ గాంధీ 4.31 లక్షలకు పైగా వోట్ల ఆధిక్యంతో సిపిఐ ప్రత్యర్థి పిపి సునీర్‌ను ఓడించారు. విజెపి మిత్ర పక్షం భారత్ ధర్మ జనసేన (బిడిజెఎస్) తమ అధ్యక్షుడు తుషార్ వెల్లపల్లిని వాయనాడ్‌లో నిలబెట్టింది. వెల్లపల్లికి 78816 వోట్లు మాత్రమే పోలయ్యాయి. ‘కేంద్ర నాయకత్వం నాపై ఒక భారం మోపింది. వాయనాడ్ నియోజకవర్గంలో పోటీ చేయవలసిందిగా వారు నన్ను కోరారు. ఇండియా కూటమి సీనియర్ నేతలు ఒకే నియోజకవర్గంలో పరస్పరం ఎందుకు పోటీ చేస్తున్నారని వాయనాడ్ ప్రజలు కచ్చితంగా అడుగుతారు’ అని సురేంద్రన్ చెప్పారు.

ఇది ఇలా ఉండగా, ప్రత్యర్థులను బట్టి లెఫ్ట్ పార్టీలు అభ్యర్థిత్వాలను నిర్ణయించవని అన్నీ రాజా చెప్పారు. వాయనాడ్ సీటుకు అభ్యర్థిని చివరగా బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రకటించింది. సిపిఐ (ఎం) నాయకత్వంలోని లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్) కాంగ్రెస్ కన్నా చాలా ముందుగానే అన్నీ రాజా అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది. ‘ప్రచారంలో మేము ఎంతో ముందంజ వేశాం. వోటర్ల స్పందన మా నమ్మకాన్ని పెంచుతోంది’అని అన్నీ రాజా మీడియాకు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News