Saturday, April 27, 2024

కాలేశ్వరం తరహాలో పాలమూరు … రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశాం

- Advertisement -
- Advertisement -

* వచ్చే సంవత్సరం నాటికి పాలమూరు .. రంగారెడ్డి ద్వారా నీళ్లు తెస్తాం
* పాలమూరు కాల్వ పనులకు త్వరలోనే టెండర్లు
* రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా.వి. శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్ : తెలంగాణ రాష్ట్రం రాకపూర్వం తెలంగాణలో సాగునీటి సంగతి దేవుడుఎరుగు, తాగడానికి సైతం నీరు లేకుండేదని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా.వి. శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బుధవారం జిల్లా నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో నిర్వహించిన సాగునీటి దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అతి కొద్ది సమయంలోనే చిన్న రాష్ట్రం అయినప్పటికీ దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని, భారతదేశంలో యాసంగిలో మొత్తం దేశ వ్యాప్తంగా 96 లక్షల ఎకరాలలో వరిపంట సాగైతే, అందులో 56 లక్షలు కేవలం తెలంగాణ నుండి స్టార్ట్ అయిందని తెలిపారు. దీనిని బట్టి మన పంటలు ఏ స్థాయిలో ఉన్నాయో ఆలోచించాలని తెలిపారు. గతంలో ఇరిగేషన్ శాఖకు ఎలాంటి గుర్తింపు ఉండేది కాదని ఇప్పుడు అందరికన్నా అత్యంత అద్బుతంగా ఇరిగేషన్ శాఖ పని చేస్తున్నదని మంత్రి తెలిపారు. 2014కు పూర్వం మే , జూన్ మాసంలో ఎండిపోయిన కంకులతో రైతులు కన్నీటితో కాలం వెళ్లబుచ్చేవారని, అలాంటిది ఎండాకాలంలో సైతం ఇప్పుడు చెరువులు, కాలువలు నీళ్లు ఉన్నాయని తెలిపారు.

పాలమూరు .. రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి అయితే ఇంకా అద్భుతంగా ఉంటుందని, కర్వెన, ఉదండాపూర్ రిజర్వాయర్లు పూర్తైతే మహబూబ్‌నగర్ జిల్లా సస్యశ్యామలమవుతుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మంగళవారం నాగర్‌కర్నూల్ పర్యటనలో పాలమూరు … రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి త్వరలోనే సాగునీరు అందిస్తామని ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కర్వెన, ఉదండాపూర్ రిజర్వాయర్లు పూర్తైతే పిలిచి పనులను పూర్తి చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో చేపట్టనున్న చెక్ డ్యాంల నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలవాలని ఇంజనీరింగ్ అధికారులని ఆదేశించడమే కాక వచ్చే సంవత్సరం నాటికి పనులు పూర్తి చేయాలని అన్నారు. జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల వద్ద పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని, బోటింగ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మహబూబ్‌నగర్ పట్టణంలోని పెద్ద చెరువును రాష్ట్రంలోనే మొదటి మినీ ట్యాంక్ బండ్‌గా ఏర్పాటు చేశామని, ఒకప్పుడు దుర్గంధభరితంగా ఉన్న మినీ ట్యాంక్ బండ్‌ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులను ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకొని పరిశీలించాలని , ముఖ్యంగా మినీ ట్యాంక్ బండ్ రివిట్మెంట్ పనులపై స్థానిక ప్రజా ప్రతినిధులు దృష్టి సారించాలని , అదే విధంగా రిటైర్డ్ ఉద్యోగులు సైతం అభివృద్ధి పనులలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

మన ఊరు .. మన భవిష్యత్తుగా భావించి ఉద్యోగులు పని చేయాలని ఆయన అన్నారు. జిల్లా సాగునీటి ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ రమణారెడ్డి మాట్లాడారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్ కె.సి. నర్సిములు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్‌ర్డె, రైతుబంధు కో ఆర్డీనేటర్ గోపాల్ యాదవ్ , ఎస్‌ఈ చక్రధరం, ఈఈలు దయానంద్, వెంకటయ్య, పిఏసిఎస్ అధ్యక్షులు రాజేశ్వర్‌గౌడ్, డిఈ మనోహర్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ సేవలందించిన సాగునీటి శాఖ ఇంజనీర్లను మంత్రి జ్ఞాపికలతో సత్కరించారు. ఈ సందర్భంగా సాగునీటి ప్రాజెక్టుల ఇంజనీరింగ్ అధికారులు మంత్రిని సన్మానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News