Friday, April 26, 2024

వ్యాక్సిన్ల కొనుగోలు అంత సులభం కాదు: కేంద్రం

- Advertisement -
- Advertisement -

We Talks with Foreign firms for Covid 19 Vaccine: Centre

వ్యాక్సిన్ల కొనుగోలు అంత సులభం కాదు
విదేశీ వ్యాక్సిన్ల దిగుమతికి ప్రయత్నిస్తూనే ఉన్నాం
ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్‌తో పలు దఫాలు చర్చించాం
దేశీయంగా ఉత్పత్తి పెంచేందుకు చర్యలు
త్వరలోనే మరిన్ని టీకాలు రానున్నాయ్
ప్రపంచమంతటా టీకాల కొరత ఉంది
రాష్ట్రా కోరిక మేరకే వాటికి స్వేచ్ఛ ఇచ్చాం
కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ అపోహలపై కేంద్రం వివరణ

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ వ్యాక్సిన్ ప్రక్రియ మందకొడిగా సాగడంపై పలు విమర్శలు వెల్లువెత్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ అపోహలపై కేంద్ర ప్రభుత్వం వివరణ విడుదల చేసింది. విదేశాల నుంచి వ్యాక్సిన్ల దిగుమతుల కోసం కేంద్రం ప్రయత్నించడం లేదనే మాట నిజం కాదని స్పష్టం చేసింది. ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వంటి పలు విదేశీ వ్యాక్సిన్ తయారీ సంస్థలతో ఇప్పటికే పలు దఫాలు సంప్రదింపులు, చర్చలు జరిగాయని తెలిపింది. అంతర్జాతీయంగా వ్యాక్సిన్ల కొనుగోలు అంటే సూపర్ బజార్‌లో సరకులు కొన్నంత సులభం కాదని, అంతర్జాతీయంగా డిమాండ్‌కు తగినంత ఉత్పత్తి లేకపోవడం వల్ల కంపెనీలు తమ ప్రాధాన్యతలను తామే నిర్ణయించుకుంటాయని తెలిపింది. రష్యాలోని స్పుత్నిక్‌వి వ్యాక్సిన్‌కు క్లినికల్ ట్రయల్స్ అనుమతులు, దిగుమతులు వేగంగా జరిగాయని, అంతర్జాతీయ వ్యాక్సిన్ తయారీ సంస్థలను భారత్‌లో తయారు చేసి, ఇక్కడి మార్కెట్‌కు అందించి ఆ తర్వాత ప్రపంచానికి ఎగుమతి చేయాల్సిందిగా కోరుతున్నామని తెలిపింది.

‘భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియపై అపోహలు వాస్తవాలు’ (మిత్స్ అండ్ ఫ్యాక్ట్ ఆన్ ఇండియాస్ వ్యాక్సినేషన్ ప్రాసెస్)పేరిట విడుదల చేసిన ప్రకటనలో ఈ వివరాలు తెలిపింది. ఇతర దేశాల వ్యాక్సిన్లకు భారత్‌లో అనుమతి ఇవ్వలేదన్న వార్తలు కూడా నిజం కాదని, అమెరికా,యూరోపియన్ యూనియన్, బ్రిటన్, జపాన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన వ్యాక్సిన్లకు భారత దేశంలో అనుమతిస్తూ గత ఏప్రిల్‌లోనే ప్రకటన జారీ చేశామని కేంద్రం గుర్తు చేసింది. దేశీయ ఉత్పత్తి సామర్థం పెంచడంలోను కేంద్ర ప్రభుత్వం చురుగ్గా పని చేస్తోందని, కోవాగ్జిన్ నెలకు ఒక కోటి డోసుల ఉత్పత్తి సామర్థ్యంనుంచి అక్టోబర్ నాటికి 10 కోట్ల డోసుల స్థాయికి చేరుకుంటుందని తెలిపింది. అలాగే కొవిషీల్డ్ నెలకు 6.5 కోట్ల డోసులనుంచి 11 కోట్ల డోసులకు పెరగనుందని, స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌ను డాక్టర్ రెడ్డీస్ సమన్వయంతో ఆరు కంపెనీల్లో ఏకకాలంలో ఉత్పత్తి చేయనుందని తెలిపింది. జైడస్ క్యాడిల్లా, బయోలాజికల్‌ఇ, జెన్నోవా సంస్థల స్వదేశీ వ్యాక్సిన్లు కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నాయని తెలిపింది.
కంపల్సరీ లైసెన్సింగ్ సాధ్యపడే అంశం కాదు
వ్యాక్సిన్ల తయారీకి అవసరమైన మానవ వనరుల తయారీ, శిక్షణ, బయో సేఫ్టీ లేబరేటరీలు వంటి పలు అంశాలు ఇందులో మిళితమై ఉంటాయని, టెక్నాలజీ బదిలీ ద్వారా భారత్ బయోటెక్ ఇప్పటికే మరో మూడు సంస్థలతో కలిసి కొవాగ్జిన్‌ను ఉత్పత్తి చేస్తోందని తెలిపింది. మోడెర్నా సంస్థ 2020లోనే తమ వ్యాక్సిన్‌ను ఇంకెవరైనా ఉత్పత్తి చేసినా కేసులు వేయబోమని ప్రకటించింది. అయినా ఇప్పటివరకు ఎవరూ ఉత్పత్తి చేయలేకపోయారు. లైసెన్సింగ్‌తో మాత్రమే ఇది సాధ్యపడదు. వ్యాక్సిన్ల తయారీ అంత సులభమైన అంశమైతే అభివృద్ధి చెందిన దేశాల్లోను వ్యాక్సిన్ల కొరత ఎందుకు ఏర్పడిందని ప్రశ్నించింది.
చిన్నారులకు ప్రపంచంలో ఎక్కడా వ్యాక్సిన్లు ఇవ్వడం లేదు

వ్యాక్సిన్ల సేకరణలో కేంద్రం బాధ్యతలనుంచి తప్పుకొని రాష్ట్రాలకు వదిలేయలేదు. రాష్ట్రాల అభ్యర్థన మేరకే వ్యాక్సిన్ల సేకరణ వెసులుబాటును రాష్ట్రాలకు కల్పించామని కేంద్రం స్పష్టం చేసింది. ఇక ప్రపంచంలో ఏ దేశంలోను చిన్నారులకు కొవిడ్ వ్యాక్సిన్లు ఇవ్వడం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఓ) కూడా ఇప్పటివరకు చిన్నారులకు వ్యాక్సినేషన్ విషయంలో ఎలాంటి సిఫార్సులు చేయలేదు. వాట్సాప్ గ్రూపుల్లో కొందరు రాజకీయ నాయకులు చేసే ప్యానిక్ సమాచారం ఆధారంగా చిన్నారులకు వ్యాక్సినేషన్ అంశాన్ని నిర్ణయించలేము. రాజకీయ నాయకులు రాజకీయమే చేయాలనుకుంటారు. వ్యాక్సినేషన్‌పై నిర్ణ్ణయాలు తీసుకోవలసింది శాస్త్రవేత్తలు, నిపుణులు మాత్రమేనని కేంద్రం స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం మొత్త వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జనవరినుంచి ఏప్రిల్ వరకు నడిపిందని, మే నెలతో పోలిస్తే అదంతా బాగా సాగిందని ప్రకటన తెలిపింది. అయితే ఈ మూడు నెలల సమయంలో ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్ల బాగా పెంచుకోలేకపోయిన రాష్ట్రాలు సైతం వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత విస్తృతం చేయలనుకున్నాయని తెలిపింది. రాష్ట్రాలకు ఎక్కువ అధికారం ఇవ్వాలన్న పదేపదే డిమాండ్లు చేసిన ఫలితంగానే ఆరోగ్యం రాష్ట్రాల పరిధిలోకి వచ్చిందనే విషయాన్ని కేంద్రం గుర్తు చేసింది.

We Talks with Foreign firms for Covid 19 Vaccine: Centre

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News