Saturday, April 27, 2024

2020కి స్వాగతం

- Advertisement -
- Advertisement -

Welcome to 2020

 

ఎల్లప్పుడూ ముందుకు సాగిపోతూ ఉండే నిరంతర చలన శీలి కాలం. దాని అడుగులంటి అడుగేయగలిగేవారే చైతన్య దీప్తులుగా వెలుగుతారు. కాలాన్ని వెనక్కి నడిపించాలనుకునేవారు మాత్రం చతికిలబడతారు. కొద్ది గంటల క్రితం కనుమరుగైపోయి కాలగర్భంలో కలిసిపోయిన 2019 భారత జాతి చరిత్రలో అనేక చీకటి ఘట్టాలు లిఖించింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో పతన అధ్యాయాలను పేర్చి దేశ ప్రజలు అంతకు ముందెన్నడూ ఎరుగని చేదును చవిచూపింది. గత ఫిబ్రవరి 14న అప్పటి జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా వద్ద సిఆర్‌పిఎఫ్ వాహన శ్రేణిపై ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది జవానులు దుర్మరణం పాలైన ఘటన దేశాన్ని అమితంగా ప్రభావితం చేసింది. ఆ నెల 26 వ తేదీన పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో గల ఉగ్రవాదుల స్థావరంపై భారత వైమానిక దళం జరిపిన మెరుపు దాడి పుల్వామాకు కొనసాగింపుగానే దేశాన్ని పట్టి కుదిపింది.

ఈ రెండు ఘటనలు దేశ ప్రజల్లో ఉగ్రవాదం పట్ల, పాకిస్థాన్ పట్ల ప్రతీకార దృష్టిని పెంచాయి. ఓటు కు మతపరమైన పూనకం వచ్చింది. ఆ తర్వాత ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు 7 విడతల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికలపై అది తన ముద్రను వేసింది. నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ 303 స్థానాలను గెలుచుకొని లోక్‌సభలో ఎదురులేని శక్తిగా అవతరించింది. అరుదైన విజయాన్ని రికార్డు చేసింది. తనకు దాదాపు ఉనికే లేని బెంగాల్‌లో బిజెపి 18 లోక్‌సభ స్థానాలు గెలుచుకోగలిగింది. ఇటువంటి బలమైన జనాదేశం సాధించుకున్న బిజెపి ఎన్నో మేలైన నిర్ణయాలతో దేశాన్ని మెరిపిస్తుందని ప్రజలను సంతోష సంబురాల్లో తేలియాడిస్తుందని పెట్టుకున్న ఆశలు రుజువు కాలేదు. గడచిన 7 మాసాల బిజెపి పాలన హిందుత్వ అజెండాను అమలు పరచడానికే అంకితమయింది.

ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలు నామమాత్రంగా మారిపోడంతో దాని మాటకు, ఆటకు అడ్డులేకుండాపోయింది. అంతకు ముందు వివాదాస్పద అంశాల జాబితాలో చేరి చాలా కాలం పాటు కోమాలోకి వెళ్లిపోయిన ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామాలయ నిర్మాణం వంటి అంశాలు ఒక్కసారిగా ప్రాణం పోసుకుని ముందుకు దూసుకొచ్చాయి. దశాబ్దాల పాటు జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కలిగించిన రాజ్యాంగం 370, 35 ఎ అధికరణలను రద్దు చేయడం వివాదాస్పమైంది. అలాగే జమ్మూ కశ్మీర్‌ను మూడు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం ఆశ్చర్యం కలిగించింది. ఈ చర్యలకు నిరసనగా కశ్మీర్ లోయ ఒక్కటయింది. అక్కడ ఉగ్రవాదులు చెలరేగుతారనే అంచనాతో చాలా రోజుల పాటు సెల్‌ఫోన్ సంబంధాలను లేకుండా చేయడం, ఇంటర్‌నెట్‌కు తెర దించడం, ఫారుఖ్ అబ్దుల్లా సహా ప్రతిపక్ష నేతలను నిర్బంధంలో ఉంచడం వంటి చర్యలు ప్రజాస్వామ్య స్వేచ్ఛలను హరించాయి.

ఫారుఖ్ అబ్దుల్లాను కోర్టు ముందు ఉంచనవసరం లేకుండానే రెండేళ్ల పాటు నిర్బంధంలో కొనసాగించడానికి అవకాశమిస్తున్న ప్రజా భద్రత చట్టం కింద అరెస్టు చేశారు. దీని తర్వాత అయోధ్యలో వివాదాస్పద స్థలంలో రామాలయ నిర్మాణానికి అనుకూలంగా నవంబర్ 9వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మరో దిగ్భ్రాంతికర పరిణామం. అలాగే డిసెంబర్ 11న పార్లమెంటు చేసిన పౌరసత్వ సవరణ చట్టం దేశంలోని పలు రాష్ట్రాల్లో, అనేక నగరాల్లో అశాంతిని రేపింది. ప్రజలు ముఖ్యంగా విద్యార్థులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. వారిని అదుపు చేయడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో 25 మంది మరణించారు. ఎక్కువగా ఉత్తరప్రదేశ్‌లో 19 మంది దుర్మరణం పాలయ్యారు.

అసోంలో చేపట్టిన మాదిరిగానే దేశమంతటా జాతీయ పౌర చిట్టాను తయారు చేయిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒకటికి రెండు సార్లు పార్లమెంటులో ప్రకటించడం దానికి నిరసన వెల్లువెత్తడంతో జాతీయ జనాభా రిజిస్టర్‌ను తీసుకు రావాలని కేంద్ర మంత్రి మండలి నిర్ణయించడం, దేశంలోని ముస్లిం మైనారిటీల్లోనూ, సెక్యులర్ ప్రజాస్వామిక వాదుల్లోనూ తీవ్ర అసంతృప్తిని కలిగించింది. ఇలా ప్రజలను మతపరంగా విభజించే నిర్ణయాలకే ప్రాధాన్యతనిస్తున్న ప్రధాని మోడీ ప్రభుత్వం ఆర్థిక రంగంలో ఎటువంటి పురోగతిని సాధించలేకపోగా కొత్త పతనాలను చవిచూపింది.

తయారీ రంగం ఎన్నడూలేనంతగా డీలాపడిపోయింది. కార్ల విక్రయం కనిష్ఠ స్థాయికి చేరుకుంది. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. వృద్ధి రేటు అధోగమనంలో కొత్త పుంతలు తొక్కింది. సామాజికంగా ఉన్నావో బాధితురాలి సజీవ దహనం, హైదరాబాద్ దిశ దుర్ఘటన వంటివి కంట నీరు తెప్పించాయి. ఇలా అన్ని రంగాల్లోనూ ప్రజలకు వివాదాలను, విషాదాలనే అనుభవంలోకి తెచ్చిన దురదృష్టకర సంవత్సరంగా 2019 గడిచిపోయింది. నేడు పురివిప్పుకున్న నూతన దశాబ్ది సంవత్సరం 2020లోనైనా దేశ ప్రజలకు విశేషమైన మంచి జరగాలని కోరుకుందాం.

Welcome to 2020
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News