Thursday, May 9, 2024

ఇక ఆప్ టార్గెట్ బీహార్?

- Advertisement -
- Advertisement -

Kejriwal

 

దేశ రాజధాని ‘ఫలితాలపై’ కేజ్రీవాల్ క్రేజ్
 బీహార్‌లో ప్రత్యామ్నాయం అందిస్తాం : ఆప్

పాట్నా: ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే, దాని ప్రభావం బీహార్‌పై ఉండవచ్చు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎన్నికలు జరగబోయే రాష్ట్రం బీహార్. అక్కడ మరో ఏడెనిమిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. కాబట్టి కేజ్రీవాల్ పార్టీ బీహార్‌పై కన్నేస్తోంది. బీహార్‌లో చెప్పుకోదగ్గ బలంలేని ఆప్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో మహా కూటమి (గ్రాండ్ అలయెన్స్ జిఎ)లో భాగస్వామి కావడంలో విఫలమైంది. అయినా కిషన్‌గంజ్, భాగల్పూర్, సీతామార్హిలలో పోటీచేసింది. కానీ, విజయభేరి మోగించిన ఎన్‌డిఏ ముందు నిలవలేకపోయింది. 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా బిజెపి కూటమికి మద్దతిచ్చింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లో మొత్తం 40 స్థానాలకుగాను 39 సీట్లకు ఆప్ పోటీచేసినా ఒక్కటీ గెలవలేకపోయింది. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని వచ్చిన ఆప్ బీహార్ శాఖ అధ్యక్షుడు శత్రుఘ్న సాహు మాట్లాడుతూ రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు తమ పార్టీ అన్ని స్థానాలకూ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. బీహార్‌లో ‘జన సంవాద్ యాత్ర’ ద్వారా ప్రజలతో నేరుగా మాట్లాడుతూ అట్టడుగు స్థాయిలో పార్టీని పటిష్టం చేసే పని ఇప్పటికే మొదలైందని కూడా సాహు చెప్పారు. ‘మీడియాలో మాకు అంతగా ప్రాధాన్యం లభించకపోయినా ప్రజల నుంచి వస్తున్న స్పందన ప్రోత్సాహకరంగా ఉంది’ అన్నారు. ‘నితీష్‌కుమార్ సారథ్యంలోని ఎన్‌డిఏ ప్రభుత్వంపట్ల జనం సంతోషంగా లేరు. వారు మార్పును కోరుకుంటున్నారు. అయితే తేజస్వి ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని ఆర్‌జెడిలో వారికి ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. ఆర్‌జెడి పాలనలో జరిగింది వాళ్ల మనసుల్లోంచి తొలగిపోలేదు. మేము విశ్వసనీయమైన, కొత్త ప్రత్యామ్నాయాన్ని అందిస్తాం’ అని శత్రుఘ్న సాహు చెప్పారు.
ఎందుకింత ఆలస్యం? : కేజ్రీవాల్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత శాతం పోలింగ్ జరిగిందో ఎన్నికల సంఘం (ఇసి) ప్రకటించవలసి ఉన్న తరుణంలో …జరుగుతున్న ఆలస్యం పట్ల ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలింగ్ ముగిసి చాలా గంటలు గడిచినా ఎన్నికల సంఘం పోలింగ్ శాతం ఎందుకు ప్రకటించడంలేదో తెలీడం లేదని ఆయన విస్మయం చెందారు. ‘ఇది చాలా దిగ్భాంతి కలిగిస్తోంది. ఇసి ఏం చేస్తోంది? పోలింగ్ శాతాన్ని ఎందుకు విడుదల చేయడం లేదు?’ అని కేజ్రీవాల్ సూటిగా అడిగారు. 61.46 శాతం ఓటింగ్ జరిగిందని శనివారం రాత్రి ఇసి చివరిసారి తెలిపింది. కానీ కొత్త ప్రభుత్వం ఎన్నికకు దేశ రాజధానిలో జరిగిన పోలింగ్ శనివారం సాయంకాలం 6 గంటలకే ముగిసింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నాయకుడు సంజయ్‌సింగ్ విలేకరులతో మాట్లాడుతూ ఓటింగ్ శాతం వివరాల్ని విడుదల చేసేందుకు ఇసి సిద్ధంగా లేకపోవడం బహుశ దేశ చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు’ అన్నారు.

ఢిల్లీలో 62.59 శాతం పోలింగ్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో 62.59 శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలయిన ఓట్లశాతంపై ఆదివారం ఎన్నికల సీనియర్ అధికారులు ప్రకటన వెలువరించారు. 70 మంది సభ్యుల ఢిల్లీ అసెంబ్లీకి శనివారం పోలింగ్ జరిగింది. పూర్తి వివరాలు అందిన మీదట పోలయిన ఓట్లశాతం 62.59గా ఉందని నిర్థారణ అయినట్లు ఢిల్లీ కేంద్ర ఎన్నికల అధికారి కార్యాలయ వర్గాలు తెలిపాయి. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఓట్ల శాతం 67.47 శాతంగా ఉంది. ఈ క్రమంలో ఈసారి ఓటు హక్కు వినియోగించుకున్న వారి సంఖ్య తగ్గినట్లు వెల్లడైంది. ఎన్నికలు ముగిసి రోజు గడిచినా ఓటింగ్ శాతం ప్రకటించకపోవడంపై ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ నిరసన వ్యక్తం చేశారు. ఈ దశలోనే ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి పోలింగ్ శాతం గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. శనివారం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీపార్టీ ఘన విజయం సాధిస్తుందని, బిజెపి దూకుడు ధోరణి వల్ల ఫలితం లేకుండా పోయిందని ఎగ్జిట్ పోల్స్ సర్వేలలో వెల్లడైంది. కాంగ్రెస్‌కు కేవలం 1 నుంచి 3 సీట్లే వస్తాయని తేల్చారు. మంగళవారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు. పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

W’ll Alternative in Bihar Assembly Polls 2020: Kejriwal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News