Saturday, April 27, 2024

కార్మిక, కర్షక నిరసన

- Advertisement -
- Advertisement -

Workers and peasants protest

 

ఎన్నికల విజయాలు ఇచ్చిన బలంతో ఎదురులేని అధికారాన్ని అనుభవిస్తున్న ప్రధాని మోడీ ప్రభుత్వం నిజస్వరూపం ఈ నెల 26, 27 (గురు, శుక్రవారాలు) తేదీల్లో చోటు చేసుకున్న రెండు ఘట్టాల అద్దంలో ప్రస్ఫుటంగా కనిపించింది. ఒకవైపు దేశ వ్యాప్తంగా కార్మికులు 10 యూనియన్ల ఐక్య సారథ్యంలో నూతక కార్మిక చట్టాలకు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటైజేషన్‌కు వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెట్టడానికి వ్యతిరేకంగా గురువారం నాడు జాతీయ స్థాయి సమ్మె నిర్వహించారు. మరొక వైపు కేంద్రం తీసుకు వచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను, దాని విద్యుత్ సంస్కరణలను నిరసిస్తూ శుక్రవారం నాడు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన వేలాది మంది రైతులు అనేక అడ్డంకులు ఎదుర్కొని దేశ రాజధానిని ముట్టడించారు. దేశంలోని సకల ఉతత్తులకు మూలస్తంభాలైన కార్మిక, కర్షక శక్తులు రెండూ పరస్పర సంఘీభావంతో జాతీయ స్థాయిలో ఈ విధంగా నిరసన పర్వాన్ని రక్తికట్టించడం చరిత్రాత్మకం. మోడీ ప్రభుత్వం కనీస స్థాయి చర్చకు కూడా అవకాశమివ్వకుండా అతి తీవ్రమైన నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుంటున్నది.

ఒకవైపు దేశం కరోనా మృత్యుకోరల్లో విలవిల్లాడుతున్నప్పుడే ప్రజల జీవితాలపై వ్యతిరేక ప్రభావం చూపించే సమూల ఆర్థిక సంస్కరణలను తీసుకు వస్తున్నది. ఆ విధంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఆసేతుశీతాచలం అసంతృప్తిని రగిలిస్తున్నది. సంబంధిత, ప్రభావిత వర్గాలతో మాట్లాడి, ఒప్పించి లేదా మధ్యస్థంగా ఒక అంగీకారాన్ని సాధించి తాము కోరుకున్న చర్యలను పాలకులు చేపట్టడం ప్రజాస్వామిక విధివిధానం. సామాజిక మాధ్యమాల్లో, ఇతర సమాచార సాధనాల్లో దూషణలు, విమర్శలు, బెదిరింపుల వంటి వాటిని అదుపు చేయడానికి వీలుగా పోలీసు చట్టాన్ని సవరిస్తూ తాను ఈ మధ్య తీసుకు వచ్చిన ఒక ఆర్డినెన్స్‌పై విమర్శలు వెల్లువెత్తగానే దాని అమలును నిలిపి వేస్తున్నట్టు ప్రకటించి కేరళ ప్రభుత్వం వెనుకకు తగ్గింది. ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు మాత్రం అటువంటి ప్రజాస్వామిక మర్యాదలను పాటించడానికి బొత్తిగా సిద్ధంగా లేదని రూఢి అవుతున్నది. విదేశీ పెట్టుబడులను విశేషంగా ఆకట్టుకోడానికనే నెపంతో కార్మిక శక్తి కారుచౌకగా లభించే చర్యలను తలపెట్టింది. రోజుకి 8 గంటలుగా ఉన్న పని సమయాన్ని 12 గంటలు చేయాలని సంకల్పించింది.

వంద మందికి మించిన పని వారున్న సంస్థలను మూసివేయాలనుకున్నప్పుడు ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలన్న నిబంధనను మార్చి ఆ సంఖ్యను 300 లకు పెంచుతూ కొత్త నియమాన్ని రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలలో బిజెపి అధికారంలో ఉండగా తీసుకు వచ్చారు. ఉద్యోగలును తీసుకోడం, తొలగించే విషయాల్లో యాజమాన్యాలకు స్వేచ్ఛను కల్పించి వాటిని ప్రశ్నించే యూనియన్లను ఏర్పాటు చేసుకునేందుకు దారులను ఇరుకు చేసే వైపు కేంద్రం అడుగులు వేస్తున్నది. ఇంకో వైపు బిఎస్‌ఎన్‌ఎల్, ఎల్‌ఐసి వంటి బలమైన ఘనమైన ప్రభుత్వ రంగ దిగ్గజాలను ప్రైవేటుపరం చేయడానికి, బ్యాంకులను సైతం వాటిని కొల్లగొట్టే అలవాటున్న కార్పొరేట్ సంస్థల అదుపులో పెట్టడానికి సాహసిస్తున్నది. కనీస మద్దతు కల్పించే విధానానికి బదులు కార్పొరేట్ శక్తుల దయాదాక్షిణ్యాల మీద రైతులు ఆధారపడక తప్పని స్థితికి అవకాశం కల్పిస్తూ 3 చట్టాలను పార్లమెంటు ఆమోదంతో తీసుకు వచ్చింది.

చిన్న రైతుల వ్యవసాయానికి, పేద మధ్య తరగతి ప్రజలకు ఉచితంగా, చౌకగా తోడ్పడుతున్న విద్యుత్ రంగాన్ని పూర్తిగా పెట్టుబడిదార్ల అధిక లాభార్జన యంత్రంగా మార్చివేసే సంసరణలను అమలులోకి తీసుకు వస్తున్నది. ఇవన్నీ ప్రజా వ్యతిరేక చర్యలేనని ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొన్ని మాసాలుగా పోరాటం చేస్తున్న పంజాబ్, హర్యానా, యుపి రైతులు చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టగా శత్రుదేశంపై దండెత్తిన స్థాయిలో పోలీసులను మోహరించి కేంద్రం వారిని అడ్డుకున్నది. చివరికి పోలీసు కాపలాతో ఢిల్లీలో అడుగు పెట్టడానికి రైతులను అనుమతించింది.

అరెస్టు చేసే రైతులను నిర్బంధించడానికి జైళ్లు చాలవు గనుక ఢిల్లీలోని 9 భారీ స్టేడియంలను తాత్కాలిక జైళ్లుగా మార్చుకోడానికి అనుమతించాలని ఆ రాష్ట్రాన్ని పాలిస్తున్న ఆప్ ప్రభుత్వాన్ని కేంద్రం కోరిందంటే రైతుల పట్ల దానికి ఎంతటి శత్రుభావమున్నదో అంచనా వేయవచ్చు. ఇంతవరకు అవలంబిస్తూ వచ్చిన ప్రజాహిత విధానాలను పూర్తిగా వదులుకొని దేశ ఆర్థిక వ్యవస్థను ఉన్నపళంగా ప్రైవేటు రంగం హస్తగతం చేయడానికి ప్రధాని మోడీ ప్రభుత్వం చూపిస్తున్న వల్లవాలిన ఆసక్తిని, ఆత్రుతను ప్రజలు ఎంత మాత్రం హర్షించడం లేదని కార్మిక, కర్షక వర్గాల నిరసన పర్వం నిరూపించింది. దీనిని గమనించి ఇప్పటికైనా కేంద్రం తన వైఖరిని సవరించుకుంటుందని ఆశిద్దాం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News