Saturday, April 27, 2024

కార్మికులు ఉచిత ఆరోగ్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -
- Advertisement -

మరిపెడ : భవన నిర్మాణ, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల కోసం నిర్వహిస్తున్న ఆరోగ్య శిబిరాలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని సిఎస్‌సి హెల్త్ కేర్ మహబూబాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ జి.శ్రీనివాస్‌రావు అన్నారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని సీతారాంపురం ప్రభుత్వ పాఠశాలలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తుందన్నారు.

ఇందులో భాగంగా కామన్ సర్వీస్ సెంటర్ (సిఎస్‌సి) హెల్త్ కేర్ ఆధ్వర్యంలో లేబర్ కార్డు కలిగిన నిర్మాణ రంగం కార్మికులకు మరిపెడ మండల కేంద్రంలోని సీతారాంపురం ప్రభుత్వ పాఠశాలలో మూడు రోజుల పాటు 50 రకాల వైద్య పరీక్షలు ఉచితంగానే చేయనున్నట్లు తెలిపారు. కార్మిక సంక్షేమ శాఖ జారీ చేసిన లేబర్ కార్డు ఉన్నవారు పరీక్షలు చేయించుకునేందుకు అర్హులని తెలిపారు. కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వైద్య పరీక్షలకు వచ్చేటప్పుడు లేబర్ కార్డుతో పాటు ఆధార్ కార్డు వెంట తీసుకుని రావాలన్నారు. భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు కూలీ పని, తాపీ మేస్త్రీ, ఫ్లంబర్, టైల్స్, పాల్ సీలింగ్, ఎలక్ట్రిషన్, కార్పెంటర్, పేయింటర్స్, బ్రిక్స్ వర్కర్స్, గ్లాస్ వర్కర్స్ తదితర కార్మికులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయడం జరుగుతుందన్నారు.

ముఖ్యంగా ఆధునిక ఆరోగ్య పరీక్షలు బిపి, షుగర్, థైరాయిడ్, హెచ్‌డిఏ, బ్లడ్, మిటమిన్ డి, ఈసిజి, హైపటైటీస్ బి, సి, పిఎఫ్‌టి, ఊపిరితిత్తుల పరీక్షలు, కాన్సర్, ఎయిడ్స్ వంటి వ్యాధులకు పరీక్షలు చేయడం జరుగుతుందన్నారు. పరీక్షలు చేయించుకున్న పది రోజుల్లోపే కార్మికుల రిపోర్ట్‌లను మాన్యువల్‌గా కార్మికులకు అందించి ఆరోగ్య పరిస్ధితిని వివరించనున్నట్లు తెలిపారు. ఆరోగ్యం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించడం జరుగుతుందన్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ప్రభుత్వ దవాఖానల్లో వైద్యం అందించే ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. వైద్య శిబిరాల్లో పరీక్షలు చేయించుకున్న కార్మికులకు తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి పేరుతో ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్‌తో రూపొందించిన హెల్త్ స్క్రీనింగ్ కార్డులు ఇవ్వడంతో పాటు ఆరోగ్య వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నట్లు తెలిపారు.

దీంతో భవన నిర్మాణ సమయంలో ఏదైనా ప్రమాదం జరిగి కార్మికులు దవాఖానల్లో చేరితే వారి హెల్త్ ప్రొఫైల్‌ను పూర్తిగా తెలుసుకుని త్వరగా వైద్యం అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. కార్మికులు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సిఎస్‌సి హెల్త్ క్యాంపులను కార్మికులు వినియోగించుకోవాలన్నారు. మూడు రోజుల పాటు మరిపెడ మండల కేంద్రంలోని సీతారాపురం ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని మరిపెడ మండంలోని భవన నిర్మాణ కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు దుండి వీరన్న, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొండా ఉప్పలయ్య, సిఎస్‌సి హెల్త్ కేర్ జిల్లా కోఆర్డినేటర్ ప్రేమ్ కుమార్, క్యాంపు కోఆర్డినేటర్ ఉపేందర్, యాదగిరి, కార్మికులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News