Friday, April 26, 2024

అంబేద్కర్ ఆశయాలే శరణ్యం

- Advertisement -
- Advertisement -

World recognizes Ambedkar as modern Indian producer

 

కులం పునాదుల మీద ఒక జాతిని గాని, ఒక నీతిని గాని నిర్మించలేరు, మీ బానిసత్వాన్ని మీరే పోగుట్టుకోవాలి. అందుకే దేవుడి మీద కానీ, మేధావుల మీద కానీ ఆధారపడవద్దు, స్వతంత్రంగా జీవించే అవకాశం ఉండి బానిస భావాలు కలిగిన వ్యక్తి కన్నా స్వతంత్ర భావాలున్న బానిస వెయ్యిరెట్లు మేలు… ఎంత ఎక్కువ కాలం బతికామన్నది కాదు… ఎంత గొప్పగా జీవించామన్నదే ముఖ్యం… దేశం అభివృద్ధి చెందడమంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు… పౌరుని నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి… మేకల్ని బలి ఇస్తారు కానీ పులుల్ని బలి ఇవ్వరు… క్రూరత్వం కంటే నీచత్వమే హీనమైనది… ఇలా ఒక వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని పెంచుకోవడానికి, దాన్ని సగౌరవంగా కాపాకోవడానికి ఇలాంటి అనేక విషయాలు చెప్పారు డా॥ భీంరావ్ రాంజీ అంబేద్కర్.

అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న అప్పటి సెంట్రల్ ప్రావిన్సెస్ లో సైనిక స్థావరమైన ‘మౌ’ ఊరిలో (ఇప్పటి మధ్యప్రదేశ్ లో) రాంజీ మాలోజీ సాక్పాల్, భీమాబాయి దంపతులకు జన్మించాడు. నేటి మహారాష్ట్ర లోని రత్నగిరి జిల్లా వారి స్వస్థలం.
ఆయన భారత రాజ్యాంగ నిర్మాత, స్వతంత్ర భారత తొలి న్యాయ శాఖా మంత్రి, స్వాతం త్య్రోద్యమ దళిత నాయకుడు, వృత్తి రీత్యా న్యాయవాది, ఆర్ధిక శాస్త్రవేత్త, సంఘ సంస్కర్త కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేసిన మహోన్నత వ్యక్తి… ఆయన 1956 డిసెంబర్ 6న మరణించాడు.

ఒబామా అమెరికాలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ఆయనను మార్టిన్ లూథర్ కింగ్ తో పోల్చాడు. (మార్టిన్ లూథర్ కింగ్ అమెరికాకు చెందిన ప్రముఖ ఆఫ్రికన్-అమెరికన్ పౌరహక్కుల ఉద్యమకారుడు. మానవహక్కుల పరిరక్షణా ప్రతినిధిగా, నోబెల్ శాంతి బహుమతి పొందిన గొప్ప మానవతా వాదిగా ప్రపంచం గుర్తించిన మహా మనిషి). కొలంబియా విశ్వవిద్యా లయం లో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తూ ఆ శిలాఫలకంపై ‘A Symbol of knowledge‘ (అంబేద్కర్ ఒక విజ్ఞాన ప్రతీక) అని ముద్రించారు. అంబేద్కర్ ను ఆధునిక భారత నిర్మాతగా ప్రపంచం గుర్తిస్తోంది…

కాని తరతరాలుగా కులమనే దొంతరలపై నడుస్తున్న హిందూత్వ శక్తులు అంబేద్కర్ ను ఒక అంటరానివాడుగా పరిగణిస్తూ రాజ్యాంగం ద్వారా తాను సూచించిన సమాజాభివృద్ధి సూత్రాలను తిరస్కరించడం ఆధిపత్య అహాంకారానికి నిదర్శనం. ఆ తత్వమే తరతరాలుగా సమస్త భారత జాతిని తమ చెప్పుచేతల్లో బిగించి, సామాజికంగా ఆర్థికంగా దూరంచేస్తూ విద్య ఉద్యోగం దరిజేరనీయ కుండా అణగదొక్కుతున్నది. దాదాపు 12 వందల సంవత్సరాలుగా ఇస్లామీయులు, 2 వందల సంవత్సరాలుగా ఆంగ్లేయులు పరిపాలించారు. ఆ కాలమంతా భారతీయ అగ్రవర్ణాలనబడేవారు విదేశీ పాలకుల సంరక్షకులుగా చలామణి అవుతూ, వారు విధించే పన్నులు వసూలు చేస్తూ సామాజికంగా, ఆర్థికంగా వెనకబడ్డ ప్రజలను అనగదొక్కుతూ వచ్చారు…

ఆంగ్లేయుల కాలం పారిశ్రామిక విప్లవ దశ కావడంతో వారి వ్యాపార అభివృద్ధి కోసం ఇక్కడి కులవ్యవస్థను పట్టించుకోకుండా కొంత విద్య, ఉద్యోగంతోపాటు వైద్య సౌకర్యాలు కల్పించారు. అయిననూ కులవ్యవస్థ నిర్మూలన అంశంపై ప్రభావం పడలేదు. ఆ కాలంలో ఫూలే, పెరియార్, నారాయణ గురు, సాహుమహరాజ్… వంటి వారి నాయకత్వంలో సామాజికోద్యమాలు జరుగాయి… సరిగ్గా భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించే సమయంలో అంబేద్కర్ అణగారినజన వర్గాల జీవితాల్లో సూర్యుడిలా ఉదయించాడు… స్వాతంత్య్రం సిద్ధించింది. అంబేద్కర్ చేత రాజ్యాంగం రాయబడింది. వెనకబడ్డ తరగతులకు ఓటు, తరిజర్వేషన్లు అనే ఆయుధాలు అందించారు. కాని తెల్ల హస్తాల నుంచి అధికారం చేజిక్కించుకున్న నల్ల హస్తీయులు ఓటు, రిజర్వేషన్లు అనే పదాలను ‘బూచి‘గా మలచుకున్నాయి…

దాంతో మన దేశంలో కులం పునాదులను కూల్చడమంటే చిన్న విషయం కాదని అర్థమైంది. రాజకీయాలు పూర్తిగా కులం పునాదుల మీదనే ఆధారపడ్డాయి. వాటిని కూల్చి మనుగడ సాగించడం నాయకులకు, పాలకులకు నచ్చని విషయమైంది. కుల ప్రాతిపాదిక పథకాలు, కుల రాజకీయాలు, కులపరమైన ఉద్యమాలు, కులాల మధ్య చిచ్చు రగల్చకుండా నాయకులకు, పాలకులకు నిదుర పట్టదు. కుల రహిత సమాజం కావాలని కొందరంటే సమసమాజం నిర్మించాలని కొందరు. కులం పునాదులు కూల్చే సమయం వచ్చిందని కొందరు అంటుంటే, ఆ పునాదులు కూలిస్తే వెనకబడిన కులాల వారికి తీవ్రమైన అన్యాయం జరగుతుందని మరి కొందరు… ఇలా అడుగడుగునా కులంపేరుతో ‘నువ్వూ నేను; మీరూ మేము’ అనే భావనను పెంచుతూనే ఉన్నారు…

పార్లమెంట్ లో రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ చిత్రపటం పెట్టడానికి ఇష్టపడలేదు హిందూవాద పాలకులు. 1990లో తన శతజయంతి సంధర్భంగా విపి.సింగ్ ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించి పార్లమెంట్ లో చిత్రపటం అమర్చింది. అది మింగుడు పడని హిందూత్వ వాదులు పడగ విప్పి బుసలు గొట్టి విషం చిమ్మారు. దాని ఫలితమే 1992 – డిసెంబర్ – 6న అంబేద్కర్ వర్ధంతి రోజు విశ్వహిందూ పరిషద్ ఆధ్వర్యంలో బాబ్రీ మసీదు పై దాడి. ఒక దెబ్బ రెండు ముక్కలు అన్నట్టు ముస్లింల మనోభావాలపై దళితుల అస్తిత్వంపై దెబ్బ కొట్టారు. అది ఆరెస్సెస్ అనుబంధ సంస్థలకు ‘విజయోత్సవ్ దివస్‘. మరోవైపు ముస్లిం లను రెచ్చగొట్టి బ్లాక్ డేగా పాటించేటట్లు చేస్తున్నారు. ఆ నెపంతో ఈనాటికీ డిసెంబర్6 అంటే దేశమంతటా యుద్ధ వాతావరణపు పొగబారుతోంది. పోలీసులను మోహరిస్తున్నారు. ఇది కేవలం మస్లిములపై ద్వేషమే కాకుండా మెజారిటీ ప్రజలైన దళిత బహుజనులను అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలకూ ఆటంకం కలిగిస్తూ ప్రజాచైతన్యానికి అడ్డు పడుతున్నారని గమనించాలి.

ఇక చుండూరు, కారంచేడు, గుజరాత్ మారణహోమం, గోద్రారైలు, సిక్కుల ఊచకోత సంఘటనలతో ఎస్సీ ఎస్టీ, మైనారిటీలకు ‘తమకు లొంగి ఉంటే తప్ప బ్రతుకు లేదనే‘ సంకేతాలిస్తున్నారు. జాతీయ, కేంద్రీయ విశ్వవిద్యాలయాల తోపాటు ప్రతి చిన్న చితక అటానమస్ విద్యాలయాల్లో సైతం కులసంఘాలను రెచ్చగొట్టుతూ దుష్ట రాజకీయాలు అలవర్చుతున్నారు.

భావ ప్రకటన స్వేచ్ఛను వాడుకున్నందుకు రోహిత్ వేములను మానసికంగా వేధించి చంపారు. సమాజ దురాగతాలను తమ ప్రసంగాలతో, రచనలతో ప్రశ్నించినందుకు గౌరీలంకేష్, కల్బుర్గి, దబోల్కర్ వంటి మేధావులను భౌతిక దాడులతో హత్యలకు పాల్పడ్డారు. స్వదేశీ హిందూ సంస్కృతిని కాపాడుతున్నామనే పేరుతో ప్రేమికుల రోజు అడ్డు పెట్టి వావివరసలు చూడకుండా అసంబద్ధమైన బలవంతపు పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఎవరైనా రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగితే సహించడంలేదు. ప్రేమపెళ్ళిళ్ళు సహించక కులదురఃహాంకార హత్యలు చేస్తున్నారు. స్వదేశీ నినాదంతో తిండి బట్టపై కూడా ఆంక్షలు విధిస్తున్నారు. ప్రశ్నిస్తే దేశద్రోహి అంటున్నారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలు నిత్యకృత్య మయ్యాయి… మధ్యప్రదేశ్ లోని భావ్‌ఖేడీ గ్రామంలో వాల్మీకి సమాజానికి చెందిన 12 ఏళ్ల రోషిణి, పదేళ్ల అవినాశ్ అనే పసి పిల్లలు రోడ్డు దగ్గర మల విసర్జన చేస్తున్నారని కొట్టి చంపారు. దళితులు గుళ్లో ప్రవేశించారని కొట్టి చంపారు.

ఇలాంటి బూర్జువా భూస్వామ్య ఆధిపత్య వ్యవస్థను మార్చాలి, సార్వజనీన హక్కులను కాపాడాలి, ‘ఏకత్వంలో భిన్నత్వం – భిన్నత్వంలో ఏకత్వం‘గా పరిగణించబడే లౌకిక భావాలను రక్షించాలి. దాదాపు 3వేల కులాలు 25వేల ఉప కులాలుగా మొత్తం 28వేల చీలికలుగా ఉన్న సమాజం మనది… దీన్ని మార్చాలంటే ‘ఇంకో అంబేద్కర్ పుట్టాలి, ఇంకెవరో రావాలి‘… అని ఎదురు చూడటం కాకుండా మనం ఏం చేయాలి? మన తక్షన కర్తవ్యం ఏంమిటి? అని ఆలోచించాలి. ‘దేశానికి గానీ, జాతికి గానీ సంఖ్యాబలమొక్కటే చాలదు. వారు ఎప్పుడూ అప్రమత్తులై, విద్యావంతులై ఆత్మగౌరవంతో,ఆత్మ విశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుంది‘ అంటాడు అంబేద్కర్. దీన్ని అలవర్చుకుంటూ తాత్కాలిక లాభసాటి స్వర్ధాలకు లొంగకుండా వ్యవస్థీకృత సమస్యలను సైద్ధాంతిక అవగాహనతో శాశ్వత పరిష్కారం కోసం పాటుపడాలి. కార్మిక – కర్షక వర్గాలను ఏకం చేసి మద్దతును కూడగట్టకుని సమస్లను సాధించాలి… అప్పుడే ‘సమీకరించు బోధించు పోరాడు‘ అన్న అంబేద్కర్ నినాదానికి అర్థం చేకూర్చినవారమవుతాం. అంబేద్కర్ కు నిజమైన గౌరవాన్ని అందించిన వారమవుతాం…
(నేడు డా॥ బి.ఆర్.అంబేద్కర్ వర్థంతి సందర్భంగా…)

                                                                                మహేష్ దుర్గే, 8333987858

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News