Saturday, April 27, 2024

సిరీస్‌పై భారత్ కన్ను

- Advertisement -
- Advertisement -

IND vs AUS Second Twenty20 today

 

ఆస్ట్రేలియాకు చావోరేవో, నేడు రెండో టి20

సిడ్నీ: తొలి మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన టీమిండియా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగే రెండో ట్వంటీ20 మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో విరాట్ సేన బరిలోకి దిగుతోంది. మరోవైపు ఆతిథ్య ఆస్ట్రేలియాకు ఈ మ్యాచ్ చావోరేవోగా మారింది. సిరీస్ అవకాశలను సజీవంగా ఉంచుకోవాలంటే రెండో టి20లో గెలవక తప్పదు. ఒకవేళ ఓడితే మాత్రం సిరీస్ కోల్పోక తప్పదు. కాగా, తొలి మ్యాచ్‌లో అద్భుత బ్యాటింగ్‌తో భారత్‌ను ఆదుకున్న రవీంద్ర జడేజా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతని లేని లోటు జట్టుపై స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. టి20 సిరీస్‌ను సాధిస్తే రానున్న టెస్టు సమరంలో మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగే అవకాశం టీమిండియాకు ఉంటుంది. దీంతో భారత్ గెలుపే లక్షంగా పెట్టుకుంది. ఇక ఆస్ట్రేలియా కూడా ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలనే పట్టుదలతో ఉంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం ఖాయం.

ఓపెనర్లే కీలకం

ఈ మ్యాచ్‌లో భారత్ ఓపెనర్లపై భారీ ఆశలను పెట్టుకుంది. తొలి టి20లో లోకేశ్ రాహుల్ అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచాడు. ఈసారి మరింత మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాలని భావిస్తున్నాడు. ఇక సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా మెరుపులు మెరిపించేందుకు సిద్ధంగా ఉన్నాడు. తొలి మ్యాచ్‌లో విఫలమైన ధావన్ ఈసారి భారీ స్కోరుపై కన్నేశాడు. ఓపెనర్లు శుభారంభం అందిస్తే తర్వాత వచ్చే బ్యాట్స్‌మెన్ ఒత్తిడి లేకుండా ధాటిగా ఆడే అవకాశం ఉంటుంది. మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా భారీ స్కోరే లక్షంగా బరిలోకి దిగనున్నాడు. తొలి మ్యాచ్‌లో కోహ్లి పెద్దగా పరుగులు సాధించలేక పోయాడు. కానీ ఈసారి మాత్రం జట్టుకు అండగా నిలువాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు. మరోవైపు మనీష్ పాండే, సంజు శాంసన్‌లు కూడా తమకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోక తప్పదు. తొలి మ్యాచ్‌లో మనీష్ పాండే ఘోరంగా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లోనైన అతను బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఉంది.

శాంసన్ కూడా భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఎంతైన ఉంది. ఒకవేళ ఈసారి విఫలమైతే వీరిద్దరికి రానున్న రోజుల్లో టీమిండియాలో చోటు కాపాడు కోవడం కష్టమేనని చెప్పక తప్పదు. ఇక హార్దిక్ పాండ్య మరోసారి జట్టుకు కీలకంగా మారాడు. జడేజా సేవలు అందుబాటులో లేక పోవడంతో హార్దిక్ బాధ్యత మరింత పెరిగింది. వన్డేల్లో బాగా ఆడిన హార్దిక్‌పై జట్టు భారీ ఆశలతో ఉంది. ఇక కిందటి మ్యాచ్‌లో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగి అసాధారణ బౌలింగ్‌తో జట్టును గెలిపించిన చాహల్‌పై అందరి దృష్టి నిలిచింది. చాహల్ తన ఫామ్‌ను ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాల్సిన అవసరం ఎంతైన ఉంది. ఇక నటరాజన్, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్ తదితరులతో భారత బౌలింగ్ చాలా బలంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో సీనియర్ బౌలర్లు బుమ్రా, షమిలను దించే అవకాశాలున్నాయి.

స్మిత్‌పైనే ఆశలు

మరోవైపు ఆతిథ్య ఆస్ట్రేలియాకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. సిరీస్ ఆశలను నిలుపు కోవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. వన్డే సిరీస్‌లో అద్భుతంగా రాణించిన స్టీవ్ స్మిత్‌పై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. స్మిత్ తొలి మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ఇక కెప్టెన్ అరోన్ ఫించ్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అతను కూడా మరింత మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాల్సిన పరిస్థితి నెలకొంది. మాక్స్‌వెల్, లబూషేన్, డిఆర్సి షార్ట్, హెన్రిక్స్, మాథ్యూవేడ్ తదితరులతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ బలంగానే ఉంది. అయితే నిలకడలేమి ప్రధాన సమస్యగా మారింది. సమష్టిగా రాణిస్తే సిరీస్‌ను సమం చేయడం ఆస్ట్రేలియాకు కష్టమేమి కాదనే చెప్పాలి. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో ఎవరూ గెలుస్తారో ముందే చెప్పడం కష్టమే.

మధ్యాహ్నం 1.40 గంటల నుంచి సోనీ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News