Friday, April 26, 2024

జీవితం జీవించడానికే

- Advertisement -
- Advertisement -

World Suicide Prevention Day 2020

ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం -2020 ఇచ్చిన నినాదం ‘వర్కింగ్ టుగెదర్ టు ప్రివెంట్ సూసైడ్’. జాతీయ నేర రికార్డుల సంస్థ ( ఎన్‌సిఆర్‌బి) – 2019 నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 2019 లో మొత్తం 7675 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అందులో 5612 మంది పురుషులు కాగా, 2062 మంది మహిళలు, ఒక ట్రాన్స్ జెండర్ ఉన్నారు. 7675 మందిలో రోజువారీ కూలీలే 2858 మంది ఉన్నారు. ఇందులో 4353 మంది ఆదాయం లక్ష రూపాయల లోపే ఉంది. ఆత్మహత్య చేసుకున్న వారిలో 2829 మంది నిరక్షరాస్యులే ఉన్నారు. రైతుల ఆత్మహత్యల్లో మన దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఐదవ స్థానంలో ఉంది. దేశ వ్యాప్తంగా 10281 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అత్యధికంగా మహారాష్ట్ర 3927 మరణాలతో మొదటి స్థానంలో కాగా, తరువాతి స్థానంలో కర్ణాటక (1992), ఆంధ్రప్రదేశ్ (1029), మధ్యప్రదేశ్ (541) ఉండగా తెలంగాణలో 499 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఆత్మహత్యల్లో జాతీయ సగటు 10.4 తెలంగాణలో అది 20.6 ఉండటం గమనార్హం. పవిత్ర భారతావని ఎన్నో విధాలా ప్రత్యేకమైనది.

ప్రపంచంలోనే అత్యధిక నిరక్షరాస్యులకు నిలయమైనది, విశ్వవ్యాప్తంగా నిరుపేదల్లో ఎక్కువ మంది ఇక్కడే పోగుపడ్డారు. అవినీతి అనకొండలు కుప్పలు తెప్పలుగా వర్ధిల్లుతున్న ధరణి తలం మనది. ఇటువంటి అప్రతిష్ఠకర జాబితాలోకి కొత్తగా భారత్ ఇప్పుడు బలవన్మరణాల రాజధానిగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక ఇచ్చింది. 2016లో ప్రపంచ వ్యాప్తంగా 12 లక్షల మంది ఆత్మహత్యలకు పాల్పడితే ఇందులో ప్రతి ముగ్గురిలో ఒకరు భారతీయులు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన చైనాలో ఒక సంవత్సరంకు ఒక లక్ష అయితే, భారత్‌లో రెండున్నర లక్షలకు పైగా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆత్మహత్యల నిరోధాన్ని లక్షిస్తూ మొట్టమొదటిసారి అంతర్జాతీయ స్థాయిలో నివేదిక విడుదల చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ కేవలం 28 దేశాల్లో తప్ప మిగతా చోట్ల జాతీయ వ్యూహాలే కొరవడటాన్ని తప్పుపట్టింది. బలవన్మరణం నివారించేది ఎలాగన్న వ్యూహం మాట దేవుడెరుగు, ఆత్మహత్య ప్రయత్నాన్ని నేరంగా పరిగణిస్తున్న దేశాల్లో భారతదేశం ఒకటి.

సమస్య తీవ్రత: ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న మేరకు, ఒక సంవత్సరంలో ఆత్మహత్యకు పాల్పడిన భారతీయుల్లో మహిళల సంఖ్య లక్ష, బలవన్మరణం పాలైన పురుషుల సంఖ్య అంతకు ఒకటిన్నర రెట్లు పైనే ఉంది. ఆత్మహత్యల వంటి బాధాకరమైన నిర్ణయం తీసుకుని, తమ జీవితానికి ముగింపు కోరుతున్న వారిలో ఎక్కువ మంది యువకులు, వృద్ధులు ఉన్నారు అన్నది సత్యం. వయసు ఉడిగి, జీవన సంధ్యకు చేరువైనా వారిపై ఆర్థిక, ఆరోగ్య సమస్యల ఒత్తిళ్లు సహజం, పరిణితితో మెలగాల్సిన వారు తీరని అభద్రతకు గురి అవుతుండగా, ఎంతో భవిష్యత్తు కలిగిన యువత, అపార ఒత్తిడికి చిత్తు అయ్యేలా నిరర్ధక చదువుల తీరుతెన్నులు నిర్ఘాంత పరుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాదాల వల్ల చనిపోయే వారి కంటే ఆత్మహత్యల వల్ల మృతి చెందిన వారి సంఖ్య పెరుగుతుంది. విద్యార్థులు తాము అనుకున్న లక్ష్యాలను సాధించలేనప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళలో 30 సంవత్సరాలలోపు వయస్సున్న వారు 50 శాతం ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఎంతో భవిష్యత్తు ఉన్న యువత క్షణిక ఉద్రేకంతో జీవితాలను చాలించడంతో సమాజం పై ఎంతో భారం పడుతుంది. నేటి సమాజంలో ఎన్నో మార్పులు రావడం వల్ల అనూహ్యంగా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కనుక యువత అవగాహన లోపంతో ఆత్మహత్యలకు బలి అవుతున్నారు. ఆత్మహత్యల విషయంలో భారతదేశంలో కేరళ రాష్ట్రం మొదటి స్థానం ఆక్రమించగా, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానం ఆక్రమించడం శోచనీయం. దేశవ్యాప్తంగా గతంలో రెండు లక్షల మందికి పైగా ఆత్మహత్యలకు పాల్పడితే అందులో 23 వేల మంది మన రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారు. కేరళలో మానసిక ఒత్తిడివల్ల ఆత్మహత్యలకు పాల్పడితే మన రాష్ట్రంలో వివిధ కారణాలతో ఆత్మహత్యలు చేసుకోవడం గమనించవలసిన విషయం.

జీవితం… అనేది అనుకోకుండా దొరికిన అద్భుతమైన వరం… అవకాశం, పూర్తి జీవితాన్ని కష్టసుఖాల కైనా ఓర్చుకొని ఆస్వాదించలేనివాడు మనిషిగా పుట్టడం వ్యర్థం. పుట్టిన ప్రతి వాడికి మరణం తప్పదు, మరణం జీవితం కాదు. స్వేచ్ఛగా పూర్తి జీవితాన్ని గడిపే అవకాశం, హక్కు ఉంది. దీన్ని ప్రకృతి ధర్మం అంటారు. కానీ కొందరు జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తారు. ఆత్మహత్య లేదా ఆత్మను హత్య చేసుకుంటారు. అంటే ఒక బలహీన క్షణంలో తీసుకునే అటువంటి అవివేకమైన చర్య అనే ఆత్మహత్యగా అర్థం చేసుకోవచ్చు. మానవ సంబంధాల మధ్య అగాధాలు పెరగడం, మనిషి చంద్రమండలానికి చేరుకున్నానని గొప్పగా చెప్పుకున్న కూడా, పక్కవాడి మనసును చేరుకోకపోవడం శోచనీయం. జన్మనిచ్చిన ప్రతి తల్లి తన సంతానం నుండి ఒకే ఒక కోరిక కోరుకుంటుందట… అదేమిటంటే తాను చనిపోయిన తరువాత తన కర్మకాండలను, తన సంతానం వారి స్వహస్తాలతో చేయాలని ఆశిస్తుంది. కానీ ఆత్మహత్యలకు పాల్పడేవారు తన తల్లి ఆఖరి కోరిక అయినా కనీస ధర్మాన్ని నిర్వర్తించేలేని దుస్థితిలో జీవితానికి చరమాంకం పాడుకుంటున్నారు. స్వాంతన చేకూర్చవలసిన సమాజంలో ఒక సమస్యకు సమాధానం దొరకడం లేదంటే ‘ఆ సమాజం చనిపోయినట్లే లెక్క….’ అదే ఇప్పుడు అందరిని ఆందోళనకు గురి చేసి ఆత్మహత్యలకు కారణం అవుతున్నాయి.

ఆత్మహత్యలకు కారణాలు: క్షణికావేశం, పట్టరాని ఉద్రేకం, నిలదొక్కుకోలేను అన్న నిరాశ… పురుగు మందులు, ఉరితాళ్లు కన్నా ప్రమాదకరమైనవి. ర్యాంకుల సాధనలో, ప్రేమలోనో వైఫల్యం చెందడం, నిరుద్యోగం, అనారోగ్యం, వైవాహిక సమస్యలు వీటన్నింటి కన్నా జీవితం చాలా ముఖ్యమైనది. జీవితంలో సమస్యలు తప్పవు, జీవితమే సమస్యగా భావించకూడదు. తీవ్ర మానసిక భావోద్వేగాలు, వ్యక్తిగత సమస్యలే మహిళలలో ఎక్కువ మందికి ఉరితాళ్లు పేనుతున్నట్లు జాతీయ నేరాల రికార్డుల విభాగం గతంలో తెలియజేసింది. వేధింపులు, ఆర్థిక సంక్షోభాలు మొదలు… కోరుకున్నది దక్కలేదన్న వేదన వరకు… దేనికైనా చావే పరిష్కారం అనుకునే పెడ ధోరణులు జోరు సర్వత్ర కళ్ళకు కడుతుంది. అక్షరాస్యత, జీవన ప్రమాణాలపరంగా ముందంజ వేసిన కేరళలోనూ ఆత్మహత్యలు విరివిగా నమోదవుతున్నాయి. జీవితాన్ని నిలబెట్టేది చదువు, కూలదోసేది కాదంటూ మరమ్మతుల ఆవశ్యకత ఎక్కడుందో ఈ పరిణామాలు విశదీకరిస్తున్నాయి. నేడు చేయాల్సింది ధైర్యాన్ని పెంపొందించే వ్యక్తిత్వ నిర్మాణం. రాంకులు మార్కులే ముఖ్యమన్న వేలం వెర్రి చదువుల బాధలో రాణించలేక ఆత్మన్యూనత భావంతో, చావే శరణ్యం అన్న దుర్దశకు పిల్లలు చేరడానికి కారణం ఎవరు? మార్కులు తగ్గినా, పరీక్ష తప్పిన ఇక బ్రతుకు వృధా అనుకునే అంత నిస్పృహలో రేపటి తరం కూరుకుపోవడానికి మూలాలు ఎక్కడున్నాయో… ముదింపు చెయ్యాలి, ఆలోచనలను, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే సామర్థ్యం నేటి చదువులలో నేతిబీర చందమైనదని ఆత్మహత్యల ఉరవడి చాటుతుంది.

బ్రతుకులో… ఘర్షణ ఉంటుంది…జీవితంలో మాధుర్యం ఉంటుంది. కష్టమో, నష్టమో, బాధో, చెప్పుకోలేని దుఃఖం, ఏమి అర్థం కాని పరిస్థితులు, దగ్గరి వాళ్లు మోసం చేయడం, ఎవరూ పట్టించుకోకపోవడం ఆత్మహత్యలకు కారణాలుగా చెప్పుకోవచ్చు. ఆలోచన ఎక్కడైతే అంతమవుతుందో, ఆవేశం అక్కడ మొదలవుతుంది. ఇందులో ముఖ్యంగా తాగుడుకు బానిసగా మారడం, కుటుంబ పోషణ పట్టించుకోకపోవడం, సున్నిత మనస్సు వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఆత్మహత్యలు నిరోధించాల్సిన కనీస బాధ్యత ఒక సామాజిక అంశంగా ప్రతి ఒక్కరూ నడుం బిగించాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు పరీక్ష ఫలితాలు, రైతుల అప్పులు, భార్య భర్తల కుటుంబ కలహాలు, పేదవాన్ని కబళించే మైక్రోఫైనాన్స్ సమస్యలు ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయి. ఈ ప్రపంచంలో జ్ఞానం తెలిసినవాడు, భాష తెలిసినవాడు, భావం తెలిసినవాడు, మాట్లాడగలిగిన వాడు, ఆలోచించగలిగే వాడు ఒకే ఒక్కరు… ‘మనిషి…’ కానీ దురదృష్టం ప్రపంచంలో మనిషి ఒక్కడే ఆత్మహత్య చేసుకునే స్థాయికి దిగజారడం సిగ్గుపడాల్సిన విషయం.

ఆత్మహత్య త్యాగం కాదు: మనల్ని మనం శిక్షించుకునే హక్కు గాని, ప్రాణాలు తీసుకునే హక్కు గాని, ప్రాణాలు తీసే హక్కు గాని, ఇహలోకంలో, పరలోకంలో నైనా లేదు. బతికి సాధించు అనేది సర్వసాధారణం. కానీ బతికించి సాధించు అనేది చాలా అరుదు. అరుదైన జీవితాన్ని అర్ధరహితం చేసుకోవద్దు. మార్కులు తెచ్చుకోవడంలో పోటీ, ఆర్థిక ఇబ్బందులు, ఇతర సామాజిక కారణాలు ఆత్మహత్యలు జాడ్యాన్ని పెంచుతున్నాయి. ప్రజల్లో సమస్య పరిష్కారమై అవగాహనను, ఆత్మస్థైర్యాన్ని పెంచాలి.

మూలాలను అన్వేషించాలి: ఆత్మహత్యలకు మూలాలను అన్వేషించాలి, అప్పుడే కారణాలు తెలుస్తాయి. వాటిని నివారించడానికి వీలు కలుగుతుంది. ఆత్మహత్య ఆలోచనలు సకాలంలో గుర్తించి తగిన తోడ్పాటు, కౌన్సిలింగ్ చేయిస్తే వాటి బారిన పడటం తప్పుతుంది. ప్రపంచంలో ప్రతి 40 సెకండ్లకు ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. జీవితంపై ఆశ, తీపి కోల్పోయిన వారే ఆత్మహత్య చేసుకుంటారు. ఎదుటి వారి బాధలను అర్థం చేసుకొని, వాటిని పంచుకునే అలవాటును పెంచుకోవాలి. దీని వల్ల బాధలో ఉన్న వారికి స్వాంతన చేకూరి ఆత్మహత్యలు చేసుకోవాలన్న ఆలోచనను మానుకొంటారు.
వైఫల్యాలకు కుంగిపోయి అంతటితో తమ ప్రయత్నాలను, జీవితాన్ని ముగించుకుంటే ఐన్‌స్టీన్, థామస్ అల్వా ఎడిసన్, అబ్రహం లింకన్ లాంటి వారిని తరతరాలు స్మరించుకోగలిగే వారే కాదు. ఓటమి ఒక మలుపు, కానీ ఏకైక గమ్యం గెలుపు. ఆ స్ఫూర్తితో, రెట్టించిన పట్టుదలతో సామర్ధ్య నిరూపణకు కంకణబద్ధులైన వారే చరిత్రలో విజేతలుగా నిలిచారు.

కుంగిన హృదయాల్ని స్వాంతన వచనాలతో సేదతీర్చే గురువులు, కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, మిత్రులు ఉన్న చోట ఆత్మహత్యలు సన్నగిల్లుతాయి. సకాలంలో ఉపశమనం, చికిత్స అందించగలిగితే 90 శాతం ఆత్మహత్య ను నివారించగలం.
అవగాహనే ఆయుధం: ఆత్మహత్యల నివారణకు వాటి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం ఒక్కటే ఆయుధం. సమాజంలో ఎయిడ్స్‌తో బాధపడుతున్న వారు, ఆర్థికంగా చితికిపోయినవారు, ముఖ్యంగా పెట్టుబడి భారంతో రైతులు, కుటుంబ కలహాలతో విసిగిపోయిన గృహిణులు, వైఫల్యాలతో డిప్రెషన్లోకి వెళ్లిన విద్యార్థులకు జీవితం పై అవగాహన కలిగించాలి, ఆశలను పెంచాలి. విద్యార్థులకు ఆత్మహత్యల పట్ల అవగాహన పెంచడానికి, ఆత్మహత్యలకు దారి తీయడానికి గల కారణాలను విశ్లేషించే పాఠ్యాంశాలను బోధనలో చేర్చాలి. మానసిక వ్యాధులు వాటికి కారణాలు నివారణకు తీసుకోవలసిన చర్యలపై ప్రజలకు సంపూర్ణ అవగాహన కలిగించాలి. అప్పుడే ఆత్మహత్యలను చాలా వరకు అరికట్టవచ్చు.

యువతే దేశ భవితవ్యానికి ప్రాణాధారం, వారిని నిరాశ, నిస్పృహల చెదలు బారినపడకుండా, ఆత్మహత్య భావనల వైరస్ సోకకుండా కాపాడే రక్షణ వ్యవస్థ నిర్మాణాన్ని , ఏళ్ల తరబడి అలక్ష్యం చేసిన దుష్పరిణామాలను నేడు చూస్తున్నాం. యావత్ విశ్వానికే స్ఫూర్తినిచ్చేదిగా వెలుగు లీనాల్సిన భారతావనికి, బలవన్మరణాలు బలి పీఠం అన్న అప్రతిష్ఠను చెదరగొట్టేలా ఇప్పుడిక వడివడిగా దిద్దుబాటు చర్యలు ఊపందుకోవాలి.

బ్రతుకు బలి చెయ్యొద్దు: మానవ జీవితం ఉత్కృష్టమైనది. దానిని కన్నీటి ధారలతో బలి చేయవద్దు. నిరాశ నిస్పృహల్లో ఉన్న వారికి స్వాంతన కలిగించడం ద్వారా సమాజంలో ఆత్మహత్యల సంఖ్య తగ్గించవచ్చును. కష్టాలకు ఎదురీది ఆత్మస్థైర్యంతో ముందుకు పోయిన మనిషి మాత్రమే పరిపూర్ణుడు. ఏదిఏమైనా ఆత్మహత్యలకు పాల్పడడం పరిష్కారం కాదు… వాళ్లకు స్వాంతన చేకూర్చడానికి ప్రయత్నిద్దాం… ఆరోగ్యవంతమైన సమ సమాజాన్ని స్థాపిద్దాం…

డా: అశోక్ పరికిపండ్ల- 9989310141
(సైకాలజిస్ట్, ఆత్మహత్యల నివారణ కమిటీ అధ్యక్షులు)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News