Friday, April 26, 2024

యువత మన జాతి సంపద!

- Advertisement -
- Advertisement -

Youth are the wealth of our nation!

కొత్త సంవత్సరం 2021లోకి భారత్ అడుగుపెట్టింది. ఇటు నుంచి రాబోయే పది సంవత్సరాల పాటు దేశంలో పరిస్థితులు ఎలా ఉంటాయనే దానిపై మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ (ఎంఒఇఎస్) 2020లో ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో 20వ శతాద్దం ద్వితీయార్ధం నుంచే వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం ప్రారంభమైందని అదే జోరు భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని నివేదికలో వెల్లడించింది. గత ఏడాది అంటే 2020 అంతా కొవిడ్- 19తో ప్రపంచం మొత్తం తల్లడిల్లిపోయింది. దీంతో ఎంఒఇఎస్ మొత్తం ఏడాది కాకుండా స్వల్పకాలానికి గణాంకాలను సేకరించింది. రోజువారీ టెస్టుల నుంచి నెలవారీ కొత్త కేసులను, అలాగే వారం వారం దేశంలోని ఆర్థిక వ్యవహారాలను కూడా పరిగణనలోకి తీసుకొంది. కొత్త సంవత్సరం ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది కాబట్టి దీర్ఘ కాలానికి అంటే రాబోయే పది సంవత్సరాలల్లో భారత్ పరిస్థితి ఎలా ఉంటుందో నివేదికలో వివరించింది. దీన్ని బట్టి భవిష్యత్తుపై ఒక అంచనాకు రావచ్చు.

భారత్ విషయానికి వస్తే ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా రికార్డు బద్దలు కొట్టబోతోంది. ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం 2023 నాటికి భారత్ జనాభా 1.42 బిలియన్‌లకు చేరుతుందని అంచనా. అదే అమెరికా విషయానికి వస్తే అత్యధిక జనాభాలో మూడో స్థానాన్ని ఆక్రమిస్తుంది. 2011 జనాభా గణాంకాల ప్రకారం భారత్ జనాభా 1.21 బిలియన్‌లు. 2021 నాటికి కొత్తగా జనాభా గణాంకాలు పూర్తవుతాయా లేదా అనేది అనుమానమే. 2030 నాటికి చైనా జనాభా అత్యధికంగా 1.425 బిలియన్‌కు చేరి అటు నుంచి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ప్రపంచంలోని పలు దేశాల్లో సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గుముఖం పడుతుంది. అయితే ఇదే భారత్ విషయానికి వస్తే 2048 నుంచి జనాభా క్రమంగా తగ్గముఖం పట్టే అవకాశం ఉంది. భారత్ జనాభా అత్యధికంగా 1.6 బిలియన్‌లకు చేరుతుందని లాన్సెట్ ప్రచురించిన నివేదికలో అంచనా వేసింది.

గత దశాబ్దం భారత్‌లో జనాభా విజృంభణతో ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సహకరించింది. గతంలో మాదిరిగా భారీ జనాభా వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుందనే అపోహ ఉండేది. అదే పూర్తిగా తప్పు అని తేలిపోయింది. దేశ జనాభాలో పని చేసే యువత లేదా మధ్య వయసు వారు ఉంటే ఆ దేశం ఆర్థికంగా బలపడుతుంది. దీంతో దేశంలో సంపాదించే వారి సంఖ్య పెరుగుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. ఉదాహరణకు 20-59 ఏళ్ల వయసు వారు ఈ దశాబ్దం చివరి నాటికి దేశంలో అత్యధికంగా పని చేసే వారుగా ఉండవచ్చునని ఒక అంచనా. దేశ జనాభాలో ప్రస్తుతం వర్కింగ్ ఏజ్ గ్రూపు అంటే ఉద్యోగాలు చేసే వారి శాతం జనాభాలో 55.8 శాతం కాగా, 2031 నాటికి 58.8 శాతానికి చేరుతుంది. దీన్ని బట్టి చూస్తే సుమారు 97 మిలియన్‌ల మంది ఉపాధి రంగంలో ఉంటారు. దీంతో ప్రభుత్వాలు పెద్ద సంఖ్యలో తమ జనాభాకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది. అలాగే జనాభాలో మరో రెండు మిలియన్‌ల వృద్ధులు జత అవుతారు. పెరిగిపోతున్న వృద్ధుల జనాభాకు తగ్గట్టు సామాజిక భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే పెరిగిపోతున్న వర్కింగ్ ఏజ్ గ్రూపు మాత్రం దేశ వ్యాప్తంగా ఒకే మాదిరిగా ఉండదు. రాష్ట్రాల్లో ఒక మాదిరిగా, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మరో రకంగా ఉంటుంది. ఉదాహరణకు బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌లలో ఈ దశాబ్దంలోనే అత్యధికంగా వర్కింగ్ ఏజ్ గ్రూపు (ఉద్యోగాలు చేసే వయసుకు) చేరుతుంది. ఈ మూడు రాష్ట్రాలు కలుపుకుంటే ఉద్యోగాలు చేసే యువత సంఖ్య 23 శాతానికి చేరుతుంది. దీనికి వ్యతిరేకంగా దక్షిణాదికి చెందిన మూడు రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో ఉద్యోగాలు చేసే వయసుకు వచ్చే వారి సంఖ్య 2.5 శాతం తగ్గుతుంది. ఈ వ్యత్యాసం ప్రభావం వల్ల ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారు ఉపాధి కోసం దక్షిణాది రాష్ట్రాల వైపు చూడాల్సి వస్తుంది.

పెరిగిపోతున్న జనాభా దామాషా ప్రకారం దేశ రాజకీయాలపై పెను ప్రభావం చూపుతుంది. ఉత్తరాదిలో జనాభా ఎక్కువ దక్షిణాదిలో తక్కువ వల్ల దాని ప్రభావం దేశ రాజకీయాలపై కనిపిస్తుంది. ప్రస్తుతం లోక్‌సభ స్థానాలను 1971 జనాభా గణాంకాల ప్రకారం పార్లమెంటు సీట్లను కేటాయించారు. ప్రస్తుతం రాష్ట్రాల మధ్య జనాభాలో వ్యత్యాసం వల్ల కొన్ని రాష్ట్రాల్లో పార్లమెంటు సీటుకు ఎక్కువ ఓట్లు కేటాయించాల్సి వస్తోంది. వస్తుంది. ఉదాహరణకు 2020 తాజా ఎలక్టోరల్ గణాంకాల ప్రకారం తమిళనాడులో ఒక లోకసభ సభ్యుడిని ఎన్నుకోవాలంటే 1.56 మిలియన్‌ల మంది ఓటర్లు ఓట్లు వేయాల్సి వస్తుంది. అదే బీహార్, ఉత్తరప్రదేశ్‌లలో ఒక పార్లమెంటు సభ్యుడిని ఎన్నుకోవాలంటే 1.8 మిలియన్ మంది ఓటర్లు ఓటు వేయాల్సి వస్తుంది. 2026 నాటికి చట్ట ప్రకారం ప్రతి రాష్ట్రం నుంచి లోక్‌సభ సీట్లపై పరిమితి విధించే అవకాశాలున్నాయి. 2031 జనాభా లెక్కలు పూర్తయ్యే వరకు తదుపరి నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశాలు కూడా లేవు. దీన్ని బట్టి అర్ధమయ్యేది ఏమిటంటే జనాభా పెరిగే కొద్దీ అసమానతలు పెరుగుతాయి.

ఒక నియోజక వర్గంలో ఓటర్ల సంఖ్య ఎక్కువ, మరో నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య తక్కువగా ఉంటుంది. జనాభా దామాషా ప్రకారం నియోజక వర్గాల పునర్విభజన చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ప్రభుత్వాలపై ఆర్థిక భారం పడుతుంది. దేశ వ్యాప్తంగా నియోజక వర్గాల పునర్విభజన ప్రభుత్వానికి అగ్ని పరీక్షలాంటింది. మనిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెన్స్ (ఎంఒఇఎస్) గత ఏడాది విడుదల చేసిన నివేదికలో ప్రస్తుతం వాతావరణంలో మార్పులు 20వ శతాబ్దం ద్వితీయార్ధం నుంచి చోటు చేసుకుంటున్నాయని వెల్లడించింది. అయితే భవిష్యత్తులోనూ ఇదే జోరు కొనసాగుతుందని తేల్చి చెప్పింది. ఉదాహరణకు 1901 -2018 వరకు ఉష్ణోగ్రత 0.7 డిగ్రీల సెల్సియస్ పెరిగిందని వెల్లడించింది. 1976- 2005తో పోల్చుకుంటే 21వ శతాబ్దం చివరి నాటికి అంటే 2070 నుంచి 2099 వరకు ఉష్ణోగ్రతలు 4.4 డిగ్రీలు పెరిగే అవకాశాలున్నాయి. అదే విధంగా ఏప్రిల్ నుంచి జూన్ కాలానికి అంటే నడి వేసవిలో వడ గాడ్పులు లేదా వేడి గాలులు 3 నుంచి నాలుగు రెట్లు పెరిగే అవకాశాలున్నాయి. దీనికి వ్యతిరేకంగా రుతు పవనాల్లో మార్పులు చోటు చేసుకొని వర్షాలు తగ్గుముఖం పడుతాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) ఖరగ్‌పూర్ గత ఏడాది విడుదల చేసిన పరిశోధన నివేదికలో రుతుపవనాల్లో అసమతుల్యం చోటు చేసుకుంటుందని వెల్లడింది. దీంతో పాటు దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాదిలో వర్షపాతం ఎక్కువ ఉంటుందని నివేదికలో తెలిపింది. ప్రపంచబ్యాంకు 2018లో విడుదల చేసిన నివేదికలో వాతావరణం మార్పు ల్లో దక్షిణాసియాలో ఎక్కువ ప్రభావం చూపుతుందని పేర్కొంది. వాతావరణంలో మార్పుల కారణంగా రుతుపనాల్లో మార్పుల కారణంగా 2030 నాటికి ప్రజల జీవన ప్రమాణాల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రపంచ బ్యాం కు నివేదికలో వివరించింది. కోవిడ్ -19 ప్రభావం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ తిరోగమన బాట పట్టింది. గత 41 సంవత్సరాలతో పోల్చుకుంటే 2020 -21 ఆర్థిక సంవత్సరంలోనే దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత కనిష్ఠానికి పడిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరం 2020-21లో స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) -7.5 శాతానికి పడిపోతుందని రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా కూడా అంచనా వేసింది. 2010-11 నుంచి 2020 -21 వరకు వృద్ధిరేటు దశాబ్దంలోనే అత్యంత కనిష్ఠానికి పడిపోయింది. 1980 జిడిపిలో పోల్చుకుంటే జిడిపి వృద్ధి రేటు బాగా కుంటుపడింది.

భారత ఆర్థిక వ్యవస్థ గురించి ఆర్థికవేత్తలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమతమ అభిప్రాయాలు వెల్లడించారు. ప్రభుత్వంతో పాటు పలువురు ఆర్థికవేత్తలు మాత్రం దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటుందన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్ నుంచి ప్రస్తుతం భారత్ బయటపడుతున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. దీంతో ఆర్థిక వ్యవస్థ మళ్లీ పట్టాలెక్కుతాయన్న భరోసాను వ్యక్తం చేస్తున్నాయి. అయితే వీరి అభిప్రాయంతో పలువురు విభేదిస్తున్నారు. కోవిడ్ వల్ల దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థపై వ్యతిరేక ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఉదా॥ ఆక్స్‌ఫర్డ్ ఆర్థికవేత్తలు మాత్రం వచ్చే 2025 వరకు భారత్ జిడిపి 4.5 శాతం దాటదని గట్టిగా వాదిస్తున్నాయి. అదే కోవిడ్- 19 కంటే ముందు భారత్ ఆర్థిక వ్యవస్థ లేదా జిడిపి 6.5 శాతంగా అంచనా వేశాయి. ఏది ఏమైనా భారత ఆర్థిక వ్యవస్థకు పెరిగిపోతున్న యువ జనాభానే ఆశాకిరణంగా కనిపిస్తోంది. కాబట్టి ఈ దశాబ్దం ముగిసే నాటికి భారత్ అత్యంత సంపన్న దేశాల్లో మూడో స్థానానికి చేరుతుందని ఆర్థిక వేత్తలు గట్టి విశ్వసిస్తున్నారు. యువతనే భారత్ వెన్నెముక. యువతోనే అభివృద్ధి యువతతోనే సంపద.

లక్కాకుల కృష్ణమోహన్- 9705472099

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News