Monday, April 29, 2024

ఎపి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల?

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ఎపి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను కాంగ్రెస్ అధిష్టానం నియమించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. వచ్చే సంవత్సరం ఎపిలో ఎన్నికలు ఉండడం, ఆలోపు షర్మిల పార్టీని కాంగ్రెస్ విలీనం చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో అధిష్టానం షర్మిలకు సముచితమైన పదవిని అప్పగించాలన్న ఆలోచనతో ముందుకెళుతున్నట్టుగా సమాచారం. దీంతోపాటు షర్మిలకు రాజ్యసభ పదవిని కూడా ఇచ్చే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టుగా తెలిసింది. కాంగ్రెస్ పెద్దలతో గతంలో షర్మిల చర్చలు జరిపారు. వైఎస్‌ఆర్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి కూడా సిద్ధమయ్యారు. అయితే, ఆమె సేవలను అధిష్టానం ఎపిలో వాడుకోవాలని చూడగా షర్మిల మాత్రం తెలంగాణ రాజకీయాలపై ఆసక్తి కనబర్చారు.

ఎపిలో వైఎస్‌ఆర్‌కు ఉన్న క్రేజ్‌ను వాడుకొని మళ్లీ పార్టీని బలోపేతం చేయాలని, అందులో భాగంగానే షర్మిలకు ఎపి పగ్గాలు అప్పచెప్పాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుందని ఆపార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో అనుకున్న ఫలితాలు సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌పై కన్నేసింది. ఈ క్రమంలోనే నేడు ఏఐసిసి అగ్రనాయకులు ఎపికి చెందిన కీలక నేతలతో సమావేశం కానున్నారు. ఈ ఏఐసిసి సమావేశంలో అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కెసి వేణుగోపాల్‌లు ఎపి నేతలతో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి తప్పక హాజరు కావాలని ఇప్పటికే ఎపి పిసిసి చీఫ్ రుద్రరాజు, కొత్త ఇన్‌చార్జి మాణిక్ రావు ఠాక్రే సహా రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపై ఈ భేటీలో కీలకంగా చర్చించనున్నట్టుగా తెలిసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News