Monday, April 29, 2024

150 మందికి త్వరలో తహసీల్దార్లుగా పదోన్నతులు

- Advertisement -
- Advertisement -

150 members Soon promots as Tahsildar

కొత్త రెవెన్యూ చట్టం పకడ్భందీగా అమలుకు ప్రభుత్వం ప్రణాళికలు
ఆఫీసుల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశం
అర్హులైన విఆర్‌ఒలకు పురపాలక శాఖలో ఉద్యోగం

మనతెలంగాణ/హైదరాబాద్ : కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం వ్యవసాయ భూముల కొనుగోలు, అమ్మకాలను తహసీల్దార్ కార్యాలయాల్లో చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దసరా పండుగ నుంచి ధరణి ప్రారంభం కానున్న నేపథ్యంలో సిబ్బంది కొరతను అధిగమించడంతో పాటు అర్హులకు పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే రెవెన్యూ అధికారుల పదోన్నతులు కల్పించడానికి సీనియార్టీ లిస్టును తయారు చేయాలని ప్రభుత్వం సిసిఎల్‌ఏను ఆదేశించింది. రాష్ట్రంలో కొన్ని కార్యాలయాల్లో డిప్యూటీ తహసీల్దార్లు ఇన్‌చార్జి తహసీల్దార్లుగా వ్యవహారిస్తున్న నేపథ్యంలో అన్ని కార్యాలయాల్లో తహసీల్దార్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అత్యంత కీలకమైన విధుల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు తలెత్తకుండా ఉండేందుకు పూర్తి స్థాయి చర్యలను ప్రభుత్వం చేపట్టింది. నాయబ్ తహసీల్దార్లకు పదోన్నతులు కల్పించడం ద్వారా రెవెన్యూ శాఖ మరింత పటిష్టం కానుంది. తాజాగా పదోన్నతుల కోసం 2016-, 17 సంవత్సరానికి గాను నాయబ్ తహసీల్దార్ల జాబితా ప్యానెల్స్‌కు ఆమోదం లభించింది. త్వరలోనే ముగ్గురు ఐఏఎస్‌ల బృందం ఆధ్వర్యంలో డిపిసి పదోన్నతుల అంశాన్ని పరిశీలించనుంది. ఈ నేపథ్యంలో డిపిసి ద్వారా 150 మందికి తహసీల్దార్లుగా పదోన్నతులు పొందే అవకాశం ఉన్నట్టుగా రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి.

తహసీల్దార్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ ఉద్యోగులు..

రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి కొందరు ఉద్యోగులను తహసీల్దార్ కార్యాలయాల్లో డిప్యూటేషన్‌పై పని చేయించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం. వారి రిజిస్ట్రేషన్ ప్రక్రియలోని అనుభవాన్ని రెవెన్యూ ఉద్యోగులు, అధికారులు అలవాటయ్యేంత వరకూ ఈ విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా సమాచారం. కొత్తగా తహసీల్దార్లకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల నిర్వహణపై నాలుగు రోజుల శిక్షణను ఇవ్వనున్నారు. ఆ శిక్షణ క్షేత్ర స్థాయిలో తహసీల్దార్‌లకు ఉపయోగపడేలా నిపుణుల ఆధ్వర్యంలో ఇవ్వనున్నారు. దసరా నుంచి రిజిస్ట్రేషన్‌లు ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని తహసీల్దార్ ఆఫీసుల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం పనులను పూర్తి చేయించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

అర్హులకు కార్పొరేషన్…

వీఆర్వో వ్యవస్థ రద్దు తర్వాత వారందరినీ ఇతర శాఖలకే బదిలీ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. గ్రామీణ స్థాయిలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో విఆర్వో పోస్టులు రద్దు చేస్తూ సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా విఆర్‌ఓలను వ్యవసాయం, పంచాయతీరాజ్ శాఖ, పురపాలక శాఖల్లో వారి సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఏయే కేటగిరీల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న సమాచారాన్ని ఉన్నతాధికారులు తెప్పించుకున్నారు. ఇటీవల కార్పొరేషన్లలో వార్డుకో అధికారిని నియమిస్తామన్న పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ పేర్కొన్న నేపథ్యంలో తమను పురపాలక శాఖకు బదిలీ చేయాలంటూ విఆర్‌ఓలు ప్రభుత్వానికి విన్నవించుకుంటున్న నేపథ్యంలో ఉన్నత చదువులు చదివి అర్హత కలిగిన విఆర్‌ఓలను పురపాలక శాఖలో తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా సమాచారం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News