Friday, April 26, 2024

వలస కూలీల బతుకు రైలు కింద ఛిద్రం

- Advertisement -
- Advertisement -

 

నడిచి నడిచీ అలసిపోయి పట్టాలపై నిద్రిస్తున్న కార్మికులపై నుంచి వెళ్లిన గూడ్స్, 16 మంది దుర్మరణం
మహారాష్ట్రలో ఘోరం n బాధితులంతా మధ్యప్రదేశ్ వాసులే

ఔరంగాబాద్: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో గురువారం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. కర్మాడ్ పోలీసు స్టేషన్ పరిధిలోని రైల్వే ట్రాక్‌పై నిద్రిస్తున్న వలస కూలీలపై గూడ్సు రైలు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలే ఉన్నారు. తెల్లవారుజామున 5.15 గంటల సమయంలో జరిగిన ఈ సంఘటన లో మరో నలుగురు ప్రాణాలతో బైటపడ్డారు. మృతులంతా మధ్యప్రదేశ్‌కు చెందిన వలస కార్మికులుగా గుర్తించారు. గూడ్సురైలు వేగంగా ఢీకొట్టడంతో ఛిద్రమైన మృతదేహాలు రైలు పట్టాలపై చెల్లాచెదరుగా పడిఉన్నాయి. వారికి చెందిన వస్తువులు దగ్గర్లో చెల్లాచెదరుగా పడి ఉన్నాయి.

ప్రాణాలతో బైటపడిన వారు గూడ్సు రావడాన్ని గమనించి తమ సహచరులను నిద్ర లేపడానికి విఫలయత్నం చేశారని, అయితే జాల్నానుంచి రాత్రంతా నడిచి వచ్చిన కారణంగా వారంతా గాఢనిద్రలో ఉండి లేవలేదని జిల్లా పోలీసు చీఫ్ మోక్షదా పాటిల్ చెప్పారు. మహారాష్ట్రలోని జాల్నానుంచి వలస కూలీలు రైలు పట్టాల వెంబడి కాలినడకన తమ స్వస్థలమైన మధ్యప్రదేశ్‌లోని భుసావాల్‌కు బయలుదేరారని, అయితే అలసి పోవడంతో రైల్వేట్రాక్‌పైనే నిద్రపోతుండగా గూడ్సు రైలు ఢీకొట్టిందని కర్మాడ్ పోలీసుస్టేషన్ అధికారి చెప్పారు. ప్రాణాలతో బైటపడిన నలుగురిలో ముగ్గురు రైలు పట్టాలకు కొద్ది దూరంలో నిద్రిస్తున్నారని ఆ అధికారి చెప్పారు. కర్మాడ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

ప్రధాని, ఉపరాష్ట్రపతి దిగ్భ్రాంతి

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాధ్యమైన సహాయ సహకారాలను అందిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని కోరారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఎన్‌సిపి చీఫ్ శరద్ పవార్ తదితరులు కూడా ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించాయి.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌థాక్రే ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్ చౌహాన్ ఎక్కడి వారు అక్కడే ఉండాలని తమ రాష్ట్రానికి చెందిన వలస కూలీలకు విజ్ఞప్తి చేశారు. వలస కూలీలను సస్థలాలకు తీసుకు రావడానికి రాష్ట్రప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందని ఆయన చెప్పారు. రైల్వేల సహకారంతో ఈ ప్రక్రియ వేగంగా సాగుతోందని, ఇప్పటికే దాదాపు 80 వేలమంది వలస కూలీలను వారి స్వస్థలాలకు తీసుకు రావడం జరిగిందని ఆయన తెలిపారు.

విచారణకు రైల్వే ఆదేశం

కాగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు రైల్వే శాఖ తెలిపింది. పటాల్టపై జనం ఉండడాన్ని గమనించిన లోకో పైలట్ వారిని అప్రమత్తం చేయడానికి హారన్ మోగించాడని, రైలును ఆపేందుకు కూడా ప్రయత్నించాడని, అయినా ఫలితం లేకపోయిందని రైల్వేశాఖ తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News